Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

17న వరంగల్ జిల్లాకు సీఎం కేసీఆర్

-లక్ష మందితో టీఆర్‌ఎస్ బహిరంగ సభ -వేదిక ఆర్ట్స్ అండ్‌సైన్స్ కాలేజీ గ్రౌండ్ -సభా స్థలిని పరిశీలించిన డిప్యూటీ సీఎం

TRS-leaders-inspecting-the-ground-for-TRS-Public-Meeting-in-warangal

వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలను పురస్కరించుకుని టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 17న జిల్లాకు రానున్నారు. వరంగల్ మహానగరంలోని హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు కళాశాల గ్రౌండ్‌ను సందర్శించి సభాస్థలిని పరిశీలించారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి ఈ నెల 21న జరిగే ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా పసునూరి దయాకర్‌ను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. దయాకర్ నామినేషన్ దాఖలు సందర్భంగా టీఆర్‌ఎస్ ఈ నెల 4న హన్మకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి(కుడా) గ్రౌండ్‌లో ఉప ఎన్నికల తొలిసభ నిర్వహించింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గులాబీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చారు.

సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, గిరిజన సంక్షేమ, ఆర్థిక శాఖ, వ్యవసాయశాఖల మంత్రులు ఏ.చందూలాల్, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, సీతారాంనాయక్, గుండు సుధారాణి, టీఆర్‌ఎస్ జిల్లా, అర్బన్ అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నన్నపునేని నరేందర్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు ఈ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గడపగడప కూ తీసుకెళ్లాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధానంగా ఈ సభ సక్సెస్ కావడం టీఆర్‌ఎస్ శ్రేణులకు కొత్త ఉత్తేజాన్నిచ్చింది. తెల్లవారి నుంచి గులాబీలు ఉత్సాహంగా ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికీ వెళ్లి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి తమ పార్టీ అభ్యర్థి దయాకర్‌కు ఓటువేయాలని కోరుతున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల ప్రచార సమన్వయ బాధ్యులుగా నియమితులైన రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, తన్నీరు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న ప్రచారంలో ముందుభాగాన నిలుస్తున్నారు. వీరికితోడు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎం పీలు వినోద్‌కుమార్, సీతారాంనాయక్, సుధారాణితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు ఉప ఎన్నికల ప్రచారంలో భాగస్వాములవుతున్నారు.

21న పోలింగ్ జరగనున్న తరుణంలో 19న ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో రెండు రోజుల ముందు అంటే.. 17వ తేదీన సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల ప్రచార సభలో పాల్గొనటానికి జిల్లాకు వస్తున్నారు. లక్ష మందితో హన్మకొండ ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల గ్రౌండ్‌లో సాయంత్రం ఆరు గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. వరంగల్ లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను బహిరంగ సభకు సమీకరించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించింది. ఈ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ టీఆర్‌ఎస్ నిర్వహించే చివరి సభ కానుంది. కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ సక్సెస్ కోసం టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. గురువారం సాయంత్రం ఆర్ట్స్‌అండ్‌ సైన్స్ కళాశాల గ్రౌండ్‌ను సందర్శించారు. సభ జరిగే స్థలాన్ని పరిశీలించారు. వీరిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, ఎంపీలు బి.వినోద్‌కుమార్, సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, శంకర్‌నాయక్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పార్టీ ముఖ్యనేతలు మర్రి యాదవరెడ్డి, ఇండ్ల నాగేశ్వర్‌రావు, చింతల యాదగిరి, వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు. లక్ష మందితో సీఎం సభ నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా విలేకరులకు చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.