Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

2 లక్షల కోట్ల బడ్జెట్!

-రేపు ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్న సీఎం కేసీఆర్

-పెరుగుతున్న సొంత రాబడులు, పన్నేతర ఆదాయం
-అదేస్థాయిలో పెరుగుతున్న రాష్ట్ర బడ్జెట్
-ఎన్నికల హామీల అమలుకు నిధులు
-మళ్లీ రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం!
-రూ.15వేల కోట్లకు రైతుబంధు నిధులు
-రైతు రుణమాఫీకి రూ.20వేల కోట్లు
-రైతుబీమాకు రూ.1500 కోట్లు
-పింఛన్లకు రెట్టింపు కేటాయింపులు
-నేడు బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదం

రాబోయే 2019-2020 ఆర్థిక సంవత్సరం కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడ్తారు. అంతకుముందు గురువారం సాయంత్రం ప్రగతిభవన్‌లో నిర్వహించే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బడ్జెట్‌కు ఆమోదం తెలియజేయనున్నది. గత నాలుగేండ్లుగా రాష్ట్ర సొంత రాబడులు, పన్నేతర ఆదాయం బాగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ పరిమాణం కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలోనే ఈసారి బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలు దాటవచ్చని భావిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో పెద్దపద్దులన్నింటినీ సమగ్రంగా చేర్చినట్టు సమాచారం. చిన్నచిన్న పద్దులను బడ్జెట్‌లో పేర్కొనడం లేదు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన మొత్తాలను బడ్జెట్‌లో చేర్చినట్టు తెలిసింది. హామీల అమలుపై ఇప్పటికే పలుసార్లు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో అవసరమైన నిధుల వివరాలను పొందుపర్చాలని సూచించారు.

ఈ మేరకు అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించారు. తాత్కాలిక బడ్జెట్‌లో రాబోయే ఆరునెలల కాలానికి ద్రవ్యవినిమయానికి చట్టసభల అనుమతి తీసుకొంటారు. ప్రస్తుత సంవత్సరంలో రాబడిని పరిగణనలోకి తీసుకుని వచ్చే సంవత్సరంలో సమకూరే ఆదాయాన్ని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన క్రమంలో అందుకు అనుగుణంగానే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే. పేరుకు తాత్కాలిక బడ్జెట్ అయినా పెద్దపద్దులతో పూర్తిస్థాయి వివరాలతో బడ్జెట్‌కు తుదిరూపమిచ్చారని సమాచారం. గత నాలుగేండ్లుగా రాష్ట్ర సొంత రాబడులు, పన్నేతర ఆదాయం బాగా పెరుగుతుండటంతో బడ్జెట్ సైజు అదేస్థాయిలో పెరుగుతున్నది. ఏటా సొంత రాబడి కనీసం 19% చొప్పున పెరుగుతున్న సంగతి తెలిసిందే. 2017-18లో రాబడి వృద్ధి రేటు 17% దాటింది. అప్పట్లో దాదాపు రూ.1.50 లక్షల కోట్లు ఉండగా.. 2018-19లో బడ్జెట్‌ను అంతమేరకు పెంచారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ రూ.1.74 లక్షల కోట్లు దాటింది. ఈసారి రాబడి 19% వృద్ధిరేటును దాటడంతో బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలు దాటే అవకాశముందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.

హామీల అమలుకు కేటాయింపులు
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అవసరమయ్యే నిధులను మధ్యంతర బడ్జెట్‌లో పొందుపరిచినట్టు సమాచారం. పేద ప్రజలకు అందించే సామాజిక పింఛన్లను ఇప్పుడున్న దానికంటే రెట్టింపు చేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు ఏప్రిల్ నెల నుంచి పెంచిన సామాజిక పెన్షన్లను అమలుచేస్తామని సీఎం అసెంబ్లీలో కూడా ప్రకటించారు. సామాజిక పింఛన్ల పెంపుతోపాటు అర్హత వయసు 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించాలని కూడా నిర్ణయించారు. ఇదంతా ఏప్రిల్ నుంచే అమలయ్యే అవకాశముంది. అర్హత వయస్సును తగ్గించడం ద్వారా అదనంగా దాదాపు 20 లక్షల మంది పింఛన్ పొందుతారని అంచనా. ప్రస్తుతం సామాజిక పెన్షనర్లు 39,52,410 మంది వరకు ఉన్నారు. ఇందులో వృద్ధులైన ఆసరా పింఛన్‌దారులు 13,36,434 మంది ఉన్నారు. వీరికి అదనంగా మరో 20 లక్షల మంది పెరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం సామాజిక పెన్షన్ల కోసం ప్రభుత్వం ఏటా రూ.5,043 కోట్లు వెచ్చిస్తున్నది.

తాజాగా పెన్షన్ల పెంపుతో మరో రూ.5 వేల కోట్లు అదనంగా బడ్జెట్‌లో కేటాయించనున్నారు. రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఒక ఎకరం భూమికి రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.8 వేలు పెట్టుబడి సాయం ఇచ్చింది. ఈ ఏడాది నుంచి ఆ సాయాన్ని ఎకరానికి రూ.10 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తారని తెలుస్తున్నది. ఈ మేరకు రైతుబంధు పథకం కింద నిధులను రూ.12వేల నుంచి రూ.15వేల కోట్లకు పెంచుతారని సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ రుణమాఫీకి రూ.20వేల కోట్లు కేటాయిస్తారని తెలుస్తున్నది. రైతుబీమాకు రూ.1500 కోట్లు కేటాయించే అవకాశముంది. ఇక వైద్య ఆరోగ్యశాఖకు దాదాపు రూ.10వేల కోట్లు, బీసీలకు రూ.5వేల కోట్ల నుంచి ఆరువేల కోట్ల వరకు, ఎస్సీలకు రూ.16వేల కోట్లు, ఎస్టీలకు రూ.9వేల కోట్లకు పైచిలుకు నిధులను కేటాయించే అవకాశముందని తెలిసింది.

చిన్నపద్దులు మినహా..
తాత్కాలిక బడ్జెట్‌లో చిన్నచిన్న పద్దుల వివరాలు మినహా రెవెన్యూ రాబడులు, ఖర్చులు, క్యాపిటల్ రాబడులు, క్యాపిటల్ ఖర్చులు, ఆస్తులు, అప్పులు ఇలా మొత్తం రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం ఉంటుందని సమాచారం. పూర్తిస్థాయి బడ్జెట్ మాదిరిగానే అన్ని వివరాలతో నివేదికను తయారుచేస్తున్నారు. ఆరునెలల కాలానికి ద్రవ్య వినియోగానికి శాసనసభ, మండలి అనుమతి పొందనున్నారు. ఎన్నిక లు ముగిసిన తర్వాత మూడునెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశమున్నా ముందుజాగ్రత్తగా ఆరునెలల వరకు సభ అనుమతి తీసుకోనున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. చట్టసభల్లో తాత్కాలిక బడ్జెట్‌పై సాధారణ చర్చ ఉంటుంది. కానీ పూర్తిస్థాయి బడ్జెట్ మాదిరిగా ప్రతి పద్దుపై చర్చలుండవని సమాచారం.

నేడు క్యాబినెట్ భేటీ
మంత్రివర్గం గురువారం సాయంత్రం 4.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశంకానున్నది. మంత్రులకు సాధారణ పరిపాలనశాఖ అధికారులు సమాచారం అందించారు. మంత్రివర్గ సమావేశం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలియజేయనున్నది. దీంతోపాటు పంచాయతీరాజ్ చట్టంలో బీసీలకు 34% రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే సుప్రీంకోర్టు అన్ని రిజర్వేషన్లు కలిపి 50% దాటకూడదని ఆదేశించిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నిక ల్లో రిజర్వేషన్లు 50% దాటకుండా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌కు చట్టరూపం కల్పించాల్సి ఉన్నది. ఈ మేరకు ఈ సవరణ చట్టాన్ని సభ ముందుకు తీసుకురావడానికి క్యాబినెట్ ఆమోదించే అవకాశం ఉన్నది. వ్యాట్ సవరణ బిల్లుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు సమాచారం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.