-రెండో విడత కంటి పరీక్షకు సిద్ధమవ్వాలి
-కోటిన్నర మందికి ఉచితంగా పరీక్షలు
-55 లక్షల మందికి కండ్లద్దాల పంపిణీ
-జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్వాలిటీ టీమ్స్
-గిన్నిస్ రికార్డ్ సాధించేలా కృషిచేద్దాం
-రాష్ట్రవ్యాప్తంగా 1500 వైద్య బృందాలు
-ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి హరీశ్
-కంటి వెలుగు షెడ్యూల్
-ఒక్కో క్యాంపులో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక ఆప్టో మెట్రీషియన్, 6-8 మంది సహాయ సిబ్బంది (ఏఎన్‌ఎం, స్టాఫ్ నర్సులు, సూపర్ వైజర్, ఆశ వంటివారు) ఉంటారు. ప్రతి బృందానికి ఒక వాహనం కేటాయిస్తారు.
ఒక రోజులో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో క్యాంపులో 300 మంది, పట్టణ ప్రాంతాల్లో 400 మందిని పరీక్షిస్తారని అంచనా.
రద్దీకి అనుగుణంగా అదనపు క్యాంపులు నిర్వహించేందుకు జిల్లాకు అదనంగా 4-6 మంది మెడికల్ ఆఫీసర్లు లేదా ఆప్టో మెట్రీషియన్లు అందు బాటులో ఉంటారు.
గ్రామీణ పీహెచ్‌సీల్లో, పట్టణాల్లో వార్డుల వారీగా క్యాంపులు నిర్వహించేలా ప్రణాళిక రచించారు.
‘నివారించదగిన అంధత్వ రహిత తెలంగాణ’ లక్ష్యంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు అమలుచేస్తున్న రెండో విడత కంటివెలుగు విజయవంతానికి సర్వం సిద్ధం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తూ పాలనా అనుమతులు ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని, అవసరమైన వారికి ఉచితంగా కండ్లద్దాలు అందించాలని స్పష్టంచేశారు. జనవరి 18న సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. కంటివెలుగు ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో మంత్రి ఎర్రబెల్లితో కలిసి మంత్రి హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల కంటి సమస్యలను దూరం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2018 ఆగస్టు 15న తొలి విడత కంటి వెలుగు ప్రారంభించి విజయవంతంగా పూర్తిచేశారని గుర్తుచేశారు. తొలి విడత సత్ఫలితాలు రావటంతో రెండో విడతకు శ్రీకారం చుట్టారని వివరించారు. కంటి చూపును నిర్లక్ష్యం చేస్తూ దృష్టిలోపంతో బాధపడుతున్నవారికి వెలుగు అందించేందుకు ప్రభుత్వం చరిత్రాత్మక కార్యక్రమాన్ని నిర్వహించనున్నదని తెలిపారు. కంటి పరీక్షలు, అద్దాలు, మందులు ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా అందజేయనున్నట్టు తెలిపారు.
పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి బృందాలు
100 పనిదినాల్లో లక్ష్యం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మొదటి దఫాలో 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు ఆ సంఖ్యను 1500కు పెంచుతున్నట్టు తెలిపారు. ఈ సారి కూడా కంటివెలుగును ‘క్యాంప్ మోడ్’లో నిర్వహిస్తామని చెప్పారు. గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి కంటి పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం 5 నెలల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. తొలి విడతలో 1.5 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి, 50 లక్షల అద్దాలు పంపిణీ చేశామని గుర్తుచేశారు. రెండో విడతలో సైతం 1.5 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సారి 55 లక్షల మందికి కండ్లద్దాలు(30 లక్షలు రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్రిప్షన్ గ్లాసెస్) అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.
కంటి పరీక్షల కోసం 850 ఏఆర్ మెషీన్లు, 1,500 ట్రయల్ లెన్స్ బాక్స్, 1,500 టార్చ్‌లు, 1,800 స్నెలెన్ చార్టుల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 1,500 ఆప్టో మెట్రీషియన్లు, 1,500 డాటా ఎంట్రీ ఆపరేటర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. 969 పీహెచ్‌సీ డాక్టర్ల నియామక తుది జాబితా వచ్చే నెల ఒకటో తేదీన విడుదల చేస్తున్నామని చెప్పారు. పల్లె దవాఖానల్లో 589 మంది ఎంహెచ్‌ఎల్సీ, 811 మంది బీఏఎంఎస్ సిబ్బంది నియమితులయ్యారని చెప్పారు. కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో 10, జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున క్వాలిటీ కంట్రోల్ టీమ్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఐ స్రీనింగ్ ప్రోగ్రాం’గా ఇది నిలుస్తుందని, వారానికి 5 రోజులు(శని, అదివారాలు సెలవులు) పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. జనవరి 5న జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, జనవరి 1 వరకు ఆటో రీఫ్రాక్టో మెషీన్లు, జనవరి 10 నాటికి 10-15 లక్షల రీడింగ్ గ్లాసెస్ సరఫరా చేస్తామని చెప్పారు. పరీక్షలు చేసిన నెల రోజుల్లోగా ప్రిస్రిప్షన్ అద్దాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అద్దాల డిమాండ్ తీర్చేలా ఆటోమెటిక్ ఆర్డర్ ఫెసిలిటీ ఉంటుందని పేర్కొన్నారు. అద్దాల బాక్స్ మీద బార్ కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేయగానే లబ్ధిదారుల వివరాలు తెలిసేలా ఏరాట్లు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యేలా అందరం కృషి చేద్దామని, దీన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు, సామాజిక కార్యకర్తలకు, పౌరులకు పిలుపునిచ్చారు.
దేశంలోనే చాలా గొప్ప కార్యక్రమం
కంటివెలుగు దేశంలోనే చాలా గొప్ప కార్యక్రమం అని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఈ కార్యక్రమానికి తమ శాఖల నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. కంటి వెలుగు తొలి విడత అమలు చేసినప్పుడు సీఎం కేసీఆర్‌ను రాష్ట్రంలోని వృద్ధులు దేవుడిగా పొగిడారని గుర్తు చేశారు. ఇప్పుడు చేపట్టిన రెండో విడత కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, కుటుంబ, సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీపీహెచ్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, సరోజినీదేవి కంటి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, కంటి వెలుగు నోడల్ ఆఫీసర్లు స్వరాజ్యలక్ష్మి, కౌటిల్య తదితరులు పాల్గొన్నారు.