మ్యానిఫెస్టోల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోంది. 2009 నాటి మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చారో చెప్పడానికి బహిరంగ చర్చకు టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సిద్ధం కావాలి. దీనిపై చర్చించేందుకు నేను ఎక్కడికైనా వస్తా.

-పొన్నాలకు టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు సవాల్ -గత వాగ్దానాల అమలులో కాంగ్రెస్ విఫలం – మరోసారి మోసానికి తెరలేపిన కాంగ్రెస్ -ఓటమి భయంతోనే బాబు బీసీ జపం: హరీశ్‌రావు గత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేని కాంగ్రెస్ మరోసారి ఈ ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడానికి సిద్ధమైంది అని టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పటి మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీల ప్రకారం 9 గంటలు కరెంటు ఇస్తామని, 5 గంటలు కూడా ఇవ్వడం లేదని, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచారని, ఏం మేలు చేశారని ఇప్పటి మ్యానిఫెస్టోను నమ్ముతారని ప్రశ్నించారు.
కేసీఆర్ తయారు చేసిన మ్యానిఫెస్టోనే ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ప్రతి మాటకు గడీలు, దొరలు అంటున్న పొన్నాల అసలు దొర ఎవరో.. గడీలు ఎవరికి ఉన్నాయో పొన్నాల సొంతూరు ఖిలాషాపురంకైనా, కేసీఆర్ సొంతూరు చింతమడకకైనా వెళ్లి అడుగుదామన్నారు. కేసీఆర్ చింతమడకలో ఉన్న తన సొంత ఇంటిని పాఠశాలకు దానం చేశారని, మరి ఖిలాషాపురంలో పొన్నాల ఏం చేశాడని ప్రశ్నించారు. దొరతనమనేది కులం బట్టి కాదని.. వ్యక్తి గుణం బట్టి వస్తుందన్నారు. జై తెలంగాణ అన్నందుకు ఓయూ విద్యార్థి యాకుబ్‌రెడ్డిని పోలీసులతో కొట్టించింది మీరు కాదా అని నిలదీశారు. కేసీఆర్ నమ్ముకున్న సిద్ధాంతం కోసం పదవులను, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారని స్పష్టంచేశారు.
టీఆర్‌ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని, ధరల పెరుగుదలకు, 1200 మంది విద్యార్థుల చావుకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు కేవలం డిపాజిట్లు దక్కించుకోవడానికే పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో చంద్రబాబు తెలంగాణలో బీసీ జపం చేస్తున్నారని, ఆయన స్వయం ప్రకాశంలేని చంద్రుడని, ఆయన పొత్తులతో ఎన్నికల్లో దిగడమే తప్ప సొంతంగా ఏనాడూ పోటీ చేయలేదన్నారు. నరేంద్రమోడీ కాళ్లా..వేళ్లపడి బీజేపీతో జతకట్టి దింపుడుకల్లం ఆశలు పెట్టుకున్నాడని విమర్శించాడు. 2000 సంవత్సరంలోనే తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అప్పుడే నిర్ణయించినట్లయితే 2013 వరకు ఎందుకు ఆగారని ప్రశ్నించారు. గురువులాంటి మైనంపల్లే టీడీపీని వదిలి టీఆర్‌ఎస్‌లో చేరినాక శిష్యుడు గజ్వేల్ టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి ఎంతన్నారు. గజ్వేల్ స్థానం నుంచి టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్ల కోసమే పోటీపడుతున్నారన్నారు. కేసీఆర్ గెలుపు ఖాయమని, భారీ మెజార్టీ కోసమే కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.