Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

2014 నాటికి ఉన్న లక్షలోపు రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం

-రుణ మాఫీపై కాంగ్రెస్, టీడీపీ రచ్చ -అనవసరంగా రెచ్చగొడుతున్నారు -రైతులెవరూ ఆందోళన చెందొద్దు -రుణమాఫీపై సోమవారం స్పష్టత వస్తుంది -మాఫీతో సంబంధం లేకుండానే ఖరీఫ్ రుణాలు -ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల

Etela Rajendar

రైతుల పంట రుణమాఫీపై కాంగ్రెస్, టీడీపీలు కావాలని రైతులను ప్రభుత్వంపై రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు. రుణమాఫీతో సంబంధం లేకుండా రైతులందరికీ ఖరీఫ్ రుణాలు ఇప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి చెప్పారు. 2014నాటికి ఉన్న లక్ష లోపు రుణాల మాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఐదురోజులే అయిందని, ఇంకా కార్యాలయాలు, సిబ్బంది విభజన పూర్తిస్థాయిలో జరగలేదని అన్నారు. అయినప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకిచ్చిన హామీమేరకు రైతుల రుణాలను మాఫీ చేయాలనే చిత్తశుద్ధితో బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధికారులతో సమీక్ష జరిపినట్లు చెప్పారు.

శాఖాధికారులిచ్చిన సమాచారం ఆధారంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బ్యాంకు రుణాలపై బుధవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారని చెప్పారు. ఈ సమావేశం సందర్భంగా బ్యాంకు అధికారులు కూడా రుణాలపై పూర్తిస్థాయి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఏ బ్యాంకు ద్వారా రైతులకు ఎన్ని రుణాలిచ్చారో సమాచారాన్ని వారం రోజుల్లో ఇవ్వాలని బ్యాంకర్లను కోరినట్లు ఈటెల చెప్పారు. బ్యాంకర్లు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు రూ.25వేల కోట్ల రైతు రుణాలున్నాయని చెప్పారు. వీటిలో రూ.6వేల కోట్లు గోల్డ్ రుణాలు, మరో రూ.7కోట్లు టర్మ్ రుణాలున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని వెల్లడించారు. అందువల్ల రుణాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు. సోమవారం దీనిపై స్పష్టత వస్తుందన్నారు. అయినప్పటికీ కొన్ని సీమాంధ్ర పార్టీలు, మీడియా తప్పుడు ప్రచారంతో రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయని విమర్శించారు.

రైతులను ఆందోళనకు గురిచేసే పనులు ఎవరూ చేయవద్దని ఈటెల కోరారు. ఎవరెన్ని విధాల విమర్శించినా రైతు రుణమాఫీపై ప్రభుత్వం వెనక్కి తగ్గదని మంత్రి స్పష్టం చేశారు. 2014లోపు రైతులు తీసుకున్న రూ.లక్షలోపు పంటరుణాలను కచ్చితంగా మాఫీ చేస్తామని చెప్పారు. ఈ విషయంపై సీఎం స్పష్టమైన వైఖరితో ఉన్నారని ఈటెల పేర్కొన్నారు. రుణమాఫీ కింద ఎంత మంది రైతులున్నారు? మాఫీ చేయాల్సిన రుణాలెన్ని? అనే అంశాలపై సోమవారం స్పష్టత వస్తుందని, అంతవరకు రైతులు ఓపికతో ఉండాలని కోరారు. రైతులు కూడా ప్రభుత్వం చెప్పిన మాటలనే పరిగణలోకి తీసుకోవాలని, ఎవరో చెబితే విని ఆందోళనకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.

ఉద్యమ సమయంలో పిచ్చిరాతలు, తప్పుడు మాటలు చెప్పిన పత్రికలు, మీడియా తెలంగాణ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడినా ఆంధ్ర ప్రాంత పార్టీల కుట్రలు ఆగడం లేదని విమర్శించారు. అందువల్ల తెలంగాణ రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. తప్పుడు రాతలు, కుట్రలకు బలికావొద్దని ఈటెల రైతులకు సూచించారు. ఎన్నికలకోసమో, ఓట్ల కోసమో టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెసో ్టపెట్టలేదని, సీమాంధ్ర పాలనలో దివాళా తీసిన తెలంగాణ రైతుల కళ్లలో ఆనందం నింపాలనే ఉద్దేశంతోనే మ్యానిఫెస్టోను నిపుణులతో చర్చించి పెట్టామని చెప్పారు. చెప్పిన విధంగా వికలాంగులు, వితంతువులు, వృద్ధులుపింఛన్లను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పిన ఈటెల.. మరో వారంలో రైతు రుణ మాఫీపై నిర్ణయం తీసుకొంటామని వెల్లడించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.