-2018 చివరినాటికి 99 నియోజకవర్గాలకు తాగునీరు -అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు
ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ సింహభాగం పనులను 2017 చివరినాటికే పూర్తి చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2018 చివరినాటికి ప్రతిపాదిత 99 నియోజకవర్గాల్లోని 24,172 జనావాసాలకు తాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నామని, 2016లో 6100జనావాసాలకు, 2017-18లో 15,872, 2018-19లో 2200 జనావాసాలకు తాగునీరు ఇవ్వనున్నామని అన్నారు. మొత్తంగా ఈ పథకం కింద రాష్ట్రంలోని 8695 గ్రామపంచాయతీలతో పాటు 65 అర్బన్ ప్రాంతాలకు తాగునీరు అందజేస్తామని అన్నారు. మొత్తం పనులను నాలుగు ప్యాకేజీల్లో చేస్తున్నామని తెలిపారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు ఇప్పటికే నిధులు అడిగామని, వారినుంచి సానుకూల స్పందన రాలేదని తెలిపారు. కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ ఈ పథకాన్ని పలుమార్లు పొగిడి, ఇత రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచించారని చెప్పారు. మొత్తం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.36,970.54 కోట్లు అని, పనులు జరిగే కొద్దీ వ్యయం పెరుగుతుంది కనుక రూ.40వేల కోట్లుగా అంచనా వేశామని తెలిపారు. నాబార్డ్, హడ్కో ద్వారా రూ.20వేల కోట్లకు కమిట్‌మెంట్లు వచ్చాయని, ఈ నిధులతో 75శాతం పనులు చేసుకోవచ్చన్నారు. ఎస్‌బీఐతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
దీని నిర్వహణకు యేటా రూ.800కోట్లతోపాటు, పట్టణ ప్రాంతాలు కలిపితే మరో రూ.950కోట్లు అవసరం అవుతాయని అన్నారు. ప్రజలు ఇప్పటికే నీటి పన్ను కడుతున్నారని, దానిని క్రమశిక్షణలోకి తీసుకు వస్తున్నామని అన్నారు. గుజరాత్‌లో మహిళా సంఘాలతో పానీసమితిలు ఏర్పాటు చేశారని, ఇక్కడ కూడా అలాగే చేస్తామని తెలిపారు. మొదటి విడతలో మేడ్చల్, కుత్బుల్లాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట, భువనగిరి, ఆలేరు, నకిరేకల్, తుంగతుర్తి, జనగాం, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తిలకు నీళ్లు ఇవ్వనున్నామని తెలిపారు. ఈ పథకంలో ప్రజాప్రతినిధులందరి భాగస్వామ్యం ఉందన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేలు పుట్ట మధు, జీవన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, సున్నం రాజయ్య, బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ మాట్లాడారు. ఈ పథకంపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని, తమ గ్రామానికి ఎప్పుడు నీళ్లు వస్తాయా..? అని ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ పథకంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కూడా ఉండాలని కోరారు. భద్రాచలంలో భక్తుల తాకిడి పెరిగిందని, త్వరగా నీళ్లు ఇవ్వాలని కోరారు.