-జూలై-ఆగస్టుకల్లా మధ్య మానేరు నింపాలి
-అనంతగిరి, రంగనాయకసాగర్ రిజర్వాయర్ల పనులు వేగవంతం చేయండి
-మల్లన్నసాగర్-సింగూరు గ్రావిటీ కాల్వ ద్వారా ఎక్కువ సాగు
-రాష్ట్రంలోని ఉపనదులపై చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టాలి
-రిజర్వాయర్లున్నచోట 20-30 ఎకరాల్లో అతిథిగృహాలు నిర్మించాలి
-కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమీక్ష
రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనం కలిగే రీతిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదని, 2020కల్లా మనం అనుకున్న తెలంగాణ సాక్షాత్కారం అవుతుందని, అంతా అద్భుతంగా ఉండబోతుందని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ఆశాభావం వ్యక్తంచేశారు. అదే తరహాలో కాల్వలు, చెక్‌డ్యాంల నిర్మాణం జరుగాలని, చెరువులను నింపుకోవాలని నీటిపారుదలశాఖ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అధ్యయనం చేసి పనులు చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణ కోసం ఒక ఉజ్వలమైన భవిష్యత్తు రూపకల్పనలో భాగంగానే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నదన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన రిజర్వాయర్లు, కాల్వలు, పంపుహౌజ్‌లు, టన్నెల్స్, చెక్‌డ్యాంల నిర్మాణం వచ్చే ప్రదేశాల్లో వసతిగృహాల నిర్మాణం జరుగాలన్నారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావుతోపాటు ఈఎన్సీ మురళీధర్‌రావు, చీఫ్ ఇంజినీర్ హరిరాం, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సలీం, సీఎంవో అధికారి భూపాల్‌రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఎగువమానేరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయే అవకాశం లేదని, ఎగువమానేరు నుంచి దిగువమానేరు ఒక జీవధారలాంటిదని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు చేపట్టిన పనుల పురోగతి కొనసాగుతున్నకొద్దీ కరీంనగర్ జిల్లా దక్షిణ ప్రాంతం ఎప్పు డూ లైవ్‌గా ఉంటుందని చెప్పారు. కాకతీయ కాల్వ మరో జీవధార అని, గోదావరి మీద కడుతున్న బ్యారేజీల వల్ల ఉత్తర కరీంనగర్ కూడా ఒక జీవధారలాగా అవుతుందన్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే వివిధ రకాలుగా సాగునీరు అందనున్నందున నాలుగు జీవధారలు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. దీనివల్ల నిత్యం పచ్చదనం వెల్లివిరుస్తుందని, హరితహారానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు. సింగూరు ఒక్కసారి నిండితే ఐదేండ్ల దాకా డోకా ఉండదని, సిం గూరు నుంచి కొండపోచమ్మ, మల్లన్నసాగర్ వరకు కూడా జీవధారనేనని చెప్పారు. తద్వారా మెదక్ జిల్లాకున్న మెతుకుసీమ అనే పేరు సార్థకమవుతుందన్నారు. ఈ ఏడాది జూలై – ఆగస్టు నాటికల్లా మధ్య మానేరు నింపడం సాధ్యమవుతుందని అధికారులు సీఎంకు చెప్పారు. ఎస్సారెస్పీ ఎప్పటికీ నీళ్లతో నిండి ఉండాల్సిన అవసరం ఉందని, దానిపైనే మిషన్ భగీరథ ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మధ్యమానేరులో నీళ్లు వచ్చేసరికల్లా బ్యారేజీలన్నీ పూర్తికావాలని ఆదేశించారు. మధ్యమానేరు నుంచి అనంతగిరి వరకు ఓపెన్ చానల్ అయిపోందని, మిగిలిన టన్నెల్ పనులు కూడా త్వరగా పూర్తిచేయాలని అధికారులకు చెప్పారు. అనంతగిరి, రంగనాయక్‌సాగర్ రిజర్వాయర్ల పనులు కూడా వేగవంతం చేయాలన్నారు.
చెరువులు నింపడం తప్పనిసరి కరువుప్రాంతాలు సస్యశ్యామలం కావడానికి ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా సాగునీరు ఇవ్వాలని, వచ్చిన నీళ్లు వచ్చినట్లే చెరువులు నింపుకొంటూ పోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. వచ్చే వర్షాకాలంనాటికి పూర్తి ఉపయోగంలోకి రావాలంటే చెరువులు నింపడం తప్పనిసరి అని పునరుద్ఘాటించారు. మధ్యమానేరు నుంచి నీళ్లతో చెరువులు, చెక్‌డ్యాంలు నింపాలని, అనంతగిరి, రంగనాయకసాగర్‌లోకి ఎత్తిపోసే పంపుహౌస్ పనులు వేగవంతం చేయాలని చెప్పారు. మల్లన్నసాగర్ కింద ఉండే కాల్వల పనులను సీఎం సమీక్షించారు. మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు గ్రావిటీ ద్వారానే నీళ్లు పోవాలన్నారు. గ్రావిటీ మార్గంలో ఎక్కువ ప్రాంతం సాగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. జాతీయ రహదారి నుంచి మెదక్ పట్టణం వరకు.. అలాగే గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఒక్క కుంట భూమి కూడా మిగులకుండా సాగులోకి రావాలన్నారు.
చెక్‌డ్యాంలు.. వసతిగృహాలు గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల పనుల పురోగతిని కూడా సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇవి ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ఫలితాలు ఉంటాయని చెప్పారు. గంధమల్ల, బస్వాపూర్ భూసేకరణ పురోగతిని సీఎం సమీక్షించారు. మొత్తం తెలంగాణలో ఉన్న మంజీరా, దుందుభి, కనగల్ వాగు, మూసీ, పాకాలలాంటి ఉపనదుల మీద చెక్‌డ్యాంల నిర్మాణం జరుగాలని చెప్పారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ లాంటి రిజర్వాయర్లున్నచోట అద్భుతమైన వసతిగృహాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. ఈ వసతిగృహాలు మంచి ఎత్తయిన ప్రదేశాల్లో, సుమారు 20-30 ఎకరాల్లో నిర్మిస్తే బాగుంటుందన్నారు. ఘన్పూర్, మక్తల్ కింద, నిజామాబాద్ దగ్గర రెండు వాగుల మీద, బాల్కొండ నియోజకవర్గం రామడుగు దిగువన, మంజీర, సింగీతం మీద చెక్‌డ్యాంల నిర్మాణం జరుగాలని సీఎం చెప్పారు.