Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

223 కోట్ల ఉపాధి..

-బకాయిలు విడుదలచేస్తూ కేటీఆర్‌కు ఉత్తర్వులు అందజేసిన కేంద్ర మంత్రి -200 పడకల ఆస్పత్రిగా కరీంనగర్ దవాఖాన -కార్మికమంత్రి దత్తాత్రేయ హామీ -నలుగురు కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీ -విజ్ఞాపనలకు పొందిన హామీలు -పర్యటన విజయవంతమైంది..మీడియాతో మంత్రి కేటీఆర్

unnamed ఉపాధి హామీ పథకంలో రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు రూ.223.36 కోట్లను సత్వరమే మంజూరు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయంపై తనకు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కే తారకరామారావుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ స్వయంగా ఈ ఉత్వర్వులను అందజేశారు. మరోవైపు కరీంనగర్ జిల్లాలో 50 పడకల దవాఖానను 200 పడకలకు పెంచేందుకు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు.

తగిన స్థలం చూపించిన వెంటనే ఆ పనులు పూర్తిచేస్తామని ఆయన కేటీఆర్‌కు స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ తన ఒకరోజు పర్యటన సందర్భంగా చౌదరి బీరేంద్రసింగ్, బండారు దత్తాత్రేయతోపాటు కేంద్ర జౌళిశాఖ మంత్రి సంతోష్‌కుమార్ గాంగ్వర్, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సుజనాచౌదరితో సమావేశమయ్యారు. ఆయా శాఖలకు సంబంధించి రాష్ర్టానికి ఉన్న అవసరాలను, బకాయిల వివరాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి.. పలు హామీలు పొందారు.

రాష్ట్రంలో అమలవుతున్న ఉపాధి హామీ పనులు, వాటర్ గ్రిడ్ పథకం, మహిళా స్వయం సహాయక బృందాల పనితీరు గురించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌కు కేటీఆర్ వివరించారు. ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 78 రోజులకు కుదించనున్నట్లు వార్తలు వస్తున్నాయని, అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నవారిలో ఎక్కువ మంది నిరుపేదలు, దళితులు, వెనుకబడినవర్గాలవారే అయినందున పని దినాలను కనీసంగా 150 రోజులకు పెంచాలని కోరారు.

సమగ్ర వాటర్ షెడ్ పథకం తెలంగాణలోని ఎనిమిది జిల్లాల్లో సమర్ధవంతంగా పని చేస్తూ ఉన్నదని, మొత్తం 14 లక్షల హెక్టార్లలో ఇది అమలవుతూ ఉందని, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున మరో 3 లక్షల హెక్టార్లకు కూడా ఈ పథకాన్ని విస్తరింపజేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని దేశం మొత్తంమీద 2500 వెనుకబడిన బ్లాకులకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయని, అయితే వెనకబడిన బ్లాకులను గుర్తించడానికి భౌగోళిక పరిస్థితులు, వర్షపాతం, సాగునీటి సౌకర్యాలు, ప్రకృతి వనరులు తదితరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రికి వివరించారు.

తెలంగాణలోని 78 మండలాలను ఇందుకు అనువైనవిగా గుర్తించడం జరిగిందని, అయితే నిజమైన పేదరికాన్ని గుర్తించడానికి తీసుకున్న ప్రాతిపదికల కారణంగా బాగా వెనకబడిన ప్రాంతాలు కూడా ఈ బ్లాకుల్లో చోటుచేసుకోలేదని వివరించారు. ఈ పథకాన్ని ఇప్పుడు అమలవుతున్న తరహాలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాల్లో హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాలు వెనకబడినవేనని, కేంద్రం సైతం గుర్తించిందని వివరించిన కేటీఆర్.. ఇప్పటివరకు ఆదిలాబాద్,

రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు మాత్రమే 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డెవలప్‌మెంట్ గ్రాంట్లను విడుదల చేసిందని, మిగిలిన ఆరు జిల్లాలకు ఇప్పటివరకు నిధుల విడుదల జరగలేదని తెలిపారు. తొమ్మిది జిల్లాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.285.50 కోట్లు రావాల్సి ఉండగా రూ.66.04 కోట్లు మాత్రమే అందాయని తెలిపారు. పెన్షన్ గురించి కేంద్ర మంత్రికి వివరిస్తూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి మంజూరయ్యే నిధులను విభజన అనంతరం 58ః42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు విభజించారని, ఈ ప్రాతిపదికన కాకుండా పేదరికాన్ని నిర్ధారించడానికి పావర్టీ ఇండెక్స్‌ను, టెండూల్కర్ ఫార్ములాను ప్రాతిపదికగా తీసుకోవాలని కోరారు.

జాతీయ గ్రామీణ జీవన పథకం కింద స్వయం సహాయక బృందాలకు రూ.3 లక్షల వరకు 7% వడ్డీతో గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల నుంచి రుణం పొందే అవకాశం ఉందని, కానీ వడ్డీ రేట్ల మార్పుతో బృందాలకు నష్టం జరుగుతున్నదని తెలిపారు. ఈ నష్టాన్ని వారి ఖాతాల్లో జమచేయనున్నట్లు కేంద్రం ప్రకటించిందని, ఈ ప్రకారం గత సంవత్సరానికి బకాయిగా ఉన్న రూ. 96.63 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్రంలోని 443 మండలాలను ప్రపంచ బ్యాంకు అర్హమైనవిగా గుర్తించిందని, ఒక్కో మండలానికి రూ. 50 లక్షల చొప్పున మొత్తం 150 మండలాలకు సుమారు రూ.75 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జలహారం పథకానికి మొత్తం సుమారు రూ.30 వేల కోట్లు ఖర్చు కానున్నదని, భారత ప్రభుత్వం సూచనల మేరకు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కాబట్టి జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకం కింద సగం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ చేపడుతున్న పథకాలన్నింటిని పరిశీలించడానికి హైదరాబాద్ రావాల్సిందిగా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామని కేటీఆర్ మీడియాకు వివరించారు. నలుగురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తాను తలపెట్టిన ఢిల్లీ పర్యటన విజయవంతమైందని, నలుగురు మంత్రుల నుంచీ సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు.

రానున్న బడ్జెట్‌లో వీటిని పేర్కొంటామని హామీ ఇచ్చారని, నిర్దిష్ట ప్రతిపాదనలను పంపాల్సిందిగా సూచించారని తెలిపారు. కేటీఆర్‌తో పాటు కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్ కూడా మంత్రులను కలిసినవారిలో ఉన్నారు.

నేతకు చేయూతనివ్వండి జౌళి మంత్రి గాంగ్వర్‌కు విజ్ఞప్తి హైదరాబాద్‌లో ఉన్న పవర్‌లూమ్ సర్వీస్ కేంద్రాన్ని సిరిసిల్లకు తరలించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర జౌళి మంత్రి సంతోష్‌కుమార్ గాంగ్వర్‌కు కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. సిరిసిల్లలో ఏటా సుమారు రూ.300 కోట్ల టర్నోవర్ జరుగుతున్నదని వివరించారు. మొత్తం తెలంగాణలోని 90% నేత పరిశ్రమ సిరిసిల్లలోనే ఉన్నందున ఈ కేంద్రాన్ని అక్కడికి తరలిస్తే ప్రయోజనం ఎక్కువ ఉంటుందని వివరించారు. దీనితోపాటు పట్టణంలోనే ఒక అప్పారెల్ ఎగుమతి పార్కు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని, ఇక్కడి పరిస్థితులు దృష్టిలోపెట్టుకుని మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

రెండేండ్ల క్రితం అప్పటి జౌళిశాఖ మంత్రి సిరిసిల్ల పట్టణంలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారని, మంజూరు చేసే ఉత్తర్వులను కూడా జారీ చేశారని, ఇప్పుడు కూడా ఆ అవసరం ఉన్నందున వీలైనంత త్వరగా ఈ క్లస్టర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం నూతన టెక్స్‌టైల్ విధానాన్ని కూడా ప్రకటించనున్నదని, దేశం మొత్తంమీదనే ఉత్తమమైన విధానాన్ని రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి గాంగ్వర్‌కు కేటీఆర్ తెలిపారు. చేనేత పరిశ్రమతోపాటు హస్తకళలరంగాన్నీ ప్రోత్సహించనున్నామని చెప్పారు.

ఇందుకోసం కేంద్ర సహకారం కోరారు. వరంగల్‌లో నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక స్పిన్నింగ్ మిల్లు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన సుమారు 50 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సమకూరుస్తుందని తెలిపారు. నేత పరిశ్రమ విస్తృతిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో నేషనల్ టెక్స్‌టైల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పాలని కోరారు. గద్వాలలో హ్యాండ్‌లూమ్ టెక్నాలజీలో ఐఐటీనీ నెలకొల్పాలని కోరారు. సమగ్ర హ్యాండ్‌లూమ్ అభివృద్ధి పథకం కింద రాష్ర్టానికి 14 కొత్త క్లస్టర్లను మంజూరు చేయాలని కోరారు.

పాత పవర్‌లూమ్‌ల స్థానంలో కొత్తవాటిని (సెమీ ఆటోమేటిక్) కొనుగోలు చేసుకోడానికి వీలుగా కేంద్రం నుంచి ఒక్కో యంత్రానికి రూ. 1.50 లక్షల చొప్పున మంజూరు చేయాలని విన్నవించారు. ముడిపదార్థాలు, ఇతర పరికరాల కోసం కలిపి మొత్తంగా రూ. 240 కోట్లు కేంద్రం నుంచి అవసరమవుతుందని వివరించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు తలా ఒకటి చొప్పున మొత్తం నాలుగు మెగా హ్యాండ్‌లూమ్ క్లస్టర్లను మంజూరు చేయాలని కోరారు.

చేనేత పరిశ్రమకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో ఒక హ్యాండ్‌లూమ్ ఎగుమతి ప్రమోషన్ మండలిని నెలకొల్పాలని విజ్ఞప్తిచేశారు. తమ ప్రభుత్వం కూడా వరంగల్ జిల్లాలో లక్ష పవర్‌లూమ్ యూనిట్లతో ఒక మెగా క్లస్టర్‌ను నెలకొల్పనున్న విషయాన్ని కేటీఆర్ వివరించారు. ఈ విజ్ఞప్తులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర మంత్రి గాంగ్వర్.. వీటిని పరిశీలించి, వచ్చే వార్షిక బడ్జెట్‌లో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనల పరిశీలన పూర్తయిందని, వాటిని ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలిపారు.

200 పడకలకు కరీంనగర్ దవాఖాన.. కేటీఆర్‌కు దత్తాత్రేయ హామీ తొలుత కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను కలిసిన కేటీఆర్.. సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలతో పాటు చేనేత కార్మికుల సమస్యలను కూడా ప్రస్తావించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలో చేనేత, మరమగ్గాల పరిశ్రమ విస్తృతంగా ఉందని, తెలంగాణ షోలాపూర్‌గా గుర్తింపు పొందిందని, ఇక్కడ సుమారు ఇరవై వేల మంది కార్మికులు నేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, మరో 20 వేల మంది కార్మికులు అనుబంధ పరిశ్రమల్లో కార్మికులుగా పని చేస్తున్నారని వివరించారు. వీటికి అదనంగా బీడీ పరిశ్రమలో కూడా వేల సంఖ్యలో పనిచేస్తున్నారని తెలిపారు.

పేదరికంతో ఉన్న వీరికి సామాజిక భద్రతా పథకాలను విస్తరింపజేయాలని కేంద్రమంత్రిని కోరారు. ఈ ప్రాంతంలో కేంద్రం గతంలో 50 పడకల దవాఖానను నెలకొల్పిందని, అయితే నేత, బీడీ, ఇతర అసంఘటిత కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందువల్ల ఈ దవాఖాన స్థాయిని 200 పడకలకు పెంచాలని కేటీఆర్ కోరారు. దీనికి దత్తాత్రేయ సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రంగాల కార్మికులకు అందాల్సిన సామాజిక భద్రతా పథకాలను కూడా విస్తరిస్తామని హామీ ఇచ్చారు. నేత, బీడీ కార్మికులు తక్కువ ఆర్థిక వనరులతో దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారని, సామాజిక భద్రతా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి దాని ద్వారా వారిని ఆదుకోవాలని దత్తాత్రేయకు కేటీఆర్ విన్నవించారు.

ప్రస్తుతం పరిశ్రమలు విస్తరిస్తున్నందున కేంద్రం ఆధ్వర్యంలో ఒక ఐటీఐని కూడా నెలకొల్పాలని కోరారు. తక్కువ వేతనాలతో పని చేస్తున్న నేత కార్మికులు, బీడీ కార్మికులకు సరైన గృహవసతి లేకపోవడంతో అరకొర సౌకర్యాలతోనే కాలం నెట్టుకొస్తున్నారని కేంద్రమంత్రి దృష్టికి కేటీఆర్ తెచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన దత్తాత్రేయ.. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంపై దృష్టి సారిస్తున్నామని, త్వరలోనే కేంద్రం స్పష్టమైన విధానాన్ని రూపొందిస్తుందని తెలిపారు.

టీ హబ్‌కు సహకరించండి సుజనా చౌదరికి వినతి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సుజనా చౌదరితో భేటీ అయిన కేటీఆర్.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, పరిశ్రమలకు అన్వయించడం పెరిగిందని, దీనికి అనుగుణంగానే సైన్స్ సెంటర్లను నెలకొల్పాల్సిన ఆవశ్యకత కూడా పెరిగిందని వివరించారు. తెలంగాణలోని పది జిల్లాల్లోనూ సైన్స్ కేంద్రాలను నెలకొల్పి, పరిశ్రమలకు అనుసంధానం చేసి, నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు పొందేలా తీర్చిదిద్దాలని కోరారు.

హైదరాబాద్‌లో ఒక ఇన్‌క్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చని వివరించారు. గతంలో రంగారెడ్డి జిల్లా బుద్వేలులో సైన్స్ సెంటర్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, ఆ తర్వాత పని ఆగిపోయిందని, ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలని కోరారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న టీ-హబ్‌కు కేంద్రం నుంచి తగిన ఆర్థిక సాయం అందించాలని కోరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.