-విధివిధానాల ఖరారుకు రేపు మున్సిపల్ సదస్సు -పట్టణాల్లో పచ్చదనం- పారిశుద్ధ్యం వెల్లివిరియాలి -రాజీవ్ స్వగృహ ఇండ్లు వేలంద్వారా అమ్మివేయాలి -లోకాయుక్త ఆర్డినెన్స్‌కు ఆమోదం -రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు

ప్రజల జీవనప్రమాణాలను పెంపొందించేలా పట్టణప్రగతి కార్యక్రమం ఉండాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 24 నుంచి పదిరోజులపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారుచేయడానికి ఈ నెల 18న ప్రగతిభవన్‌లో రాష్ట్రస్థాయి మున్సిపల్ సదస్సు నిర్వహించనున్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. సుమారు ఏడుగంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పట్టణప్రగతి నిర్వహణపై క్యాబినెట్ విస్తృతంగా చర్చించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రం చక్కని నగర జీవనవ్యవస్థపై పయనం సాగడమే లక్ష్యంగా పట్టణప్రగతి కార్యక్రమంతో మంచి పునాది ఏర్పడాలని ఆకాంక్షించారు. పట్టణాల్లో పచ్చదనం- పారిశుద్ధ్యం వెల్లివిరియాలని, ప్రణాళికాబద్ధమైన ప్రగతి జరుగాలని, పౌరులకు మెరుగైన సేవలు అందాలని.. మొత్తంగా ప్రజల జీవనప్రమాణాలు పెంపొందించే దిశగా అడుగులు పడాలని పిలుపునిచ్చారు. పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సూచించారు. పట్టణాలు ఇప్పుడెలా ఉన్నాయి? రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి? అనేది ప్రణాళిక వేసుకుని అందుకనుగుణంగా నిధులు వినియోగించుకుని ప్రగతి సాధించాలని చెప్పారు. ఈ మేరకు పట్టణప్రగతిపై మంత్రివర్గ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అవి..
రాష్ట్రస్థాయి మున్సిపల్ సదస్సు ఈ నెల 24 నుంచి అన్నిపట్టణాలు, నగరాల్లో పదిరోజులపాటు పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహించాలి. దీని సన్నాహకంగా 18న ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్రస్థాయి మున్సిపల్ సదస్సు నిర్వహించాలి. మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించాలి. పట్టణప్రగతికార్యక్రమ నిర్వహణపై చర్చించాలి. సదస్సులో పాల్గొన్న వారందరినీ అదేరోజు మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్మించిన వెజ్-నాన్‌వెజ్ మార్కెట్, శ్మశానవాటిక సందర్శనకు తీసుకెళతారు.
ఐదురోజుల్లో వార్డుకమిటీలు వార్డు యూనిట్‌గా పట్టణప్రగతి జరుగాలి. ప్రతివార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. వార్డులవారీగా చేయాల్సిన పనులను, మొత్తం పట్టణంలో చేయాల్సిన పనులను గుర్తించాలి. నిరక్షరాస్యుల డాటా సేకరించాలి. ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో వార్డులవారీగా నాలుగు చొప్పున ప్రజాసంఘాలను ఏర్పాటుచేసే ప్రక్రియ వచ్చే ఐదురోజుల్లో పూర్తి కావాలి.
పట్టణాలకు నెలకు రూ.148 కోట్లు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలకు రూ.70 కోట్ల చొప్పున, జీహెచ్ఎంసీకి రూ.78 కోట్లు వెంటనే ఆర్థికసంఘం నిధులు విడుదలచేయాలి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించిన నిధులు జనాభా ప్రాతిపదికన ఆయా పట్టణాలకు అందించాలి. ఈవిధంగా రాష్ట్రంలోని పట్టణప్రాంతాలకు నెలకు రూ.148 కోట్ల చొప్పున నిధులు సమకూరుతాయి. పట్టణప్రగతిలో భాగంగా చేపట్టే పనులకు నిధుల కొరత ఉండదు. 14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన 811 కోట్ల రూపాయల్లో 500 కోట్లు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు, రూ.311 కోట్లు జీహెచ్ఎంసీకి కేటాయించాలి.
పచ్చదనం- పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యం పట్టణప్రగతిలో పచ్చదనం పారిశుద్ధ్యం పనులకు అధిక ప్రాధాన్యమివ్వాలి. డ్రైనేజీలను శుభ్రంచేయాలి. మురుగునీటి గుంతలు పూడ్చాలి. విరివిగా మొక్కలు నాటాలి. హరిత ప్రణాళిక రూపొందించాలి. వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపికచేయాలి. నగరాలు, పట్టణాల్లో స్థలాలు అందుబాటులో లేకుంటే సమీపగ్రామాల్లో నర్సరీలు ఏర్పాటుచేయాలి. అందుకోసం గ్రామాలను ఎంపికచేయాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుద్ధ్య పనుల కోసం మొత్తం 3,100 వాహనాలు సమకూర్చాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో 600 వాహనాలు వచ్చాయి. మిగతా 2,500 వాహనాలను త్వరగా తెప్పించి, పట్టణాలకు పంపాలి. ఇంకా ఎన్ని వాహనాలు అవసరమో అంచనావేసి, వాటినీ సమకూర్చాలి.
-పట్టణాల్లో చేయాల్సిన మరిన్ని పనులు -మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేయాలి. -ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల పరిస్థితిని మెరుగుపరచాలి. గుంతలు పూర్తిగా పూడ్చేయాలి. -దహన/ఖననవాటికల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను ఎంపికచేయాలి. -ముళ్లపొదలు, తుమ్మలను నరికివేయాలి. -వెజ్/ నాన్‌వెజ్ మార్కెట్లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించుకుని, వాటికోసం స్థలాలను ఎంపికచేయాలి. -క్రీడాప్రాంగణాలు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటుచేయాలి. -డంప్‌యార్డులకు స్థలాలు గుర్తించాలి. -పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి. మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్స్ ఏర్పాటుచేయాలి. వీటికోసం స్థలాలు గుర్తించాలి. ప్రభుత్వ స్థలాలను టాయిలెట్ల నిర్మాణానికి కేటాయించాలి. -వీధుల్లో వ్యాపారం చేసుకునేవారిని ప్రత్యామ్నాయస్థలం చూపించేవరకు ఇబ్బందిపెట్టొద్దు -పార్కింగ్ స్థలాలు గుర్తించాలి. అవసరమైతే ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పార్కింగ్‌కోసం ఏర్పాటుచేయాలి. -విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి ఆధునిక పద్ధతులు అవలంబించా లి. ప్రమాదరహిత విద్యుత్‌వ్యవస్థ ఉండా లి. వంగిన, తుప్పుపట్టిన, రోడ్డుమధ్యలో ని స్తంభాలు, ఫుట్‌పాత్‌లపై ట్రాన్స్ఫారా లు మార్చాలి. వేలాడే వైర్లను సరిచేయాలి.
రాజీవ్ స్వగృహ ఇండ్లవేలం రాజీవ్ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీలేనిరుణం తదితర పథకాల పరిస్థితిని అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకోవాలి. రాజీవ్ స్వగృహ ఇండ్లను వేలంద్వారా అమ్మేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. విధివిధానాలు ఖరారు చేయడానికి చిత్రారామచంద్రన్ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవిందకుమార్ సభ్యులుగా అధికారుల కమిటీని నియమించింది. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియాకు అప్పగించింది. తెలంగాణ లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను క్యాబినెట్ ఆమోదించింది. అసెంబ్లీ బడ్టెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించినందుకు అధికారయంత్రాంగాన్ని క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, కేటీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
సీఏఏ రద్దుకు క్యాబినెట్ తీర్మానం భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మతపరమైన వివక్ష చూపరాదని తెలంగాణ మంత్రివర్గం కేంద్రప్రభుత్వాన్ని కోరింది. చట్టం ముందు అన్నిమతాలను సమానంగా చూడాలని సూచించింది. భారతరాజ్యాంగం ప్రసాదించిన లౌకికత్వాన్ని ప్రమాదంలో పడేసేలా పరిణమించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దుచేయాలని కేంద్రానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు రాష్ట్రమంత్రివర్గ సమావేశం తీర్మానం చేసింది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలో కూడా ఇందుకు సంబంధించిన తీర్మానం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.