Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

27న ప్లీనరీకి భారీ ఏర్పాట్లు..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర అర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ఖమ్మంలో ప్లీనరీ నిర్వహించేందుకు అనుమతించిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఖమ్మంజిల్లా ప్రజల పక్షాన ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Home-Naini-Narsimha-Reddy-released-TRS-Plenary-wall-poster

టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణభవన్‌లో ఖమ్మం ప్లీనరీ వాల్‌పోస్టర్‌ను సోమవారం రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 27న జరగనున్న ప్లీనరీకి హైదరాబాద్ నుంచి 600 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఉద్యమ కాలంలో ఖమ్మం జిల్లాలో ప్లీనరీ నిర్వహించేందుకు అవకాశం రాలేదని, రాష్ట్రం ఆవిర్భవించి, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్లీనరీ నిర్వహించేందుకు ఇప్పుడు అవకాశం వచ్చిందని చెప్పారు. -ఉదయం టీఆర్‌ఎస్ ప్రతినిధుల సభ..సాయంత్రం బహిరంగ సభ -సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ -ప్లీనరీ నిర్వహణకు అనుమతించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు -ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల -రాజధానిలో ప్లీనరీ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించిన హోం మంత్రి నాయిని -పార్టీ ప్లీనరీలో 12 తీర్మానాలు చేసే అవకాశం

సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్లీనరీని విజయవంతం చేసేందుకు, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ కార్యక్రమం ఇచ్చినా, దానిని విజయవంతం చేసిన చరిత్ర ఖమ్మం జిల్లా ప్రజలకు ఉందని అన్నారు. ప్లీనరీని కూడా ద్విగిజయంగా పూర్తిచేసేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్లీనరీ సమయం దగ్గర పడుతున్నదని, ఏర్పాట్లను యుద్ధప్రతిపాదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్లీనరీ నిర్వహణకు ఇప్పటికే కమిటీలు వేశామని, ఆయా కమిటీలు తమ తమ పరిధిలో పనులు ప్రారంభించాయన్నారు. తెలంగాణ ఉద్యమ నినాదమైన నిధులు, నీళ్లు, నియామకాలు అన్నింటినీ పూర్తి చేసేందుకు సీఎం కేసిఆర్ కంకణబద్ధులై ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన నిధులు మనమే ఖర్చు చేసుకునే అవకాశం వచ్చిందని, వచ్చే నాలుగైదేండ్లలో లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టిందన్నారు. నీళ్ల సద్వినియోగానికి ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. కృష్ణా, గోదావరి మధ్య ఉన్న తెలంగాణకు ఉమ్మడి పాలనలో పూర్తిగా అన్యాయం చేశారన్నారు. ఖమ్మం జిల్లాలోనే రెండు సాగునీటి ప్రాజెక్టులను చేపడుతున్నామని, గోదావరి నదిపై బ్యారేజీల నిర్మాణంతో రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని మంత్రి తుమ్మల కొనియాడారు.

ముంపు మండలాల్లోని కొన్ని గ్రామాలను తెలంగాణకు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, దీనికి ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారన్నారు. సాంకేతిక అంశాలపై పరిజ్ఞానం లేకుండా ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి మాట్లాడుతున్నాడని, అంతర్రాష్ట్ర సంబంధాలపై మాట్లాడేటప్పుడు సీఎంతో చర్చించి మాట్లాడితే బాగుంటందని మంత్రి తుమ్మల సూచించారు. విభజన చట్టంలోని లోటుప్లాట్లను సరిదిద్దుకునే అవకాశం ఉందని, ఆ విధమైన చర్చ జరిపితే బాగుంటుందన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్, కే కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్ నేతలు ఆర్జేసీ కృష్ణ, బీ రమేశ్‌బాబు, టీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

ప్లీనరీ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ టీఆర్‌ఎస్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఈ నెల 27న జరగనున్న ప్లీనరీకి హైదరాబాద్ నుంచి 600 మంది ప్రతినిధులు హాజరవుతారని హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. తెలంగాణభవన్‌లో సోమవారం ఖమ్మం ప్లీనరీ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన నలుగురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు ఎం గోవర్ధన్‌రెడ్డి, ఆజం అలీ, పీ పురోషోత్తం, సలీం, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

ఖమ్మం ప్లీనరీలో 12 తీర్మానాలు ప్లీనరీలో ఆమోదించాల్సిన తీర్మానాలపై ఏర్పాటైన కమిటీ సోమవారం మరోసారి భేటీ అయింది. ఎంపీ కే కేశవరావు నివాసంలో ఆయనతో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, పర్యాద కృష్ణమూర్తి సమావేశమై 12 తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పారిశ్రామిక విధానం, తెలంగాణ ఐటీ విధానం, సంక్షేమ పథకాలు – ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యున్నతికి చేపడుతున్న చర్యలు, డబుల్‌బెడ్ రూం ఇండ్లు, అనావృష్టి పరిస్థితులు-మంచినీటి సమస్య – పశుగ్రాసం కొరత, పార్టీ సంస్థాగత నిర్మాణం, విద్య, వైద్యం, పట్టణాభివృద్ధితోపాటు ఒక రాజకీయ తీర్మానం ఉండాలని నిర్ణయించారు. అయితే వీటిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ముందు ఉంచి, ఆయన పరిశీలన తర్వాత తుదిగా తీర్మానాల్ని ఖరారు చేయాలని భేటీలో నిర్ణయించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.