Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

28 నుంచి రైతుబంధు

-ఎకరానికి 5000 పంట పెట్టుబడికిఆర్థిక సాయం
-గతంలో మాదిరిగానే అందజేత.. గుంట భూమి ఉన్నా సాయం
-దాదాపు 63 లక్షల మందికి లబ్ధి.. కోటిన్నర ఎకరాలకు పెట్టుబడి
-పది రోజుల్లో ఖాతాల్లోకి.. 50 వేల కోట్లకు రైతుబంధు మొత్తం
-కేంద్రం వింటలేదు.. యాసంగిలో వడ్లు కొనలేం
-దళితుల ఆర్థిక పరిపుష్టే దళితబంధు లక్ష్యం
-కొత్త జోనల్‌ విధానంలో ఉద్యోగుల విభజన
-దంపతులకు ఒకేచోట పనిచేసే అవకాశం
-కలెక్టర్లతో సమావేశంలో సీఎం కేసీఆర్‌

రైతుబంధు పంపిణీపై నెలకొన్న అనుమానాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పటాపంచలు చేశారు. ఈ నెల 28 నుంచి అర్హులైన రైతులందరికీ రైతుబంధు పంపిణీ జరుగుతుందని స్పష్టంచేశారు. పది రోజుల్లో రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ వరి ధాన్యం కొనబోమని పదేపదే ప్రకటిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో అప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటుచేయబోమని పునరుద్ఘాటించారు. కేంద్రం మొండివైఖరి వల్లనే ఈ నిర్ణయం తీసుకోకతప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ముందుగా ప్రకటించినట్టుగానే దళితబంధును కూడా సంతృప్తస్థాయిలో అమలుచేస్తామని చెప్పారు. నూతన జోనల్‌ విధానం ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగులైన భార్యాభర్తలకు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలని సూచించారు. ఒమిక్రాన్‌ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని, తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్ల విస్తృత సమావేశం జరిగింది. రాష్ట్రంలో రైతుబంధు విడుదల, యాసంగి వరిధాన్యం సేకరణపై కేంద్రం మొండివైఖరి అనుసరిస్తున్న నేపథ్యంలో చేపట్టవలసిన కార్యాచరణ, దళితబంధు అమలు తీరుతెన్నులు, ఉద్యోగుల విభజన, ఒమిక్రాన్‌ వ్యాప్తి తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాసంగి కోసం రైతుబంధు పంట పెట్టుబడి సాయాన్ని ఈ నెల 28 నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. ప్రారంభించిన వారం పది రోజుల్లో గతంలో మాదిరిగానే, వరుస క్రమంలో అందరి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతాయని చెప్పారు. రైతుకు గుంట భూమి ఉన్నా సాయం అందిస్తామని స్పష్టంచేశారు. దాదాపు 63 లక్షల మంది రైతులకు ఉన్న కోటిన్నర ఎకరాలకు పెట్టుబడి సాయం అందబోతున్నది.

నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న కేంద్రం
తెలంగాణలో వ్యవసాయరంగాన్ని దెబ్బతీసేలా కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల నుంచి రైతాంగాన్ని కాపాడుకొనే బాధ్యత కలెక్టర్లకు, అధికారులకు ఉన్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వం యాసంగి వడ్లను ఎందుకు కొనడం లేదనే విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధంచేయాలని కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఆహార భద్రత కల్పించడం కోసం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఎఫ్‌సీఐ.. ఉప్పుడు బియ్యం పేరుతో యాసంగి వరి ధాన్యం కొనుగోలును నిలిపివేయడం శోచనీయమని పేర్కొన్నారు. ఎఫ్‌సీఐ నిర్లక్ష్యం వల్ల గోదాముల్లో బియ్యం నిల్వలు పేరుకుపోతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ అనుకూల విధానాలు కొనసాగిస్తాం

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టంచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలను ఇప్పటివరకు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం కూడా అమలుచేయలేదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వ్యవసాయ విధానాలను ఎన్ని కష్టాలు వచ్చినా ఇలాగే కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు. రాబోయే వానకాలంలో ఏయే పంటలు వేయాలో ముందస్తు ప్రణాళికలను సిద్ధంచేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రిని, అధికారులను ఆదేశించారు. ప్రధానంగా పత్తి, కంది, వరిని సాగుచేసేలా చూడాలని ఆదేశించారు. రైతాంగాన్ని లాభసాటి పంటల సాగుదిశగా సమాయత్తంచేయాలని చెప్పారు.

ఒమిక్రాన్‌ గురించి ఆందోళన వద్దు
ఒమిక్రాన్‌ వ్యాప్తి వార్తల నేపథ్యంలో.. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌ పురోగతిని కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉన్నదని చెప్పారు. ఒమిక్రాన్‌ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరంలేదని అన్నారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్‌ నిరోధానికి చేపట్టవలసిన ముందస్తు చర్యలపై సమీక్షించిన ముఖ్యమంత్రి ఆ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షా సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, కొప్పుల ఈశ్వర్‌, కే తారకరామారావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, సీహెచ్‌ మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వీ శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, మాజీ మంత్రి మోతుపల్లి నర్సింహులు పాల్గొన్నారు. ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియానాయక్‌, రేఖానాయక్‌, షిండే, కోరుకంటి చందర్‌, బాల సుమన్‌, జాజుల సురేందర్‌, సుంకె రవిశంకర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సీఎంఓ అధికారులు నర్సింగ్‌రావు, స్మితా సబర్వాల్‌, రాహుల్‌ బొజ్జా, భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ అశోక్‌కుమార్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఐజీ శేషాద్రి, సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, ఫైనాన్స్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గంగాధర్‌, శ్రీనివాసరావు, రమేశ్‌రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

దళిత సమాజం దుఃఖాన్ని, ఆర్తిని తెలుసుకోండి
గత పాలకుల చేదు అనుభవాలతో, దశాబ్దాలుగా తాము ఎప్పుడూ మోసాలకు గురవుతూనే ఉన్నామనే దుఃఖం దళితవాడల్లో నెలకొన్నదని, వారి ఆర్తిని అర్థంచేసుకొని దళితులకు భరోసా కల్పించేదిశగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ ఉద్బోధించారు. ‘మీకు ఆకాశమే హద్దు. మీరు ఇప్పటివరకు చేసిన ఏ పనిలోనూ లేని తృప్తి.. దళితబంధు పథకం అమలులో పాల్గొనడంలో దొరుకుతుంది’ అని చెప్పారు. దళిత కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు వున్న అన్ని అవకాశాలను, ప్రభుత్వ ప్రైవేట్‌ రంగాల్లోని అన్ని రకాల వ్యాపార ఉపాధి మార్గాలను శోధించాలని సూచించారు. ఈ క్రమంలో దళిత సమాజం అభ్యున్నతి కోసం పాటుపడుతున్న దళిత మేధావులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, దళిత సామాజిక అభివృద్ధి కాముకుల సలహాలు సూచనలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లకు సూచించారు.

నూతన జోనల్‌ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన
నూతన జోనల్‌ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు. నూతన జోనల్‌ వ్యవస్థతో స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనతోపాటు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వపాలన అమలులోకి వస్తుందని చెప్పారు. వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయాలని ఆదేశించారు.

భార్యాభర్తలు ఒకేచోట
భార్యాభర్తలైన ఉద్యోగులు (స్పౌజ్‌) ఒకేచోట పనిచేస్తేనే వారు ప్రశాంతంగా ఉండగలుగుతారని, ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలుగకుండా మానవీయ కోణంలో స్పౌజ్‌ కేస్‌ అంశాలను పరిషరించాలని ఆదేశించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.