-నెరవేరనున్న సీఎం కేసీఆర్ సంకల్పం -26న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. -జూన్ తొలివారంలో సీఎం నల్లగొండ పర్యటన

పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఆలయ అభివృద్ధి పనులకు ఈ నెల 30న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపనతో శ్రీకారం చుడుతున్నారు. తిరుపతిని తలపించే రీతిలో ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దాలని సీఎం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆలయంలో చేపట్టనున్న కార్యక్రమాలకు మొదటి అడుగు పడుతున్నది. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పాల్గొంటున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన కార్యక్రమం ఖరారైంది. మరోవైపు రాష్ట్రం ఆవిర్భవించి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ నెల 26న సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం కీలక సమావేశం జరుగుతున్నది. అలాగే జూన్ మొదటి వారంలో నల్లగొండ జిల్లాలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ పర్యటనలో సీఎం చౌటుప్పల్‌లో జలహారం పైలాన్ ఆవిష్కరణ, దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూమి పూజ, నక్కలగండి జలాశయానికి శంకుస్థాపనతో పాటు నకిరేకల్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. వాస్తవానికి ఈనెల 29నే నల్లగొండ జిల్లాలో సీఎం పర్యటన జరపాల్సి ఉంది. అయితే జిల్లాలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు, వేడిగాలుల తీవ్రత అధికమైన నేపథ్యంలో ప్రజలు, అధికారులకు ఇబ్బంది కలుగుతుందని జిల్లా మంత్రి జీ జగదీశ్‌రెడ్డి సీఎం దృష్టికి తెచ్చారు. మంత్రి సూచన మేరకు ఈ పర్యటనను జూన్ మొదటివారానికి వాయిదా వేశారు.
ప్రస్తుతం ఖరారైన వివిధ కార్యక్రమాల షెడ్యూలును బట్టి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర తొలి ఏడాది సంబురాలు ముగిసిన తర్వాత ఈ పర్యటన ఉండే అవకాశం ఉంది. జూన్ 5వ తేదీన జిల్లా పర్యటనకు వస్తే ఎలా ఉంటుందని మంత్రి జగదీశ్ రెడ్డిని సీఎం అడిగారని సమాచారం. అన్నీ కుదిరితే అదే తేదీ ఖరారు కావచ్చు. ఇదిలా ఉంటే ఈనెల 26వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశానికి విస్తృత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచిన నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాల సమీక్ష నూతన పథకాల ప్రతిపాదనలు ఇందులో చర్చకు వచ్చే అవకాశమందని భావిస్తున్నారు.