Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

31 వరకు మూత

-కరోనా వైరస్‌ నిరోధానికి ప్రాథమికంగా రూ.500 కోట్లు
-సిద్ధంగా 1341 ఐసొలేటెడ్‌ బెడ్లు.. 241 వెంటిలేటర్లు
-సోషల్‌ మీడియాలో ఎవరూ తప్పుడు ప్రచారంచేయొద్దు
-మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
-వార్తలు, కథనాల్లో ఆరోగ్యశాఖ నివేదికనే ప్రసారంచేయాలి
-ప్రాంతాల పేర్లు ప్రస్తావించవద్దు.. భయోత్పాతాన్ని సృష్టించొద్దు
-ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినవారిపై కఠినచర్యలు
-కరోనా మనదేశంలో పుట్టలేదు.. భయపడాల్సిన పరిస్థితుల్లేవు
-మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు

రాష్ట్రంలో కరోనాతో భయంకరమైన పరిస్థితి ఏమీ లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ వైరస్‌ గురించి ప్రజలు ఏ మాత్రం భయపడాల్సిన అవసరంలేదని స్పష్టంచేశారు. కానీ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించారు. శనివారం సాయంత్రం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలుతీసుకోవాల్సిన అవసరం ఉన్నదని.. ఇందుకోసం రెండుదశల కార్యక్రమాలను చేపట్టాలని క్యాబినెట్‌ నిర్ణయించిందని వెల్లడించారు. 15 రోజులు.. ఏడు రోజులవారీగా కార్యక్రమాలు నిర్ణయించామని తెలిపారు. ఇందులోభాగంగా మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సినిమాహాళ్లు, బార్లు, పబ్‌లు, మెంబర్‌షిప్‌ క్లబ్‌లు మూసివేస్తున్నట్లు చెప్పారు. బహిరంగసభలు, సమావేశాలు, సదస్సులు, వర్క్‌షాప్‌లు, ఉత్సవాలు, ర్యాలీలు, ఎగ్జిబిషన్లు, ట్రేడ్‌ ఫెయిర్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతులివ్వబోమని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులకు ఇబ్బంది కలుగకుండా మాల్స్‌, సూపర్‌మార్కెట్లను మూసివేయడంలేదన్నారు. విద్యాసంస్థలు మూసివేసినప్పటికీ బోర్డు పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, సంక్షేమహాస్టళ్లలో వసతి సౌకర్యం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్టేడియంలు, స్విమ్మింగ్‌పూల్స్‌, జిమ్‌లు, జిమ్నాజియంలు, జూపార్కు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, మ్యూజియంలను మూసివేస్తామన్నారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలుగకుండా బస్సులు, రైళ్లు నడుస్తాయని.. వాటిలో నిరంతరం శానిటేషన్‌ పనులు చేపడ్తామని చెప్పారు. అన్ని క్రీడా పోటీలు రద్దుచేశామని చెప్పారు.

పరీక్షలు యథాతథం
మార్చి 31 వరకు రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేయాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ నిర్ణయం శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందన్నారు. ఈ నిర్ణయాన్ని ఎవరు అధిగమించినా కఠినంగా వ్యవహరిస్తామని, ఆ విద్యాసంస్థ గుర్తింపు కూడా రద్దుచేస్తామని హెచ్చరించారు. వీటితోపాటు కోచింగ్‌సెంటర్లు, సమ్మర్‌క్యాంపులు మూసివేయాలని చెప్పారు. విద్యాసంస్థలను మూసివేసినప్పటికీ, ఇంటర్‌, పది తదితర బోర్డు పరీక్షలు, సెట్స్‌ పరీక్షలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని, వీటికోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంటారని తెలిపారు. సాంఘిక సంక్షేమ, మైనార్టీ గురుకులాల్లో పరీక్షలు రాసేవారు హాస్టళ్లలో ఉండవచ్చని.. పరీక్షలు పూర్తయ్యేవరకు వారికి వసతి ఉంటుందన్నారు. మిగిలినవాళ్లను ఇండ్లకు పంపిస్తారని చెప్పారు. హాస్టళ్లలో ఉండేవారికి ప్రత్యేక శానిటరీ ఏర్పాట్లుచేయాలన్నారు.

అసత్య ప్రచారాలను సహించం
సోషల్‌మీడియాలో కొందరు అతిగాళ్లు ఇష్టారీతిన ప్రచారంచేస్తున్నారని, అలాంటివారిపై కఠినచర్యలు తీసుకొంటామని సీఎం హెచ్చరించారు. వారిని ఎవరూ ఏమీచేయలేరనుకొంటున్నారని, కానీ ఈసారి ప్రభుత్వమంటే ఏమిటో రుచిచూస్తారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో భయోత్పాతం సృష్టించడం మంచిది కాదని స్పష్టంచేశారు.

ఆరోగ్యశాఖ నిర్ధారిస్తేనే ప్రసారంచేయాలి
మీడియాలోకూడా కొందరు అతిగా ప్రచారంచేస్తున్నారని.. ఫలానా ప్రాంతాల్లో గుర్తించారని చెప్పడం మంచిపద్ధతి కాదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇలాంటివారిపై కూడా నియంత్రణ పెడుతున్నామని చెప్పారు. ఆరోగ్యశాఖ నిర్ధారించిన నివేదికలను మాత్రమే ప్రసారంచేయాలని సూచించారు. మీడియా స్వేచ్ఛను తామేం హరించడంలేదని, కానీ ఆ పేరుతో ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తే కఠినచర్యలు తీసుకొనేందుకు వెనుకాడబోమన్నారు. ప్రభుత్వానికి ఆ అధికారాలు కూడా ఉంటాయన్నారు. ఇలాంటి సున్నితమైన సమయంలో ప్రభుత్వంచేసే విజ్ఞప్తిని ఆషామాషీగా తీసుకొంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రజలకు ధైర్యం, అవగాహన కల్పించేలా ప్రసారాలు, ప్రచురణలు ఉండాలని సూచించారు.

కరోనా మనదేశంలో పుట్టలేదు
కరోనా మనదేశంలో పుట్టిన వ్యాధే కాదని, చైనాలో పుట్టి.. అక్కడినుంచి వివిధ దేశాలకు పాకుతున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణలో అస్సలు కరోనా లేదని పునరుద్ఘాటించారు. మొదట ఒక వ్యక్తికి వచ్చిందని, అతను వేరే దేశంనుంచి బెంగళూరు వచ్చి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చాడని తెలిపారు. అతనికి చికిత్సచేసి డిశ్చార్జికూడా చేశామని చెప్పారు. శనివారం ఉదయం అనుమానిత కేసులు వస్తే చికిత్సచేస్తూ రిపోర్ట్‌ను పుణెకు పంపించామని, వారి నివేదికలు రావాల్సి ఉందని తెలిపారు. దేశంలో మొత్తం 83 మందికి కరోనా సోకినట్టుగా కేంద్రం తెలిపిందన్నారు. వీరందరూ విదేశాలనుంచి వచ్చి నవారేనని, ఇందులో 66 మంది విదేశీ భారతీయులు, 17 మంది విదేశీయులున్నారని చెప్పారు. ఇందులో 10 మంది చికిత్స తర్వాత కోలుకోగా, ఇద్దరు చనిపోయారన్నారు. 130 కోట్ల మంది ఉన్న దేశంలో భయోత్పాతానికి గురికావాల్సిన అవసరంలేదని ప్రజలకు భరోసా కల్పించారు.

దేనికైనా సిద్ధం
వైరస్‌ ఒక వ్యక్తి నుంచి చాలామందికి ప్రబలే ఆస్కారం ఉం టుందని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్‌ వివరించారు. జనసమ్మర్దం ఉన్న దగ్గరికి ప్రజలు పోవద్దని సూచించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకొన్నాయని, కేంద్రం సూచనలు, సలహాలు అందిస్తున్నదని చెప్పారు. ఏ రకమైన పరిస్థితి ఉత్పన్నమైనప్పటికీ ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్యశాఖ సర్వసన్నద్ధంగా ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం ప్రాథమికంగా రూ.500 కోట్లు మంజూరుచేసిందని తెలిపారు. ఈ నిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందుబాటులో ఉంటాయని, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో 200 మంది ఆరోగ్యశాఖ సర్వైలెన్స్‌ ద్వారా స్క్రీనింగ్‌ చేస్తున్నారని సీఎం తెలిపారు. ఎఫెక్ట్‌ అయినవారిని కార్వంటైన్‌ చేసి, చికిత్స అందిస్తున్నారని వివరించారు. కరోసా వస్తేగిస్తే విదేశాల నుంచే వస్తుందని, అక్కడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ‘మనకు పోర్ట్‌ బెడద లేదు. హైదరాబాద్‌లో మాత్రమే ఎయిర్‌పోర్ట్‌ ఉన్నది. సమస్య అంతా హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లోనే ఉంటుంది. గ్రామాల్లో ఉండదు. భయాందోళనలు అవసరం లేదు’ అని సీఎం భరోసా ఇచ్చారు. కరోనా వస్తే చికిత్సచేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 1020 బెడ్స్‌తోపాటు 321 ఐసీయూ బెడ్‌లు సిద్ధంగా ఉంచామని తెలిపారు. 240 వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచామని చెప్పారు. రాష్ట్రంలో క్వారంటైన్‌ చేయడానికి నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి, శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, అటవీ, పోలీసుశాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. వీరు ప్రతిరోజు రెండుసార్లు సమావేశమై పరిస్థితిని మంత్రికి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి నివేదిస్తారని తెలిపారు.

విమానాశ్రయంలోనే పరీక్షలు
ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ ఉన్నదని ప్రచారంచేశారని, కానీ చైనా, ఇటలీ, ఇరాన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, దక్షిణ కొరియా దేశాల్లో మాత్రమే కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ దేశాల నుంచి వచ్చే విదేశీయుల వీసాలను భారత ప్రభుత్వం రద్దుచేసిందని చెప్పారు. మన దేశస్థులు తిరిగివస్తే వారిని 14 రోజులు క్వారంటైన్‌ ప్రాంతంలో పరిశీలన తర్వాతే బయటకు పంపిస్తున్నట్టు స్పష్టంచేశారు. అందుకే శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో 200మంది నియంత్రణ అధికారులతో విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ పరీక్షిస్తున్నారన్నారు. కరోనా వైరస్‌ స్థానిక వ్యాధి కాదని, దీనివల్ల పెద్దగా ఇబ్బందేమీ లేదన్నారు. భారతప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు అన్ని ఎయిర్‌పోర్టుల్లోనూ పరీక్షలు జరుగుతున్నాయని, శంషాబాద్‌లోనూ అదేవిధంగా పరీక్షలు చేస్తున్నారని సీఎం తెలిపారు.

లేని భయం కల్పించొద్దు
గాంధీ దవాఖానలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. ‘ఆ వార్డు పేరే ఐసొలేషన్‌ వార్డు. ప్రత్యేకంగా ఉంటుంది. బెడ్స్‌ ఐసోలేటెడ్‌. వారికి వాడే వస్తువులను ఇతరులకు వాడరు. వైద్యులే వైద్యం చేస్తున్నారు. కొందరుఅనవసరంగా ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేంద్రం నుంచి నిధులేమీ కోరలేదని, సంప్రదింపులు జరుపుతున్నామని, వైద్యం కోసం డబ్బులు పెట్టుకొనే సామర్థ్యం ఉన్నదని చెప్పారు. కేంద్రం నుంచి సాంకేతిక సహాయంతోపాటు, వారి సలహాలు, సూచనలు తీసుకొంటున్నామని తెలిపారు. వ్యాధి ప్రబలినప్పుడు కొన్ని వస్తువులు అవసరమవుతాయని, కానీ వ్యాధి ప్రబలలేదని చెప్పారు. అనవసరంగా ప్రజల్లో లేనిభయం కల్పించొద్దన్నారు. మాస్క్‌లను అధికధరలకు అమ్మేవారిపై కఠినచర్యలు తీసుకొంటామని తెలిపారు. అనుమానం ఉంటేనే పరీక్షలు నిర్వహిస్తారని, అనంతరం దాని పూర్తిస్థాయి పరిశీలన కోసం పుణె పంపిస్తామని వివరించారు. అక్కడ నిర్ధారిస్తేనే కరోనా వచ్చినట్లు అని స్పష్టంచేశారు. మనదగ్గర కేవలం ఒకరికి మాత్రమే వచ్చిందని, ముగ్గురు అనుమానితులు ఉంటే ఒకరు దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు. మరొకరికి మాత్రమే అనుమానంగా ఉన్నదన్నారు. ఈ వైరస్‌ కొద్ది రోజులు ఉంటుందని, ఆ రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

31 వరకే మ్యారేజిహాళ్లలో పెండ్లిళ్లు
ఈ నెలాఖరువరకు రాష్ట్రం లో మ్యారేజి హాళ్లలో ముందే నిర్ణయించిన పెండ్లిళ్లకు అనుమతిస్తామని.. 200 మంది లోపు బంధువులను పిలుచుకొని పెండ్లిళ్లు చేసుకోవచ్చని సూచించారు. అతికి పోకుండా తక్కువమందితో పెండ్లి చేసుకోవాలని హితవుచెప్పారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి మ్యారేజి హాళ్లు బుక్‌ చేసుకోవద్దని చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీచేశామని.. ఎవరైనా అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకొంటామని స్పష్టంచేశారు. పబ్లిక్‌ మీటింగ్‌లు, ర్యాలీలు అన్ని బంద్‌చేశామని, ప్రభుత్వం ప్రకటించేవరకు ర్యాలీలు బంద్‌ చేయాల్సిందేనన్నారు. ఈ నెలాఖరువరకు పరిస్థితి చూసి, శ్రీరామనవమివరకు పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. దేవాలయాలు, చర్చిలు, ప్రార్థనా మందిరాలు శుభ్రంగానే ఉంటాయన్నారు.

మాల్స్‌ తెరిచేఉంటాయి
ప్రజలకు నిత్యావసర సరుకుల కొనుగోలుకు ఇబ్బంది లేకుండా, సరుకుల కొరత రాకుండా సూపర్‌మార్కెట్లు, మాల్స్‌, షాపులేవీ మూసివేయటంలేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అక్కడ కూడా ప్రజలు పెద్దగా గుమిగూడకుండా తొందరగా తమకు కావలసినవి కొనుక్కొని వెళ్లిపోతే మంచిదని సూచించారు. పరిస్థితులను అంచనా వేస్తూ నిర్ణయం తీసుకుంటామన్నారు. పంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రజలు కూడా ఉత్సవాలను దూరంగా ఉంటేనే మంచిదన్నారు. వారంరోజుల కోసం ప్రకటించిన నిబంధనలను.. వారం రోజుల తర్వాత ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ అధికారులు సమీక్షించి అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అసెంబ్లీ నిర్ణయాల గురించి బయటకు చెప్పడం సబబు కాదని, దానిపై స్పీకర్‌తో చర్చించి చెప్తామన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.