Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

3920 కోట్ల గృహరుణ మాఫీ…

పేద ప్రజలకు మరో భారీ వరాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలో బలహీనవర్గాల గృహనిర్మాణ లబ్ధిదారులు చెల్లించాల్సిన రూ.3920 కోట్ల రుణాలను రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీలో సభాముఖంగా ప్రకటించారు. త్వరలోనే పేదలను ఈ రుణాల నుంచి విముక్తులను చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 2.60 లక్షల డబుల్ బెడ్‌రూం ఇండ్లను పూర్తిచేయడమేకాకుండా.. మరిన్ని చేపడుతామని స్పష్టంచేశారు.

k-chandrasekhar-rao4

గ్రామాలు, పట్టణాల్లోని బలహీనవర్గాల గృహనిర్మాణ లబ్ధిదారులు చెల్లించాల్సిన రూ.3920 కోట్ల రుణాన్ని మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గత ప్రభుత్వాల హయాంలో పథకాలు ఎన్ని వచ్చాయో పరేషాన్లూ అన్ని అయ్యాయన్నారు. 1983 నుంచి 2014 వరకు గ్రామీణ శాశ్వత గృహాలు (ఆర్పీహెచ్), పట్టణ ప్రాంత శాశ్వత గృహాలు (యూపీహెచ్), బీడీ కార్మికులు, మత్స్యకారులు వంటి బలహీనవర్గాల ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా కూడా లబ్ధిదారులపై రుణభారం పడిందన్నారు. సదరు బలహీనవర్గాలు తమపై పడిన రుణాన్ని తిరిగి చెల్లించే స్థితిలో లేరన్న సీఎం.. ఈ రుణాన్ని తిరిగి చెల్లించే అవసరమే లేకుండా రూ.3920 కోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రుణమాఫీ బలహీన వర్గాల గృహనిర్మాణ పథకానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

మంగళవారం అసెంబ్లీలో గృహ నిర్మాణ పథకంపై జరిగిన లఘు చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ఈ అప్పులు పడ్డాయి. నాతోపాటు సభలో ఉన్న చాలామంది ఆయా ప్రభుత్వాల్లో భాగస్వాములే. మేం తప్పించుకోవాలంటే తప్పించుకోవచ్చు. కానీ ఆ విధంగా చేయవద్దని నిర్ణయించుకున్నాం. అందుకే మాకేంపని? అనుకోకుండా ఈ మాఫీ నిర్ణయం తీసుకున్నాం అని సీఎం చెప్పారు. ఇగ పేదోళ్ల దర్వాజలు బ్యాంకోల్లు గుంజుకపోవద్దు. ఇందుకోసం త్వరలోనే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటుచేస్తాం. వాళ్లకు ప్రభుత్వపరంగా ఆదేశాలు ఇప్పించి, పేదలను రుణవిముక్తులను చేస్తాం. రాబోయే నెలలోగానే ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. వాళ్లు కడుపు నిండా తిని..కంటి నిండ నిద్రపోయే పరిస్థితిని కల్పిస్తాం. పేదలకు మేలు చేసే విషయంలో మా ప్రభుత్వం ముందు ఉంది. ఉంటుంది అని చెప్పారు. పేదలకు మేలు చేసే విషయంలో తమ ప్రభుత్వం ముందుందని, ఇకపైనా ముందు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో 2.60 లక్షల మంది పేద కుటుంబాలకు ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని స్పష్టంచేశారు. ఈ ప్రక్రియ శరవేగంతో ముందుకు పోతుందని అన్నారు. ముఖ్యమంత్రి ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..

ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలకు బాధ్యులెవరు? గత ప్రభుత్వ జమానాలో ఇందిరమ్మ ఇండ్లలో అర్హులకు న్యాయం జరగలేదు. మరోవైపు పెద్దఎత్తున నిధులు దారిమళ్లాయి. ఈ అక్రమాలకు ఎవరు బాధ్యులు? 2004 నుంచి 2014 వరకు ఎవరు అధికారంలో ఉన్నారు? ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలకులే 500 మంది అధికారులను డిస్మిస్ చేశారు.

k-chandrasekhar-rao2

ఇపుడు చర్యలు అంటే.. ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్లు పేద ప్రజలపై పడాలా? ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటే.. అధికారంలోకి రాగానే చర్యలు తీసుకున్నారు.. పేదలను జైల్లో వేస్తారా? అని ఇదే ప్రతిపక్షాలు అంటాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత మేం ఆదుర్దా పడలేదు. సంక్షేమం, అభివృద్ధి, విద్యుత్, తెలంగాణకు ఆకుపచ్చదనం పెంపొందించడం వంటి పనులతో ముందుకు పోయినం. అంతేతప్ప ఇండ్ల నిర్మాణం విషయాన్ని మర్చిపోయికాదు. ఇండ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డ దొంగలను బయటపెడుతం. దోషులకు శిక్ష, ప్రజలకు న్యాయం తప్పకుండా చేస్తాం. ఇపుడు ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం తీసుకునే చర్యలకు కూడా మద్దతివ్వాల్సి ఉంటుంది.

గ్రేటర్ హైదరాబాద్ కోసం 650 ఎకరాలు.. రూ.500 కోట్ల నిధులు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తారనే భరోసాతోనే టీఆర్‌ఎస్‌కు ఓట్లేసిన వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. గ్రేటర్‌లో నిర్మాణాలు చేపట్టేందుకు మెరుపు వేగంతో పనిచేస్తాం. ఇందుకోసం ఇప్పటికే 650 ఎకరాల స్థలం ప్రత్యేకంగా తీసిపెట్టాం. హౌసింగ్ బోర్డు వద్దనున్న స్థలాలు, సర్కారు జాగలను తీసుకుంటాం. హైదరాబాద్‌కు చెందిన ఇండ్ల విషయంలో ఉన్న ఇసుక కొరత, అనుమతులు వంటి సమస్యలను త్వరలో గ్రేటర్ ఎమ్మెల్యేలతో సమావేశం సందర్భంగా చర్చించి పరిష్కరిస్తాం. జీవో 59 ద్వారా స్థలాల క్రమబద్ధీకరణ వల్ల సంపన్నులు లాభపడకుండా చూస్తాం. 1/70 చట్టం విషయంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఉపయోగించి ఇటు గిరిజనులకు, అటు లబ్ధిదారులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. సత్తుపల్లిలో ఇండ్లు కాలిపోయిన వారికి కొత్తగా ఇండ్లు నిర్మించి ఇస్తాం. దివంగత సీఎం వైఎస్ హయాంలో పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించని వారికి కూడా త్వరలో స్థలం చూపించేలా చర్యలు తీసుకుంటాం.

ఇల్లు వచ్చింది నాటిక తీరు చేయం..

ప్రస్తుత గ్రేటర్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి జగిత్యాలలో పీడీగా పనిచేస్తున్న సమయంలో ఒక నాటిక రాశారు. ఆ నాటిక పేరు ఇల్లు వచ్చింది. దాన్ని నేను చూశాను. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే రమణ కూడా చూశారు. ఆ నాటిక సారాంశం ఏమిటంటే.. ఒక సామాన్యుడికి ఇల్లు వస్తుంది. అయితే డబ్బులు లేక ఇల్లు నిర్మాణం కాదు. అక్కడిక్కడ గోసపడి అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే.. తిరిగి తీర్చే స్థోమత ఉండదు. దీంతో బ్యాంకోల్లు వచ్చి తలుపులు గుంజుక పోతరు.. ఇది నాటకం. ఎంత బాధ అనిపించిందో. అలాంటివి ఎన్నో మేం ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో చూసినం. అట్ల గుంజుకపోయిన బాధితుల పక్షాన బ్యాంకువాళ్ల దగ్గరికి ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లం పోయి.. సర్దిచెప్పి.. ఆ ఇంటాయన పరువు కాపాడేటోళ్లం. ఎల్లుమాను ఉన్నోళ్లు.. కట్టుకునేటోళ్లు లేనోల్లు లేరు. ఇపుడు అలా చేయం. గర్వంగా, అప్పులు లేకుండా నిశ్చితంగా ఇంట్ల ఉండే పరిస్థితి కల్పిస్తాం.

మోడీ భరోసా ఇచ్చారు.. తెలంగాణ అంతా అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతమో అని కాకుండా.. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలనేదే మా తాపత్రయం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, జాతీయ రహదారులు, డబుల్ బెడ్‌రూం ఇండ్లు.. ఇలా ఏ విషయంలో అయినా అన్ని ప్రాంతాలను కలుపుకొనిపోయే విధంగా మా ప్రణాళికలు ఉంటున్నాయి. పెద్ద నోట్ల రద్దు విషయంలో అనవసర ప్రలోభాలు, ప్రచారాలు వద్దు. ఆర్థికంగా భయం కల్పించవద్దు. నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రిని కలిసినపుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆయన ప్రస్తావిస్తే.. మా స్టేట్ ఓన్ రెవెన్యూ (ఎస్‌వోఆర్) 21% ఉంది.. అది తగ్గిపోతుందేమో అనే ఆందోళన వ్యక్తంచేశాను. అపుడు మోదీ నన్ను ప్రశంసించారు. భారతదేశంలో అత్యుత్తమ అభివృద్ధి రాష్ట్రంగా ఉన్నపుడే గుజరాత్ రాష్ట్ర ఎస్‌వోఆర్ 11% ఉంది. మీరు (తెలంగాణ) 21% అంటే అద్భుతం. రాష్ర్టానికి కావాల్సిన సహాయ, సహకారాలను అందిస్తాను అని హామీ ఇచ్చారు. ఇలా సొంతగా ఎదుగుతున్న రాష్ట్రంపై అనవసర అపోహలు, దురభిప్రాయం వద్దు.

జానారెడ్డి ఇంటకి వెళ్తా.. పులుసు, పప్పు పెట్టినా తింటా ప్రతిపక్ష నేత ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లి భోజనం చేయడం గతంలో సంప్రదాయంగా ఉండేది. ఒకప్పుడు నేను అదే విధంగా ప్రతిపక్ష నేత జానారెడ్డి ఇంటికి వెళ్లాలని భావించాను. అయితే అప్పుడే ఏదో ఉప ఎన్నిక వచ్చింది. అందుకే ఆగిపోయిన. త్వరలోనే జానారెడ్డి గారి ఇంటికి వెళతా. ఆయన పులుసు పోసినా.. పప్పు పెట్టినా తింటాను. (సీఎం ఈ మాటలు చెప్పగానే సభలో నవ్వులు విరిశాయి).

రాజకీయ జోక్యం ఉండనే ఉండదు

k-chandrasekhar-rao3

ప్రజాప్రతినిధుల గౌరవం కాపాడటానికే అర్హుల ఎంపికలో ఎమ్మెల్యేలు కాకుండా కలెక్టర్ సారథ్యంలో అధికారుల బృందానికి అప్పగించాం. దీనికి అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అంగీకరించారు. గ్రామాల ఎంపిక మాత్రం ఎమ్మెల్యేలు చేస్తారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. రాజకీయ జోక్యం లేకుండా సహకరించినందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగితే బాధ్యులైన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆనాటి ప్రభుత్వం హయాంలో జరిపినట్టుగా చేయం. అప్పటి వాటికి చరమగీతం పాడేందుకే ఈ నిర్ణయం. ఏ ప్రభుత్వం ఉన్నా.. ఏ పార్టీ వచ్చినా.. డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టాల్సిందే. లేకపోతే ప్రజలు ఊరుకోరు. ఎక్కడ అభివృద్ధి జరిగినా మనదే.. తెలంగాణదే.. అనే సూత్రంతో ముందుకు వెళుతున్నాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధిచేయాలనే లక్ష్యంతో పోతున్నాం. జాతీయ రహదారులు వచ్చినప్పుడు అన్ని ప్రాంతాలు, నియోజకవర్గాలను ఎలా అభివృద్ధి చేశామో అలాగే డబుల్ బెడ్‌రూం ఇండ్ల విషయంలోనూ అన్ని ప్రాంతాలు, నియోజకవర్గాల్లోనూ నిర్మిస్తాం. ఒక్క రూపాయికూడా దుర్వినియోగం కాకుండా వేగంగా ఇండ్లను కడతాం.

కాంట్రాక్టర్లను ఒప్పిస్తున్నాం హైదరాబాద్‌లో కాంట్రాక్టర్లను పిలిపించి మాట్లాడా. దీంట్లో మార్జిన్ తక్కువ ఉంటది. బయట ఇతర పనుల్లో మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ముందుకు రావడంలేదు అని వారు చెప్పారు. కార్పొరేట్ సంస్థగా మీకు సామాజిక బాధ్యత ఉంటుంది కదా.. ఒక సంస్థ ఒక్కో నియోజకవర్గానికి కట్టండి అని చెప్పా. సభ్యులకు 100 శాతం హామీ ఇస్తున్నాను. ఇక డబ్బాలు కట్టం.. ఆరు నూరైనా డబుల్ బెడ్‌రూం ఇండ్లే కడుతాం. ప్రధానమంత్రి తమ పరిమితి బట్టి నిధులు ఇస్తామన్నారు. కేంద్రం నిధులు, మన నిధులను వినియోగించుకుని.. ఇండ్ల నిర్మాణం వేగం చేస్తాం.

ఆదరాబాదరా లేదు.. డబుల్ బెడ్‌రూం పథకం దేశంలో ఎక్కడా లేదు. ఈ హామీ ఇచ్చే ముందు రెండు మూడు నెలలు చర్చించాం. నేను 1985 నుంచి ఎమ్మెల్యే. నేను కూడా ఒక్క గదితో ఇండ్లు కట్టించా. లబ్ధిదారుల నుంచి ఉద్యోగులు డబ్బులు తీసుకొవద్దని అనేకసార్లు చెప్పాం. ఎంగిలి కూడు తినకండి అన్నాం. జడ్పీ సమావేశాల్లో వారిని నిలదీసే వాళ్లం. ఆ తరువాత కూడా వారు అదే ధోరణి కొనసాగించారు. ఇపుడు వారికే అప్పగిద్దామా? అనే విషయంలో అనేకమార్లు చర్చించాం. కలెక్టర్లకు బాధ్యత ఇచ్చాం. ఫస్ట్ ఫేజ్‌లో కాలనీలు తీసుకొమ్మని చెప్పాం. నిధులు ఖర్చు చేయాలని చూస్తే రెండు వేల కోట్లు.. పది వేల కోట్లు ఖర్చుచేసే వాళ్లం. కానీ అలా కాదు. నాలుగు రోజులు ఆలస్యమైనా ఫర్వాలేదు. రాజకీయాల కొరకు కడ్తలేం. రెండు తరాలు ఆ ఇండ్లలో నిద్రపోవాలి.. ప్రశాంతంగా ఉండాలని చూస్తున్నాం. ఆదరాబాదరగా ఏం లేం. 2.60లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. మిగిలినవి కూడా టేకప్ చేస్తాం.

ఇండియాలోనే ఇలాంటి పథకం లేదు.. డబుల్ బెడ్‌రూం పథకంలాంటిది దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదు. గడిచిన ఆరు దశాబ్దాల్లో గత ప్రభుత్వాలు నిర్మించామని చెప్పుకుంటున్న.. సోకాల్డ్ లక్షల ఇండ్లకు చేసిన ఖర్చు రూ.11వేల కోట్లు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం తలపెట్టి, సమకూర్చుకున్న మొత్తం రూ.17,660 కోట్లు. హైదరాబాద్‌లాంటి సిటీలో పేదలు గుడిసెలు వేసుకుని ఉంటారు. అక్కడి నుంచి పొమ్మంటే పోరు. నాకన్న లక్ష్మణ్, కిషన్‌రెడ్డిలాంటి సిటీకి చెందిన ఎమ్మెల్యేలకే ఎక్కువ తెలుసు. మరి ఏం చేయాల! జాగ తక్కువ ఉంది. ఎక్కడ ఉన్నారో అక్కడే ఇండ్లు కట్టడానికి ఎన్ని కాలనీల్లో అవకాశం ఉన్నదో పరిశీలించాం. నగరంలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో అవసరమయ్యే లిఫ్ట్‌లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. మెయింటెన్స్ కాస్ట్ భరిస్తాం.

ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు.. ఇందిరమ్మ ఇండ్లకు చెల్లించడానికి రూ.556కోట్లు సిద్ధంగా ఉన్నాయి. ఎట్లెట్లా జరిగితే అట్లట్ల బిల్లులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. 56వేల ఇండ్లు పూర్తి అయ్యాయి. మిగిలిన రూ.1500కోట్లతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరాటంకంగా జరుగుతుంది. రూ.500 కోట్లతో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జరుగుతుంది. 14వేల ఇండ్లకు టెండర్లు ఖరారయ్యాయి.

నగర ప్రజాప్రతినిధులతో త్వరలో సమావేశం జంట నగరాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ప్రగతి భవన్‌లో సమావేశం పెడుతాం. మీ మీ నియోజకవర్గాల్ల్లో మీరు బాధ్యులు. ఇండ్ల నిర్మాణంపై ఫైనల్ చేద్దాం. 15లక్షల మంది దరఖాస్తులు అనర్హమైనవని చెప్పలేదు. తక్షణం నిర్మాణానికి అనువుగా లేవని సమాధానం చెప్పారు.

భారం ప్రజలది.. ప్రచారం గత ప్రభుత్వాలది బలహీనవర్గాల గృహనిర్మాణం విషయంలో గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్ని లోతుగా విశ్లేషిస్తే.. పేదలకు జరిగిన మేలు పెద్దగా లేదని అర్థమవుతున్నది. ప్రభుత్వం ఇండ్లు కట్టించి ఇచ్చిందన్న పేరే కానీ, భారమంతా బలహీనవర్గాలపైనే పడింది. నిర్మాణ వ్యయంలో ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు కన్నా లబ్ధిదారులు పెట్టుకున్న ఖర్చే ఎక్కువ. బ్యాంకు రుణాలు వసూలు చేయడం కోసం ప్రభుత్వాధికారులు వారి ఇంటి దర్వాజలను ఊడదీసుకుపోవడం, అధికారులు వస్తున్నారంటేనే ప్రజలు ఇండ్లకు తాళాలు వేసి వెళ్లిపోవడం లాంటి సంఘటనలెన్నో గతంలో మనమంతా చూశాం. గృహ నిర్మాణ పథకం పేదలకు నిలువనీడ కల్పించాల్సింది పోయి, వారిని రుణగ్రస్తులను చేసి, అవమానాల పాలుచేసే పథకంగా మారింది.

ముస్లింలు, జర్నలిస్టులకు కోటా డబుల్ బెడ్‌రూం ఇండ్ల విషయంలో జర్నలిస్టులు, ముస్లింలకు కోటా ఉంటుంది. సమాజ సంక్షేమంలో భాగంగా పనిచేస్తున్న వారిని గౌరవించుకోవాల్సి ఉంది. గతంలో మాట ఇచ్చినట్లుగానే జీహెచ్‌ఎంసీ సహా మున్సిపల్ కార్పొరేషన్లలోని జర్నలిస్టులకు తప్పకుండా ఇండ్లు కట్టిస్తాం. అదే విధంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లలో ముస్లింలకు వాటా కల్పిస్తం. రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప విషయంలో నెలకొన్న సమస్యలను సైతం పరిష్కరిస్తాం. పాత ఇండ్ల విషయంలో నూతన జిల్లాల కలెక్టర్లు అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుంటాం. బినామీలు ఎక్కడైనా ఉంటే వారిని తొలగించే దిశగా చర్యలు చేపడుతాం.

జనవరి మొదటివారం వరకు అసెంబ్లీ! అసెంబ్లీ సమావేశాలు జనవరి మొదటివారం వరకూ కొనసాగుతాయని సీఎం సంకేతమిచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం..జనవరిలో వారం రోజులు నిర్వహించుకోవాలి. చాలా విషయాలు చెప్పాల్సి ఉంది. చర్చ జరగాల్సి ఉంది అన్నారు.

ప్రగతి భవన్.. తెలంగాణ ప్రజల ఆస్తి సీఎం క్యాంపు కార్యాలయం అంటే అది కేసీఆర్ సొంత ఇల్లు కాదు. తెలంగాణ ప్రజల ఆస్తి. దాన్ని ప్రైడ్ ఆఫ్ తెలంగాణగా భావించాలి. ఆయన(కోమటిరెడ్డి) రాజకీయ భవిష్యత్ ఆయనే పొగొట్టుకున్నడు. ఏదన్న మాట్లాడితే అతికినట్లు ఉండాలి. అల్పంగా మాట్లాడవద్దు. అభాసుపాలు కావద్దు. 150 గదుల ఇల్లు ఎక్కడైనా ఉంటుందా? కాంగ్రెస్ నాయకులు అన్ని గదులను చూపిస్తారా? అక్కసుతో మాట్లాడినట్లుగా ఉంది. పేలవంగా మాట్లాడుతున్నారు. ఇంత భావదారిద్య్రం పనికిరాదు. అది తెలంగాణ సీఎం నివాసం. కేసీఆర్ తర్వాత వచ్చిన వాళ్లూ అక్కడే ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం చేశారో.. ఏమో తెలియదు. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యే వరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారిక నివాసమే లేదు. నిజాం మనకు లక్షల ఎకరాల భూమిని ఇచ్చాడు. హైదరాబాద్‌లో కావాల్సినంత భూమి ఉంది. అయినా సీఎంకు క్యాంపు కార్యాలయాన్ని నిర్మించలేదు. వైఎస్ క్యాంపు ఆఫీస్‌ను నిర్మించినా ఆ ఇంటిలో సీఎం వాహనం తప్ప మరో వాహనం నిలపడానికే స్థలం లేదు. సీఎం కాన్వాయ్ బయట రోడ్డు మీద ఉండాల్సిందే. అలా ఎందుకు కట్టారో తెలియదు. సీఎం నివాసం అంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు నిత్యం వస్తూ పోతూ ఉంటారు. ఇలాంటి సీఎం నివాసంలో పార్కింగ్ సౌకర్యం ముఖ్యం. అందుకే ప్రస్తుత ప్రగతి భవన్‌లో 200 నుంచి 300 కార్లు పార్కింగ్ చేసే విధంగా రూ.37కోట్లతో నిర్మించాం. అది ప్రజల ఆస్తి. విదేశీయులు వచ్చినా, ఇతర రాష్ర్టాల వారు వచ్చినా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా ఉండాలి.

డబుల్ నిబంధనలు మారుస్తాం డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం విషయంలో వ్యతిరేక ఆలోచన వద్దు. నిర్మాణంకోసం సమయం తీసుకున్న మాట నిజమే. అయితే దీనికి కారణాలున్నాయి. అయితే, ఇప్పుడు మెరుపు వేగంతో ముందుకు పోతాం. ఇండ్ల నిర్మాణం విషయంలో ప్రతిపక్షంకంటే మాకే బాధ్యత ఉంది. పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా ఇండ్లు నిర్మిస్తాం. లక్షలు, వేలు కట్టినం అని సంఖ్యలు చూపించుకోవడం కాకుండా.. నాణ్యమైన ఇండ్లను కట్టించాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే పిల్లర్లు వేసి ఇండ్లు కట్టాలని కోరినం. అందువల్ల పేదల పిల్లలకు ఉద్యోగం దొరికినా, పంట మంచిగా పండి ఇంకో అంతస్తు వేసుకున్నా ఇబ్బందులు ఉండవు. పెద్ద కాంట్రాక్టరే రావాలని ఏం లేదు. ఎమ్మెల్యేలు బాధ్యతగా భావించి స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లను, పెద్ద మేస్త్రీలను సైతం ఇండ్ల నిర్మాణం వైపు మొగ్గుచూపేలా చేయవచ్చు.

అయితే ఇండ్ల నిర్మాణం విషయంలో ఏడు శాతం డిపాజిట్ చెల్లించాలనే నిబంధన ఇబ్బందికరంగా ఉందని కొందరు చెప్తున్నారు. దాన్ని సడలించే విషయాన్ని చర్చిస్తాం. సిమెంటు కంపెనీలతో చర్చించి, తక్కువ ధరకే సిమెంట్ సరఫరా చేసేలా ఒప్పించాం. తెలంగాణ కోసం ఎన్ని ఇండ్లయిన ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్‌కు వచ్చినపుడు.. మన డబుల్ బెడ్‌రూం పథకాన్ని ఆయన అభినందించడమే కాకుండా.. కేంద్రం తరఫున తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ ప్రకారం మొత్తం రూ.5.50లక్షల డబుల్ బెడ్‌రూం ధరలో.. కేంద్రం లక్షన్నర ఇస్తే మిగతాది రాష్ట్రం భరిస్తుంది. ఒకవేళ కాస్త అటూ ఇటూ అయినా పేదల కోసం భరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దివంగత సీఎం వైఎస్ హయాంలో సంతృప్తికరమైన రీతిలో (శాచురేషన్ లెవెల్) ఇండ్ల నిర్మాణం అని ప్రకటించారు. అందులో మొత్తం అవినీతి అని చెప్పలేం కానీ అవినీతి జరిగింది. అలా జరుగకుండా ఉండేందుకు, అందరికీ ఇండ్లు దక్కేందుకు మేం నిర్ణయం తీసుకున్నాం. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగాలని, అవినీతి జరగవద్దన్నదే మా ఉద్దేశం. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కు తీసుకోలేం. ఇపుడు బ్రహ్మాండంగా కొత్త జిల్లాలు, మండలాలు చేసుకున్నాం. అట్లనే డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిబంధనలు సైతం. ఎలాంటి నష్టం లేకుండా ఎమ్మెల్యే భాగస్వామ్యం, ప్రజల అవసరాలకు తగిన విధంగా ఇండ్ల నిర్మాణం చేసుకోవాలి. హైదరాబాద్‌కు లక్ష ఇండ్లు, నియోజకవర్గాల వారీగా 1400 ఇండ్లు ఇప్పటికే మంజూరు అయి ఉన్నాయి.

జంట నగరాల ప్రజల ఆశలు నెరవేరుస్తం జంట నగరాల ప్రజలకు అశలున్నాయి. దరఖాస్తు చేసిన వారికి ఇండ్లకోసం 650 ఎకరాల భూమిని సిద్ధంచేశాం. 2.60 లక్షల ఇండ్లేకాదు.. ఇంకా మించి కడుతాం. కట్టి చూపిస్తాం. బాలరిష్టాలను అధిగమించాం. మనీ టైఆప్ ఉంది. మీరు నిరాశలో ఉండొచ్చు. ఆలస్యంగా జరుగుతుందని ప్రభుత్వమే చెప్పింది. రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప.. ఇలా అనేక పేర్లు పెట్టారు. వాటి నిర్మాణం ఆయా దశల్లో ఉంది. రాజీవ్ స్వగృహ ఎంప్లాయీస్‌కు ఇవ్వాలన్నారు. మాజీ సీఎస్ పది సమావేశాలు పెట్టారు. ఎటు పడితే అటు ఇవ్వడానికి ఉండదు. అందరికీ సమాధానం చెప్పాలి. కాగ్‌కు చెప్పాలి. తక్కువకు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకోవాలి. అధికారికంగా రాజ్యాగబద్ధంగా సమాధానం చెప్పాలి. రాజీవ్ స్వగృహ పూర్తిచేస్తాం.

అసెంబ్లీలో నేడు.. అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం బిల్లులపై చర్చను స్పీకర్ ప్రారంభిస్తారు. బీసీ కమిషన్ సవరణ బిల్లు, ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో ఉన్న పెండింగ్ కేసుల బదిలీల బిల్లు, తెలంగాణ వ్యాల్యూ యాడెడ్ టాక్స్ సవరణకు సంబంధించి రెండు బిల్లులు, తెలంగాణ యాక్ట్ బిల్లు, జీహెచ్‌ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ రెండో సవరణ బిల్లు, భూ సేకరణలో పరిహారం, పారదర్శకత, పునరావాసం బిల్లుపై చర్చించనున్నారు. వీటితోపాటు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ బిల్లుపై చర్చించనున్నారు. ఈ బిల్లులపై చర్చ అనంతరం హరితహారంపై లఘుచర్చ కొనసాగనున్నది.

మండలిలో నేడు.. శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే బిల్లలపై చర్చించనున్నారు. జీతాలు, పెన్షన్ల చెల్లింపు, అనర్హుల తొలగింపు బిల్లు, కొత్త జిల్లాల ఏర్పాటు బిల్లు, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు బిల్లుపై చర్చిస్తారు. మున్సిపల్, అర్బన్ లా బిల్లు, వెంకటేశ్వర వెంటర్నరీ వర్సిటీ బిల్లుపై చర్చిస్తారు. అనంతరం బలహీన వర్గాలకు గృహనిర్మాణం, రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంపై లఘుచర్చ కొనసాగనున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.