-7న హుస్నాబాద్‌లో తొలి సభ.. ప్రజా ఆశీర్వాదానికి కదలనున్న సీఎం కేసీఆర్ -మంత్రులు హరీశ్, ఈటలకు సభ నిర్వహణ బాధ్యతలు -ఏర్పాట్లను పరిశీలించిన నేతలు -చేసిన మంచిని ప్రజలకు వివరించడమే లక్ష్యం -గవర్నర్‌తో సీఎస్, అసెంబ్లీ కార్యదర్శి సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్త విస్తృత పర్యటనకు సిద్ధమవుతున్నారు. దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. 50 రోజుల్లో వంద సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నారు. ఇందుకు ముహూ ర్తం ఖరారయ్యింది. శ్రావణమాసం అన్ని మంచి పనులకు శ్రేష్ఠం. వేదపండితులు కూడా ఇదే విషయాన్ని చెప్తుంటారు. దీంతో శుక్రవారం (ఈ నెల 7వ తేదీన) ప్రజా ఆశీర్వాద సభ పేరిట హుస్నాబాద్ నుంచి సభలను ప్రారంభించనున్నారు.
దీనికి సంబంధించి నిర్వహణ బాధ్యతలను మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు సీఎం అప్పగించారు. మంగళవారమే మంత్రులు రంగంలోకి దిగి ఏర్పాట్లను మొదలుపెట్టారు. 70-75 వేల మందితో సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ తరహా సభలను రాబోయే 50 రోజుల్లో వందచోట్ల నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీకి ఈశాన్యం సెంటిమెంట్ ఉన్నది. ఈ నేపథ్యంలో తొలి సభకు ఈశాన్యం మూలన ఉండే హుస్నాబాద్‌ను ఎన్నుకున్నారు. హుస్నాబాద్‌ను ఎన్నుకోవడంలో కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
సాధారణంగా కేసీఆర్ ఏ పని మొదలుపెట్టినా సెంటిమెంట్లను పట్టించుకుంటారని.. ఈ సభ ఎంపికలో ఈశాన్యం, శ్రావణమాసాలతోపాటు కరీంనగర్ సెంటిమెంటు కూడా ఉన్నదని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ ప్రారంభ సభ మొదలు టీఆర్ఎస్కు సంబంధించిన అన్ని ముఖ్యమైన ఘట్టాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికయ్యింది. ఇప్పుడు సభ నిర్వహించతలపెట్టిన హుస్నాబాద్ నియోజకవర్గం కూడా పూర్వ కరీంనగర్ జిల్లాలోదే. దీంతోపాటు అనేక చారిత్రక, రాజకీయ ఘట్టాలతో ఈ ప్రాంతానికి అనుబంధం ఉన్నది. శుక్రవారం జరిగే సభతో రాబోయే ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమరశంఖం పూరిస్తున్నట్లుగానే పార్టీ నేతలు చెప్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే చెప్పారు.
దీంట్లో భాగంగానే ఇప్పుడు ప్రజా ఆశీర్వాద సభను నిర్వహిస్తున్నారు. ఏడో తేదీ తర్వాత శ్రావణమాసం ముగుస్తున్నది. భాద్రపద మాసంలో తిథుల ప్రకారం శ్రేష్ఠమైన రోజులు లేవు. దీంతో శ్రావణమాసంలోని చివరిరోజు నుంచి ప్రజా ఆశీర్వాద సభను లాంఛనంగా మొదలుపెట్టనున్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో 100 శాసనసభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటన ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్నాబాద్ సభ తర్వాతి సభ ఎక్కడ, ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయం కాలేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సభలన్నీ అక్టోబరు మాసాంతం లేదా నవంబరు తొలివారంనాటికి పూర్తిచేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
చేసిన మంచిని ప్రజలకు వివరించడమే లక్ష్యం.. గడిచిన 51 నెలల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రజల కోసం అమలు చేసిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడమే లక్ష్యంగా ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనన్ని కార్యక్రమాలను తెలంగాణ సర్కారు అమలు చేస్తున్నది. వీటిని ప్రజల ముందు ఉంచడం లక్ష్యంగా సభలు సాగనున్నాయి. వీలైతే ప్రతీరోజు రెండు సభలను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. వంద నియోజకవర్గాల్లో సభలను పెట్టనున్నారు.

గవర్నర్‌తో సీఎస్, అసెంబ్లీ కార్యదర్శి సమావేశం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం. కొన్ని కీలకమైన రాజ్యాంగపరమైన అనుమానాలను వీరు నివృత్తి చేసుకోవడానికి వెళ్లినట్లు తెలుస్తున్నది.
హుస్నాబాద్ సభకు భారీ ఏర్పాట్లు -రాష్ట్రంలో 7న తొలి ప్రజా ఆశీర్వాద సభ నాలుగున్నరేండ్ల పాలనపై ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ప్రజల ఆశీర్వాద సభల కార్యక్రమం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం (ఈ నెల 7న) హుస్నాబాద్‌లో తొలి బహిరంగసభలో ప్రసంగించనుండటంతో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్.. సభకోసం హుస్నాబాద్ ఆర్టీసీ డిపో పక్కనున్న మైదానాన్ని ఎంపిక చేశారు. వెంటనే పనులను ప్రారంభించారు. రాబోయే 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో వంద బహిరంగ సభలు నిర్వహించి ప్రజల మద్దతుతోపాటు ఆశీర్వాదాన్ని తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ మీడియాతో చెప్పారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయవంతం అవుతుందనే నమ్మకంతో సీఎం ఉమ్మడి జిల్లాలోని హుస్నాబాద్‌లో తొలి ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నారని, ఇది ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నుంచి ప్రతి ఇంటి నుంచి ఇద్దరు లేక ముగ్గురు సభకు తరలిరావాలని కోరారు. కనీవినీ ఎరుగని రీతిలో తరలివచ్చి సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సిద్దిపేటలో హుస్నాబాద్ నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించి జనసమీకరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ నెల 7న మధ్యాహ్నం నిర్వహించే బహిరంగసభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి సుమారుగా 50 వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనసమీకరణలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని మండలాలకు ఎమ్మెల్యేలతోపాటు పార్టీ సీనియర్ నాయకులను ఇంచార్జీలుగా నియమించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు హరీశ్‌రావు, కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాలకు మంత్రి ఈటల ఇంచార్జులుగా వ్యవహరిస్తారు. చిగురుమామిడి మండలానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కార్పొరేషన్ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, సైదాపూర్ మండలానికి మంత్రి ఈటల, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, భీమదేవరపల్లి మండలానికి ఎమ్మెల్యే పుట్ట మధు, ఎల్కతుర్తి మండలానికి మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్, హుస్నాబాద్ పట్టణం, రూరల్‌కు ఎంపీ వినోద్‌కుమార్, చీఫ్ విప్ పాతూరి, అక్కన్నపేట మండలానికి ఎమ్మెల్సీ నారదాసు, కోహెడ మండలానికి ఎమ్మెల్యే రసమయి ఇంచార్జీలుగా ఉంటారు.