-ఉపాధ్యాయ, పోలీసు నియామకాలే అధికం -శాఖలవారీగా భర్తీకి సీఎం కేసీఆర్ నిర్ణయం -అన్నిశాఖల్లో ఖాళీల వివరాలను సేకరించండి -వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి -సీఎస్ సోమేశ్‌కుమార్‌కు సీఎం ఆదేశాలు -ఆరేండ్లలో లక్షకుపైగా ఉద్యోగాలు భర్తీచేసిన సర్కార్ -టీఎస్‌పీఎస్సీ ద్వారానే 36 వేల నియామకాలు -పోలీసుశాఖలో 29 వేల పోస్టులు భర్తీ పూర్తి

రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్ర పాలనలో వివక్షకు గురైన తెలంగాణ నిరుద్యోగులకు స్వరాష్ట్రంలో ఆరేండ్లలో లక్షకుపైగా కొలువులిచ్చిన సీఎం కేసీఆర్.. మరో 50 వేల పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి కకావికలమైన యువతలో ఆశలు చిగురింప జేశారు. శాఖలవారీగా ఖాళీల లెక్కతేల్చి.. వెంటనే నోటిఫికేషన్లు జారీచేయాలని ఆదేశాలిచ్చారు.
రాష్ట్రంలో కొలువుల జాతర ఉద్యమంలా కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. వెంటనే నోటిఫికేషన్లు జారీచేయాలని ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకుపైగా ప్రభుత్వ కొలువుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, పోలీసులతోపాటు ఇతర శాఖల్లో ఖాళీగాఉన్న అన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్.. సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ఇందుకోసం అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం ఉన్నదని, వాటన్నింటిని భర్తీచేయాలని సూచించారు. పోలీసు, ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌తోపాటు, వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించాలని.. తర్వాత వాటి భర్తీకి నోటిఫికేషన్ జారీచేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కలను సాకారం చేసుకొనేందుకు పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. కరోనాకాలంలో ఉద్యోగాలు కోల్పోయి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది నిరుద్యోగులకు సీఎం ప్రకటన కొత్త ఆశలు చిగురింపజేసింది.
అత్యధికంగా పోలీసు, టీచర్ పోస్టుల భర్తీ 50 వేల ఉద్యోగాల్లో ఎక్కువగా పోలీసు, ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 29,408 పోస్టులు భర్తీ అయ్యాయి. కాగా, తాజా ప్రకటనతో మరో 19,910 ఖాళీలు భర్తీచేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఈసారి ఉపాధ్యాయుల ఖాళీలను పూరించేందుకూ ప్రభుత్వం ప్రాధాన్యమివ్వనున్నది. ఎంసీహెచ్చార్డీ నివేదిక ప్రకారం 16వేల పైచిలుకు ఉపాధ్యాయ భర్తీలు ఉండన్నట్టు సమాచారం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లోనే 4,300పైచిలుకు ఖాళీలున్నట్టు సమాచారం. జాతీయ విద్యావిధానం ప్రకారం రాష్ట్రంలో హైస్కూళ్లను అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. మూడు గ్రామీణ మండలాలను కలిపి క్లస్టర్ జూనియర్ కాలేజీలుగా ఏర్పాటు చేయనున్నారు. ఇలాచేస్తే దాదాపు వెయ్యి హైస్కూళ్లకు జూనియర్ కాలేజీల హోదా వస్తుంది.
ఇలా కొత్తగా అప్‌గ్రేడ్ అయిన జూనియర్ కాలేజీల్లో ప్రతి కాలేజీలో కనీసం ఏడుగురు అధ్యాపకులు అవసరం కానున్నారు. దీంతో ప్రస్తుతం ఉపాధ్యాయులుగాఉన్న వారికి పదోన్నతి కల్పించి అనంతరం ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీగ్రేడ్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తారనే ప్రచారం సాగుతున్నది. వీటితోపాటు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో రెండువేల ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నది. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే 8,300 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది. అయితే, ఉపాధ్యాయ పోస్టులపై ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తేగానీ ఎన్నివేల ఉద్యోగాలు భర్తీ చేస్తారనేది తెలిసేలా లేదు. వ్యవసాయశాఖలో 1,740, పశుసంవర్ధకశాఖలో 1,500, బీసీ వెల్ఫేర్‌లో 1,027, మున్సిపల్‌లో 1,533, ఎస్సీ, గిరిజన, బీసీ సంక్షేమశాఖల్లో 350, ఇతరశాఖల్లో మూడు నుంచి నాలుగువేల ఖాళీలు భర్తీ చేసే వీలుంది. ఏఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయనే అంశంపై అధికారులు దృష్టిసారించారు. అన్నిశాఖల్లోని ఖాళీల వివరాలను తీసుకొని అతిత్వరలోనే 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
‘లక్ష’్యం దాటిన కొలువులు స్వరాష్ట్రంలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని రూపుమాపేందుకు పూనుకొన్నారు. లక్షా ఏడువేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ తొలిశాసన సభ సమావేశాల్లోనే మాట ఇచ్చారు. గత ఆరేండ్లలో అందుకనుగుణంగా భర్తీ ప్రక్రియ పూర్తిచేశారు. వీటికి అదనంగా తాజాగా 50 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి బంగారు తెలంగాణ చరిత్రలో మరో అధ్యాయానానికి నాంది పలికారు. ఆరేండ్లలో ఇచ్చిన లక్ష కొలువుల్లో అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 36,665 పోస్టులను భర్తీ చేసింది. ఇప్పటివరకు 107 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు, 41 డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్లు కలిపి టీఎస్‌పీఎస్సీ మొత్తం 148 నోటిఫికేషన్లు ఇచ్చింది. మరికొన్ని పోస్టుల భర్తీ వివిధ దశల్లో కొనసాగుతున్నది. టీఎస్‌పీఎస్సీ తర్వాత తెలంగాణ ప్రభుత్వం పోలీసు పోస్టులను ఎక్కువగా భర్తీ చేసింది. 2015-2016లో 10,980, 2018లో 17,297 కలిపి మూడేండ్లలో 28,277 మంది కానిస్టేబుళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లను నియమించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 19,299 పోలీసు కానిస్టేబుళ్లు, 425 ఎస్‌ఐలు, 9 ఫింగర్‌ప్రింట్ బ్యూరో విభాగం ఏఎస్‌ఐలు, 177 అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కలిపి మొత్తం 19,733 పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉన్నది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. వాటన్నింటినీ భర్తీచేయాలి. వేలసంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్‌మెంట్ జరుగాల్సి ఉన్నది. ఇతరశాఖల్లోనూ ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏయే శాఖల్లో ఎంతమంది ఉద్యోగులు అవసరం ఉన్నదో లెక్క తేల్చాలి. వెంటనే వాటి భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలి. – ముఖ్యమంత్రి కేసీఆర్
ఉద్యోగాల భర్తీ ప్రకటనపై హర్షాతిరేకాలు రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించడంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వంగా టీఆర్‌ఎస్ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందని టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూటీఎస్ నేతలు అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రాధాన్యరంగాలను అభివృద్ధిచేస్తూ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీచేయాలని నిర్ణయించడం సంతోషకరం. ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు చేరవేయడంలో ఉద్యోగులు విశేషంగా కృషిచేస్తున్నారు. -మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు
తెలంగాణ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్రంలో ఖాళీపోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలచేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తంచేస్తున్నది. విద్యార్థుల, అమరవీరుల పక్షాన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న. -ఎస్‌ఎం ముజీబ్‌హుస్సేనీ, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లాశాఖ అధ్యక్షుడు
రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలచేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం హర్షణీయం. నూతన ఉద్యోగ నియామకాలతో మరింత సర్వతోముఖాభివృద్ధి వైపు రాష్ట్రం సాగుతుంది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిరంతరం అధ్యయనం చేయాలి. -కృష్ణాయాదవ్, టీజీవో హైదరాబాద్ జిల్లాశాఖ అధ్యక్షుడు