Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

60 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అద్భుత ప్రాజెక్టు ఇది

-ఎస్సారెస్పీ పునర్జీవం పూర్తయితే కరువు రాదు -వచ్చే జూలైనాటికి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి నీళ్లు పారిస్తాం -రాజకీయ మనుగడ కోసం కేసులు వేస్తున్న కాంగ్రెస్ -లాయర్‌కు ఓ రైతు గంటకు ఆరు లక్షలు చెల్లించగలడా? -భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు సూటి ప్రశ్న

వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండానే ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా ఎస్సారెస్పీ పునర్జీవ పథకం నిలుస్తుందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఎకరా భూసేకరణ అవసరం లేకుండా, తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో 60 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అద్భుతమైన పథకంగా వర్ణించారు. ఇది పూర్తయితే కరువనేదే ఉండదని చెప్పారు. గురువారం పోచంపాడ్ వద్ద ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి సీఎం కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, లోయర్‌మానేరు డ్యాం, కడెం ప్రాజెక్టులకు దాదాపుగా 210 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. ఈ కేటాయింపులు వాడుకోలేకపోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించనున్న మేడిగడ్డ నుంచి 215 టీఎంసీల నీరు కరువులోనూ దిగువకు వృథాగా పోయింది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా రెండు పంటలకు నీరిచ్చే అవకాశం ఉన్నది.

మహారాష్ట్రలో అధికవర్షాలు కురిస్తే ఎత్తిపోతలు అవసరం లేకుండానే ప్రాజెక్టు నిండుతుంది. లేకుంటే మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి, మీదుగా మిడ్‌మానేరు వరదకాల్వ 102వ కిలోమీటరు వద్ద 15 మెగావాట్ల మోటర్లను బిగించి మూడుచోట్ల ఎత్తిపోతల ద్వారా శ్రీరాంసాగర్‌లోకి 60 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తాం. వరదకాల్వనే జలాశయంగా మార్చుకొని ఎత్తిపోతలకు డిజైన్ చేశాం. 11 నెలల్లోనే పూర్తి చేయాలనేది లక్ష్యం. వచ్చే జూలైనాటికి ఎస్సారెస్పీ రైతాంగానికి నీళ్లిస్తాం. కడెం ప్రాజెక్టుకూ ఏనాడు ప్రస్తుత పరిస్థితి రాలేదు. సరస్వతి కాల్వ ద్వారా 35 వేల ఎకరాలకు, లక్ష్మీ కాల్వ ద్వారా 25 వేల ఎకరాలకు నీళ్లిస్తాం. నిర్మల్, ముథోల్, గుత్ప, నిజాంసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టుల కింద 4.4 లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందించగలుగుతాం. టీఎస్‌ఐడీసీ చేపట్టిన ఎత్తిపోతల పథకాలకు నీరందిస్తాంఅని మంత్రి చెప్పారు.

రివర్స్ పంపింగ్ కాంగ్రెస్ ఎందుకు చేపట్టలేదు? టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిని విమర్శించడం కాంగ్రెస్ నాయకులకు పరిపాటిగా మారిందని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌అధికారంలో ఉన్నప్పుడు రివర్స్ పంపింగ్ గురించి ఎందుకు ఆలోచించలేదో చెప్పాలి? ఇప్పుడు వాళ్లు చెప్తున్నట్టుగా బరాజ్ ఎత్తుపెంచితే ముంపు, వ్యయం పెరుగుతుంది. ప్రాజెక్టులపై కేసులు వేయడాన్ని తప్పుపట్టడంలేదు. రైతులు కాకుండా కాంగ్రెస్ నాయకులు కేసులు వేయడాన్ని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టుల కింద భూమిలేదు, నిర్వాసితులు కాదు. కానీ కేసులు వేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు వందకుపైగా కేసులు వేశారు. ఒక రైతు కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఆ రైతు తరుఫున వాదించిన న్యాయవాది ఫీజు గంటకు రూ.6 లక్షలు. ఆ రైతుకు వచ్చే నష్టపరిహారం నుంచి అంత మొత్తంలో ఫీజు ఎలా చెల్లించగలుగుతాడు? చనిపోయిన రైతులు కేసులు ఎలా వేస్తారు? వారి పేరుతో కాంగ్రెస్ నాయకులు కేసులు వేస్తున్నారు. దీంతో ఇంజినీర్ల సగం సమయం కోర్టుల చుట్టూ తిరుగడానికే సరిపోతున్నది. ఎన్నికల్లోపు ప్రాజెక్టులు పూర్తయితే రాజకీయ మనుగడ ఉండదనే కేసులు వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అనుకున్న సమయానికే పూర్తిచేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు మామూలుగా పూర్తిచేయడానికి ఐదేండ్ల సమయం పడుతుంది. ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా 18 నెలల్లో పూర్తిచేసేందుకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనూ పనిచేస్తున్నాంఅని మంత్రి హరీశ్‌రావు వివరించారు.

మంత్రి పోచారం ఎస్సారెస్పీ పునర్జీవ పథకం తరతరాలకు గుర్తుంటుంది. సీఎం కేసీఆర్‌కు వచ్చిన ఆలోచనతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు కచ్చితంగా సాగునీరు అందుతుంది. ఈ నీళ్లతో పండే పంట విలువ రూ.80 వేల కోట్ల వరకు ఉంటుంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.