Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

7న టీఎస్‌ఐపాస్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కొత్త పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌ను జూన్ 7వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా భారీఎత్తున ఏర్పాటు చేస్తున్న సమావేశానికి దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, బహుళజాతి కంపెనీల ప్రతినిధులు ఇతర ప్రముఖులందరినీ ఆహ్వానిస్తున్నారు. వీరందరి సమక్షంలో నూతన విధానం, దాని వివరాలను ప్రకటిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సచివాలయంలో సీఎం అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశమై తెలంగాణ నూతన పారిశ్రామిక విధానానికి తుది మెరుగులు దిద్దారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సుదీర్ఘ కసరత్తుతో మొత్తం మీద అత్యుత్తమ పారిశ్రామిక విధానం తయారైందని సంతృప్తి వ్యక్తం చేశారు.

KCR-rview-meet-on-industrial-policy

-పారిశ్రామిక ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరణ -నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ -అత్యుత్తమ విధానం రూపొందించాం -పరిశ్రమలకు లక్షా 60 వేల ఎకరాలు సిద్ధం -విద్యుత్, నీరు, రహదారుల బాధ్యత ప్రభుత్వానిదే -ఆన్‌లైన్‌లో దరఖాస్తులు,15 రోజుల్లో అనుమతులు -ముఖ్యకార్యదర్శుల సమావేశంలో సీఎం పరిశ్రమల స్థాపనకు ఇప్పటికే 1.60 లక్షల ఎకరాలు సమకూరాయని అన్నారు. వచ్చే మార్చినాటికి విద్యుత్ మరో 7వేల మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పరిశ్రమలకు ప్రాజెక్టుల నీటిలో 10 శాతం కేటాయిస్తూ విధాన నిర్ణయం తీసుకున్నామని, వాటర్‌గ్రిడ్ ద్వారా ఆ నీటిని అందిస్తామని అన్నారు. 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులివ్వాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని టీఎస్ ఐపాస్ నెరవేర్చిందన్నారు.

మనదే బెస్ట్ పాలసీ.. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం కోసం చేసిన కసరత్తు తుదిరూపం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన నాటి నుంచి పారిశ్రామిక విధాన రూపకల్పన కోసం భారీ కసరత్తు చేశామన్నారు. అనేక మంది పారిశ్రామిక ప్రముఖులు, అధికారులతో పలుమార్లు సమావేశమయ్యామని చెప్పారు. ఉత్తమ పారిశ్రామిక విధానం అమలు చేస్తున్న దేశాల్లో పరిస్థితిని అధ్యయనం చేశామని సీఎం తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇవ్వాలన్న పట్టుదలతో దానికి తగిన వనరులు సృష్టించామన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రధానమైన భూమి, నీరు, విద్యుత్ వంటి మూడు విషయాల్లో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు.

నీటి కొరత లేదు రాష్ట్రంలో పరిశ్రమలకు నీటి కొరత లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టుల నుంచి 10శాతం నీటికి కేటాయిస్తూ విధాన పరమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పైపులైన్ల ద్వారా పరిశ్రమలకు కూడా నీటి సరఫరా చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ సమస్యను విజయవంతంగా అధిగమిస్తున్నదని అన్నారు. ఈ పరిణామం పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది ఎలాంటి విద్యుత్ కొరత లేకుండా చూడగలిగామన్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి మొత్తం ఏడు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. 2017 మార్చినాటికి తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉంటుందన్నారు. అప్పుడు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని వెల్లడించారు.

పాత పద్ధతులకు చెల్లు చీటీ పరిశ్రమలు పెట్టే వారికి తెలంగాణ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. అనుమతుల పేర తనిఖీల పేర, విచారణల పేర కాలయాపన చేసే పాత పద్ధతులకు స్వస్తి చెపుతున్నట్లు ప్రకటించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని, ఎవరైనా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను చేజింగ్ సెల్ పరిశీలించి నాలుగైదు రోజుల్లోనే దరఖాస్తుదారుడిని అహ్వానిస్తుందని చెప్పారు. దరఖాస్తు దారునితో ముఖాముఖి సమావేశమై ఏ పరిశ్రమ స్థాపించాలనుకుంటున్నారు? ఎంత స్ధలం అవసరం? ఎంత నీరు, ఎంత విద్యుత్ అవసరం లాంటి వివరాలు తీసుకుని తర్వాత పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అనుమతులన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుందని సీఎం చెప్పారు.

పరిశ్రమలను ప్రమాద భరిత, ప్రమాద రహిత పరిశ్రమలుగా వేర్వేరుగా చూస్తామని ఫార్మాలాంటి పరిశ్రమలు కచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతంలోనే ఉండే విధంగా నిబంధన విధిస్తామని చెప్పారు. పారిశ్రామిక వాడల్లో లేని పరిశ్రమలకు కూడా అనుమతులు సరళంగా ఉండాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు. పారిశ్రామిక వాడలను ఫ్లగ్ అండ్ ప్లే పద్దతిన సిద్ధం చేసి ఉంచుతామన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్ ఐసీసీ ఎండీ నర్సింహారెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, వివిధ శాఖల కార్యదర్శులు ఎస్‌కే జోషి, రేమండ్ పీటర్, జయేష్‌రంజన్, మీనా, వెంకటేశం, గోపాల్, రామకృష్ణారావు, అజయ్‌మిశ్రా,నదీమా సీఎంఓ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు అధికారులు, ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.

1,60 లక్షల ఎకరాల భూమి టీఎస్ ఐసీసీకి నూతన విధానం అమలుకు సన్నాహకంగా టీఎస్ ఐసీసీకి ఇప్పటికే 1,60,000 ఎకరాల భూమి అప్పగించామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ఇకపై టీఎస్ ఐసీసీ ద్వారానే భూమిని బదలాయిస్తామని చెప్పారు. అలాగే టీఎస్‌ఐసీసీ ఆధీనంలో ఉన్న భూమిని పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. పారిశ్రామిక వాడలకు కావాలసిన కరెంటు, నీరు, రహదారుల లాంటి మౌలిక వసతులు కల్పించి పరిశ్రమల స్థాపనకు సిద్ధం చేస్తామన్నారు. పరిశ్రమలకోసం తీసుకునే ఈ భూమిని ఎట్టి పరిస్థితిలో మరో అవసరానికి బదలాయించకుండా షరతు విధిస్తామని స్పష్టం చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.