-ప్రతి ఒక్కరికీ రైతుబంధు -ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రవ్యాప్తంగా రూ.750 కోట్లతో లక్ష కల్లాలను ప్రభుత్వం నిర్మించనున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీసీ గార్డెన్, నంగునూరులో రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాలు, కల్యాణలక్ష్మి చెక్కులు, సిద్దిపేట వైద్య కళాశాలలో స్టాఫ్ నర్సులకు నియామకపత్రాలను అందజేశారు. సిద్దిపేట కోమటి చెరువు ఫీడర్ చానల్ పూడికతీత పనులను పరిశీలించారు. అంతకుముందు వైద్య కళాశాలలో వీరజవాన్ కర్నల్ సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కల్లాల నిర్మాణాన్ని మూడు పద్ధతుల్లో.. రూ.60 వేలు, రూ.70 వేలు, రూ.86 వేలతో చేపట్టనున్నట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, మిగతా వారికి 90 శాతం సబ్సిడీపై ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. రైతులు మార్కెట్ సీజన్ ఆధారంగా పంటలు పండించాలన్నారు. మల్బరీ, మిర్చి, కూరగాయలు పండించే రైతులకు ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామన్నారు. దేశంలోనే అతి ఎక్కువగా వడ్లు పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రైతుబంధు కింద రూ.7 వేల కోట్లు కేటాయించామని, ఈ వానకాలంలో రైతులందరికీ వారం రోజుల్లో రైతుబంధు అందిస్తామన్నారు.