Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

7800 కోట్లు ఇవ్వండి

-7800 కోట్లు ఇవ్వండి.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలకు కేటీఆర్‌ వినతి
-తెలంగాణ ప్రగతితో జాతీయ వృద్ధి..
-మున్సిపల్‌, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించండి
-వరంగల్‌ మెట్రో నియో, ఎస్సార్డీపీ, ఎస్టీపీలు, మూసీ స్కైవే, లింక్‌ రోడ్ల ప్రతిపాదనలపై సమగ్ర వివరాలతో లేఖ రాసిన మంత్రి

రాష్ట్రంలో మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు రూ.7,800 కోట్ల మేర కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రాష్ట్ర మున్సిపల్‌ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం లేఖ రాశారు. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ప్రతిపాదించిన పనులకు వచ్చే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని లేఖలో కోరారు. ఎస్సార్డీపీ, వరంగల్‌ మెట్రో నియో ప్రాజెక్టు, ఎస్టీపీలు, ఓఆర్‌ఆర్‌కు లింకు రోడ్ల పనులకు నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు చేయబోయే మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (ఎంఆర్టీఎస్‌)కు నిధులను కేటాయించాలన్నారు. మెట్రో నియో నెట్‌వర్క్‌ కేపీహెచ్‌బీ – కోకాపేట- నార్సింగి కారిడార్‌ కోసం రూ.3,050 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశామని లేఖలో తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే అంచనా వ్యయంలో కనీసం 15 శాతం నిధులు రూ.450 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

30 కిలోమీటర్ల కారిడార్‌ ద్వారా 2030 నాటికి ఐదు లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నామని, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మెట్రో మార్గంలో నార్సింగి వద్ద ప్రయాణికులకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. వరంగల్‌ మెట్రో నియో ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి నిర్మలను మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ.184 కోట్లు అవుతున్నదని, ఇందులో కనీసం 20% నిధులు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. ఈ ప్రాజెక్టు ద్వితీయ శ్రేణి నగరాలకు రవాణా రంగంలో కీలక మైలురాయిగా మారుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మేకిన్‌ ఇన్‌ ఇండియా, ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మెట్రో నియో రైలు కోచ్‌ల తయారీకి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నదన్నారు. హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లో చేపట్టిన లింక్‌ రోడ్ల నిర్మాణానికి రూ.2,400 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో కేంద్రం మూడో వంతు భరించేలా రూ.800 కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు. హైదరాబాద్‌ అర్బన్‌ అగ్లామరేషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఎస్సార్డీపీ, మోడల్‌ కారిడార్స్‌ డెవలప్‌మెంట్‌లో చేపట్టిన లింక్‌ రోడ్లలో 22 పూర్తి అయ్యాయని, మరో 17 రోడ్లు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. నగర శివారు, నగరం నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు రోడ్లను వెడల్పు చేసి రవాణా సదుపాయాలను మెరుగుపర్చడానికి 104 అదనపు కారిడార్లను గుర్తించామని తెలిపారు. ఈ రోడ్ల కనెక్టివిటీ ద్వారా అర్బన్‌ రోడ్ల కనెక్టివిటీ కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.

ఎస్సార్డీపీకి..
వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) ద్వారా హైదరాబాద్‌లో రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలను చేపట్టామని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కేటీఆర్‌ తెలిపారు. రోడ్ల అభివృద్ధి జాతీయ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఎస్సార్డీపీ ద్వారా ప్రాధాన్య క్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 100 కిలోమీటర్ల స్కై వాక్‌లు, 166 కిలోమీటర్ల మేజర్‌ కారిడార్లు, మేజర్‌ రోడ్లు 348 కిలోమీటర్లు, ఇతర రోడ్లు 1400 కిలోమీటర్ల పరిధిలో గ్రేడ్‌ సెపరేటర్లు, ఫ్లై ఓవర్లను నిర్మించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని చేపట్టామన్నారు. ఎస్సార్డీపీ మొదటి దశలో భాగంగా మున్సిపల్‌ బాండ్లు, వివిధ ఆర్థిక సంస్థల ద్వారా రూ.5,937 కోట్ల నిధులను సేకరించి పనులు చేపడుతున్నామని తెలిపారు. రూ.11,500 కోట్లతో మూసీ నదిపై స్కైవే, నదికి ఇరువైపులా 16 కిలోమీటర్ల గ్రేడ్‌ సెపరేటర్లను నిర్మించాలని ప్రతిపాదించామని తెలిపారు. ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌, శామీర్‌పేట వరకు, ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి కండ్లకోయ ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని ప్రతిపాదించామని పేర్కొన్నారు. వీటికి నిధులు కేటాయించాలని కోరారు. వీటికి రూ.9వేల కోట్ల అంచనా వ్యయం అవుతుందని, భూమి కేటాయింపుల అంశం కేంద్ర రక్షణ శాఖ పరిశీలనలో ఉన్నదని కేటీఆర్‌ వివరించారు. ఎస్సార్డీపీ రెండో దశ రూ.14 వేల కోట్ల అంచనాతో రూపొందించామని తెలిపారు. వీటన్నింటికీ రూ.34,500 కోట్లు అవసరమని పేర్కొన్నారు. ఇందులో 10 శాతం అంటే.. రూ.3,450 కోట్లు కేంద్రం కేటాయించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

ఎస్టీపీలకు..
సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్టీపీ) నిర్మాణాలకు అయ్యే వ్యయం రూ.8684.54 కోట్లలో కేంద్రం మూడో వంతు భరించాలని మంత్రి కేటీఆర్‌.. కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్టీపీల నెట్‌వర్క్‌ కోసం సమగ్ర సీవరేజ్‌ మాస్టర్‌ ప్లాన్‌ (సీఎస్‌ఎంపీ) రూపొందించిందని తెలిపారు. మొదటి దశ ఎస్టీపీలను హైదరాబాద్‌ నగర పరిధిలో చేపట్టామని, ఇందులో 31 ఎస్టీపీలను 1250.50 ఎంఎల్‌డీల సామర్థ్యంతో రూ.3,866.21 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించామని పేర్కొన్నారు. 2,232 కిలోమీటర్లతో రూ.3,722 కోట్ల అంచనా వ్యయంతో సీవర్‌ నెట్‌వర్క్‌కు ప్రతిపాదనలు తయారుచేశామన్నారు. ఎస్టీపీ ప్రాజెక్టుల రెండో దశను 10 ఎస్టీపీలు.. 340.50 ఎంఎల్‌డీ సామర్థ్యంతో రూ.1095.50 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించామని లేఖలో పేర్కొన్నారు. హైబ్రిడ్‌ అమ్యూనిటీ మోడల్‌లో మూడు ఎస్టీపీలకు టెండర్లు పిలిచామని, వీటిని రూ.4,818.33 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించామని మంత్రి కేటీఆర్‌ లేఖలో తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.