-విద్యుత్ కొరత సృష్టించిన బాబుతో బీజేపీ పొత్తా! -మెదక్ ఎంపీ ఎన్నికలో మెజార్టీ సాధించడంపైనే దృష్టి -ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొడుతాం:మంత్రి హరీశ్‌రావు
మెదక్ పార్లమెంట్ ఉపఎన్నికలో పోటీచేయడానికి ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ టీడీపీలకు అభ్యర్థులే కరువయ్యారు. ఎంపీ ఎన్నికలో విజయం కంటే మెజార్టీపైనే టీఆర్ఎస్ దృష్టి సారిస్తున్నది. బీజేపీ, టీడీపీలు కుమ్మక్కై హైదరాబాద్‌లో గవర్నర్ పాలన తీసుకురావడానికి కుట్రలు పన్నుతున్నారు..ఆ కుట్రలను తిప్పికొడతాం. తెలంగాణలో సుపరిపాలనను చంద్రబాబు ఓర్వలేకే కేంద్రంతో కుమ్మక్కై ఎన్నో కొర్రీలు పెడుతున్నారు. తెలంగాణకు చెందాల్సిన ఏడు మండలాలను ఏపీలో కలుపుకుని విద్యుత్ కొరత సృష్టించారు.
అలాంటి టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుని మెదక్ జిల్లాలో ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది.? మెదక్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుని ప్రభుత్వం వెనుక ప్రజలు ఉన్నారనే విషయాన్ని కేంద్రానికి తెలియజేస్తాం అని భారీ నీటి పారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు. మంగళవారం మెదక్ జిల్లా రామచంద్రాపురంలో రెండు వేల మంది యూత్‌కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హరీశ్‌రావు హాజరై ప్రసంగిస్తూ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 రోజుల పాలనలో 43 హామీలను అమలుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో చేయలేదని గుర్తుచేశారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరని, ప్రజలు సీఎం కేసీఆర్‌వైపే ఉన్నారన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు కుట్రలు చేశాయి..అయినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. తెలంగాణ భూములను ఏపీఐఐసీ ముసుగులో అమ్మివేయగా వచ్చిన డబ్బులను సీమాంధ్ర పాలకులు ఆ ప్రాంతానికి తరలించుకెళ్లారని ఆరోపించారు.
అన్యాక్రాంతమైన భూములన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తామని, అందుకే సమగ్ర భూసర్వే చేపట్టబోతున్నామని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలని, అప్పుడే బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోగలమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మల్లేపల్లి సోమిరెడ్డి, ఎంపీపీలు యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, నాయకులు గాలి అనిల్‌కుమార్, దేవేందర్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, అశ్విన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.