Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆదాయం పెంచుతాం..పేదలకు పంచుతాం

-ఇదే టీఆర్‌ఎస్ ఆర్థిక సిద్ధాంతం
-త్వరలో పూర్తిస్థాయి మ్యానిఫెస్టో.. కేసీఆర్ సభల షెడ్యూల్
-గజ్వేల్ రూపు రేఖలు మార్చాం.. లక్ష మోజార్టీతో గెలుస్తాం
-పటుత్వమైన, పటిష్టమైన, స్థిరమైన ప్రభుత్వం కావాలని ప్రజల కోరిక
-కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు
-వంద సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం
-చంద్రబాబు కాంగ్రెస్ దత్తపుత్రుడు..
-కాంగ్రెస్‌లోనే పుట్టారు..అందులోకే వెళ్లారు
-తెలంగాణలో టీడీపీ.. పిల్ల కాంగ్రెస్
-సోనియాను తిట్టిన బాబుతో పొత్తా?
-తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తుత్తి నాయకులు
-కాంగ్రెస్ పార్టీలో ఎవరి మ్యానిఫెస్టో వారిదే
-కూటమి పుంజుకోలేదు.. ఇంకా సిగపట్లు పడుతున్నారు
-దేశాన్ని పాలించడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలం
-ప్రాంతీయపార్టీలు పుంజుకోవాల్సి ఉంది
-ఎన్నికల తరువాత ఫెడరల్ ఫ్రంట్‌పై దృష్టి
-మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి కే తారకరామారావు

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆదాయమార్గం అతి ముఖ్యమైనది. రాష్ట్ర అభివృద్ధి కోసం అందుబాటులోని వనరుల ద్వారా ఆదాయాన్ని పెంచి.. పేదలకు పంచాలనేదే టీఆర్‌ఎస్ ఆర్థిక సిద్ధాంతం. ఈ ప్రణాళిక ప్రకారమే గత నాలుగున్నరేండ్లలో 17.17 శాతం ప్రగతి సాధించాం. స్టేట్ ఓన్ రెవెన్యూ, స్టాంపు డ్యూటీ రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూలో వృద్ధి సాధించాం. అవినీతిని తగ్గించడం, పారదర్శకతతో ఇది సాధ్యమైంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి త్వరలో పార్టీ పూర్తిస్థాయి మ్యానిఫెస్టోను విడుదల చేస్తాం. రాష్ట్ర ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మరో 15 ఏండ్లు ఆయనే సీఎంగా ఉంటారు. టీఆర్‌ఎస్‌కు కేసీఆర్ ఒక్కరే నాయకుడు.. నాతోపాటు అందరూ కార్యకర్తలే.. వందసీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం.. అని మంత్రి కే తారాకరామారావు అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ దత్తపుత్రుడు.. కాంగ్రెస్‌లో పుట్టిన ఆయన తిరిగి ఆ పార్టీ చెంతకే వెళ్లాడు. తెలంగాణలో టీడీపీ పిల్ల కాంగ్రెస్.. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఉత్తుత్తి నాయకులే.. ఢిల్లీకి, అమరావతికి గులాంలు. ఆ పార్టీలో ఎవరి మ్యానిఫెస్టో వారిదే.. శేరిలింగంపల్లిలో రెండురోజుల క్రితం జరిగిన సంఘటనలే రాష్ట్రమంతటా పునరావృతమవుతాయి.. కూటమి అభ్యర్థుల్ని ప్రకటిస్తే టీఆర్‌ఎస్‌కు మరింత సానుకూలత పెరుగుతుంది అని చెప్పారు. మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. కేటీఆర్ పంచుకున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

అన్ని ఎన్నికల్లోనూ ఆదరణ
క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌కు పూర్తిస్థాయిలో అనుకూలత ఉన్నది. గత నాలుగేండ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు పార్టీని ఆదరిస్తూ వచ్చారు. పాలేరు, నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో ప్రతిపక్షపార్టీల ఎమ్మెల్యేలు చనిపోతే వారి కుటుంబసభ్యులను అభ్యర్థులుగా నిలబెట్టినా టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీ కట్టబెట్టారు. రోమ్ లాంటి నగరం కూడా ఒకేరోజులో నిర్మాణం కాలేదు. హైదరాబాద్ కూడా అంతే. నగరాన్ని దశలవారీగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం.

మైదానమంతా ఖాళీగా ఉంది
శాసనసభను రద్దుచేసిననాడే 105 మంది అభ్యర్థులను ప్రకటించడం సాహసం. మా అభ్యర్థులకు మంచి టైం దొరికింది. వారి ప్రచారం బ్రహ్మాండంగా సాగుతున్నది. ఇప్పటికే రెండుసార్లు ప్రచారం పూర్తిచేశారు. ప్రత్యర్థులు ఖరారు కాకముందే ప్రచారం ఎలా చేయాలి? మైదానమంతా ఖాళీగా ఉంది. అందుకే కేసీఆర్ ప్రచారం ప్రారంభించలేదు. త్వరలో పార్టీ పూర్తిస్థాయి మ్యానిఫెస్టోను విడుదల చేయడంతోపాటు, కేసీఆర్ సభల షెడ్యూల్‌ను ప్రకటిస్తాం. ప్రతిపక్ష పార్టీలు ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేస్తారో ఇంకా ఖరారు కాలేదు. వారికి సిగపట్ల తోనే సరిపోతున్నది. కూటమి అభ్యర్థుల్ని ప్రకటించాక టీఆర్‌ఎస్‌కు ఇంకా సానుకూలత పెరుగుతుంది. సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని సైనికులుగా ప్రజలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేల్లో ప్రతి ఒక్కరిలోనూ కేసీఆర్‌ను చూసుకుంటున్నారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. ఇప్పటికి 107 మంది అభ్యర్థులను ప్రకటించాం. వారిని మార్చే ప్రసక్తే లేదు.

డిసెంబర్ 11న శబ్ద విప్లవమే..
మాది రైతుపక్షపాతి ప్రభుత్వం. ఇప్పటికే నేను 20 నియోజకవర్గాల్లో తిరిగాను. ప్రచారంలో బ్రహ్మాండంగా స్పందన ఉంది. రోడ్‌షోలు చేసిన దగ్గర సభకు వచ్చిన వారినుంచే కాకుండా సమీపంలో ఉండే సాధారణ ప్రజలు, వ్యాపారులు, తటస్థుల నుంచి స్పందన బాగుంది. ఎన్నికల్లో 100 స్థానాలు తగ్గకుండా గెలుస్తాం. ప్రతిపక్షాల మీద విశ్వాసం లేదు. కేసీఆర్‌కు సరితూగే నాయకుడు లేడు. డిసెంబర్ 11న నిశబ్ద విప్లవం కాదు.. శబ్ద విప్లవమే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గూబ గుయ్ మంటుంది. ప్రస్తుతమున్న పరిస్థితే రాబోయే 30 రోజులూ ఉంటుంది.

సర్దుబాట్లు పూర్తి
ఈ రోజుకంటే రేపు భవిష్యత్ బాగుంటుంది అని చెప్తే నాయకులు అందరూ వింటారు. టీఆర్‌ఎస్ నాయకులకు అదేవిధమైన భరోసాను కల్పించాం. అభ్యర్థుల ప్రకటనతో అసంతృప్తి చెందిన నాయకులతో మాట్లా డాం. అందరూ సంతృప్తి వ్యక్తంచేశారు. తృప్తిపడని వారు పార్టీలో నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు అంతా సవ్యంగా ఉన్నది. ప్రచారంతో అభ్యర్థులు దూ సుకుపోతున్నారు. జిల్లాస్థాయిలో జిల్లా మంత్రులు అసంతృప్తి నాయకులను బుజ్జగించారు. నియోజకవర్గాల్లో అక్కడక్కడా అభ్యర్థులను నిలదీస్తున్నారని అంటున్నారు.. అవి స్థానిక సమస్యలు.. ఇటీవలే మానకొండూరు నియోజకవర్గంలో రసమయి బాలకిషన్‌ను తమ గ్రామాన్ని ముంపుగ్రామంగా ప్రకటించాలని అడిగారు. ఇలా ఇతరచోట్ల కూడా స్థానికంగా తమ పార్టీ ప్రత్యర్థులు కొందరిని ఎగదోసి పంపిస్తున్నారు.

95 శాతం ఉద్యోగాలు స్థానికులకే..
జోనల్ విధానాన్ని ప్రవేశపెట్టి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా కృషిచేసిన ఏకైక సీఎం కేసీఆర్. ఇంతశాతం ఏ రాష్ట్రంలో లేదు. స్థానిక సమస్యలు తెలియడం, ఉద్యమం చేసినవాడు కాబట్టే కేసీఆర్ పట్టుబట్టి మరీ సాధించారు. చంద్రబాబు రాజకీయాలు చేసే సమయంలో రాజకీయాలు చేయడు.. చేయకూడని సమయంలో రాజకీయాలు చేస్తాడు. కానీ మేం ఎప్పుడు రాజకీయాలు చేయాలో అప్పుడే చేస్తాం. హరీశ్‌రావుపై సంస్కారహీనంగా వ్యాఖ్యలు

హరీశ్‌రావుపై సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడాలని దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. హరీశ్‌రావు ఇప్పటికే అనేకమార్లు పుట్టుక, చావు టీఆర్‌ఎస్‌లోనే అని చెప్పారు. ఇంకా ఎన్నిసార్లని చెప్పుతారు. రాజకీయాల్లో ప్రజాసమస్యలను ప్రస్తావించాలి. కానీ అవన్నీ పరిష్కారం కావడంతో దిక్కుతోచక నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారు. మాకు రాజకీయాల కంటే ఫ్యామిలీ ముఖ్యం. కుటుంబం తరువాతే రాజకీయాలు. కుటుంబసభ్యుల మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పది. దాన్ని ఎప్పుడూ వీడబోం.

గజ్వేల్‌లో లక్ష మెజార్టీ ఖాయం
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గజ్వేల్ రూపురేఖలు మారిపోయాయి. నియోజకవర్గంలో గతంలో ఎవరూ కూడా చేయలేనంత అభివృద్ధి చేశారు. కోట్ల నిధులు వెచ్చించారు. ఆయన అక్కడ ఈసారి లక్ష మెజార్టీతో గెలుస్తారు. డిసెంబర్ 7న ప్రజలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా తీర్పు చెపుతారు. సీఎంగా కేసీఆర్ మరో 15 ఏండ్లు ఉండాలని కోరుకుంటున్నారు. నాతోపాటు, హరీశ్‌రావు, కవిత పార్టీ నాయకులందరిదీ ఇదే అభిప్రాయం. పార్టీలో నేనూ సామాన్య కార్యకర్తనే.

అందుకే దోస్తానా..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫలప్రయోగమని చెప్పడానికి కాంగ్రెస్, టీడీపీలు కలిసి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించాయి. వారి కుట్రలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ గుర్తించి మాకు చెప్పారు. ఆ సమాచారంతో వారి కుట్రలను తిప్పికొట్టాం. ఆ సందర్భంలోనే ఎంఐఎంతో మాకు బంధం ఏర్పడింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలు, పరిపాలన విధానం నచ్చి అసదుద్దీన్ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఎంఐఎంతో మాకు ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంటుంది.

వారందరికీ చంద్రబాబు ప్రతినిధి కాదు
ఏపీ ప్రజల మొత్తానికి చంద్రబాబు ఒక్కడే ప్రతినిధి కాదు. గత ఎన్నికల్లో ఆయనకు వైఎస్ జగన్‌కు మధ్య ఐదు లక్షల ఓట్ల తేడా అంతే. ఒకే దెబ్బకు రెండుపిట్టలు మాదిరిగా ప్రజలు ఈసారి తీర్పు ఇస్తారు. అక్కడ ఇప్పుడు మూడు ముక్కలాట. అక్కడ ఎవరు గెలుస్తారో తెలియదు. చంద్రబాబు ఇప్పటివరకు అన్ని పార్టీలతో కూటమికట్టారు. ఒక్క వైసీపీతో తప్ప.

తెలంగాణలో కులపిచ్చి లేదు ..
తెలంగాణలో కులపిచ్చి లేదంటూ జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా. తెలంగాణలో కుల ప్రాతిపదికన ఓట్లు పడవు. ఒకవేళ అలా జరిగితే జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌కు అన్నిసీట్లు వచ్చేవి కావు. 2014లో హైదరాబాద్‌తోపాటు, శివార్లలో టీడీపీపై ప్రేమతో ఆ పార్టీకి ఓట్లు వేయలేదు. టీఆర్‌ఎస్‌పై అపోహతో టీడీపీకి పడిన ఓట్లు అవి. వారిలో కొన్ని అపోహలు, అనుమానాలు ఉండేవి. ఈ ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో కూడా టీడీపీ గెలవదు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. ఎలాంటి చిన్న సంఘటనలు జరగలేదు. ఏకోన్ముఖంగా ఓట్లువేస్తారు. తెలంగాణలో పటుత్వమైన , పటిష్టమైన, స్థిరమైన ప్రభుత్వం, నాయకత్వం కావాలని, కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్‌ను తాను అభివృద్ధి చేశానని చెప్పుకునే చంద్రబాబుకు 2004 ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా రాలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

దాడిని ఖండించినా రాజకీయమేనా…?
కాంట్రాక్టర్ల మీద ఐటీ దాడులు అయితే చంద్రబాబు రాజకీయం చేస్తారు. నాలుగేండ్లపాటు మోదీతో అంటకాగి ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తారు. మాపార్టీ నాయకులు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కుమారుడి ఇంటిపైనా ఐటీ దాడులుచేశారు. అయినా ఎక్కడా రాజకీయహంగామా చేయలేదు. కానీ, చంద్రబాబు మాత్రం ఏపీలో జరిగిన ఐటీ దాడులపై క్యాబినెట్ మీటింగ్‌లోనూ చర్చించారు. జగన్‌పై దాడిన జరిగిన తరువాత మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన కోలుకోవాలని, ఖండిస్తూ ట్వీట్‌చేస్తే దాన్ని కూడా రాజకీయం చేశారు. చంద్రబాబు ప్రతిదానికి భయాందోళనలకు గురవుతున్నారు. థాట్ పోలీసింగ్ చేస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు.. అన్ని గమనిస్తున్నారు. సరియైన సమయంలో తీర్పు ఇస్తారు.

అప్పుడు ఎగిరిర్రు… ఇప్పుడు మాట్లాడుతలేరు
గతంలో సోనియాను అవేశంలో అమ్మా బొమ్మా అంటే ఐదుఅడుగులు ఉన్నవాళ్లు కూడా ఆరడుగులు ఎగిరారు.. వీహెచ్ ఏదేదో మాట్లాడారు. కానీ, కాంగ్రెస్‌తోపాటు, సోనియాపై అవినీతి అనకొండ, సోనియా దయ్యం, ఇటలీ మాఫియా, పుత్రవాత్సల్యం అంటూ అనేక రకాలుగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రాహుల్‌గాంధీని కలిస్తే.. ఒక్కకాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడటం లేదు. వారికి సిగ్గులేదా? చంద్రబాబు కాంగ్రెస్‌కు దత్తపుత్రుడిగా మారితే.. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ అధిష్ఠానానికి ఉత్త పుత్రులు, ఉత్తుత్తి పుత్రులుగా పనికిరాకుండాపోయారు. రోషం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోల్పోయి జీవచ్ఛవాల్లా మిగిలిపోయారు. అధిష్ఠానంతో కలిపి తెలంగాణ కాంగ్రెస్ నేతలను తోలుబొమ్మల్లాగా మార్చి చంద్రబాబు ఆడుకుంటున్నారు. రిమోట్ రాహుల్ వద్ద ఉంది.. బ్యాటరీ చంద్రబాబు వద్ద ఉంది. కేసీఆర్‌ను ఎదుర్కోలేకే కూటమి కట్టారు.

శేరిలింగంపల్లిలో జరిగిందే అంతటా..
మహాకూటమిలో ఏం కాబోతుందో ఇటీవల శేరిలింగంపల్లిలో జరిగిన సంఘటన చూస్తే అర్ధమవుతున్నది. వివాదాలు, గొడవలను పరిష్కరించుకునేందుకు కూడా వారికి సమయం లేదు. 119 సీట్లలో పోటీచేస్తామని పార్టీ పెట్టిన కోదండరాం 3, 4 సీట్లలో పోటీ చేస్తానంటున్నాడు. అవి కూడా సిద్దిపేట, దుబ్బాక, చాంద్రాయణగుట్టలాంటి సీట్లలో పోటీ చేస్తామంటున్నారు. ఇలాంటి సీట్లలో పోటీ చేయడం పోచమ్మగుడి ముందు పొట్టెలు పరిస్థితే అవుతుంది. రాష్ట్రంలో రాహుల్, సోనియాగాంధీలు ప్రచారం చేసినా కొత్తగా ఏం చెప్తాతారు.. ఇక్కడి నాయకులు చెప్పినవే వాళ్లు మాట్లాడుతారు. కాంగ్రెస్ మాజీమంత్రులు బిల్డప్ ఇస్తున్నారు. కాంగ్రెస్‌లో 40 మంది సీఎంలు ఉన్నారు. సబితాఇంద్రారెడ్డి సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారు.

ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో తెలుసా?
కాంగ్రెస్ పార్టీ హామీల చిట్టాలను పరిశీలిస్తే వారి హామీల అమలుకు దక్షణాది రాష్ట్రాల బడ్జెట్ సరిపోదు. రైతు రుణమాఫీ, మహిళల రుణాల మాఫీ, సన్నబియ్యం, సిలిండర్లు ఉచితంగా, ఇలా ఇతర హామీలన్నింటినీ పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. ఎంత బడ్జెట్ కావాలో లెక్క వేయడంలేదు. వారి హామీలు అసాధారణంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఏవరి మ్యానిఫెస్టో వారిదే. మల్లు భట్టి విక్రమార్క ఓ మ్యానిఫెస్టోను ప్రకటించారు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో మొత్తం 10 వేల ఉద్యోగాలు ఇచ్చారు. కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన నాలుగేండ్లలోనే ఇప్పటివరకు ఆర్ధికశాఖ 1.09 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. 87,300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో 38 వేల ఉద్యోగాల భర్తీ పూర్తయింది. కోదండరాం మ్యానిఫెస్టో ప్రకటిస్తూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. అసలు అన్ని ఉద్యోగాలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి? ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా యో కూడా వారికి తెలియడంలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడుతుంది. దీని ద్వారా కేవలం 5 శాతం నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలను రాష్ట్రానికి రాబట్టడం ద్వారా ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మిగిలినవారికి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం, నిరుద్యోగ భృతి కల్పించడం వంటి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని నిర్ణయించాం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇవేవీ పట్టవు. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. ఎంతమందికి ఇస్తారో? వాటి విధి విధానాలు ఏమిటో వారికి తెలియదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతమందికి ఇవ్వాలనే పరిమితి లేదు. నిరుద్యోగ భృతిని తొలిసారిగా పశ్చిమబెంగాల్‌లో జ్యోతిబసు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలుచేశారు.

ప్రస్తుతమున్న కూటమి కొత్త కూటమేమీ కాదు. 2014 ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్ మ్యానిఫెస్టో రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్నారు. సీపీఐ గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో కలిసే పోటీచేసింది. కాంగ్రెస్, టీడీపీలు కలిసే తెలంగాణను అడ్డుకున్న ప్రయత్నం తెలంగాణ ప్రజలకు తెలుసు. పాలేరు, అచ్చంపేటలో కాంగ్రెస్, టీడీపీ కలిసే పోటీచేశాయి. రాజకీయాల్లో ఎప్పుడూ 1+1= 2 కాదు. ఒక్కోసారి 1+1=0 కూడా అవుతుంది. మేము 2009 అదే లెక్కలతో దెబ్బతిన్నాం. 30 ఏండ్లకు పైగా క్షేత్రస్థాయిలో కొట్టుకున్న కాంగ్రెస్, టీడీపీ ఇప్పడు కలిస్తే ప్రజలు ఒప్పుకోరు. ప్రగతిభవన్‌ను దవాఖానగా మార్చడం కాదు.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎన్టీఆర్ మ్యుజియంగా మారుతుంది.

కాంగ్రెస్, బీజేపీ రెండూ విఫలం
దేశాన్ని పాలించడంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ విఫలమయ్యాయి. దేశ రాజకీయవ్యవస్థను నాశనం చేశాయి. ఆ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలు. మనుషులను ఓటుయంత్రాలుగా చూస్తుంటాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు గెలవాలి. ప్రజలకు మోదీ చేసిందేమీ లేదు. రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇలా కేంద్రం నుంచి ఒక్కటి కూడా వచ్చింది లేదు.. ఇచ్చిందీ లేదు. న్యాయంగా, చట్టబద్ధంగా రావాల్సినవే ఇచ్చారు. ఒక్కపైసా అదనంగా రాలేదు. అమిత్‌షా అన్నీ అబద్ధాలే చెప్తున్నారు. ఇక్కడి ప్రజలు పన్నులు కట్టిన డబ్బే కేంద్రానికి వెళ్లేది. రాష్ట్రంలో బీజేపీకి వంద సీట్లలో డిపాజిట్లు కూడా దక్కవు. నగరంలోని వారికున్న ఐదుసీట్లలోనూ టీఆర్‌ఎస్సే గెలుస్తుంది.

ప్రాంతీయపార్టీలు బలోపేతం కావాలి
రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ప్రాంతీయపార్టీలు బలోపేతం కావాలి. రాష్ట్రాలు మరింత బలపడాలి. ఢిల్లీ నుంచి ముంబైకే బుల్లెట్ ట్రెయిన్ ఎందుకు? చన్నై- హైదరాబాద్- బెంగళూరు రూట్‌లో వేయవచ్చు కదా? ముంబై రూట్లో అయితే గుజరాత్ కలుస్తుందనే ఉద్దేశమే కదా? స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఆవిష్కరించారు… కానీ ఎవరినీ పిలవరు. ఇన్నాళ్లు ఆలస్యం చేసి ఇప్పుడు హైకోర్టు విభజన పూర్తిచేశామని బీజేపీ చెప్పుకుంటున్నారు. ఎప్పుడో కావాల్సిన విభజన ఇది. ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు అంటున్నారు. 2019లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు ఏవి కూడా సొంతంగా అధికారంలోకి రావు. రాష్ట్రాలను పట్టించుకోని కేంద్రం ఎందుకు.

ఎన్నికల తరువాత ఫెడరల్ ఫ్రంట్..
అసెంబ్లీ ఎన్నికల తరువాత ఫెడరల్ ఫ్రంట్ పనులు వేగం అందుకుంటాయి. కాంగ్రెస్, బీజేపీలను వ్యతిరేకిస్తాం. రాష్ట్రాల్లో ఆ పార్టీలను ఓడగొడుతాం. ప్రత్యామ్యాయాన్ని నిర్మిస్తాం. గతంలో ప్రాంతీయపార్టీల కూటమి విఫలమైందని మానెయ్యలేం కదా…?. సిపాయిల తిరుగుబాటు విఫలమైందని పోరాటం ఆపితే దేశానికి స్వాతంత్య్రం వచ్చేదా..? 1969లో తెలంగాణ రాలేదు కదా అని పోరాటం ఆపితే తెలంగాణ వచ్చేదా? అని కేసీఆర్ గతంలో రాసిన పాట స్ఫూర్తితో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు సాగిస్తున్నాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.