Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆడేది కాంగ్రెస్.. ఆడించేది చంద్రబాబు

-టీడీపీ అధినేతవి శిఖండి రాజకీయాలే
-నాడు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన బాబు..
-నేడు కాంగ్రెస్ పార్టీనే కొనుగోలు చేస్తున్నారు
-టిక్కెట్లు రానివారే మా నుంచి వెళ్లిపోయారు
-తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉంటారు
-ప్రజాస్వామ్యంలో ప్రజాకోర్టు తీర్పును మించింది లేదు
-ప్రతిపక్షాలకు ముందుంది ముసుర్ల పండుగ
-నిరుద్యోగ భృతి ఇచ్చే యోచన చేస్తున్నాం
-దసరా తర్వాత సీఎం కేసీఆర్ సభలు ఉంటాయి
-మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి కే తారకరామారావు

రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బయటికి కనిపించేది కాంగ్రెస్ అయినా దానివెనుక ఉండి కాంగ్రెస్ తోలుబొమ్మను ఆడించేది మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే కొనుగోలుచేసే ప్రయత్నాల్లో ఉన్నారని అన్నారు. చంద్రబాబువి శిఖండి రాజకీయాలుగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఓటుకు నోటు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతున్నదని చెప్పారు. రాబోయే ఎన్నికలు ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్ పనితీరుపై రెఫరెండంగా భావిస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రతిపక్షాలు కూడా వారి పనితీరుకు రెఫరెండంగా భావించాలని సవాలు విసిరారు. శనివారం ప్రగతిభవన్‌లో మంత్రి కే తారకరామారావు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారని అన్నారు.

సీఎం కేసీఆర్ పేద ప్రజల గుండెల్లో గూడుకట్టున్నారని, మరోసారి ఆయనను ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలను చేపట్టామని, భవిష్యత్తులో ఇంకా చాలాచేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పించడంతోపాటుగా నిరుద్యోగ భృతి ఇచ్చే ఆలోచన ఉందని వెల్లడించారు. రాహుల్‌గాంధీది భస్మాసుర హస్తమని, ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమేనని వ్యాఖ్యానించారు. రాహుల్ ప్రచారంచేస్తే గుజరాత్, కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమిపాలైందని గుర్తుచేశారు. త్వరలో కామారెడ్డి, బోథ్‌లో కూడా సభల్లో రాహుల్ పాల్గొనబోతున్నారని, అక్కడ కచ్చితంగా గెలుస్తామని, అక్కడేకాదు.. రాష్ట్రమంతా గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..

బాబువి శిఖండి రాజకీయాలు చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి, ఎమ్మెల్యేల కొనుగోలుకు గతంలో కుట్రచేశారు. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్‌నే కొనుగోలుచేసే పనిలో ఉన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులను తోలుబొమ్మల్లా ఆడించాలనుకుంటున్నారు. బయటికి కాంగ్రెస్ కనిపిస్తుంది.. ఆడించేది మాత్రం చంద్రబాబే. ఉత్తమ్‌నో మరో నాయకుడినో ముందు పెట్టి ఆట ఆడిస్తారు. జగన్, పవన్ తమకు ఇక్కడేమీ పనిలేదనుకుని ఏపీలోనే పనిచేసుకుంటున్నారు. కానీ చంద్రబాబు ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఏపీ ఇంటెలిజెన్స్‌ను మోహరించారు. డబ్బులు ఇస్తున్నారు. టీడీపీని ఇక్కడ మూసేయాలని ప్రజలే చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు ఇప్పటికి 30 లేఖలు రాశారు. ఒకవేళ వాళ్ల కూటమి వస్తే చంద్రబాబు మన ప్రాజెక్టులను ముందుకు పోనిస్తారా? జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన లోకేశ్.. ఇక్కడే చదువుకున్నాను. నేను లోకల్.. కానీ కేటీఆర్ గుంటూరులో చదివాడు.. అన్నారు. చివరికి లోకేశ్‌ను ఏపీలో మంత్రిగా చేశారు. ఇది తమకు ఇక్కడేమీలేదని పరోక్షంగా సంకేతాలు ఇవ్వటమే. వాళ్లకే ఇక్కడ అవసరంలేనప్పుడు వారి క్యాడర్ ఆ పార్టీలో ఎందుకు ఉంటది?

టిక్కెట్లు రానివారే వెళ్లారు.. కొండా సురేఖ, బాబూమోహన్, రమేశ్‌రాథోడ్, భూపతిరెడ్డి మా పార్టీ విధానాలు, గెలుపుపై విశ్వాసం, నమ్మకం ఉండే చివరివరకు ఇక్కడే ఉన్నారు. టిక్కెట్లురాక పార్టీ మారారు. మా పార్టీలో టికెట్లు ఖరారైనా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతుండటాన్ని గమనించాలి.

కుటుంబాలను విడగొట్టం.. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముందుకొచ్చారు. కానీ వాళ్ల కుటుంబసభ్యులు తండ్రులకాలం నుంచి కాంగ్రెస్‌లో ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఒకరు కాంగ్రెస్‌లో, మరొకరు మా పార్టీలో ఉంటే బాగోదని, కుటుంబాన్ని విడగొట్టడం సరికాదనే ఉద్దేశంతో వారిని పార్టీలోకి చేర్చుకోలేదు. పద్మినీరెడ్డిని బీజేపీ చేర్చుకున్న విధంగా మేం చేయదలుచుకోలేదు. గత ఎన్నికల్లో హైదరాబాద్, శివారు ప్రాంతాల ప్రజలు టీడీపీ మీద ప్రేమకంటే టీఆర్‌ఎస్‌పై కోపంతో వ్యతిరేకంగా ఓటేశారు. వాళ్ల అనుమానాలు, అపోహలు తొలిగిపోవడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 99 సీట్లు కట్టబెట్టారు. ఇదే పరిస్థితి రాబోయే ఎన్నికల్లో పునరావృతం అవుతుంది. రాజకీయ పార్టీల్లో అసంతృప్తులు సహజం. పార్టీలో ఉన్న అసంతృప్తులందరికీ సర్దిచెప్పాం. వారి రాజకీయ భవిష్యత్‌పై భరోసా కల్పించాం. మా ప్రభుత్వమే రాబోతున్నది కాబట్టి వారుకూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఎన్నికల్లో పోటీచేయబోనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆరు నెలల క్రితమే చెప్పారు.

ప్రజలు అన్నింటినీ చూసే కేసీఆర్‌ను సీఎంను చేశారు కేసీఆర్ భాష, వ్యక్తిత్వంపై అనేకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. గత 18 ఏండ్లలోనూ ఇలానే చేశారు. కొంగరకలాన్ సభలో కేసీఆర్ ప్రతిపక్షాలపై ఏమీ మాట్లాడకపోతే.. మమ్మల్ని ఎందుకు తిట్టలేదు? అన్నట్టు ప్రతిపక్షాల నాయకులు మాట్లాడారు. ఇప్పుడేమో సీఎం ఇలా మాట్లాడవచ్చా? అంటూ విమర్శిస్తున్నారు. ఆయనపై ఉద్యమ సమయం నుంచి జరుగుతున్నదే ఇది. వీటన్నింటినీ ప్రజలు చూశారు.. విన్నారు.. అ తరువాతే కేసీఆర్‌ను సీఎం చేశారు. మరోసారి సీఎంగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

మనల్ని చూసి నేర్చుకుంటున్నారు కేంద్రంతో సంబంధంలేకుండా రుణమాఫీ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణనే. ఇతర రాష్ర్టాల అధికారులు ఇక్కడికి వచ్చి, రుణమాఫీని అధ్యయనం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు కొన్నింటిని కొనసాగిస్తామని, వాటిని మ్యానిఫెస్టోలో పెడుతామని కాంగ్రెస్ చెప్తున్నది. అంటే.. మా పథకాలను వాళ్ల మ్యానిఫెస్టోలో పెట్టుకుంటారన్నమాట. ప్రజలు ఎవరిని నమ్మాలో వారినే నమ్ముతారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ నేత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి రూపాయి 90 పైసలకే కిలో బియ్యం ఇస్తామన్నారు. కానీ, ప్రజలు విజయభాస్కర్‌రెడ్డి మాటలను నమ్మలేదు. ఎన్టీఆర్‌నే గెలిపించారు.

కోదండరాంను మర్యాదగా చూసుకున్నాం.. కోదండరాంతో మాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. 2014 నుంచి కూడా ఆయన కాంగ్రెస్ వ్యక్తిగానే వ్యవహరిస్తున్నారు. అప్పుడే సోనియాను కలిశారు. జేఏసీలోనివారికి దగ్గరుండి టిక్కెట్లు ఇప్పించారు. తాజాగా పార్టీ పెట్టి కాంగ్రెస్ కూటమిలో చేరారు. గతంలో మేం ఆయనను ఎంత మర్యాదగా చూసుకున్నామో, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎలా చూస్తున్నారో గమనించవచ్చు. ఆ పార్టీకి ఎనిమిది సీట్లు ఇస్తారని, అందులోనూ నాలుగు సీట్లు పాతబస్తీలో ఇస్తారని మావద్ద సమాచారం ఉంది. ఇదీ ఆయన పరిస్థితి.

రాష్ట్రానికి బీజేపీ చేసిందేమిటి? రాష్ట్రానికి న్యాయంగా రావాల్సినవాటిలో ఒక్కటికూడా బీజేపీ చేయలేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలనూ అమలుచేయలేదు. అనేకమార్లు ప్రధానిని కలిసి విజ్ఞప్తిచేశాం. ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరాం.. ఏమీ ఇవ్వలేదు. మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్ల సాయం చేయాలని కేంద్రానికి నీతిఆయోగ్ సిఫారసు చేసింది. కానీ కేంద్రం పైసా కూడా ఇవ్వలేదు. పెద్దనోట్ల రద్దు సమయంలో సంపూర్ణక్రాంతి అన్నారు. ఫలితం రాలేదు.

ఓట్ల కోసం చేయలే.. చంద్రబాబు 2014లో చెప్పిన నిరుద్యోగ భృతిని ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే అమలుచేస్తున్నారు. ఆయన ఇంటింటికో ఉద్యోగం అన్నారు. దీనిపై ఎవరూ మాట్లాడటంలేదు. అనేక హామీలను తుంగలో తొక్కారు. కానీ కేసీఆర్ పేదల కోసం అవసరమైన పథకాలను ఓట్లతో సంబంధంలేకుండా అమలుచేశారు. బడ్జెట్‌లో 43% సంక్షేమపథకాల కోసం ఖర్చుచేస్తున్నాం. అందుకే కేసీఆర్‌పై ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఏర్పడింది. కేసీఆర్ మళ్లీ గెలిస్తేనే తమకు లాభం కలుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు. అట్టడుగు వర్గాలు గతంలో ఇందిరాగాంధీ, ఆ తరువాత ఎన్టీఆర్‌కు అండగా నిలిచాయి. ఇప్పుడు కేసీఆర్‌వైపు నిలిచాయి. ప్రజలకు నాయకుడి మీద విశ్వాసం రాత్రికిరాత్రే రాదు. 2014లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశంలోనే 42 హామీలను అమలుచేయడానికి ఆమోదం తెలిపాం. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటిస్తే.. కాంగ్రెస్ రెండు లక్షలన్నది. కానీ కాంగ్రెస్ హామీని ప్రజలెవ్వరూ విశ్వసించలేదు.

బాబుకు ఎందుకు ఉలికిపాటు? పారిశ్రామికవేత్తలు, కాంగ్రెస్ నాయకుల ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలతో చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? మా పార్టీ నాయకులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కార్యాలయాలు, నివాసాల్లో, విజయరామారావు కొడుకు నివాసాల్లో ఐటీ సోదాలు నిర్వహించారు. మేం వాటిని రాజకీయం చేయలేదు. కాంగ్రెస్ నాయకుల ఇండ్లలో జరిగే సోదాలకు కూడా టీడీపీ అధినేత ఎందుకు బెంబేలెత్తుతున్నారు? ఎందుకు క్యాబినెట్ సమావేశాల్లో చర్చిస్తున్నారు? వ్యాపారవేత్తలు సీఎం రమేశ్, బీద మస్తాన్‌రావు, విద్యాసంస్థల అధినేత నారాయణ ఇంట్లో సోదాలు జరిగినా నానాహంగామా చేస్తున్నారు. తెలంగాణను రెవెన్యూ సర్‌ప్లస్ రాష్ట్రంగా చేసినట్టు చంద్రబాబు చెప్పుకొంటున్నది శుద్ధ అబద్ధం.. పెద్ద జోక్. 1956, 1968లో, 2001, 2018లో కూడా తెలంగాణ మిగులు ఆదాయ రాష్ట్రమే. బీపీఆర్ విఠల్‌తో సహా అనేకమంది ఆర్థిక నిపుణులు ఈ మాట చెప్పారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.. నిరుద్యోగ సమస్యపై మూడంచెల వ్యూహంతో ముందుకెళ్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఒకవైపు, ప్రైవేటురంగంలో ఉపాధి మరోవైపు.. దీనికితోడుగా నిరుద్యోగ భృతి ఇవ్వాలనే అంశం టీఆర్‌ఎస్ పరిశీలనలో ఉంది. గత నాలుగేండ్లలో మా ప్రభుత్వం 1,02,217 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. 87,346 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. 32,681 ఉద్యోగాలను భర్తీచేసింది. సగటున ఏడాదికి ఎనిమిదివేల ఉద్యోగాలను భర్తీచేశాం. కానీ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీచేసింది? టీఎస్‌ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 8,013 పరిశ్రమలకు అనుమతులిచ్చాం. వీటిలో ఇప్పటికే 5,952 పరిశ్రమలు ఉత్పత్తులను మొదలుపెట్టాయి. వీటిద్వారా రూ.60,612 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. 2,67,351 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 668 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిద్వారా రూ.27,706 కోట్ల పెట్టుబడులు, 1.96 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మిగిలిన పరిశ్రమలు వివిధదశల్లో ఉన్నాయి. వాటితో 3.88 లక్షలమందికి ఉపాధి కలుగుతుంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ద్వారానే నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేం. నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నాం. దీనిద్వారా ప్రైవేటురంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

పేదల పక్షపాతిగా మ్యానిఫెస్టో మా మ్యానిఫెస్టో పేదల పక్షపాతిగా ఉండబోతున్నది. వచ్చే నెలలో మ్యానిఫెస్టోను విడుదలచేసే అవకాశముంది. దసరా తర్వాత సీఎం కేసీఆర్ సభలు ఉంటాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రకటిస్తాం. నేను కొన్నిచోట్ల ప్రచారానికి వెళ్తాను. త్వరలో స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళ్తాను. ఈసారి తెలంగాణలో కులం, మతం, ప్రాంతానికి అతీతంగా ఓటింగ్ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలవారికి, అన్ని కులాలు, మతాలకు చెందినవారికి అందాయి. అవన్నీ వారి కండ్లముందు ఉన్నాయి. కాబట్టి వారంతా టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తారనే విశ్వాసంతో ఉన్నాం. వందకుపైగా సీట్లు సాధిస్తాం.

వాళ్ల సీట్లు ఖరారయ్యేలోగా మేం స్వీట్లు పంచుకుంటాం పొత్తులు అన్ని వేళలా విజయవంతం కావు. రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ ఎల్లప్పుడూ రెండు కాదు. ఒక్కోసారి జీరో కూడా అవుతుంది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు కాంగ్రెస్, టీడీపీ పొత్తు మిగులుతుంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించింది. మూడు దశాబ్దాలకుపైగా ఒకరిపై ఒకరు పోరాడి, ఇప్పుడు కలిసి పనిచేయడం అంత సులువుకాదు. వాళ్ల కూటమిలో ఉన్న కోదండరాం పార్టీ బలం ఎంతో వారికే తెలియదు. ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీచేయలేదు. సీపీఐ బలం నామమాత్రం. వాళ్లు ఎవరికెన్ని సీట్లో తేల్చుకుని, అభ్యర్థులను ఖరారుచేసుకొనేసరికి మేం స్వీట్లు పంచుకుంటాం. మాకు వందకుపైగా సీట్లు వస్తాయి. ప్రతిపక్షాలకు ముందుంది ముసుర్ల పండుగ. అభ్యర్థులు ఖరారయ్యాక అసలు సంగతి ఉంటది.

మా పాలనకు రెఫరెండమే మేం చేసిన అభివృద్ధిపై రెఫరెండంగా ఈ ఎన్నికలను భావిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజాకోర్టు తీర్పును మించింది లేదు. నాలుగేండ్లలో మేం అమలుచేసిన పథకాలు, మా పార్టీ విధానాలు, సీఎంగా కేసీఆర్ పనితీరుపై ప్రజాతీర్పు కోరుతున్నాం. ప్రతిపక్షాలు కూడా వారి పనితీరుపై రెఫరెండంగా భావించాలి. ఈ సవాలును కాంగ్రెస్, బీజేపీ, ఇతర ప్రతిపక్షాలు స్వీకరించాలి. మాకు ప్రజలపై విశ్వాసం ఉంది. ప్రజలకు కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌దే విజయమని అనేక సర్వేలు పేర్కొంటున్నాయి. ఓటర్లు కూడా అదే చెప్తున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.