Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యం

-రెండేండ్లలో రైతుకు భరోసా కల్పించాం -వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం -నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతులకు సకాలంలో ఇన్‌పుట్స్, సాగునీరు, కరెంట్ అందితే పొలాల్లో బంగారం పండిస్తారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరిచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. సీఎం ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేసి ఆకుపచ్చ తెలంగాణ సాధిస్తామన్న విశ్వాసం ఉంది అని వ్యవసాయ, సహకారశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ రెండేండ్లలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అనేక కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.

Pocharam-Srinivas-Reddy

ప్రశ్న: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ రెండేండ్లలో వ్యవసాయరంగంలో ఎలాంటి మార్పులొచ్చాయి? జవాబు: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ తొలి సందేశంలోనే బడుగు బలహీనవర్గాలతోపాటు రైతుల సంక్షేమమూ అంతే ముఖ్యమని స్పష్టంగా చెప్పారు. దానికి అనుగుణంగానే అడుగులు వేస్తూ వస్తున్నాం. విత్తనాలు, ఎరువులు, సాగునీరు, కరెంట్.. ఈ నాలుగింటి విషయంలో తెలంగాణ ఏర్పడకముందు రైతులు ఎదుర్కొన్న బాధలు అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కరెంటు, విత్తనం, ఎరువుల కొరత లేకుండా సకాలంలో అందజేస్తున్నాం. వ్యవసాయానికి గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన ప్రాధాన్యం చాలా తక్కువ. తెలంగాణ ఏర్పడ్డాక ఆ పరిస్థితి మారింది. బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయింపులు పెంచాం.

ప్ర: తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు తీసుకుంటున్న చర్యలు.. జ: సాగునీరు లేక, కరెంట్ లేక పంటలు ఎండిపోయే రైతులు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవన్నీ సమృద్ధిగా ఇస్తే రెండు పంటలు పండిస్తారు. అప్పుడు ఆత్మహత్యలన్న మాటే ఉండదు. ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ట్రం చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యం. అందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ పనిచేస్తుంది. వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీలు, విత్తన సబ్సిడీలు, డ్రిప్, పాలీహౌస్ సబ్సిడీలు పెంచాం. రైతులపై భారం పడకుండా రాయితీలు పెంచాం. వారికి సాగులో ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం.

ప్ర: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుకు ఏ విధమైన భరోసా కలుగుతున్నది? జ: రైతులపై ఆర్థికభారం తగ్గించేందుకు రుణమాఫీ అమలు చేస్తున్నాం. ఇన్‌ఫుట్ సబ్సిడీలు ఇస్తున్నాం. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌గ్రేషియా పెంచాం. పంటలు పండించుకునేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నాం.

ప్ర: రాష్ర్టాన్ని ప్రపంచ విత్తన భాండాగారం చేయాలనుకుంటున్నారు. అందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? జ: గతంలో దెబ్బతిన్న ప్రభుత్వ రంగ విత్తన సంస్థలను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. బడ్జెట్‌లో ప్రత్యేకంగా సీడ్‌చైన్ కోసం నిధులు కేటాయించాం. తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారం చేయడంలో మనకు ఓఈసీడీ గుర్తింపు రావడం కీలక అడుగు. తెలంగాణలో ఇప్పటికే 400 ప్రైవేటు కంపెనీలు 2 లక్షల ఎకరాల్లో విత్తనాలు పండిస్తున్నాయి. 20-30 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఓఈసీడీతో తెలంగాణ విత్తనాలు 58 దేశాలకు ఎగుమతి చేసే అవకాశం వచ్చింది. విదేశాలకు విత్తనాల ఎగుమతితో మన రైతులకు ఎక్కువ లాభం ఉంటుంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు తెలంగాణను ప్రపంచ విత్తన కేంద్రం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

ప్ర: పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాతోపాటు ఇతర పంటలను ప్రోత్సహించాలన్న డిమాండ్ గురించి.. జ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో పత్తి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందుకే పత్తికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఇప్పటికే రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నాం. ప్రత్యామ్నాయ పంటల్లో కేవలం సోయాబీనే కాకుండా కంది, పెసలు, మినుములు సహా రైతులు ఏ పంట వేయడానికి ముందుకు వస్తే ఆ విత్తనాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధ్దంగా ఉంది. ఇప్పటికే అన్ని రకాల విత్తనాలు ఆయా జిల్లాల్లో డంప్ చేశాం. రైతు ఇష్టం మేరకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవచ్చు.

ప్ర: ఎరువులు, విత్తనాల పంపిణీలో ఇబ్బంది రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జ: గతంలో ఎరువులు, విత్తనాల కోసం మండల వ్యవసాయాధికారి దగ్గర పర్మిట్లు తీసుకుని ప్రైవేటువాళ్ల దగ్గర కొనేవాళ్లు. ఈసారి ప్రాథమిక సహకార సంఘాల్లో వ్యవసాయాధికారులు అందుబాటులో ఉంటారు. చాలామంది అధికారులను నియమించాం. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులతోపాటు తిరిగి పంటను కొనుగోలు చేసేవరకు సొసైటీలను భాగస్వామ్యం చేస్తున్నాం. దీనివల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాం. గ్రామస్థాయి వరకు విత్తనాల పంపిణీని వికేంద్రీకరించాం. ఈ తరహా విధానం మరే రాష్ట్రంలోనూ లేదు.

ప్ర: ఈ రెండేండ్లలో ఉద్యాన పంటల సాగులో వచ్చిన మార్పులు.. జ: రైతుకు ఉద్యాన పంటల సాగుతోనే ఎక్కువ లాభం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 32 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు పండుతున్నాయి. వీటిని మరింత పెంచేందుకు డ్రిప్, స్ప్రింక్లర్స్‌కు సబ్సిడీల కోసం రూ.1300 కోట్లు కేటాయించాం. సాగులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖలను కన్వర్జెన్స్ చేశాం. అధికారుల సంఖ్య పెరిగింది. పర్యవేక్షణ పెరిగి, రైతులకు అందుబాటులో ఉంటారు. మండలానికి ఒక హెచ్‌ఈవో, నియోజకవర్గానికి ఒక హార్టికల్చర్ అధికారిని నియమించాం.

ప్ర: ప్రజలకు కల్తీలేని కూరగాయలు, మసాలాలు అందించేందుకు హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు గురించి.. జ: హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే ఏర్పాటు చేశాం. ప్రాసెసింగ్ యూనిట్లపై అవగాహన కోసం జూన్ చివరివారంలో పోలండ్, జర్మనీ దేశాల్లో అధికారుల బృందంతో పర్యటిస్తాం. ఆ నివేదికల తర్వాత కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటాయి.

ప్ర: ఈ ఖరీఫ్ సీజన్‌కు ఎలా సన్నద్ధమయ్యారు? జ: ఈ ఖరీఫ్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఎరువులు, విత్తనాలు నిల్వ చేశాం. జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశాం.

ప్ర: రానున్న మూడేండ్లలో వ్యవసాయశాఖలో ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు? జ: సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఒకటి. కోటి ఎకరాలకు సాగునీరిచ్చేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిలో అంతా భాగస్వాములమవుతాం. వందశాతం ఆకుపచ్చ తెలంగాణ సాధన దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.