-1,00,00,000 రాష్ట్రంలో ఏటా వైద్యసేవలు పొందుతున్నవారు -ప్రభుత్వ దవాఖానల్లో 50శాతానికి పెరిగిన ప్రసవాలు -1,55,00,000 ఇప్పటివరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారు -40 కిడ్నీ వ్యాధిగ్రస్థులకు డయాలసిస్ కేంద్రాలు -పేదలకు అందుబాటులో ప్రభుత్వ వైద్యం -నాటి నిర్లక్ష్య విధానాలకు చెల్లుచీటీ -సర్కారీ వైద్యానికి ప్రభుత్వ దన్ను -విప్లవాత్మకం.. కేసీఆర్ కిట్స్ పథకం -ఆదర్శనీయంగా మారిన కంటివెలుగు -త్వరలో ఈఎన్టీ, దంతవైద్య పరీక్షలు -విజయవంతంగా బస్తీ దవాఖానలు -ప్రభుత్వ వైద్యశాలల్లోనే పరీక్షాకేంద్రాలు -ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ఈజేహెచ్ఎస్ -ఆపత్కాలంలో సీఎంఆర్ఎఫ్ రక్ష
ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రతి ప్రభుత్వ కనీస బాధ్యత. గత ప్రభుత్వాలు ఈ బాధ్యతను పూర్తిగా ప్రైవేటుకు ధారాదత్తంచేసి.. చేతులు దులిపేసుకున్నాయి. తెలంగాణలో ఒకనాటి గొప్ప దవాఖానలైన ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర వైద్యశాలలు నిర్లక్ష్యానికిగురై నిస్తేజమయ్యాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం నిమ్స్, గాంధీ, ఉస్మానియా దవాఖానలను కేసీఆర్ సర్కారు అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దింది. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా.. కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా అధునాతన సౌకర్యాలు కల్పించింది. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవల్లో వినూత్న కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి నుంచి సూపర్‌స్పెషాలిటీ దవాఖానల వరకు రోగ నిర్ధారణకు అవసరమైన పరికరాలను సమకూర్చుతున్నారు. పట్టణ పేదలకు వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లో ప్రారంభించిన బస్తీ దవాఖానలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎమ్మారై, సీటీ స్కాన్, డిజిటల్ రేడియాలజీ, 2డీ ఎకో, అల్ట్రాసౌండ్, ఆటోఅనలైజర్ వంటి అత్యాధునిక పరికరాలను వివిధ దవాఖానాల్లో ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా పరీక్షాకేంద్రాలకు అవసరమైన రీజెంట్లను రేట్ కాంట్రాక్టు చేసి వివిధ వైద్యశాలల అవసరం మేరకు కొనుగోలుకు ప్రభుత్వం అనుమతించింది. జాతీయ ఆరోగ్యమిషన్ సూచనల మేరకు పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా దవాఖాన, జిల్లా దవాఖాన, బోధనవైద్యశాలల్లో అవసరమైన పరికరాలను అందుబాటులోకి తెచ్చారు.
విస్తృతంగా ఐసీయూలు ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రమైన జబ్బుచేస్తే చికిత్స చేసేందుకు ఏ హాస్పిటల్లోనూ ఐసీయూలు ఉండేవికావు. ఆస్తులు అమ్ముకొనైనా ఖరీదైన ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఆ పరిస్థితిని సమూలంగా మార్చివేసిన తెలంగాణ ప్రభుత్వం.. పెద్ద సంఖ్యలో ఐసీయూలు ఏర్పాటుచేస్తున్నది. మెడికల్ కాలేజీల్లోనూ ఐసీయూలను బలోపేతం చేయడంతో సర్కారీ వైద్యంపై ప్రజల్లో భరోసా నెలకొంటున్నది. ప్రభుత్వ దవాఖానల్లోనే రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలుదేశంలోనే మొదటిసారి ప్రభుత్వ వైద్యశాలల్లో రోగనిర్ధారణ పరీక్షాకేంద్రాల ఏర్పాటు, నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది. గాంధీ దవాఖానలో అత్యాధునిక సెంట్రల్ డయాగ్నస్టిక్ లేబొరేటరీని ఏర్పాటుచేశారు. ఎంఎస్‌ఐడీసీలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి, రాష్ట్రవ్యాప్తంగా జరిగే డయాగ్నస్టిక్ సర్వీసులను పర్యవేక్షిస్తున్నారు. ఈ చర్యలవల్ల ప్రజలు రోగనిర్ధారణ పరీక్షల కోసం వేలల్లో ఖర్చు చేయకుండా ఉచితంగా ప్రభుత్వ దవాఖానాల్లోనే పరీక్షలు చేయించుకునే వెసులుబాటు కలిగింది.
కిడ్నీ బాధితులకు అండగా డయాలసిస్ సెంటర్లు కిడ్నీ వ్యాధి బారినపడ్డవారు డయాలసిస్ సేవలు పొందేందుకు వ్యయ, ప్రయాసలకు లోనుకావాల్సి వస్తున్నది. డయాలసిస్ కేంద్రాలు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ సేవలను అందించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 కేంద్రాలను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 6000 మంది మూత్రపిండ వ్యాధిగ్రస్థులకు డయాలసిస్ సేవలు అందుతున్నాయి. ప్రస్తుత మల్టీయూజ్ డయాలసిస్ పద్ధతి కన్నా సింగిల్ యూజ్ డయాలసిస్ విధానంతో నాణ్యత, డయాలసిస్ ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్లను పూర్తిగా తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. ఎక్కువ మొత్తంలో ఖర్చవుతున్నప్పటికీ సింగిల్ యూజ్ డయాలసిస్ విధానాన్ని దేశంలోనే మొదటగా మన రాష్ట్రంలో అమలుచేస్తున్నారు. ఈ డయాలసిస్ కేంద్రాలను రాష్ట్రంలోని బోధనవైద్యశాలల ద్వారా నిర్వహిస్తున్నారు. నిమ్స్ పరిధిలో 17, గాంధీ బోధన వైద్యశాల పరిధిలో 18, నిమ్స్ బోధన వైద్యశాల పరిధిలో 10 కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీ.. తీవ్రమైన అనారోగ్యాలకు కార్పొరేట్ వైద్యశాలల్లో ఉచిత వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తున్నది. కార్పొరేట్ దవాఖానల్లో ఇందుకు అవకాశం కల్పిస్తూనే ప్రభు త్వ దవాఖానల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలను విస్తృ తం చేస్తున్నారు. అంతేకాదు.. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరిన్ని వ్యాధులకు వర్తింపచేశారు. అవయవ మార్పిడి, శస్త్రచికిత్సలకు కొత్త విధానాలను అమలుచేస్తున్నారు. దీనితోపాటు సీఎం ఆర్ఎఫ్ నుంచి వందల కోట్ల రూపాయలను ఆపన్నుల వైద్యసేవల నిమిత్తం ప్రభుత్వ సకాలంలో విడుదల చేస్తున్నది. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చురుకైన పాత్ర పోషి స్తూ, తమ వద్దకు వచ్చిన విజ్ఞప్తులను సీఎం కార్యాలయానికి నివేదిస్తూ సత్వరమే నిధులు విడుదలయ్యేందుకు సహకరిస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన కేసులలో వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వెరసి.. తెలంగాణ ప్రజలకు వైద్యంపై ఎనలేని భరోసా ఏర్పడింది.
వినూత్నం ఈజేహెచ్ఎస్ సేవలు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభు త్వం ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ఈజేహెచ్ఎస్ పథకాన్ని అమలుచేస్తున్నది. ఇందుకోసం వెల్నెస్ సెంటర్లు ఏర్పాటుచేసిం ది. వీటిలో ప్రాథమికంగా వైద్యం, మం దులు అందిస్తూనే, అవసరమైన వారికి పెద్ద దవాఖానల్లో ఉచిత వైద్యానికి రెఫర్చేస్తున్నారు.
తగ్గుతున్న మరణాల శాతం వివిధ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో మరణాల రేటు తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. విస్తరించే వ్యాధులపట్ల వైద్యాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, ప్రత్యేక చర్యలు చేపడుతుండటంతో మలేరియా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వంటివాటితో మరణించేవారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రజల్లో వ్యాధులపట్ల అవగాహన, నివారణ చర్యలు, వ్యాధులను ముందస్తుగా గుర్తించి వైద్యచేయడం వంటివాటితో తెలంగాణ ముందడుగు వేస్తున్నది.

దేశంలోనే మొదటిసారి పార్థివ వాహన సేవలు ప్రభుత్వ దవాఖానకు వచ్చేవారిలో అత్యధికులు పేదలే. చికిత్సకోసం వచ్చిన పేద రోగులు దురదృష్టవశాత్తూ చనిపోతే ఆ మృతదేహాన్ని సొంతూరుకు తీసుకువెళ్లడానికి ఆ పేద కుటుం బం ఎన్ని కష్టాలు పడుతుందో తెలియందికాదు. ఈ క్రమంలోనే చనిపోయన వ్యక్తి భౌతికకాయం గౌరవప్రదంగా ఇంటికి చేరాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం పార్థివవాహన సేవలు ఉచితంగా అందిస్తున్నది. రాష్ట్రంలో వివిధ దవాఖానల్లో 50 వాహనాలను ఏర్పాటుచేసి రోజుకు 30కి పైగా పార్థివ శరీరాలను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.

కోటీ 55 లక్షలమందికి కంటి వెలుగు అంధత్వరహిత తెలంగాణ సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కోటీ 55లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమంలో భాగం గా రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దృష్టిలోపాలున్నవారికి కండ్లద్దాలు ఇవ్వడంతోపాటు అవసరమైనవారికి శస్త్ర చికిత్సలకు రెఫర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా త్వరలో ఈఎన్టీ, దంతవైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్య స్థితిగతులను రికార్డు చేసి హెల్త్ ప్రొఫైల్ రూపొందించే కార్యక్రమం చేపట్టనున్నారు.

విప్లవాత్మక మార్పులకు నాంది.. కేసీఆర్ కిట్స్ గతంలో పురుళ్లకు ప్రభుత్వ వైద్యశాలలకు రావాలంటేనే పేదలు సైతం జంకిన పరిస్థితి ఉండేది. ప్రైవేటు దవాఖానలకు వెళితే అవసరమున్నా లేకున్నా సిజేరియన్లు చేసేవారు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సర్కారీ వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. అందులోనూ సహజ ప్రసవాలు పెంచేందుకు వైద్యులు కృషిచేస్తున్నారు. దీనికి కేసీఆర్ కిట్స్ పథకం గొప్ప తోడ్పాటునిస్తున్నది. పేద మహిళ గర్భిణిగా ఉన్న సమయంలోనూ కూలి పనులకు వెళితే తప్ప కుటుంబం గడవని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాబోయే అమ్మను భద్రంగా చూసుకునేందుకు, తగిన విశ్రాంతి, పోషకాహారం తీసుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కిట్స్‌లో భాగంగా పన్నెండు వేల రూపాయలను విడుతలవారీగా అందిస్తున్నది. ఆడపిల్ల పుడితే మరో వెయ్యిరూపాయలు ప్రోత్సాహకం ఇస్తున్నది. పుట్టిన బిడ్డకు, బాలింతకు అవసరమైన వివిధ వస్తువులతో కూడిన కిట్ అందిస్తున్నది. గర్భిణిని ప్రసవం కోసం హాస్పిటల్‌కు, ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఇండ్ల వద్ద దించి రావటానికి అమ్మ ఒడి పేరుతో వాహనాలను సైతం ఏర్పాటుచేసింది. 2017 జూన్ 3న ప్రారంభించిన కేసీఆర్ కిట్స్ పథకం విజయవంతంగా కొనసాగుతున్నదనేందుకు ప్రభుత్వ వైద్యశాలల్లో 50 శాతానికి చేరుకున్న ప్రసవాలే నిదర్శనం. కేవలం డబ్బులు పంచే కార్యక్రమంగా కాకుండా.. మహిళలకు సమాజంలో గౌరవం పెంచేలా, అన్ని దశల్లో గర్భిణులకు అండగా ఉండి, ఆరోగ్యకరమైన సమాజాన్ని తీర్చిదిద్దేలా ప్రభుత్వం సంకల్పించింది.