Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆర్నెల్లలో 3వేల గ్రామాలకు మంచినీళ్లు..

వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలోని 3,000 గ్రామాలకు సురక్షితమైన తాగునీరు అందించనున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీశాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు జిల్లా ఎస్‌ఈ, ఈఈలతో హైదరాబాద్‌లో ఆయన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నందుకు మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు తొలి ఫలితాలను త్వరలోనే ప్రజలకు అందిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం 24,500 గ్రామాలకు నీరు అందించాలన్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో రాబోయే ఆరు నెలల్లోనే మూడు వేల జనావాసాలకు ఈ సౌకర్యం కల్పిస్తామన్నారు.

KTR review on water grid project

-తెలంగాణ తాగునీటి పథకంపై సమీక్షలో మంత్రి తారక రామారావు -దేశమంతా మనవైపే చూస్తున్నది -నీళ్లిచ్చే తేదీలను ముందుగానే ప్రజలకు చెప్పాలి -ప్రాజెక్టు పనుల్లో వేగం ఇంకా పెంచాలి -జిల్లా ఎస్‌ఈ, ఈఈలకు మంత్రి ఆదేశం వచ్చే ఏడాది ఏప్రిల్ 30 నాటికి గజ్వేల్ నియోజకవర్గానికి, తర్వాత మేడ్చల్‌తో పాటు నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు మంచినీళ్లు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ర్టాలు కూడా తెలంగాణ చేపట్టిన పాజెక్టు వైపు చూస్తున్నాయని.. ఉత్తర్‌ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ర్టాలు చేపట్టబోయే ప్రాజెక్టులకు దీనినే ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఇంజనీర్లతో చెప్పారు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు పట్టుదలతో పనిచేయాలని జిల్లా ఎస్‌ఈలకు కేటీఆర్ సూచించారు. ప్రాజెక్టు పురోగతిపై త్వరలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో ఉన్నతస్థాయి సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు.

-తేదీలను ముందే చెప్పండి.. సెగ్మెంట్లు- మండలాల వారీగా ఏయే తేదీనాటికి తాగునీరు అందిస్తామో ప్రజలకు తెలియచేయాలని మంత్రి కేటీఆర్ ఎస్‌ఈలకు సూచించారు. డెడ్‌లైన్లు పెట్టుకుని పనిచేయాలని, ఎప్పటిలోగా పనులు పూర్తిచేస్తారో కచ్చితమైన తేదీలను తమకు నివేదిక రూపంలో ఇవ్వాలని ఆదేశించారు. అటువంటి నివేదికలే ఎస్‌ఈలకు బైబిల్, భగవద్గీత లాంటివన్నారు. జిల్లా స్థాయి సిబ్బందికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి ప్రతిపాదనలు పంపాలని మంత్రి వారితో చెప్పారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపట్టాలని, ఈ విషయమై జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని పనిచేయాలని అన్నారు.

జిల్లాల్లో జరుగుతున్న వాటర్ ప్రాజెక్టు పనుల గురించి ఆరా తీసిన మంత్రి.. అటవీ అనుమతులు, భూసేకరణ పనులు ఎంత వరకు వచ్చాయో తెలుసుకున్నారు. ఇతర శాఖలతో సమన్వయం కోసం ఏర్పాటు చేసిన జిల్లా జాయింట్ వర్కింగ్ గ్రూపుల సమావేశాల వివరాలు అడిగారు. డిజైన్‌లను అప్రూవ్ చేసే అధికారాలను జిల్లా ఎస్‌ఈలకే ఇస్తున్నట్టు మంత్రి చెప్పారు. ప్రధాన ప్రాజెక్టు పనులతో పాటు గ్రామాల అంతర్గత పైప్‌లైన్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్ కేంద్రంగా చేయాల్సిన డిజైన్లు, టెండర్ల పనులు పూర్తయిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పనులపై దృష్టి సారించాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యూఎస్ సలహాదారు జ్ఞానేశ్వర్, ఈఎన్సీ బీ సురేందర్‌రెడ్డితోపాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.