Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆశీర్వదించండి అభివృద్ధికి ఓటేయండి

-మళ్లీ గెలిపిస్తే పింఛన్లు పెంచుతాం
-చిన్న ఉద్యోగులకు వేతనాలు పెంచుతాం
-రైతు సమన్వయ సమితి సభ్యులకు నెలవారీ పారితోషికం
-కంటి వెలుగు తరహాలో ఈఎన్టీ బృందాలు
-రాష్ట్ర పౌరులందరి వివరాలతో హెల్త్ ప్రొఫైల్
-కేసీఆర్ మా పెద్దకొడుకని వృద్ధులు చెప్తున్నరు
-మ్యానిఫెస్టోలో పెట్టని 450 కార్యక్రమాలు అమలుచేశాం
-అభివృద్ధి స్థిరంగా ఉండాలనే ముందస్తు ఎన్నికలు
-టీఆర్‌ఎస్‌కు పదవులు ఎడమకాలి చెప్పుతో సమానం
-దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలన్నవాళ్లు..ఇప్పుడు రద్దు చేయగానే ఆగమాగమైతున్నారన్న కేసీఆర్
-ఇందూరు ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

కేసీఆర్ గర్జించారు! ప్రతిపక్షాల ఆపదమొక్కుల వాగ్దానాలను చీల్చి చెండాడారు! తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డంపడుతున్న వ్యక్తి.. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటారా? థూ.. మీ బతుకులు చెడ.. అంటూ కాంగ్రెస్‌పై నిప్పులు కురిపించారు! ఇండ్ల కిరాయి కడ్తం.. అంటూ పనికిమాలిన హామీలు ఇస్తున్న బీజేపీని తూర్పారబట్టారు. ఇండ్ల కిరాయి సంగతి తర్వాత.. ప్రధాని మోదీ ఇస్తానన్న తలా పదిహేను లక్షల మాటేందని నిలదీశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి.. నేనూ తిట్టగలుగుతా.. నా నోరు కూడా చెడ్డనోరే! తెరిసిన అనుకో తెల్లారేవరకు తిడుతా.. అని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలవారీగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా బుధవారం ఇందూరు నడిబొడ్డున భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. నాలుగేండ్లకాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌కు ఏ శిక్ష విధించాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి స్థిరంగా ఉండాలనే ముందస్తు ఎన్నికలకు వచ్చామన్న సీఎం.. మళ్లీ ఆశీర్వదించి.. అభివృద్ధికి ఓటేయాలని ప్రజలను కోరారు. మొదటి నుంచి గులాబీ ఖిల్లాగా ఉన్న నిజామాబాద్ జిల్లా.. మరోసారి ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.

రాష్ట్రంలో అభివృద్ధి స్థిరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ముందస్తు ఎన్నికలకు వచ్చామని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. మళ్లీ ఆశీర్వదించి.. అభివృద్ధికి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలవారీగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. నాలుగేండ్లకాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన సీఎం.. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేపడుతామని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీల పొత్తుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ద్రోహి, తెలంగాణ ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడుతున్న చంద్రబాబు పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడమేందని నిలదీశారు. థూ.. మీ బతుకులు చెడ.. అడిగితే మేమే నాలుగు సీట్లు ఇచ్చేవాళ్లం కదా! అంటూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం.. ఆయన మాటల్లోనే..

ఆరంభంలో భయంకరమైన పరిస్థితులు..
తెలంగాణ ఆవిర్భవించిన రోజుల్లో భయంకరమైన పరిస్థితులుండేవి. బడ్జెట్ ఏందో తెల్వదు. కరంటు కటకట. వ్యవసాయంలో సంక్షోభం. వలసలు, కరువులు, శిథిలమైపోయిన చెరువులు, మూలకు పడ్డ ప్రాజెక్టులు, తాగునీళ్లకు కష్టాలు, కూలిపోయిన కులవృత్తులు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు! ఉద్యమ సమయంలో తెలంగాణ నలుచెరుగులా తిరిగిన రోజున మన అమాయకత్వానికి అంతం లేకుండా పోతున్నది. మనతో చెలగాటమాడేవారికి గుడ్డివాళ్లలాగా మనం మద్దతు ఇసు న్నాం. రాజకీయంగా చైతన్యం వస్తే తప్ప మనం బాగుపడం అని చెప్పాను. కరంటు రెండు గంటలే వస్తున్నది సార్ అని ప్రజలు సభలో చెప్పేవారు. కరంటు స్తంభాలకు మూడు వైర్లు ఉంటాయి. ఒకటి కాంగ్రెస్ జెండా, రెండోది టీడీపీ జెండా, మూడోది కమ్యూనిస్టు జెండా కట్టండి.. బాగా వత్తది కరంటు అనేవాడిని.

మీరంతా చప్పట్లు కొట్టేవారు. ఆ జెండాలను విరిచి నేలకు కొట్టండి.. గులాబీ జెండా చేత పట్టండి.. కడుపునిండా కరంటు వస్తుందని అప్పుడే చెప్పాను. ఆ మాట ఈరోజు నిజమైంది. నిజామాబాద్ జిల్లా అన్ని జెండాలను నేలకేసి కొట్టి.. గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని పరుగెత్తింది కాబట్టి.. ఇరవై నాలుగు గంటల కరంటు ఇస్తున్నం. రెప్పకొట్టినంత సేపుకూడా పోకుండా కరంటు పరిస్థితి బాగు చేసుకున్నం. కష్టాల నుంచి ఒకటొకటి గట్టెక్కే దిశగా పోతున్నం.

మిషన్ భగీరథ.. నీటి కటకటకు చెక్..
తెలంగాణలో ప్రతి ఎకరానికి సాగునీరు రావాలి.. ప్రతి ఇంటికి కృష్ణా, గోదావరి తాగునీరు కావాలి అని లక్ష్యం గా పెట్టుకున్నాం. ఆ దిశగా ఐదుసార్లు భూమి చుట్టూ తిరిగేంత స్థాయిలో లక్షాయాభై వేల కిలోమీటర్ల పైప్‌లైన్లు వేశాం. వేలరకాల అడ్డంకులను తొలిగించుకుంటూ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ పరుగు పెడుతున్నది. నిజామాబాద్ జిల్లాలో 1690 గ్రామాలకు నీళ్లు చేరినయ్. రాబోయే రెండుమూడు నెలల్లో ఇంటింటికీ నల్లా ద్వారా నీరు చేరుకోబోతా ఉన్నయి.

మీ అన్నగా చెప్తున్న.. మీ జీతాలు పెంచుతా
అవినీతిరహితంగా పనిచేయడంతోనే ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. గత నాలుగేండ్లలో ఆర్థిక ప్రగతి వరుసగా 17.17% నమోదు అయింది. ఈ సంవత్సరం గడిచిన నాలుగైదు నెలల్లో ఆర్థిక ప్రగతి 19.83% నమోదైంది. ఈ ప్రగతి ఎట్ల వచ్చింది? ఎంత క్రమశిక్షణ ఉండాలి? ఎంత అవినీతి లేకుండా ఉండాలి? ఎంత పటిష్ఠమైన పాలన ఉండాలి? తెలంగాణ ఏర్పాటుకాకముందు కాంగ్రెస్ పదేండ్లు పాలించింది. ఆ పదేండ్లలో తెలంగాణలోని పది జిల్లాల్లో ఇసుక ఆదాయం రూ.9.56 కోట్లు. టీఆర్‌ఎస్ నాలుగేండ్ల పాలనలో రూ.1977 కోట్లు. ఆనాడు దొంగల్లా కాంగ్రెస్‌వాళ్లు ఇసుకను కూడా దోచుకుతిన్నారు. మేం అవినీతి బంద్ పెట్టి, పైసపైస కూడబెట్టి ప్రభుత్వానికి వచ్చేట్టు చేస్తే ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతున్నం. ప్రజలకు ఉచిత కరంటు ఇవ్వగలుగుతున్నం. ఉద్యోగస్తులకు మంచి జీతాలు ఇవ్వగలుగుతున్నం. చిన్న ఉద్యోగస్తులకు జీతాలు పెంచినం. అంగన్‌వాడీ టీచర్లను ఒకడు గుర్రాలతో తొక్కించిండు. ఇంకోడు వెట్టి చాకిరీ చేయించిండు. ఆశ వర్కర్లు అంగలారిస్తే కూడా ఐదు రూపాయలు పెంచలేదు. కానీ ఈ రోజు హోంగార్డులు, ఆశ, అంగన్‌వాడీ వర్కర్లు, సెకండ్ ఏఎన్‌ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులు.. ఇలా ఎంతోమంది అర్ధాకలితో పనిచేసే చిన్న ఉద్యోగులకు మేము ఎలా జీతాలు పెంచామో సమాజానికి తెలుసు. వారందరికీ తెలుసు. మీరు మళ్లీ టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి.. మీ జీతాలు మీరు గౌరవంగా బతికేలా పెంచుతానని మీ అన్నగా మనవి చేస్తున్నాను.

ట్రాక్టర్లపై పన్నులు రద్దు చేశాం..
సబ్సిడీ మీద ట్రాక్టర్లు, పనిముట్లు ఇస్తున్నం. డ్రిప్, పాలిహౌజ్ కావచ్చు.. 75 శాతం నుంచి వంద శాతం సబ్సిడీ మీద రైతులకు ఇచ్చే ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ. దేశంలో రైతులు వాడే ట్రాక్టర్లకు రవాణా పన్నులు లేని రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల కింద నీళ్లు వస్తే ముక్కుపిండి నీటి తీరువా వసూలుచేశారు. ఇయ్యాల తెలంగాణవ్యాప్తంగా నిజాంసాగర్, సింగూరు, ఎస్సారెస్పీ, లేదా మరో ప్రాజెక్టు అయినా.. నీటి తీరువా రద్దుచేసింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే.

మార్కెట్ కమిటీల్లో అందరికీ రిజర్వేషన్లు కల్పించాం
మార్కెట్ కమిటీల్లో అన్ని కులాలకు, మతాలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేసుకున్నాం. భవిష్యత్‌లో వాళ్లు బలంగా పనిచేయాలి. మ్యానిఫెస్టో పెట్టిననాడు సమన్వయ సమితి సభ్యులకు కూడా నెలవారీ పారితోషికాన్ని ప్రకటిస్తాం.

ప్రాజెక్టులను అడ్డుకున్న పాపం కాంగ్రెస్‌ది
నీటిపారుదల ప్రాజెక్టులద్వారా కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని కేసీఆర్ శపథం తీసుకున్నడు. పాలమూరు ఎత్తిపోతల, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులయితేనేమి.. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం.. ఈ మాట చెప్తుంటే సిగ్గు అయితాంది. శ్రీరాంసాగర్‌కు పునర్జీవమా? గోదావరిలాంటి జీవనది మీద ఉండే ప్రాజెక్టు.. ఏం బీమార్ వచ్చింది? ఆ బీమార్‌కు కారణం ఎవ్వరు? మహారాష్ట్ర నుంచి నీళ్లు రాకుండా అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతావుంటే గుడ్లు అప్పగించి చూసింది కాంగ్రెస్‌పార్టీ కాదా? శ్రీరాంసాగర్ మత్తడి దునికితే ఎల్లంపల్లికి నీళ్లు పోవాలి. కానీ ఎల్లంపల్లి నుంచి ఉల్టా నీళ్లు తెచ్చి శ్రీరాంసాగర్‌లో పోయాల్సిన పరిస్థితి! ఏం చేశారో కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఈ ప్రాజెక్టులన్నీ కట్టాలని ప్రయత్నం చేస్తుంటే అడ్డుపడుతున్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదే 196 కేసులు వేసినారు. ఏ రాష్ట్రంలోనైనా వ్యవసాయానికి నీళ్లు కావాలని అన్ని పార్టీలు ఒక్కటైతయి. కానీ చిల్లర రాజకీయాల కోసం, చిల్లర అధికారం కోసం ప్రాజెక్టులను అడ్డుకునే దుర్మార్గులు ఉన్న రాష్ట్రం తెలంగాణ. వారికి ఏ శిక్ష విధించాలో ఆలోచించాలి.

కులవృత్తులను ఆదుకున్నం
కూలిపోయిన కులవృత్తులు, గొల్లకురుమలను, మత్స్యకారులను ఎలా ఆదుకున్నమో ప్రత్యేకంగా చెప్పే అక్కెర లేదు. చేనేత కార్మికులకు 50% సబ్సిడీతో రంగులు, నూలు సరఫరాచేసి, వాళ్ల ఆత్మహత్యలు ఆపింది ఎవరో, గీత కార్మికులకు చెట్ల పన్ను పూర్తిగా రద్దుచేసింది ఎవరో, రజక, నాయీబ్రహ్మణులకు ఏ విధమైన సాయం అందుతున్నదో మీకు తెలుసు. పాల ఉత్పత్తిదారులకు బర్రెలు పంచడమే కాదు.. లీటరు పాలపై రూ.4 ప్రోత్సాహకం ఇచ్చే విషయం కూడా మీకు తెలుసు. సంచార పశువైద్యశాలలు ఏర్పాటుచేశాం. ఎంబీసీలకు వెయ్యి కోట్లతో కార్పొరేషన్ పెట్టాం. ఇవన్నీ మీ కండ్ల ముందట ఉన్నయి. కరంటు వెలుగులు.. మిషన్ భగీరథ.. మిషన్ కాకతీయతో బాగుపడ్డ చెరువులు మీకు తెలుసు. ఐదువేల కిలోమీటర్ల జాతీయ రహదారులను తెచ్చుకున్నం. రెసిడెన్షియల్ స్కూళ్లు బ్రహ్మాండంగా పెట్టుకున్నం. మైనార్టీల కోసం ఒక్క నిజామాబాద్ పట్టణంలోనే 8 కాలేజీలు, స్కూళ్లు పెట్టుకున్నం.

అద్భుతంగా కొనసాగుతున్న కంటివెలుగు
కంటివెలుగు కార్యక్రమం గురించి ఎవరూ ఎన్నడూ ఆలోచన చేయలేదు. ఈ రోజు పేద, ధనిక తేడాలేకుండా కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించి, అవసరమైన వాళ్లకు అద్దాలు ఇచ్చి, చికిత్సలు, ఆపరేషన్లు చేయిస్తున్న విషయం మీకు తెలుసు. ఇప్పటికి 44లక్షలు మందికి పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం 3.50 కోట్ల మందికి పరీక్షలు జరుగతయి. కాంగ్రెస్, టీడీపీ నాయకులు వాళ్ల జీవితంలో ఎన్నడన్న ఇలాంటి ఆలోచన చేసినారా? ఇది ఇంతవరకే ఆగదు. దీని తరువాత ఈఎన్టీ బృందాలు వస్తాయి. ఎవరికైతే చెవుడు ఉన్నదో, ముక్కు బీమారు ఉన్నదో.. వాళ్ల గురించి కంటి వెలుగు బృందాల్లాగ ప్రతి గ్రామానికి వచ్చి చూస్తాయి. ఆరోగ్య తెలంగాణ కావాలంటే ప్రతి మనిషికి రక్త పరీక్షలుచేసి, ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇవన్నీ జరుగుతయి.

43% ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే
ఉద్యోగుల విషయంలో కొందరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. టీఆర్‌ఎస్ ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని స్థాయిలో 43% ఫిట్‌మెంట్ ఇచ్చినది కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వమే. భవిష్యత్‌లోనూ ఉద్యోగస్తులకు మంచి పెంపుదల ఉంటది. కల్యాణలక్ష్మి పథకాన్ని మొదట్లో భయపడుతూ పెట్టినం. ముందుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.51వేలతో ప్రారంభించినం. సంపద ఎట్లెట్లా పెరుగుతుంటే.. వారికీ పెంచాం. తర్వాత బీసీ, ఈబీసీలకు పెట్టినం. ఇప్పుడు కల్యాణలక్ష్మి/షాదీముబారక్ కింద లక్షానూటపదహార్లు ఆడబిడ్డ పెండ్లికి ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే ఇవన్నీ చేశాం.

దుర్మార్గులకు బుద్ధి చెప్పండి
దుర్మార్గులకు, గులాంలకు బుద్ధి చెప్పడానికి నిజామాబాద్ ప్రజలు మళ్ల తొమ్మిది సీట్లలో గులాబీ జెండా ఎగురవేయాలి. ఈ రోజు దుర్మార్గుడైన చంద్రబాబుతో పొత్తా? ఇంతకన్న అధ్వాన్నం ఉంటదా? ఇంతకన్న దిగజారుడు ఉంటదా? చంద్రబాబు రూ.500 కోట్లు ఇస్తాడట దుర్మార్గులకు! కాంగ్రెస్ ప్రచారానికి చంద్రబాబు మూడు హెలికాప్టర్లు ఇస్తడట! వీళ్లు వాని కాళ్లు వత్తి, దండంపెట్టి వాణ్ణి ఊరేగించి మళ్లీ తెస్తారట. మన నెత్తి మీద పెడుతరట. ఇదేనా కావాల్సింది? తెలంగాణకు మనం కోరుకున్నది ఇదేనా? పోరాటం చేసింది ఇందుకేనా? ఇంతమంది సచ్చిపోయింది ఇందుకేనా? దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏడు మండలాలు గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబునాయుడు. తెలంగాణకు కరంటు లేకపోతే మనకు కరంటు ఇవ్వక.. మనం కరెంటుకోసం గోసపడ్డనాడు రాక్షసానందం పొందిన రాక్షసి చంద్రబాబు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్‌కు పొత్తా? సిగ్గుశరం ఉండాలే! సీలేరు పవర్ ప్రాజెక్టు గుంజుకున్నడు చంద్రబాబు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని అడుగడుగునా ఇప్పటికే కేంద్రానికి 36 లేఖలు రాసిండు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు అడ్డం.. తెలంగాణ కరంటుకు అడ్డం.. ఆ దుర్మార్గుడుతోనా మీరు కలిసేది?

సంక్షేమానికి 42వేల కోట్లు
-దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో తెలంగాణ
-మీతో రెండువేలు అనిపించినదే ఈ గులాబీ జెండా
-వృద్ధులు.. కేసీఆర్ మా పెద్ద కొడుకు అంటున్నరు
-వారి దీవెనలు వృథాపోవు

రాష్ట్రంలో రూ.42 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ అని సీఎం కేసీఆర్ చెప్పారు. రెండొందలు ఉన్న పింఛన్‌ను వెయ్యి రూపాయలకు తీసుకొనిపోయినం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అర్రాజ్ పాట పాడినట్లు.. నువ్వు వెయ్యి ఇత్తవా? మేం రెండు వేలు ఇత్తం.. అంటున్నరు. నేను రూ.2200 అంటా.. అప్పుడు నువ్వేం చేస్తావ్? అని మొన్న హుస్నాబాద్ సభలో అడిగిన. ఇంకో మాట కూడా చెప్పిన. బిడ్డా.. ఎన్నటికీ యాభై, డెబ్బయ్, నూరు రూపాయలిచ్చిన బతుకుమీది. మీతో రెండువేల మాట అనిపించిందవరు? ఇదిగో ఇదే గులాబీజెండా.. ఇదే కేసీఆర్! ఈ తెలంగాణ విప్లవం పుట్టకపోతే.. మేం వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే.. జన్మలో మీరు రెండు వేల మాట అందురా? పేదల పట్ల ఇప్పుడైనా మీకు కనువిప్పు కలిగినందుకు, మీకు బుద్ధి వచ్చినందుకు సంతోషపడుతున్నా. మేం కూడా పెన్షన్ పెంచబోతున్నం. అది ఎంత అన్నది మ్యానిఫెస్టో కమిటీ త్వరలోనే నిర్ణయం చేస్తది.

బ్రహ్మాండంగా ప్రభుత్వ వైద్యం
గతంలో ప్రైవేటు డాక్టర్ల కోతలు, అబార్షన్లు, అవసరం లేని గర్భసంచుల తీసివేతలతో ఆడవారిని నాశనంచేశారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. దానిని తట్టుకోవాలని ప్రభుత్వ వైద్యాన్ని మెరురుపర్చామని చెప్పారు. కేసీఆర్ కిట్లు, పిల్ల చదువుకుంటే రెసిడెన్షియల్ స్కూళ్లు.. పెండ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మి, ప్రసవిస్తే.. ఆడపిల్ల పుడితే పదమూడు వేలు, మగపిల్లవాడు పుడితే పన్నెండు వేలు ఇస్తున్నాం. ప్రభుత్వ దవాఖానల్లో లక్షలమందికి బ్రహ్మాండంగా వైద్యం అందుతున్నది. 452 కార్యక్రమాలు.. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టని పనులు కూడా చేశాం. ఇందూరు జిల్లాలో బీడీలు చుట్టే మా అక్కాచెల్లెళ్లకు తెలుసు. మీకు సరిపోతలేదు. బీడీలు చేస్తే బీమారి వస్తది. దుఃఖం ఉంది. గతిలేక బీడీలు చేస్తున్నారు. ఏనాడు ఏ ప్రభుత్వం మీ గురించి ఆలోచన చేయలే. రాష్ట్రవ్యాప్తంగా ఉండే బీడీ కార్మికుల్లో 39% నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. మీ అందరికీ మేలు కలగాలని.. మీకు పెన్షన్ ఇస్తామని బాల్కొండ నియోజకవర్గంలో మోర్తాడ్ ఎన్నికల ఉపన్యాసంలో చెప్పినాను. వెయ్యిరూపాయలు పెన్షన్ ఇస్తున్నాను. ఇంట్లో ఒక్కరికే ఇస్తున్నారు. దీంతో అత్తా కోడళ్లకు పంచాయతీలు అవుతున్నయ్.. అని తమ్ముడు ప్రశాంత్‌రెడ్డి చెప్పినాడు.. దీంతో నిబంధనలు సడలించి.. మరో 70 వేల నుంచి 80వేల మందికి లబ్ధి కలిగించాం. ఈ రకంగా చాలామంది ఈరోజు సంతోషంగా ఉన్నారు. వృద్ధులు ఈ రోజు కేసీఆర్ మమ్మల్ని అదుకున్నాడు.. మా పెద్దకొడుకు అని చెప్తున్నరు. అది చాలా సంతోషంగా ఉన్నది. వారి దీవెన వృథాపోదు.

హమ్‌సే జమానా హై.. జమానాసే హమ్ నహీ
-ప్రజలు అండగా ఉండగా ఏ కూటములు ఏమీ చేయలేవు
-ముస్లింలకు అండగా నిలిచిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం

ముస్లిం మైనార్టీలకు నమస్కారం. మీకు బాగా తెలుసు. మన సర్కార్ ముస్లింల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలుకావడం లేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన బడ్జెట్‌లో రెండువేల కోట్లు కేటాయించాం. మన పిల్లలకోసం 204 గురుకుల విద్యాలయాలను ఏర్పాటుచేశాం. షాదీముబారక్ వంటి ఎన్నో పథకాలను అమలుచేస్తున్నాం. బోధన్ ఎమ్మెల్యే షకీల్‌అహ్మద్ ఈ విషయాన్ని చాలాసార్లు శాసనసభలో చెప్పారు. ఈరోజు తెలంగాణ గద్దార్ అయిన చంద్రబాబుతో కాంగ్రెస్ చేతులు కలిపి టీఆర్‌ఎస్‌ను ఓడించాలనుకుంటున్నది. కాంగ్రెస్ సిగ్గులేకుండా చేతులు కలుపుతున్నది. మీ ఆశీర్వాదం ఉండగా ఎవ్వరూ ఏమీచేయలేరు. ఎంతమంది చంద్రబాబులు వచ్చినా ఎదుర్కొంటాం. హమ్‌కో మిఠా సకే యే జమానా మే దమ్ నహీ.. హమ్‌సే జమానాహై.. జమానాసే హమ్ నహీ (మనను ఎవరు ఏమీ చేయలేరు.. మన నుంచి వారు ఉన్నారు.. వారితో మన మనుగడ ఆధారపడి లేదు). బారూద్ బన్‌కర్ జిస్‌కే హిఫాజత్ ఖుదా కరే.. హో షమా క్యాబుజే.. జిసే రోషన్ ఖుదా కరే (దేవుడే దీపమై వెలుగునిస్తే.. ఆ దీపాన్ని ఎవరు ఆర్పగలరు?) ప్రజలే నాకు అండగా ఉండగా వీళ్లు (చంద్రబాబు, కాంగ్రెస్) నన్నేమి చేయగలుగుతారు? మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి నిజామాబాద్ జిల్లా అంటే ఎంతో ప్రేమ. చెండూరు దగ్గర చెక్‌డ్యామ్‌లు కావచ్చు.. లిఫ్టుల నిర్మాణం కావచ్చు! ఇంకా చాలా నిర్మించుకోవాలి. మంజీరా నుంచి చుక్క కూడా బయటకు పోకుండా చర్యలు తీసుకుందాం. నిజామాబాద్ జిల్లాలో ప్రతీ ఎకరానికి సాగునీరందించడానికి మీ బిడ్డగా నేను ప్రయత్నిస్తా. నిజామాబాద్ ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలువాలి. నిజామాబాద్ గులాబీ ఖిల్లా అని మరోసారి నిరూపించుకోవాలి.

ఇంతటి ప్రభంజనం ఎన్నడూ చూడలే
తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎగరేసిన ఖిల్లా ఇది.. ఇందూరు సభకు ప్రజలు ప్రభంజనంలా తరలి వచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సభలో ఎంతమంది ఉన్నారో.. అంతకు సగంమంది సభ వెలుపల ఉండటాన్ని హెలికాప్టర్‌లో వస్తూ గమనించానని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో ఎన్నో సభల్లో మాట్లాడాను. మీ దర్శనానికి అనేకసార్లు వచ్చాను. ఈ రోజు చూసిన జన ప్రభంజనం.. గతంలో ఎప్పడూ చూడలేదు. నిజామాబాద్ జిల్లా మొట్టమొదటిసారి టీఆర్‌ఎస్‌ను స్వతంత్రంగా జిల్లా పరిషత్‌కు గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఎగురవేసిన ఖిల్లా. పౌరుషానికి ప్రతీక. గత ఎన్నికల్లో మొత్తం తొమ్మిది శాసనసభ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు, స్థానిక మేయర్, జెడ్పీ చైర్మన్.. ఇలా అందరినీ అపురూపంగా గెలిపించిన జిల్లా. తెలంగాణ ఉద్యమంలో నాడు నేడు ఏనాడూ అగ్రభాగాన ఉన్న జిల్లా అన్నారు.

కే: ఎవడైతే తెలంగాణను నాశనం చేసిండో.. ఎవడైతే గుండు కొట్టిండో.. నిర్దాక్షిణ్యంగా ఎన్‌కౌంటర్ల పేరుమీదుగా వందల మంది తెలంగాణ బిడ్డలను బలిపెట్టుకున్నడో తెలంగాణ ద్రోహి.. చెడిపోయిన చంద్రబాబుతో పొత్తా మీ బతుకులకు.. అడుక్కుంటే మేమే ఇస్తాం కదా నాలుగు సీట్లు.

సీ: కాంగ్రెస్ ప్రచారానికి చంద్రబాబు మూడు హెలికాప్టర్‌లు బుక్ చేసి ఇస్తడట.. వీళ్లు కాళ్లు వత్తి.. దండం పెట్టి వాణ్ని ఊరేగించి మళ్లీ తెస్తారట.. మన నెత్తి మీద పెడుతరట.. ఇదేనా కావాల్సింది తెలంగాణకు..

ఆర్: కరంటు ఇవ్వకుండా రాక్షసానందం పొందిన రాక్షసి చంద్రబాబుకు.. మీ గులాం మనస్తత్వానికి, చిల్లర అధికారానికి ఇంత నీచంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతరా..? దీనిపై తెలంగాణ ప్రజలే నిర్ణయం ప్రకటించాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.