Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆయకట్టుకు.. గొలుసుకట్టు జీవం

-సీఎం కేసీఆర్ చొరువతో చెరువులకు మహర్దశ
-గ్రామాల్లో తటాకాలకు పూర్వవైభవం.. -ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4,258 చెరువులకు జలకళ

సమైక్య పాలనలో రూపురేఖలు కోల్పోయిన గ్రామీణ నీటిపారుదల వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొస్తున్నది. కాకతీయుల కాలంలో ఆయకట్టుకు ఆయువుపట్టుగా నిలిచిన గొలుసుకట్టు చెరువులు స్వరాష్ట్రంలో జలకళ సంతరించుకొంటున్నాయి. సీఎం కేసీఆర్ ప్రారంభించిన మిషన్ కాకతీయలో భాగంగా విడుతల వారీగా ఉమ్మడి జిల్లాలోని 4,258 చెరువులు పునరుద్ధరణకు నోచుకొన్నాయి. ఐదోవిడుత మిషన్ కాకతీయలో గొలుసుకట్టు చెరువులకు సాగునీటి వనరుల లింకేజీని ప్రా ధాన్యంగా తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో సీఈలు, ఈఈలతో సమావేశం నిర్వహించిన ఉన్నతాధికారులు ప్రాజెక్టులకు అనుసంధానంగా చెరువులను పునరుజ్జీవం చేసే బృహత్ కార్యక్రమానికి సన్నద్ధం కానున్నారు.

నాగర్‌కర్నూల్‌లో వెయ్యి చెరువులకు అవకాశం..
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణతోపాటు నీటిని నింపే కార్యక్రమంలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో కొత్తగా వెయ్యి చెరువులను ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. ఎంజీకేఎల్‌ఐ ద్వారా ఏటా దాదాపు 200 చెరువుల ను నింపుతున్నారు. దీనివల్ల దాదాపుగా 15 వేల ఎకరాల ఆయకట్టుకుపైగా సాగునీరు అందనున్నది. ఎంజీకేఎల్‌ఐతోపాటు కొల్లాపూర్‌లో భీమా, భవిష్యత్తులో పూర్తికానున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు అనుసంధానంగా ఉన్న చెరువులను అభివృద్ధి చేయనున్నారు. ఈ గుర్తించిన వెయ్యి చెరువుల ద్వారా దాదాపు 30 వేల నుంచి 35 వేల ఎకరాలకు చెరువుల ద్వారా సాగునీరు అందనుండటంతో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశమున్నది.

గద్వాలలో 16,909 ఎకరాల స్థిరీకరణ..
జోగుళాంబ గద్వాల జిల్లాలో 345 చెరువుల్లో మిషన్ కాకతీయ పనులు చేపట్టి దాదాపు 16,909 ఆయకట్టు స్థిరీకరించాలని అధికార యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఇందుకోసం రూ.41.25 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటివరకు రూ.20.53 కోట్లు ఖర్చు చేసి 231 చెరువుల్లో మిషన్ కాకతీయ పనులు చేపట్టారు. ర్యాలంపాడు రిజర్వాయర్ కింద 103 గొలుసుకట్టు చెరువులను కృష్ణానీటితో నింపారు. నాలుగో విడుత మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా 43 చెరువుల్లో మరమ్మతు పనులు చేపట్టనున్నారు. గతేడాది జూరాల నుంచి సేకరించిన వరద నీటిని 4.5 టీఎంసీల సామర్థ్యం గల ర్యాలంపాడు రిజర్వాయర్‌లో నిల్వచేశారు. ఈ నీటి నుంచి 103 గొలుసుకట్టు చెరువులకు గ్రావిటీ కెనాళ్ల ద్వారా సరఫరా చేశారు.

మహబూబ్‌నగర్‌లో 2563 చెరువులకు అవకాశం..
గొలుసుకట్టులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 2,563 చెరువులను అధికారులు గుర్తించారు. ఇప్పటికే 180 చెరువులను నీటితో నిం పారు. ఈ చెరువులకు ఎంబీకేఎల్‌ఐ, జూరాల ఎడుమ కాల్వ, కోయిల్‌సాగర్ నుంచి నీళ్లు వస్తున్నాయి. జిల్లాలో మొత్తం చెరువులు మరమ్మతు చేస్తే 1.37 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నది. ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువులను గుర్తించే పనికి శ్రీకారం చుట్టారు.

వనపర్తి జిల్లాలో 350 చెరువులు..
వీలున్న చెరువులన్నింటినీ గొలుసుకట్టు కిందికి తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ ఆదేశంతో వనపర్తి జిల్లాలో కొత్తగా 350 చెరువులను ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. జిల్లాలో ఉన్న చెరువులకు సాగు నీరందించేందుకు ఈ గొలుసుకట్టు తరహా చెరువులను ఎంపిక చేశారు. దీంతో జిల్లాలోని దాదాపు 350 చెరువుల కింద ఉన్న 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే అవకాశమున్నది. ఆయా ప్రాంతాల్లో వీలునుబట్టి ప్రాజెక్టుల మెయిన్ కాల్వలకు ప్రత్యేకంగా తూములను ఏర్పాటు చేసి ఈ చెరువులను నదుల నీటితో నింపుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

గొలుసుకట్టు కాల్వలతో లాభాలెన్నో..
గొలుసుకట్టు కాల్వల ద్వారా గతంలో ఉన్న పొలాలకు కూడా సాగునీరు అంది రైతులకు లబ్ధిచేకూరుతుంది. భూగర్భ జలాలు పెంపొందడంతోపాటు బోర్లలో నీరు వృద్ధి చెందుతుంది. రైతులు పండించే ప్రతి పంటకూ సాగునీరు సునాయసంగా అందుతుంది.
– -కొత్త యాదవులు, రైతు, ఖిల్లాఘణపురం, వనపర్తి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.