Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆయనొక శిఖరం

ఒక పార్టీని ప్రారంభించి, ఒక జెండాను సృష్టించి, ఎజెండాను రూపొందించి, ఒక ఉద్యమాన్ని నడిపించి, ఒక రాష్ట్రాన్ని సాధించి, నాలుగున్నరేండ్లు అద్భుతమైన పాలన అందించి, మరోమారు కోట్లమంది ప్రజల అభిమానం చూరగొని, 88 స్థానాల్లో విజయకేతనం ఎగరేసిన మహానాయకుడు కేసీఆర్. ఒంటిచేత్తో అనేక విజయాలు సాధించిన జనహృదయనేత కేసీఆర్. వారసత్వాలు లేవు. రాజకీయ సంక్రమణాలు లేవు. బలమైన ఆర్థిక నేపథ్యమూ లేదు. సామాన్యుడిగా మొదలై అజేయుడిగా ఎదిగిన భూమిపుత్రుడు. ఒంటరిగా మొలిచి మహావృక్షంగా ఎదిగిన నేత. ఎటువంటి పటాటోపాలు లేకుండా కొన్ని నిమిషాల్లోనే చాలా సాదాసీదాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగించారు. నిబద్ధత, నిరాడంబరత ఆయన సహజాతాలు. ఆయన మూలాలను వదిలిపెట్టని నాయకుడు. స్వయంకృషితో ఇంత గా ఎదిగిన నాయకుడు. మరొకరయితే ప్రమాణ స్వీకారోత్సవాన్ని బ్రహ్మాండం బద్దలయ్యేట్టుగా చేసేవారు. ఏ ఎల్బీస్టేడియమో రణగొణ ధ్వనులతో మోగిపోయేది. అప్పుల్లో ఉన్నాం.. ఆగమై పోయాం అంటూ నిరంతరం ఏడ్చే పొరుగు ముఖ్యమంత్రి కూడా తొలి ప్రమాణానికి ఎంత సెట్టింగు వేశారో తెలుసు. కానీ కేసీఆర్ వాటి జోలికెళ్లలేదు. ఎదిగే కొద్దీ మరింత బాధ్యతగా ఉందామన్నది ఆయన ఆలోచన. సాయంత్రానికి యథావిధిగా పనిలో నిమగ్నమయ్యారు.

CM KCR Is A God For Me Says Telangana People

పార్లమెంటు సభ్యులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఆయన జనం మనిషి. నిన్న ముఖ్యమంత్రిని అభినందించడానికి ప్రగతిభవన్‌కు వెళితే అక్కడ ఎటుచూసినా జనప్రవాహమే. వేలమంది లోపలికి వచ్చి ముఖ్యమంత్రిని అభినందించి వెళుతున్నారు. ఆ జనాన్ని చూసినప్పుడు అదొక దర్బారు అని తిట్టే సన్నాసులు గుర్తొచ్చారు. మనిషి శిఖరం, మనసు విశాలం, అయినా నేల విడువని నైజం. ఎప్పుడూ పదిమంది చుట్టూ లేకుండా భోజనంచేయరు. కులాలు, సామాజికవర్గాలు, హోదాలు ఇవేవీ ఆయన లెక్కలో ఉండవు. భోజనం వేళకు వచ్చిన అతిథులను పేరుపేరునా పలకరిస్తూ ముచ్చటిస్తూ భోజనంచేయడం ఆయనకు ఆది నుంచీ అలవాటు. నాకు వివిధ పార్టీలలో చాలా పెద్దపెద్ద నాయకులు తెలుసు. వాళ్లందరి ఇళ్లకూ వెళ్లాను. కానీ ఏ నాయకుడూ తన డైనింగ్‌టేబుల్ వద్ద తనతో కూర్చోబెట్టుకుని నాకు భోజనం పెట్టిన సందర్భంలేదు అని టీడీపీ నుంచి వచ్చిన ఓ సీనియర్ నాయకుడు ఒకనాడు చెప్పడం గుర్తు. పెద్దలను గురువులను ఆయన సత్కరిస్తారు. పాదాభివందనం చేస్తారు. కానీ ఎవరినీ తనకు సాష్టాంగపడనివ్వరు.

ఆయన ఏ విషయాన్నీ ఆషామాషీగా తీసుకోరు. ఏ సభకూ ముందుగా తయారుకాకుండా, సాకల్యంగా అధ్యయనం చేయకుండా వెళ్లరు. ఇప్పుడేకాదు గత ఇరవైయ్యేండ్లుగా ఆయన అలాగే ఉన్నారు. ఏదైనా మాట్లాడేముందు, ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ఆయన పదిమందిని సంప్రదిస్తారు. ఆయనకు తెలియక కాదు, మాటలు రాక కాదు, తెలుగు తెలియకా కాదు. మాట్లాడే అంశాలు పరిపూర్ణంగా ఉండాలన్నది ఆయన తపన. తెలిసితెలిసి తప్పులు చేయకూడదన్న వివేకం. తను మాట్లాడితే అందుకు తిరుగుండకూడదన్న ఆరాటం. ఎన్నోసార్లు నేను కూడా ఆయనకు నాలుగు మాటలు రాసిపంపిన సందర్భాలున్నాయి. నన్నే కాదు చాలా మందిని అడిగి వివిధ అంశాలపై వారి అభిప్రాయాలు తెప్పించుకుంటారు. వాటన్నింటినీ పరిశీలించి తన శైలిలో తనదైన భాషాభావోద్వేగాలతో మాట్లాడుతారు. ఆయన నలిగి నలిగి ఎదిగిన నేత. అందుకే ఆయన ప్రసంగాలు జనాన్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇవ్వాళ దేశంలో ఏ రాజకీయ నాయకుడూ స్పృశించని అంశాలను కూడా ఆయన అలవోకగా మాట్లాడగలరు. ఏ సమస్య గురించి అయినా లోతైన అవగాహనతో చర్చించగలరు. ఉద్యమకాలంలో నాయకులు, మేధావుల ఇండ్లకు వెళ్లి గంటలు గంటలు చర్చలుచేసి వచ్చేవారు.

ఎక్కడా ఎటువంటి భేషజం ప్రదర్శించేవారు కాదు. ఆయన సంతోషాన్నీ దాచుకోలేరు. దుఃఖాన్నీ దాచుకోలేరు. ఆ ఆర్ద్రత ఉన్న నాయకుడు కాబట్టే గత నాలుగున్నరేండ్లలో జనం కన్నీళ్లు తుడువడమే లక్ష్యంగా ఎన్ని పథకాలు రూపొందించి అమలు చేశారో! ఒక సందర్భం చెప్పాలి- ఇటు అభివృద్ధి పథకాలు అటు సంక్షేమ పథకాలు ఒక ఉద్యమంగా అమలుచేస్తున్న కాలం. నీటిపారుదల ప్రాజెక్టుల నవీకరణ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఒకవైపు ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, అందరికీ ప్రమాద బీమా, బడిపిల్లలకు సన్నబియ్యం అన్నం.. ఇలా అనేకానేకం అమలులోకి వస్తున్నకాలం. ముఖ్యమంత్రి వద్ద పనిచేసే ఒక పోలీసాఫీసరు, సార్, ఇంతమందికి ఇన్ని చేస్తున్నరు. రైతులకు కూడా ఏమైనా పథకం తెస్తే బాగుంటది కదా అని విన్నవించారట. తనకింద పనిచేసే అధికారి తనకు చెప్పడమా అని అనుకోలేదు. ఆ మాట ఆయనను బాగా కలవరపర్చింది. నిజమే ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? మరో మనోయాతన, మరో కొత్తపథకం. రైతుబంధు అలా మొదలయింది. కొనసాగింపుగా రైతుబీమా వచ్చింది. అలా కేసీఆర్ ప్రారంభించిన పథకాలు వేనోళ్ల ప్రశంసలందుకుంటున్నాయి.

కేంద్రమంత్రులు, అధికారులు, అనేక రాష్ర్టాల మంత్రులు తెలంగాణను ఒక ఆదర్శంగా, మార్గదర్శిగా కొనియాడారు. ఐక్యరాజ్యసమితి మన పథకాలను ప్రశంసించింది. కేసీఆర్ రెండోసారి గెలిచారు కదా ఇక ప్రశాంతంగా ఉంటారా అని ఒక మిత్రుడు ప్రశ్నించారు. ఆయన ఒక నిరంతర భావోద్వేగాల ప్రవాహం. ఎప్పుడూ నిత్యనూతనంగా, వైవిధ్యంగా ఆలోచిస్తూ ఉండడంలోనే కేసీఆర్ ప్రశాంతతను వెతుక్కుంటారు. బాగా గుర్తు. తెలంగాణ వచ్చి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో గత ప్రభుత్వం నుంచి నల్ల సఫారీల కాన్వాయ్ ఒకటి మనకు వచ్చింది. ఆయనకు నల్లరంగు అంటే ఇష్టం ఉండదు. వెంటనే కొత్తవి కొనుక్కోవచ్చు. ఆయన ఆ కార్లకు తెల్లరంగు వేయించి ఆరేడు మాసాలు ఉపయోగించారు. ఇంత పిసినారితనమా అనిపించింది. కానీ తనలోని సామాన్యుడిని ఆయన వదిలిపెట్టలేదు. అధికారం వచ్చిందికదా దూకేద్దాం అనుకోలేదు. అదొక్కటే కాదు, కార్పొరేషన్లు, ఇతర నియామక పదవులు నింపేటప్పుడు ఆయన ఆలోచించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేది. మనం ఉద్యమ తొలినాళ్లలో పాదయాత్రచేస్తూ వెళ్లాం. ఈ నాయకులు ఎవరూలేని కాలంలో అక్కడ మనకు భోజనం, వసతి ఏర్పాటుచేశారు. ఇప్పుడాయన ఎక్కడున్నారు? అని నాయకులను అడిగిమరీ పిలిపించుకుని వారికి పదవులు ఇవ్వడమేకాదు, అప్పటికి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఎంతోమంది ఉద్యమకారులకు కొత్త జీవితాన్ని ఇచ్చిన మానవతావాది కేసీఆర్. తెలంగాణలో రాజకీయశక్తుల పునరేకీకరణ కోసం, రాజకీయ సుస్థిరతకోసం ఇతర పార్టీల నాయకులను తీసుకున్నా, కేసీఆర్ తనకు ఆపదకాలంలో అండగా ఉన్నవారినెవరినీ విస్మరించలేదు.

కేసీఆర్ రెండోసారి గెలిచారు కదా ఇక ప్రశాంతంగా ఉంటారా అని ఒక మిత్రుడు ప్రశ్నించారు. ఆయన ఒక నిరంతర భావోద్వేగాల ప్రవాహం. ఎప్పుడూ నిత్యనూతనంగా, వైవిధ్యంగా ఆలోచిస్తూ ఉండటంలోనే కేసీఆర్ ప్రశాంతతను వెతుక్కుంటారు.

తొలినాళ్లలో కాంగ్రెస్, టీడీపీ కొట్టిన దెబ్బలకు ఆయన కాకుండా మరెవరున్నా తెలంగాణ ఉద్యమం బతికిబట్టకట్టేది కాదు. పలుచని శరీరంలో వజ్రహృదయం ఉందని నాడు ఎవరూ అనుకోలేదు. కాంగ్రెస్ నాయకత్వం కుట్రలు పన్నీ తెలంగాణ ఉద్యమం లేదు అని, దాని పని అయిపోయింది అని చాటిచెప్పాలని ప్రయత్నించిన ప్రతిసందర్భంలోనూ ఆయన ఫీనిక్స్‌లా ఉవ్వెత్తున పైకిఎగసి తెలంగాణ పతాకాన్ని సమున్నతంగా ఎగరేశారు. మదినిండా ఆలోచనలు, రెక్కలనిండా మనుషులతో ఇంకో ప్రయత్నం. మరో ముందడుగు. సమైక్యాంధ్ర ఆధిపత్య శక్తుల లాలూచీలు, బెదిరింపులు, కుట్రలు పటాపంచలుచేస్తూ ముందుకు సాగుతూ వచ్చారు. వందలమంది కొత్తతరం నాయకులను తయారుచేశారు. ఊరికొక కేసీఆర్ తయారయ్యారు. తెలంగాణ ఎందుకుకావాలో చెప్పే ఆట, పాట, మాటలతో తెలంగాణ పల్లెలు, పట్నాలు మారుమోగిపోయాయి.

అది ఆయన సాధించిన విజయం. ఏకకాలంలో ఇటు రాష్ట్రంలో జనాన్ని, అటు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి సవ్యసాచిగా జైత్రయాత్ర సాధించారు. ఆయన మొండివాడు. పట్టిన పట్టు వదలరు అని అంటారు కొందరు. కాదు అది ఆయన నిబద్ధత అంటాను. తెలంగాణ రాష్ట్ర సాధనతోపాటు పాతతరం నాయకులను చీపురుతో ఊడ్చేసినట్టు ఊడ్చేసి 54 మంది కొత్త నాయకులను అసెంబ్లీకి తీసుకువచ్చారు. అత్యంత విద్యావంతులయిన, కార్యదక్షులయిన ప్రజాప్రతినిధులను ఒక వరంగా ఇచ్చారు. కొత్తతరం నాయకులతో తెలంగాణ సమాజానికి జరిగిన మేలు అంతాఇంతా కాదు. వెనుకటికి ఒక ఎమ్మెల్యేనో, మంత్రినో కలువాలంటే ఒక యజ్ఞం. వారు ఊళ్లకు వచ్చేది కూడా ఐదేండ్లలో ఏ రెండు మూడుసార్లో. కానీ కేసీఆర్ తను నిద్రపోలేదు. తమ పార్టీ ప్రజాప్రతినిధులను నిద్రపోనివ్వలేదు. ఐదేండ్లూ నిరంతరం ఏదో ఒక పథకం, ఏదో ఒక కార్యాచరణ ఇచ్చి ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల వద్దకు వెళ్లేట్టు చేశారు. గత నాలుగున్నరేండ్లలో తెలంగాణ పల్లెలు, పట్నాల్లో గుణాత్మకమైన అభివృద్ధి వచ్చింది. జీవనప్రమాణాలు పెరిగాయి. సంపద పెరిగింది. ప్రతిగడపకూ తెలంగాణ సంపద ఫలాలు చేరాయి. అందుకే అన్నిశక్తులూ ఎన్ని కుట్రలుచేసినా, ఎన్ని వందలకోట్లు కుమ్మరించినా, టీఆర్‌ఎస్ అభ్యర్థులు నాలుగింట మూడొంతుల స్థానాలు గెల్చుకున్నారు. ఈ విజయానికి కర్త కర్మ క్రియ కేసీఆర్.

మొన్న ఒక మిత్రుడు కేసీఆర్ స్థానంలో చంద్రబాబో మరొకరో ఉండి ఉంటే వారి మీడియా ఏమిచేసి ఉండేది? ఎంత ఆకాశానికి ఎత్తి ఉండేది? ఏ మహాత్ముడినో చేసి కూర్చోబెట్టేది. కేసీఆర్ సృష్టికర్త. కేసీఆర్ సాధకుడు. కేసీఆర్ స్వయం చోదకుడు. చంద్రబాబు అనుకర్త. కబ్జాదారు. స్వయం ప్రకాశంలేని నేత. ఎవరో ఒకరితో జట్టులేకుండా అడుగువేయలేని నేత. అయినా వారి మీడియాకు ఆయన బంగారంలాగా కనిపిస్తారు. కేసీఆర్ నియంతలాగా, అహంభావిలాగా కనిపిస్తారు. ఈ దృష్టిలోపం ఎప్పటికీ పోదా? వాళ్లు మారరా అని ప్రశ్నించాడు. కేసీఆర్ ఎవరి దయపైనా ఆధారపడలేదు. వారంతా తెలంగాణ ఉద్యమంపై తలా ఓ పోటుపొడుస్తున్నకాలంలో కూడా ఆయన వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు అవన్నీ పట్టించుకునే అవసరం లేదు.

కట్టా శేఖర్‌రెడ్డి గారు న‌మ‌స్తే తెలంగాణ ఎడిట‌ర్

https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/cm-kcr-is-a-god-for-me-says-telangana-people-1-2-590626.html

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.