Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అబద్ధాల మోదీ

-ప్రధాని నరేంద్రమోదీకి చాలెంజ్ చేస్తున్న..రాష్ట్రంలో కరంటు సమస్యపై చర్చిద్దామా?
-ప్రధానిస్థాయిలో ఝూఠాబాత్ మాట్లాడతరా?
-నరేంద్రమోదీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్
-దేశంలో వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
-మీరు అధికారంలో ఉన్న 18 రాష్ర్టాల్లో ఇస్తున్నరా?
-కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యానని మోదీ..మోదీతో కుమ్మక్కయ్యానని కాంగ్రెస్ అంటున్నరు
-నేనెవరితోనూ కలువలేదు.. ప్రజలతోనే ఉన్న
-ఎవరికీ గులాములం కాదు.. ప్రజలే మా హైకమాండ్
-నల్లా నీళ్లల్లో ప్రతి రోజూ కేసీఆర్ మీ ఇంటికొస్తున్నడు
-ప్రజలు.. ప్రజల అభీష్టం గెలువాలి
-సమైక్య పాలనలో కల్వకుర్తికి కన్నీళ్లే
-కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ రావాలి
-టీఆర్‌ఎస్, మజ్లిస్ పక్కాలోకల్
-ప్రజాఆశీర్వాదసభల్లో సీఎం కేసీఆర్‌అబద్ధాల మోదీ
-తెలంగాణ గురించి అతిపెద్ద అబద్ధం చెప్పావు.. ఇంత తెలివితక్కువ ప్రధాని అనుకోలేదు

తెలంగాణలో కరంటు సమస్యపై చర్చించేందుకు సిద్ధమా? అని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సవాలు విసిరారు. ఓట్లకోసం ఝూఠా మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధాని తెలంగాణ గురించి అతిపెద్ద అబద్ధం చెప్పారని, ఆయన ఇంత తెలివితక్కువ ప్రధాని అనుకోలేదని అన్నారు. ప్రధానిస్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. మోదీతో కుమ్మక్కయ్యానని కాంగ్రెస్‌వాళ్లు, కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యానని మోదీ మాట్లాడుతున్నారన్న సీఎం.. తాను ఎవరితోనూ కలువలేదని, కుమ్మక్కయ్యే ఖర్మలేదని చెప్పారు. తాను తెలంగాణ ప్రజల వెంట ఉన్నానని, భవిష్యత్తులో కూడా ఉంటానని తేల్చి చెప్పారు. తమ హైకమాండ్ ఢిల్లీలోనో, విజయవాడలోనో లేదన్న సీఎం.. తాము ఎవరికీ గులాములం కాదని స్పష్టంచేశారు. ప్రజలే తమ హైకమాండ్ అని చెప్పారు. బక్క కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఏకమై దాడిచేస్తున్నాయని, అయినా తనవెంట తెలంగాణ ప్రజలు ఉన్నారని, వారే తనను కాపాడుకుంటారని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తంచేశారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. నల్లా నీళ్లల్లో ప్రతిరోజూ కేసీఆర్ మీ ఇంటికొస్తున్నడని చెప్పారు. మంచి గెలిస్తే మంచి జరుగుతుందని అన్నారు.

ప్రజలు పరిపక్వతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంగళవారం కల్వకుర్తి, మహబూబ్‌నగర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగార్జునసాగర్, మునుగోడు, ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించి నిర్వహించిన ప్రజాఆశీర్వాదసభల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇవ్వాల నరేంద్రమోదీ ఓ.. ఇంతింత మాట్లాడుతుండు! సోనియాగాంధీ.. రాహుల్‌గాంధీ.. ఇంకెవడో మాట్లాడుతడు. ఇండియా మొత్తంలో 24 గంటలు ఉచితంగా రైతులకు కరంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప ఇంకేదన్న ఉందా? ఇయ్యాల 18 రాష్ర్టాల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. నేను నరేంద్రమోదీని అడుగుతున్న.. ఒక్క రాష్ట్రంలనన్న ఉచితంగా కరంటు ఇస్తున్నరా? పక్కనున్న మహారాష్ట్రల ఇస్తున్నరా? కర్ణాటకల ఇస్తున్నరా? ఇయ్యరు. చార్జీకట్టి ఇన్ని గంటలు వాడుకోవాలె.. అది దాటితే డబుల్ చార్జి, ట్రిపుల్ చార్జి! ఎన్ని హెచ్‌పీలు కాల్చుకున్నా రైతాంగానికి ఉచితంగా కరంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఉచిత కరంటుకు ఐదారువేల కోట్లు ఖర్చు అయితున్నయి.. కావాలె. ఎవరికో పెట్టడం లేదు.. మన రైతులకు ఖర్చు పెట్టుకుంటున్నం అని చెప్పారు. వివిధ అంశాలపై ఆయన ఏమన్నారో.. ఆయన మాటల్లోనే..

మిస్టర్ మోదీ నా చాలెంజ్‌కు సిద్ధమా?
ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ నిజామాబాద్‌కు వచ్చిండట! ఆయనకు కండ్లు ఉన్నయోలేవో? ఎవరు రాసిచ్చిండ్రో.. ఏం సదివిండో! ఇంత తెలివితక్కువ ప్రధానమంత్రి అనుకోలే. నిజామాబాద్‌ను అభివృద్ధిచేసిన అని కేసీఆర్ అంటున్నడు.. నిజామాబాద్‌లో ప్రజలు కరంటుకు, మంచినీళ్లకు కూడా ఇబ్బందిపడుతున్నరు అని అన్నడట. మోదీని చాలెంజ్ చేస్తున్న.. నువ్వురమ్మంటే హెలికాప్టర్ ఎక్కి మహబూబ్‌నగర్ నుంచి నిజామాబాద్‌కే వస్త. నువ్వుకూడా రా! ఇద్దరం కలిసి సభపెట్టి.. కరంటుకు ఇబ్బంది పడుతున్నరా? అని ప్రజలను అడుగుదం. ఆప్‌కో జవాబ్‌దేనా చాహియే మోదీ సాబ్. ఇతనా ఝూఠ్ నహీ బోల్‌సక్తే ఆప్.. ఆప్ భారత్‌కే వజీరే ఆజమ్ హై. ఇతనా గంధా బాత్ కైసే బోల్‌సక్తే ఆప్? ఝూఠాబాత్ కైసే బోల్‌సక్తే? ఏ బడా సోచ్‌నేకీ బాత్‌హై! నిజామాబాద్‌లో తెలంగాణ గురించి అతి పెద్ద అబద్ధం చెప్పావు. తెలంగాణలో కరంటు తక్కువ ఉందని ఆరోపణచేశావు. తెలంగాణ విద్యుత్ వినియోగంలో ఉన్నతస్థానంలో ఉన్నదని భారత సర్కారులో భాగమైన ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పింది. ఎలాంటి కొరత లేదని స్పష్టంచేసింది.

నేను మధ్యలోనే పాలనను ముగించానట! ఎందుకు ముగిస్తడు కేసీఆర్? అధికారం అనుభవించడం ఇష్టంలేకనా? ఇవాళ ప్రధానిస్థాయిలో ఉన్న వ్యక్తి తెలంగాణ బాధలో ఉన్నదని అబద్ధమాడే ప్రచారం అంటే ఎంతగోల్‌మాల్ ఉంటదండి? ప్రధాని గింత అల్పంగా.. గింత తప్పుడు మాట మాట్లాడొచ్చునా? అంత దరిద్రపుగొట్టు రాజకీయం ఉంది. మీరు రేపు పేపర్లల్ల ఆయన చెప్పింది చూస్తరు.. నేను చెప్పింది చూస్తరు. అన్నీ చూడాలే. వాళ్ల అధ్యక్షుడు కూడా గతంలో ఓసారి వచ్చి గిట్లనే అడ్డంపొడుగు మాట్లాడిండు. నువ్వు రుజువు చెయ్యి.. నేను సీఎం పదవికి రాజీనామా చేస్త.. లేదంటే నువ్వు క్షమాపణ చెప్పి, ఆబిడ్స్‌కాడ ముక్కు నేలకురాయాలి అని చెప్పిన. ఈ రోజు కూడా నేను మోదీని చాలెంజ్ చేస్తున్న.. మిస్టర్ మోదీ దేరీజ్ నో పవర్ ప్రాబ్లం ఇన్ తెలంగాణ. డోంట్ లై, బట్ ఫర్‌ద సేక్ ఆఫ్ ఓట్స్.. ఐయామ్ వెరీ సారీ టు సే దిస్.. బికాజ్ యూవార్ ఏ రెస్పాన్సిబుల్ ప్రైం మినిస్టర్ ఆఫ్‌ద కంట్రీ. యూ కెనాట్ అలేజ్ ఫాల్స్ అలిగేషన్స్ ఎగనెస్ట్ టు ఏ చీఫ్ మినిస్టర్ ఇన్ దిస్ కంట్రీ, ఐయామ్ సారీ టు సే దిస్. ఆయనకు పోవాలనే నేను హిందీలో, ఇంగ్లిష్‌లో చెప్తున్న. నేను ఎవరికీ భయపడను. నేనేమైనా చంద్రబాబునా భయపడటానికి? నాదంతా తెరిచిన పుస్తకమే.

కేంద్రంలో మతగజ్జి గవర్నమెంట్
అనేక ఉద్యమాల అనంతరం ఆంధ్ర నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. ఆ కారణంగా మన ప్రాంతంలో గిరిజనుల సంఖ్య పెరిగింది. న్యాయం ప్రకారం రిజర్వేషన్లలో మన హక్కు రావాలి. ముస్లింల జనాభా ఉమ్మడి ఏపీలో ఆరు శాతం ఉంటే.. ఇప్పుడు 12నుంచి 13శాతానికి చేరుకున్నం. రిజర్వేషన్లు పెంచాలని క్యాబినెట్లో, అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపినం. అక్కడున్నదేమో మత గజ్జి ఉన్న గవర్నమెంట్. ఇప్పటివరకు మన ప్రతిపాదనను ఆమోదించలేదు. అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి ఇదే మోదీని మన సమస్యలను పరిష్కరించాలని అడిగిన. ఒక్కటైనా పరిష్కరించిండా? మా గిరిజనుల సంఖ్య పెరిగింది.. మరి రిజర్వేషన్లు పెరగాలంటున్నం. నీ ముల్లేం పోతుంది? నువ్వు ఇయ్యకుంటే.. మేమిచ్చుకుంటం. నీకేం అభ్యంతరం? ముందు తెలంగాణ గిరిజనులకు సమాధానం చెప్పు.. గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు ఎందుకు ఆపినవు? ఎందుకోసం పెంచలేదు? ఒక రాష్ట్రం అడిగితే ఎందుకు గౌరవించలేదు? ఇంకా ఉన్నడేమో మోదీ! ఉంటే జవాబు చెప్పే తెలంగాణ నుంచి పోవాలి. పెద్దపెద్ద మాటలు మాట్లాడుడు కాదు. వాస్తవాలు మాట్లాడాలి. అది చెయ్యరు.

నేను పూజ చేసుకుంటే నీకేం బాధ?
మోదీ అంటడు.. కేసీఆర్‌కు పూజలమీద, యాగం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదంట! అరె.. నేను పూజ చేసుకుంటే నీ ముల్లేంబాయర బై నాకర్థం కాదు! నేను ఏడాదికి పదిమాట్ల యాగం చేసుకుంటే నీ ముల్లేమైన పాయనా? నీకు ఏమన్న ఇబ్బంది పెడితినా? ఇష్టముండి ఎవడన్న వస్తే బుక్కెడు అన్నం పెడుతున్నం.. తీర్థం పెడుతున్నం.. నీకు భక్తి ఉంటె నీవు కూడ రా.. దండం పెట్టుకో.. ఇంత తీర్థం తీసుకొని పో.. వద్దంటున్నమా! నాకు భక్తి ఉంది.. నేను దేవున్ని నమ్ముత. నీకేం బాధ?

చంద్రబాబూ.. కరంటు ఏడపెట్టినవు?
కాంగ్రెస్‌లో అందరూ మేధావులు, ఘనాపాటీలే. చంద్రబాబు అయితే చెప్పేపనే లేదు. హైదరాబాదే నేను కట్టినా.. హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో పెట్టినా అంటడు. ఏ పటంలో పెట్టినవోగానీ.. కరంటు యాడ పెట్టినవు? సీఎంగా ఉన్నప్పుడు కరంటు ఎందుకు ఇయ్యలే? నీ మేధావితనం, కాంగ్రెస్ మేధావితనం ఎక్కడపాయె? సమైక్య ఏపీ చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. తెలంగాణ అయితే కరంటురాదని కర్రపెట్టి చూపిచ్చిండు. కానీ ఈ రోజు దక్షిణభారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగంలో జాతీయ సగటును మించిన రాష్ట్రం తెలంగాణ.

ఉద్యోగుల పదవీవిరమణ వయసు పెంచబోతున్నం..
నేను ఈ రోజు ప్రకటిస్తున్న.. ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి పెంచబోతున్నం. ఐఆర్‌కూడా మంచిగ ఇస్తం. పీఆర్సీ కూడా ఇస్తం. దాంట్లో ఎవరికీ అనుమానం అవసరం లేదు. పింఛన్ పొందే సోదరులకోసం ఒక డైరెక్టరేట్ ఏర్పాటుచేసి, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తం. త్వరలోనే మా నిర్ణయాలు ప్రకటిస్తం.

సంపూర్ణ ఆరోగ్యమే మా లక్ష్యం
కంటివెలుగు కింద ప్రజలకు కంటిపరీక్షలు చేయించి, మందులు ఇచ్చి, ఆపరేషన్లు కూడా చేయిస్తున్నం. దేశంలో ఒక్క తెలంగాణలోనే ఇవన్నీ అందుతున్నయి. రాబోయే రోజుల్లో చెవి, ముక్కు, గొంతుకు ఉండే వ్యాధులకు వైద్యులు గ్రామాలకు వచ్చి చూస్తరు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి రక్తం గ్రూపు సేకరించి, తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రెడీ చేస్తరు. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణగా తయారుకావాలి. అది నా కల.

దేశంలో ఆ ఇద్దరు దరిద్రులు పోవాలి
-కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ రావాలి.. దేశంలో 70 ఏండ్లు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పాలించాయి. మరి ఎట్ల ఉన్నది భారతదేశం ఇయ్యాల? దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లున్నయి. భగవంతుడు, ప్రకృతి ఇచ్చింది. వీళ్ల తెలివికి 30 వేల టీంఎసీలు కూడ వాడలేదు. అవి సముద్రానికి పోతున్నయి. ఏటా అనేక రాష్ర్టాలు కరువుతో అల్లాడుతున్నయి. మన పక్కన ఉన్న చైనా 25 ఏండ్ల కింద మనకన్న వెనుకబడి ఉండె. ఇవ్వాల మనకన్న వెయ్యిరెట్లు ముందుకెళ్లింది.. మనం ఇక్కడనే ఉన్నం! మనకున్నంత వ్యవసాయభూమి వాళ్లకు లేదు.. దేశం మనకంటే, రెండుమూడింతలు ఉంటది. కానీ అన్నీ పర్వతాలు, కొండలు, గుట్టలు, ఎడారి. కానీ ఇవ్వాల ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికశక్తిగా అమెరికా తరువాత స్థానం సంపాదించింది. మరి ఏమాయె మీ మేధావితనం? మీ బీజేపీ, మీ ఎన్డీఏ, కాంగ్రెస్, తోక తొండెం? ఏమొచ్చె ఈ దేశానికి? అందుకే నేను ప్రతిపాదిస్తావున్నా. ఈ దేశంలో ఇద్దరు దరిద్రులు పోవాలె. ఈరోజు మళ్లీ చెప్తున్న.. ఇప్పుడున్న రెండు పార్టీలు పోవాలి. ఫెడరల్‌ఫ్రంట్ రావాలి. వస్తుంది. దానికి అంకురార్పణ జరిగింది. ఈ ఇద్దరు పోయి కచ్చితంగా రాష్ర్టాల పవర్‌తో ఫెడరల్‌ఫ్రంట్ గవర్నమెంట్ వస్తేనే ఈ రోగాలన్నీ బంద్ అయితయి. ఎంత దుర్మార్గమంటే.. ఆ కాంగ్రెసోడు నేను బీజేపీతో కుమ్మక్కు అయిన అంటడు. ఇవ్వాల మోదీ వచ్చి నేను కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయిన అని చెప్తడు.

ఇప్పుడు నేను ఎవ్వరితో కుమ్మక్కు అయినట్లు? వాడూవీడూ నన్నే అనబట్టే. నాకే సమజైతలే. నమ్మకంలేక, విశ్వాసంలేక ఇప్పుడెవడెవడో పొత్తులు కట్టిండ్రు! 2014లో మేం ఎవ్వనితోని పొత్తు కలువలే. ఎన్నికల ముచ్చటలో సాఫ్‌సీదా ఉండాలని ఈరోజు కూడ ఎవ్వనితోని పొత్తు కలువలే. ఈ రాష్ట్రంలో 119 స్థానాల్లో పోటీచేస్తున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్. ఎన్నికలు వస్తుంటయి.. పోతుంటయి. పార్టీలు, అభ్యర్థులు గెలువడం ముఖ్యం కాదు. ప్రజలు గెలువాలి. ప్రజల అభీష్టం గెలువాలి. అట్ల జరిగినప్పుడు ప్రజల ఎజెండా, ప్రజా అవసరాల ప్రకారం ప్రభుత్వాలు పనిచేస్తయి. మన దేశంలో ఇంకా పరిపక్వత రాలేదు. రావాల్సిన అవసరం ఉంది. మాకు ప్రజల మీద నమ్మకం ఉంది. మీరు మమ్మల్ని కాపాడతరనే విశ్వాసం ఉంది. అందుకనే ఒంటరిగ పోటీచేస్తున్నం. కచ్చితంగా వంద పైచిలుకు స్థానాలతోటి టీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తది. దాన్ని ఎవడూ ఆపే పరిస్థితి లేదు. నిన్న మొన్న వచ్చిన కొత్త సర్వేలో టీఆర్‌ఎస్ 103 నుంచి 105 సీట్ల మధ్య గెలుస్తుందని తేలింది. తర్వాత 17 ఎంపీ స్థానాలు కూడా మనమే గెలువాలి. ఎందుకంటే.. కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వమే కేంద్రంల రావాలె. కాంగ్రెస్, బీజేపీలకు ఏలి.. ఏలి.. కండ్లకు చాలా మబ్బులు వచ్చినయి. రెండు పార్టీలు అధికారంతోటి మదం ఎక్కి ఉన్నయి. ఆ రెండింటినీ దెబ్బకొట్టి, ప్రజల అవసరాలు తీర్చే, ప్రజల ఎమోషన్స్ గుర్తించే, ప్రజల వెంట పోయే, ప్రజా ఎజెండా అమలుచేసే కేంద్రప్రభుత్వం రావాలి. దాంట్ల మనం కీలక పాత్ర పోషించాలి. మన హక్కులు మనం సాధించుకోవాలి. దానికోసం నేను శ్రీకారం చుట్టిన. పది రాష్ర్టాల నాయకులతో మాట్లాడిన. నాకు ఆషామాషీ రాజకీయాలు రావు. ఏదన్న చేస్తే మొండిగ చేస్తనని మీకు తెలుసు. నేను ఎవనికి భయపడ.. భయపడే అవసరం లేదు.

గొల్లకురుమల సంపద రూ.1500 కోట్లు
రోజుకు 650 లారీల గొర్రెలు దిగుమతి చేసుకుంటున్న పరిస్థితిలో ప్రభుత్వం రాష్ట్రంలోని గొల్లకురుమలకు 70 లక్షల గొర్రెలు పంచితే వాటికి 40 లక్షల పిల్లలు పుట్టాయి. వారు ఇప్పటికి రూ.1500 కోట్ల సంపద సృష్టించారు. గత ప్రభుత్వాల్లో చేనేత కార్మికులు చచ్చిపోతే ఎవరూ మాట్లాడలే. ఆత్మహత్యలు పరంపరగా కొనసాగేవి. ఈరోజు ఆత్మహత్యలు లేవు. నేత, చేనేతను అక్కున చేర్చుకున్నం. వాళ్లకు యాభై శాతం సబ్సిడీకే నూలు, రసాయనాలు ఇస్తున్నం. బడిపిల్లల యూనిఫాంల ఆర్డర్లు వారికే ఇచ్చినం. బతుకమ్మ చీరలన్నీ పవర్‌లూమ్‌లకు ఇస్తున్నం. వారునేసిన బట్టలన్నీ ప్రభుత్వమే కొంటున్నది. చేపలు పట్టుకుని బతికే బెస్త, ముదిరాజ్, గంగపుత్ర సోదరులకోసం వెయ్యికోట్లను కేటాయించాం. ప్రతి సంవత్సరం వంద, వందయాభై కోట్ల చేపపిల్లలను చెరువులలో వదిలిపెడుతున్నం. సమైక్యరాష్ట్రంలో ప్రతి పనికీ లంచమివ్వాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు లంచాలు పెట్టుడు తీరిపోయింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా సంక్షేమం చేసుకుంటున్నం. పెన్షన్లు చూస్తున్నరు. కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, బియ్యం, రెసిడెన్షియల్ స్కూళ్లు, మైనార్టీ వెల్ఫేర్.. ఇట్ల అనేకం చేస్తున్నం. ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తుండటంతో వాళ్ల సోదరులు నాకు ఫోన్‌చేసి.. తమ అక్క, చెల్లిని ఆదుకుంటున్నారంటూ చేతులెత్తి దండం పెడుతున్నరు. ఈరోజు మహిళల కోసం కావచ్చు, ప్రసూతికి పోయే స్త్రీలు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు కావచ్చు.. అనేక పథకాలు అమలుచేసుకుంటున్నం. ఈరోజు చంద్రబాబు మన పథకాలు కాపీ కొడుతుండు. ఆయన మేధావి అంటడు. మన వెనుకబడి వస్తడు.. మన స్కీమ్‌లు కాపీ కొడతడు.

నన్ను కాపాడేది ప్రజలే
నన్ను కాపాడేదే ప్రజలు. ఇయ్యాల ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఎంతమంది మోపైండ్రనుకున్నరు? ప్రధాని నరేంద్రమోదీ బయలెల్లిండు. ఇక సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సీపీఐ, సీపీఎం.. ఇది చాలదన్నట్టు వాళ్ల సోపతికి చంద్రబాబు టీడీపీ! గింతమందా.. ఒక్క కేసీఆర్‌ను కొట్టడానికి? వీళ్లందరు ఎందుకు నాయంట బడుతున్నరండీ? మనం మొండిగ ఉంటం కాబట్టి, ముక్కుమీద గుద్దినట్టు మాట్లాడుతం కాబట్టి, ఉన్నదున్నట్లు నిజాయితీగా మాట్లాడుతం కాబట్టి! నేను ప్రతిసభలో స్పష్టంగా చెప్తున్న.. దయచేసి ఆలోచనచేయలె.

టీఆర్‌ఎస్, మజ్లిస్ పక్కాలోకల్
మేము, మజ్లిస్ మిత్రపక్షం. మేం పక్కాలోకల్, కల్తీలేని పక్కా తెలంగాణ పార్టీలం. అన్ని మతాలు, అంతా కలిసిమెలిసి గొప్పగా బతుకాలని కోరుకున్నం. 2014లో తెలంగాణ ఏర్పడి టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినవెంటనే చంద్రబాబు, నరేంద్రమోదీ కుట్రలు మొదలుపెట్టిండ్రు. టీఆర్‌ఎస్ గవర్నమెంట్‌ను దించేయాలి.. తెలంగాణను అస్థిరం చేయాలి. రాష్ట్రపతి పరిపాలన చేయాలి.. మన గుప్పిట్ల పెట్టుకోవాలి అని కుట్రజేసిండ్రు. దీనిపై మొట్టమొదట నాకు చెప్పిన వ్యక్తి అసదుద్దీన్‌ఒవైసీ. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దింపాలని ఢిల్లీలో చర్చ జరుగుతున్నది. తెలంగాణ ఏర్పడదని ఇప్పటిదాక అనుకున్నం. దేవుడిదయతో తెలంగాణ ఏర్పడింది. ఏర్పడిన తెలంగాణను బతుకనివ్వరా? ఇప్పటిదాకా తెలంగాణకోసం మీరొక్కరే కొట్లాడిండ్రు. ఇకపైన మేంకూడా మీతో కలుస్తం. కలిసి కొట్లాడదం అని చెప్పిండ్రు. తర్వాతి రోజు వాళ్ల పార్టీ కార్యాలయంలో నిర్ణయం తీసుకున్నరు. టీఆర్‌ఎస్ వెంట ఉన్నమని ప్రకటించడంతో కుట్రలు తగ్గినయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతివర్గం, ప్రతివ్యక్తి సంక్షేమంకోసం కృషిచేస్తుంది. ఇకపైనా అదే కొనసాగిస్తది. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ముస్లిం విద్యార్థులు బాగా చదువుకుంటున్నరు. ఆ పిల్లలంతా ఉన్నతవిద్యావంతులైతే ముస్లిం కుటుంబాల్లో విప్లవాత్మక మార్పులు వస్తయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.