Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అబ్బురపరిచే పాలన

-అబ్బురపరిచే పాలన -అనుమానాల నీలినీడల నుంచి బయటపడ్డాం -33 నెలల కార్యక్రమాలతో దేశ విదేశాల్లో పెరిగిన బ్రాండ్‌ఇమేజ్ -దేశంలో నంబర్ వన్ స్థానం సాధించాం.. పారిశ్రామిక విధానంతో ప్రపంచాన్ని ఆకర్షించాం

అసెంబ్లీలో పద్దులపై చర్చలో మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం మనుగడ సాగిస్తుందా? ఆర్థికంగా నిలదొక్కుకుంటుందా? వీరికి పాలన చేతనవుతుందా? భవిష్యత్తు ఉంటుందా? వంటి అనేక అనుమానాల.. అపనిందల నీలినీడలను చెల్లాచెదురు చేసి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత పురోగామి రాష్ట్రంగా, అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. పారిశ్రామికరంగ జాబితాలో 13వ స్థానంలో ఉన్న రాష్ర్టాన్ని ఒకటో స్థానానికి తీసుకువచ్చామని, సులభ వాణిజ్య విధానంలో నంబర్ వన్ ర్యాంకు సాధించామని చెప్పారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దార్శనికత, సమర్థత, టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర ప్రగతిపై తమకున్న చిత్త శుద్ధితో దేశం అబ్బురపడే రీతిలో ప్రగతిపథంలో సాగుతున్నామని అన్నారు. గురువారం రాష్ట్ర శాసనసభలో పరిశ్రమల శాఖ పద్దులపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. సింగిల్ విండో ద్వారా 15రోజుల్లో అనుమతులనిచ్చే టీఎస్ ఐపాస్ నుంచి దళిత, మహిళా పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, త్వరలో ఏర్పాటు చేయనున్న వివిధ పారిశ్రామిక పార్కుల వివరాలను సభకు తెలియజేశారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇస్తున్నామని, ఖాయిలాపరిశ్రమలు తెరిపించేందుకు నిధిని ఏర్పాటు చేశామని, రామగుండం ఫర్టిలైజర్స్‌ను తెరిపించిన రీతిలోనే మూతపడ్డ పరిశ్రమలను కూడా తెరిపిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

పెరిగిన బ్రాండ్ ఇమేజ్… గత 33 నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల దేశవిదేశాల్లో తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని కేటీఆర్ చెప్పారు. టీఎస్‌ఐపాస్ ద్వారా వినూత్నమైన స్వీయధ్రువీకరణ పద్ధతి తెచ్చి 15 రోజుల్లో సింగిల్ విండో ద్వారా కొత్త పరిశ్రమలకు అన్ని అనుమతులు ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నామన్నారు. తెలంగాణలో ఒక్క నయాపైసా లంచం లేకుండా అనుమతులు పొంది ఆరునెలల్లో ఉత్పత్తి ప్రారంభించుకున్నామని, ఇదే ఉత్తరాఖండ్‌లో ప్యా క్టరీ ప్రారంభానికే రెండున్నర ఏండ్లు పట్టిందని మైక్రోమ్యాక్స్ కంపెనీ సీఈవో రాష్ట్ర ప్రభుత్వపనితీరును ప్రశంసించారని మంత్రి సభకు తెలిపారు. ఈ ఏడాది జూన్ 2 నుంచి పరిశ్రమలకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డులు ఇవ్వబోతున్నామని మంత్రి ప్రకటించారు.

అన్ని వర్గాలకూ పెద్దపీట.. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తల కోసం టీ-ప్రైడ్, జనరల్ క్యాటగిరి కోసం టీ-ఐడియా కార్యక్రమాలు తీసుకువచ్చి ప్రభుత్వం అన్ని వర్గాల పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మైనారిటీ పారిశ్రామికవేత్తల కోసం టీ-ప్రైమ్ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, పారిశ్రామిక రంగంలో వారికి ఇతోధిక సహకారం అందించబోతున్నామని కేటీఆర్ తెలిపారు. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నందిగామ, తూప్రాన్, సుల్తాన్‌పూర్‌లలో మహిళా పారిశ్రామికవేత్తలకు మూడు ఇండస్ట్రియల్ పార్క్‌ల కోసం స్థలాన్ని అందజేశామన్నారు. ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చిన తర్వాత ఇంకా అనేక విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి ధృఢవిశ్వాసం వ్యక్తం చేశారు.

రానున్న పారిశ్రామిక పార్కులు.. చౌటుప్పల్ మండలం దండుమైలారం వద్ద టీఐఎఫ్-ఎస్‌ఎంఈ ఆధ్వర్యంలో గ్రీన్ పార్క్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు. గ్రామీణ పారిశ్రామిక విధానం కింద ఐటీ పారిశ్రామిక రంగాన్ని గ్రామాలకు కూడా విస్తరింపజేస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్ వద్ద ఏర్పాటు చేసే ఐటీ పార్క్‌తో లక్ష మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ముచ్చెర్లలో 5,800 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో లక్ష మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గం బుగ్గపహాడ్‌లో, సుల్తాన్‌పూర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఫుడ్‌పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని, బాల్కొండలో స్పైస్ పార్క్, రంగారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ పార్క్, రామగుండం, మిర్యాలగూడల్లో ఆటో పార్క్‌లు, మానకొండూరులో గ్రానైట్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. చేనేతరంగానికి రూ.1200 కోట్లు కేటాయించామని చెప్పిన మంత్రి, వరంగల్ దశ తిరిగే రీతిలో టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

పరిశ్రమలకు క్లీనిక్.. దేశంలో మరెక్కడా లేని విధంగా ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ పేరిట కొత్త సంస్థను రూ.100 కోట్ల నిధితో ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఖాయిలా పడుతున్న పరిశ్రమలకు ఈ నిధి ద్వారా సహకారం అందచేస్తామని చెప్పారు. రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్)ను తెరిపించిన రీతిలోనే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), సిర్పూర్ పేపర్ మిల్లు, వరంగల్‌లో బిల్ట్ కంపెనీలను తెరిపించేందుకు తీవ్ర కృషి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని వెదజల్లే 1,140 పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తరలిస్తున్నామని చెప్పారు. పరిశ్రమల విషయంలో ప్రభుత్వం చాలా ఉత్సాహంతో ముందుకు పోతున్నదన్నారు. మన దేశంలోని పారిశ్రామిక రంగంలో 13వ స్థానంలో ఉన్న తెలంగాణ గత రెండున్నర ఏండ్లలో తాము తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన తీరుతో గుజరాత్‌ను పక్కన నెట్టి తొలి స్థానానికి ఎదిగిందన్నారు. నఖల్ మార్నే కే లియే అఖల్ చాహియే అనే ఉర్దూ సామెతను గుర్తు చేస్తూ పక్కనే ఉన్న ఏపీ సర్కార్‌కు సరిగా నకలు కూడా కొట్టడం రాలేదని, తమ కాపీని మక్కీకి మక్కీగా దించి సులభవాణిజ్య విధానంలో తొలి స్థానం సాధించినట్టు ఏపీ కూడా ప్రకటించుకున్నదన్నారు.

అవినీతి గురించి మీరా చెప్పేది? ఇసుక, మైనింగ్ ఆదాయాలను దోచుకున్నారు.. కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఫైర్ గణాంకాలతోసహా సభకు వివరించిన మంత్రి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, మైనింగ్ ఆదాయాలు భారీగా పెరిగాయని ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక ఆదాయం కేవలం రూ.10.88 కోట్లు ఉంటే తమ హయాంలో రూ.436 కోట్లు దాటిందని వివరించారు. ఇసుక, మైనింగ్ ఆదాయాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు దళారులు, కాంట్రాక్టర్లు, పార్టీ నేతలకు దోచి పెట్టారని ఎండగట్టారు. అంతకుముందు కాంగ్రెస్ సభ్యులు చేసిన అవినీతి ఆరోపణలను కేటీఆర్ గణాంకాలతో సహా తిప్పి కొట్టారు. మీరా అవినీతి గురించి మాట్లాడేది? మీ పాలనలో ఇసుకలో ఏం జరిగిందో తెలియదా? ఒక్క ఇసుకలోనే కాదు, మైనింగ్‌లో సైతం మీ హయాంలో సర్కార్ ఖజానాకు గండికొట్టారు. దళారులకు పార్టీ నేతలకు దోచిపెట్టారు అని ధ్వజమెత్తారు. శాసనసభలో గురువారం పద్దులపై చర్చలో భాగంగా మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామికరంగాల్లో సాధించిన అభివృద్ధి, మైనింగ్ ద్వారా పెరిగిన ఆదాయ వివరాలను సభ ముందుంచారు. ఈ దశలో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన కాంగ్రెస్ సభ్యులు కొందరు మంత్రి వివరణపై అవహేళనగా కామెంట్లు చేయడంతో మంత్రి కాంగ్రెస్ హయాంలో జరిగిన వ్యవహారాన్ని గణాంకాలతో సహా సభ ముందు పెట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల లెక్కలు చదువుతూ ఇసుక ఆదాయం ఏటేటా ఎలా పడిపోతూ వచ్చిందో ఆర్థిక సంవత్సరం వారీగా గణాంకాలను చదివి వినిపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చివరి సంవత్సరం 2013-14 లో ఉమ్మడి రాష్ట్రంలో ఇసుక ద్వారా రూ.10.88 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2015-16లో రూ.375 కోట్లు, 2016-17 లో(ఇప్పటి వరకు) రూ.436 కోట్లు ఆదాయం వచ్చిందని, ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మరో రూ.50 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరించారు. కాంగ్రెస్ హయాంలో దళారులు, కాంట్రాక్టర్లు, పార్టీ నేతలకు దోచి పెట్టారని ఎండగట్టారు. ఇసుకలో ఏం జరిగిందో అందరికీ తెలియదా? అని నిలదీశారు. అయినా కాంగ్రెస్ సభ్యులు నినాదాలిస్తూ కేటీఆర్ ప్రసంగానికి అడ్డు తగిలే ప్రయత్నం చేయగా ఇంకా ఉంది.. ఒక్క ఇసుకలోనే కాదు.. మైనింగ్‌లో కూడా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు అని వివరించారు. మైనింగ్‌లో కాంగ్రెస్ హయాంలో కేవలం రూ.1780 కోట్ల ఆదాయం వస్తే తమ హయాంలో 2016-17లో రూ.3000 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇంకా రూ.1100 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు. నేను చెప్తున్నది తప్పయితే నా ప్రసంగం తర్వాత మైకు తీసుకుని మాట్లాడండి అని కాంగ్రెస్ సభ్యులకు సవాలు విసిరారు.

దేశానికి మంచిదని మద్దతిచ్చాం.. చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు టీఆర్‌ఎస్ ఎన్డీఏకు మద్దతు పలుకుతున్నదని, పెద్దనోట్ల రద్దు విషయంలో గట్టిగా బలపరిచిందని వ్యాఖ్యానించారు. దీనికి బదులిచ్చిన కేటీఆర్ మేం ఎన్డీఏలో లేము. అయితే పెద్దనోట్ల రద్దు వల్ల దేశానికి మంచి జరుగుతుంది.. కాబట్టి ఆ అంశంలో మద్దతు ఇచ్చాం అని వివరించారు. మీ కాంగ్రెస్ నాయకత్వం పెద్దనోట్ల రద్దు అంశాన్ని వ్యతిరేకిస్తూ జనావేదన సమ్మేళనాల పేరిట జనం ముందుకు వెళ్లింది కదా! మరి యూపీలో ఏమైంది ? అని ఎద్దేవా చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.