తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో 60 ఏండ్ల దారిద్రాన్ని ఆరేండ్లలో తీర్చామని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని అర్వపల్లి, తుంగుతుర్తి మండలకేంద్రాల్లో జరిగిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగు, తాగునీటి రంగంతోపాటు రైతుల సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిచ్చిందన్నారు. ఇకనుంచి రాబోయేది ఉద్యోగులు, నిరుద్యోగుల శకమని, ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.26 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో సుమారు 24 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన నాటి నుంచి ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు.
తన ఎమ్మెల్సీ పదవీకాలంలో ఇప్పటివరకు ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికే కృషి చేశానని తెలిపారు. గ్రామాల్లో కనిపించే అభివృద్ధిని చూసి వివేకవంతులైన పట్టభద్రులు ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్‌రావు, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, రైతుబంధు సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రజాక్, జడ్పీటీసీలు దావుల వీరప్రసాద్ యాదవ్, కందాల దామోదర్‌రెడ్డి, ఎంపీపీలు మన్నె రేణుక, గుండగాని కవితరాములుగౌడ్ తదితరులుపాల్గొన్నారు.