
-పేదల సంక్షేమానికే టీఆర్ఎస్ కట్టుబాటు -మోదీ మీటరే పడిపోతున్నది.. బీజేపీ అభ్యర్థులు ఎంత? -కూటమిలో 40 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు -గెలిస్తే నెలన్నరకో సీఎం.. అదీ సీల్డ్కవర్లోనే -కులం, మతం, ప్రాంతం పేరిట రాజకీయాలు చేసే -దిక్కుమాలిన పార్టీలను తిప్పికొట్టండి: మంత్రి కేటీఆర్ -ఖైరతాబాద్, గోషామహల్లో రోడ్‌షోకు జననీరాజనం
అభివృద్ధిని నమ్ముకొనే ముందుకుపోతున్నాం. 18 ఏండ్లు నిండినవారందరికీ ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం. అభివృద్ధి ఆగొద్దంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలి. దమ్మున్న నేత కేసీఆర్‌తోనే ప్రగతి సాధ్యం అని మంత్రి కే తారకరామారావు పునరుద్ఘాటించారు. మోదీ మీటర్ రోజురోజుకు పడిపోతున్నదని చెప్పారు. కర్ణాటక నుంచి హైదరాబాద్‌లో ఖైరతాబాద్, గోషామహల్ వరకు అదే పరిస్థితి ఉన్నదని.. ఇక్కడి బీజేపీ అభ్యర్థులు ఎంతని ఎద్దేవాచేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సోమవారం సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద మంత్రి కేటీఆర్ రోడ్‌షోను ప్రారంభించారు. తర్వాత గోషామహల్‌లోని జుమ్మెరాత్‌బజార్, గౌలిగూడ చమన్, ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని హిమాయత్‌నగర్ వై జంక్షన్, ఖైరతాబాద్, జహీరానగర్, ఫిలింనగర్ ప్రాంతాల్లో ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, భావిపౌరులకు బంగారు భవిష్యత్ అందించేందుకే నిరంతరం తపించామని చెప్పారు. బంజారాహిల్స్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాంనాథ్ కూతురుకు విదేశీ విద్యానిధి పథకం కింద రూ.20 లక్షల రుణం ఇచ్చి విదేశాల్లో చదివిస్తున్నామని, ఎవరిపైనా వివక్ష చూపలేదనడానికి ఇదే నిదర్శనమని వివరించారు. విద్య, వైద్యరంగాలను బాగుచేస్తామని, హైదరాబాద్‌లో వెయ్యి బస్తీ దవాఖానలను ఏర్పాటుచేయబోతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గుడిసెలు, రేకుల ఇండ్లల్లో నివసిస్తున్నవారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టివ్వడం, కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు 3,800 ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం, పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలించడంవంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. పేదలకోసం ఏం చేయడానికైనా సిద్ధమని, పనిచేసే ముఖ్యమంత్రినే గెలిపించాలని పిలుపునిచ్చారు.

మతతత్వవాదులకు బుద్ధిచెప్పాలి రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు ఎక్కడా గెలువరని, అలాంటి పార్టీతో తమకు దోస్తీ లేదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. మోదీతో అవగాహన ఉందని కాంగ్రెసోళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు బాసులు ఢిల్లీలో లేరని, గల్లీల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఇదివరకు ఖైరతాబాద్, గోషామహల్లో ప్రాతినిధ్యం వహించిన బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడం ఖాయమని చెప్పారు. ఇక్కడో మాజీ ఎమ్మెల్యే ఉన్నరు. ఆయనకు ఎప్పుడు హిందూ, ముస్లింలు పంచాయితీ పెట్టుకోవాలని ఉంటది. రెండు వర్గాలు కలిసుంటే చూడలేరు. తెల్లారిలేస్తే జగడాలు, పంచాయితీలు తప్ప, పనిచేసేది లేదు. లొల్లి పెట్టి పబ్బం గడుపుకుంటుండుఅని గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థిని కలుద్దామంటే దొరుకరని విమర్శించారు. కుల, మత పంచాయితీలను ప్రజలు కోరుకోవడం లేదని, కుట్రలు చేసే దుర్మార్గులకు, రాజకీయాలు చేస్తున్న పనికిమాలిన పార్టీలకు బుద్ధిచెప్పాలని కోరారు.
దమ్మున్న నాయకుడు కేసీఆర్ కేసీఆర్‌ను ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమవడంతోనే టీఆర్ఎస్ ఎంత బలంగా ఉన్నదో తెలుస్తున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ గెలిస్తే దమ్మున్న నాయకుడైన కేసీఆర్ సీఎం అవుతారని, పొరపాటున కూటమి గెలిస్తే ముఖ్యమంత్రులయ్యేందుకు 40 మంది సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 40 మంది పంచుకుంటే నెలన్నరకు ఒకరు ముఖ్యమంత్రి అవుతారని ఎద్దేవాచేశారు. ఆయన కూడా ఢిల్లీ నుంచి రావాల్సిందేనని, తెలంగాణ మట్టిలో పుట్టిన సింహంలాంటి సీఎం కావాలో, ఢిల్లీలో నిర్దేశించే సీల్డ్‌కవర్ సీఎం కావాలో తేల్చుకోవాలని కోరారు. రోడ్‌షోల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మెహన్, ఖైరతాబాద్, గోషామహల్ అభ్యర్థులు దానం నాగేందర్, ప్రేమ్‌సింగ్ రాథోడ్, ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా, నందకిశోర్‌వ్యాస్, ప్రేమ్‌సింగ్‌రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

నాలుగు సెకండ్లు కర్ఫ్యూ పెట్టలే నేను జన్మతః కరీంనగర్లో పుట్టినా, మీ నియోజకవర్గంలోనే చదువుకున్న. జహీరానగర్‌లో ఓటు హక్కు ఉంది. చిన్నప్పుడు చిరాగ్ అలీ లేన్‌లోని అబిడ్స్ గ్రామర్ స్కూల్లోనే స్కూలింగ్ పూర్తిచేశా. హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, రంజాన్ వస్తే రోజులకురోజులు కర్య్ఫూ విధించిన రోజులు గుర్తున్నయి. టీఆర్ఎస్ నాలుగేండ్ల పాలనలో నాలుగు సెంకైడ్లెనా కర్ఫ్యూ పెట్టలేదు. మిగతా పార్టీలకు మద్దతిస్తే రాజకీయాలు చేస్తరు. అభివృద్ధి కుంటుపడుద్ది. హైదరాబాద్ లొల్లులైతే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది. మొత్తం తెలంగాణ ఇబ్బందిపడే రోజులొస్తయి. తెలంగాణ ప్రయోజనాల కోసం మోదీ, రాహుల్, వారి జేజమ్మలైనా.. ఆఖరికి దేవుడు దిగొచ్చినా కొట్లాడుతం. ఎవ్వరితోనైనా ధైర్యంగా కొట్లాడే దమ్మున్న నాయకుడు కేసీఆరే. ప్రత్యర్థి పార్టీలు బూటకపు మాటలు చెప్పి ఏమార్చుతయి. ఆగం చేస్తరు. జాగ్రత్తగా ఉండాలి. మీరంతా అండగా ఉన్నారన్న ధైర్యంతో రాజీపడకుండా ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డాంఅని ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరిగిన రోడ్‌షోలో కేటీఆర్ వివరించారు.