-ఏది కావాలో మనం తేల్చుకోవాలి -అందరి హైదరాబాద్ కావాలా? కొందరి హైదరాబాద్ కావాలా? -ఎవరికి ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి -అభివృద్ధిపై మా మాటలు నిజమైతే ఆశీర్వదించండి.. లేదంటే శిక్షించండి -దేశంలోనే హైదరాబాద్‌ను అత్యంత సేఫ్ సిటీగా తీర్చిదిద్దాం -ఆరేండ్లలో ఏకంగా 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం -ప్రపంచ మేటి కంపెనీలకు హైదరాబాద్ ఇప్పుడు అడ్డా -ఎప్పుడూ నేనే చాలెంజ్ చేయాలా? వాళ్లు విసిరితే స్వీకరిస్తా -మజ్లిస్‌తో ఒప్పందం లేదు.. వారి ఇలాకాలోనే 10 గెలుస్తాం -వరదలపై సీఎం స్పందించనిదే రూ.550 కోట్లు వచ్చినయా? -మేం ఎవరికీ బీ టీం కాదు… తెలంగాణ ప్రజలకు ఏ టీం -టీఆర్ఎస్ది ఒంటరి పోరు.. బల్దియాపై గులాబీ జెండానే -మీట్ ది ప్రెస్‌లో మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు

హైదరాబాద్‌లో అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా?.. అందరి హైదరాబాద్ కావాలా? కొందరి హైదరాబాద్ కావాలా?.. ఎవరికి ఓటువేస్తే ఏం జరుగుతుందో హైదరాబాద్ ప్రజలు విజ్ఞత, వివేకంతో ఆలోచించాలని.. పనిచేసే పార్టీకి పట్టం కట్టాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. ఆరేండ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరంలో కొందరు అగ్గి రాజేయాలనుకొంటున్నారని, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. హైదరాబాద్‌ను కాపాడే బాధ్యత తమపై ఉన్నదని, మత విద్వేషాలను రెచ్చగొడితే ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.67 వేల కోట్లతో హైదరాబాద్‌ను సర్వతోముఖాభివృద్ధి చేశామని తెలిపారు.
ఇంకా ఎంతో చేస్తామన్నారు. నగర ప్రజల సుఖంలో, దుఃఖంలో టీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. గడచిన ఆరేండ్లలో ప్రజలపై ఒక్క పైసా అదనపు భారం మోపలేదని గుర్తుచేశారు. బల్దియా కోటపై ఎగిరేది గులాబీ జెండానేనని ధీమా వ్యక్తంచేశారు. గురువారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఇప్పటిదాకా చేసింది.. ఇకపై చేయబోయేది.. తదితర అంశాలపై ప్రసంగించారు. వివరాలు కేటీఆర్ మాటల్లోనే..
అభివృద్ధి జరుగదన్నారు.. ఇప్పుడేమంటారు? తెలంగాణ సిద్ధించి.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఆరేండ్లు గడుస్తున్నది. అంతకుముందు హైదరాబాద్‌లో ఒకరకమైన అనిశ్చితిని సృష్టించారు. టీఆర్ఎస్పై ఎన్నో దుష్ప్రచారాలు, ఆరోపణలు చేశారు. తెలంగాణ వస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే, హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు ఇబ్బంది కలుగుతుందని, ప్రాంతీయ విద్వేషాలు రగులుతాయని విషంకక్కారు. విద్యుత్ లేక రాష్ట్రం మొత్తం అంధకారమవుతుందని, కొత్త పెట్టుబడిదారులు రారు.. ఉన్నవారూ పారిపోతారు.. ఉద్యోగాలు ఊడుతాయి.. ఇక కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటూ ప్రచారంచేశారు. అభివృద్ధి ఉండదన్నారు.. ప్రజల్లో అపోహలు కల్పించే యత్నంచేశారు. ఇప్పుడు తెలంగాణ కండ్లముందు అభివృద్ధి సాక్షాత్కరించింది. అప్పుడు మాపై విమర్శలు చేసినవాళ్లు ఇప్పుడేమంటారు? ఇవాళ తెలంగాణ, హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నాయి. దేశం మొత్తం మనవైపు చూసే పరిస్థితి వచ్చింది. అన్ని రంగాల్లోనూ మనం ముందుకు పోతున్నామంటే అందుకు కారణం ఒకే ఒక్క వ్యక్తి. ఆయనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనపై ఎన్నో ఆరోపణలు, మరెన్నో విష ప్రచారాలు చేశారు. అయినప్పటికీ.. సీఎం అయ్యాక కేసీఆర్ వాటిని పట్టించుకోలేదు. అసాధారణ పరిణతి ప్రదర్శించారు. ఎక్కడా గిల్లికజ్జాలకు, పంచాయతీలకు చోటు ఇవ్వకుండా పటిష్ఠమైన కార్యాచరణతో ముందుకువెళ్లారు. ఫలితంగా తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది.
మౌలిక సదుపాయాల కల్పనే మా ప్రాథమ్యం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని మా ప్రభుత్వం మొదట ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టింది. ప్రజల ప్రాథమిక అవసరాలు ఏమిటి? వాటిని తీర్చడం ఎలా? అన్నదానిపై ఆలోచనచేసి ప్రణాళికలు రూపొందించాం. వాటిని సాధించడానికి ఇన్నాళ్లు పనిచేశాం. ఇంకా చేస్తున్నాం. నేను చిన్నప్పటినుంచి ఇక్కడే పెరిగాను. అబిడ్స్‌లో చదువుకొనేవాడిని. జలమండలి ముందు నుంచి బస్సు వెళ్లేది. ఎండకాలం వచ్చిందంటే చాలు.. జలమండలి ముందు ఖాళీ బిందెలు, కుండలు పట్టుకొని వందలమంది మహిళలు ధర్నా చేసేవారు. హైదరాబాద్‌లో 14 రోజులకోసారి నీళ్లు వచ్చే దుస్థితి ఉండేది. ట్యాంకర్లమీద ఆధారపడే పరిస్థితి కనిపించేది. ఇప్పుడు శివారు ప్రాంతాలకు కూడా తాగునీటిని ఇస్తున్నాం. రూ.2 వేల కోట్ల పైచిలుకు నిధులతో మంచినీరు అందించాం. ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చింది సీఎం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే.
వందేండ్ల కిందట గండిపేట.. ఇప్పుడు కేశవాపురం దేశంలోని కొద్దిపాటి మహానగరాల్లో హైదరాబాద్ ఒకటి. అలాంటి మహానగర ప్రజల తాగునీటి అవసరాలకోసం.. 75 ఏండ్లలో ఏ రోజు ఏ ఒక్క మహానుభావుడు.. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా రిజర్వాయర్ ఉండాలని ఆలోచన చేయలేదు. అప్పుడెప్పుడో హైదారాబాద్ స్టేట్‌లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య నేతృత్వంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఏర్పడ్డాయి. అదికూడా మూసీకి వరదలు వచ్చిన తర్వాత మాత్రమే. 1920లో గండిపేట కడితే.. మళ్లీ ఇప్పుడు 2020లో వందేండ్ల తర్వాత సీఎం కేసీఆర్.. కేశవాపురం రిజర్వాయర్ కడుతున్నారు. దీనివల్ల 2050 వరకు హైదరాబాద్‌కు ఎలాంటి తాగునీటి సమస్య ఉండదు. ముందుచూపు, విజన్ ఉన్న నాయకుడు పరిపాలకుడైతే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో తాగునీటికోసం యుద్ధాలుచేసే పరిస్థితి లేదు. తాగునీటి సమస్య 90% పరిష్కారమైంది. ఇది సామాన్య ప్రజలకు, బస్తీల్లోని ప్రజలకు బాగా తెలుసు.
తెలంగాణ వస్తే చిమ్మచీకట్లే అన్నరు తెలంగాణ వస్తే రాష్ట్రం మొత్తం అంధకారమవుతుందన్నారు. నిజానికి రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ లోటున్నది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. ఖమ్మంలోని ఏడు మండలాలను.. కేంద్రం తెలంగాణ నుంచి గుంజుకొని ఏపీకి ఇచ్చింది. ఆ మండలాల్లోనే ఉన్న దిగువ సీలేరు విద్యుత్ కేంద్రం ఏపీకి వెళ్లిపోయింది. దాదాపు 450 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల సీలేరు మనకు కాకుండా పోయింది. మనకు ఇష్టంలేకపోయినా.. కనీసం మనల్ని అడగాలనే సంస్కారం కూడా లేకుండా మోదీ ప్రభుత్వం బరబరా గుంజి ఏపీకి ఇచ్చింది. అక్కడి నుంచి మన ప్రయాణం మొదలైంది. సీఎం కేసీఆర్ పట్టుదలతో ఆర్నెళ్లలోనే విద్యుత్ కష్టాలను అధిగమించాం. లోటు నుంచి మిగులుకు చేరుకొన్నాం. ఒకప్పుడు హైదరాబాద్‌లో కరెంట్ పోతే పట్టించుకొనేవారు కారు. కరెంట్ ఉంటే.. కరెంట్ ఉందా! అని ఆశ్చర్యం వ్యక్తంచేసేవారు. ఇప్పుడు కరెంట్ పోయిందా? అని ఆశ్చర్యపోయే స్థాయికి చేరుకొన్నాం. 45 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి స్థాయి నుంచి ఐదువేల మెగావాట్ల సౌరవిద్యుదుత్పత్తి స్థాయికి చేరుకొన్నాం. 16 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో అప్పుడు ఉండె. త్వరలోనే 24 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యానికి చేరుకోబోతున్నాం. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రం మొత్తం విద్యుత్ సమస్య అనేది ఉండదు. నిరంతర విద్యుత్ హైదరాబాద్‌కు ఎంతో అవసరం. నగరంలోని లక్షల కార్మికులు విద్యుత్‌పైనే ఆధారపడిఉన్నారు. సూరారం, చర్లపల్లి, మల్లాపూర్ ఇలా ఏ పారిశ్రామికవాడకు వెళ్లినా మూడు పూటల కరెంట్ ఉంటే మూడు షిఫ్టుల్లో లక్షల కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. ఆనాడు వారానికి రెండ్రోజులు పవర్ హాలిడేలుండేవి. కానీ, ఈ రోజు ఆదివారం కూడా పరిశ్రమలను నడిపించుకొనే వీలున్నది.

సురక్షిత నగరంగా తీర్చిదిద్దాం ఆరున్నరేండ్లలో హైదరాబాద్‌లో పటిష్ఠమైన పోలీసింగ్‌తోనే శాంతిభద్రతలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో శాంతి భద్రతల విషయంపై యూకే సంస్థ రిపోర్టు ఇచ్చింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోని నగరాలను పరిశీలించింది. ఇందులో మన హైదరాబాద్ ప్రపంచంలో 16వ స్థానంలో, మనదేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఇది మాకు మేము కొట్టుకొంటున్న డబ్బాకాదు. ఓ అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన రిపోర్టు. దేశంలో ఉన్న సీసీ కెమెరాల సంఖ్యను పరిశీలిస్తే.. 65% సీసీ కెమెరాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఉన్న 5 లక్షల సీసీ కెమెరాలను రెట్టింపు చేసి.. 10 లక్షలకు పెంచబోతున్నాం. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి హైదరాబాద్‌ను అత్యంత భద్రమైన, సేఫెస్ట్ నగరంగా మలుస్తున్నాం. పోలీసింగ్‌లో ఎన్నో నూతన మార్పులకు శ్రీకారంచుట్టాం. పోలీసులకు నూతన వాహనాలు, అధునాతన పోలీస్స్టేషన్లు, బాడీ కెమెరాలు.. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, విమెన్ పోలీస్టేషన్లు ఇలా నగరవాసుల భద్రతకు ఎన్నో చర్యలు తీసుకున్నాం. ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే ఏర్పడ్డాయి. హైదరాబాద్‌లో ఈ రోజు ఆకతాయిల ఆగడాలు లేవు.. పోకిరీల పోకడలు లేవు.. పేకాట క్లబ్బుల్లేవు.. గుడుంబా గబ్బులేదు. బాంబు పేలుళ్లు లేవు.. మత కల్లోలాల్లేవు. అల్లర్లు లేవు.. కర్ఫ్యూ లేదు. ఇదంతా కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే సాధ్యమైంది. ఇది వాస్తవమా? కాదా? అనేది ప్రజలే విచారించుకోవాలి. కమాండ్ కంట్రోల్‌ను ఆషామాషీగా పెట్టలేదు. 2015లో ఆరుగురు సీనియర్ పోలీస్ అధికారులతో కమిటీవేశాం. వాళ్లు లండన్, న్యూయార్క్ వెళ్లి అక్కడి పోలీసింగ్ విధానాలను పరిశీలించారు. స్కాట్లాండ్ యార్డ్‌ను కూడా అధ్యయనంచేశారు. శాంతి భద్రతల విషయంలో మహానగరం ఏ విధంగా ఉండాలో ఆలోచించి నూతన విధానాలకు శ్రీకారం చుట్టినం. దానికి అనుగుణంగానే కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్‌లో శాంతి భద్రతల విషయంలో పోలీసుల కృషి అభినందనీయం.
పెట్టుబడులకు అడ్డా మెరుగైన విద్య, ఉపాధి, వైద్యంకోసం ప్రజలు హైదరా బాద్‌కు వస్తున్నారు. వీటిపై కూడా ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఉపాధి అవకాశాలకోసం టీఎస్ఐపాస్ వంటి అత్యుత్తమ పాలసీ తీసుకొచ్చాం. కరోనా సమయంలో ఐటీ, పరిశ్రమల్లో పెట్టుబడుల ఆకర్షణలో దేశంమొత్తం కొంత వెనుకబడి ఉన్నా.. మనం మాత్రం ముందుకు వెళ్లాం. గడిచిన ఆరేండ్లలో రాష్ర్టానికి ఏకంగా రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాం. ఐటీలో టాప్ కంపెనీలు హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకున్నాయి. గూగుల్, ఆమెజాన్, ఫేస్బుక్, యాపిల్ ఈ నాలుగు కంపెనీలు తెలంగాణ ఏర్పడిన తర్వాతే వచ్చాయి. వారికి బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై, ఢిల్లీ వంటి మహా నగరాలున్నాయి. కానీ హైదరాబాద్‌నే ఎంచుకొన్నారు. వారేమీ ఆషామాషీగా ఇక్కడికి రాలేదు. ఇక్కడి వాతావరణం, ప్రభుత్వ విధానం, శాంతిభద్రతలు, ఆర్థికవృద్ధి ఇవన్నీ ఉంటేనే వస్తారు తప్ప ఊరికేరారు. పెద్దపెద్ద కంపెనీలను ఆకర్షించే అద్భుత వాతావరణం ఇక్కడున్నది. యువత జాబ్ సీకర్స్ కాదు జాబ్ క్రియేటర్లు కావాలనే ఉద్దేశంతో ఇన్నోవేషన్‌కు పెద్దపీట వేశాం. తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా మహిళలకు ప్రత్యేకంగా ఎంట్రప్రెన్యూర్షిప్ హబ్ లేదు. తెలంగాణలో వీ-హబ్ ఉన్నది.. టీ-వర్క్స్ ఉన్నది. దేశంలోనే అత్యధిక ఇంక్యుబేషన్ సెంటర్లు ఇక్కడ ఉన్నాయి. గవర్నమెంట్ పాలసీలు, పొలిటికల్ స్టెబిలిటీ, లా అండ్ ఆర్డర్ ఈ మూడూ పెట్టుబడుల ఆకర్షణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ మూడూ బాగున్నాయి కాబట్టే హైదరాబాద్ పెట్టుబడులకు అయస్కాంతంగా మారింది. పాలన దక్షత గల నాయకుడు, స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.
పేదవాళ్లకు భోజనం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు హైదరాబాద్‌లో పేదవాడు భోజనం చేయాలంటే ఎక్కడి వెళ్లాలో తెలియదు. అన్నపూర్ణ ద్వారా ప్రతిరోజూ 50 వేల మందికి నాణ్యమైన భోజనం పెడుతున్నాం. విపక్షనేతలు కూడా ఈ భోజనాన్ని తిని మెచ్చుకున్న సందర్భాలున్నాయి.
మత విద్వేషాలు రెచ్చగొడితే ఉక్కుపాదంతో అణిచేస్తాం హైదరాబాద్‌లో కొందరు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారు. వారికి నేనొక్కటే చెప్తున్నా. తెలంగాణ ఆగమాగమయ్యే దశలో లేదు. తెలంగాణ ఒక పటిష్ఠ నాయకత్వంలో ముందుకు పోతున్నది. హైదరాబాద్‌లో మళ్లీ బాంబు పేలుళ్లు, మత కల్లోలాలు అంటూ పిచ్చి ప్రయత్నాలు చేస్తే.. చూస్తూ ఊరుకోం. శాంతిభద్రతల విషయంలో కచ్చితంగా కఠినంగా ఉంటాం. అలాంటి ఘటనలను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. హైదరాబాద్ ప్రజలకు నేను మాట ఇస్తున్నా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని ఎవరు దెబ్బతీయాలని చూసినా ఉక్కుపాదంతో అణిచివేస్తాం. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం అవసరం లేదు. తెలంగాణకు ఎకానమిక్ ఇంజిన్‌గా ఉన్నటువంటి హైదరాబాద్‌కు ఎవరైనా నష్టంచేయాలని ప్రయత్నిస్తే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.
అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నాం… హైదరాబాద్ ఒకేవైపు పెరిగితే లాభం లేదనేది ప్రభుత్వ ఉద్దేశం. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగాలనే ఉద్దేశంతో ‘గ్రిడ్’ పాలసీ తీసుకొచ్చాం. దీని ద్వారా ఉప్పల్, నాగోల్‌లో 5 కొత్త ఐటీ పార్కులు వస్తున్నాయి. కొంపల్లిలో తొందర్లోనే ఐటీ పార్క్ రానున్నది.
దక్షిణ హైదరాబాద్‌లో మహేశ్వరం, రావిర్యాలలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లకు పెట్టుబడులు వస్తున్నాయి. అమెజాన్ కూడా అక్కడికే వస్తుంది. లైఫ్ సైన్సెస్‌లో కూడా తెలంగాణ దూసుకుపోతున్నది. ఎన్నో ఫార్మా కంపెనీలు వచ్చాయి.
ప్రపంచానికే వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ నిలిచింది. ఇంకా అభివృద్ధి చెందుతున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో, అద్భుత ఆలోచనతో ఫార్మాసిటీ రూపుదిద్దుకొంటున్నది.
రహదారులను విస్తరించాం.. జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్సార్డీపీ (వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం) ద్వారా హైదరాబాద్‌లో రోడ్లను అభివృద్ధిచేశాం. ఎన్నో ఫ్లై వోవర్లను నిర్మించాం. ఎన్ని ఫ్లైవోవర్లు కట్టామో ఎల్బీనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో ఉన్నవాళ్లను అడిగితే చెప్తారు. మీరు ఎక్కడికి వెళ్లినా ఫ్లైవోవర్లు, అండర్‌పాస్‌లు కనిపిస్తాయి. దుర్గం చెరువు బ్రిడ్జి హైదరాబాద్‌కు ఐకాన్‌గా మారింది. ప్రపంచమే మెచ్చుకుంటున్నది. మున్సిపల్ కాంట్రాక్టు వ్యవస్థను ప్రక్షాళనచేయాలనే ఉద్దేశంతో సీఆర్ఎంపీ అనే నూతన కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. రూ.1800 కోట్లతో రోడ్లను అభివృద్ధిచేశాం. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ను తగ్గించాలనే ఉద్దేశంతో 137 లింకురోడ్లను నిర్మిస్తున్నాం. ఇక రోడ్ల వెడల్పు పని విస్తృతంగా చేపడుతున్నాం.
వలస కార్మికులను ఆదుకొన్న చరిత్ర మాది ఇండ్లతో పాటు ఒక లక్ష కుటుంబాలకు 58, 59 జీవోల ద్వారా పట్టాలు అందించాం. లాక్డౌన్లో ప్రజలు అవస్థలు పడుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఆదుకొన్నది. ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడికి వచ్చిన వలస కూలీలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కడుపులో పెట్టుకొన్నది. మిగతా రాష్ర్టాల సీఎంలు వారిని స్వస్థలాలకు పంపించేందుకు బస్సులు ఏర్పాటుచేస్తే సీఎం కేసీఆర్ మాత్రం అలా చేయకుండా.. వారిని కంటికి రెప్పోలె కాపాడుకొన్నారు. వారిని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా అభివర్ణించారు. అలాచేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే. వారికోసం 300 శ్రామిక రైళ్లను ఏర్పాటుచేసి వారి నుంచి రూపాయి కూడా తీసుకోకుండా స్వస్థలాలకు పంపించింది. ఇతర రాష్ర్టాలేమో చార్జీలు వసూలుచేసి వేధించాయి.
అభివృద్ధి కావాలా? ఆరాచకం కావాలా? ఆరేండ్లుగా హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నది. ఎలాంటి లొల్లులు లేవు. ఇంత మంచి నగరాన్ని, వాతావరణాన్ని పాడుచేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞతతో ఆలోచించండి. వివేకంతో వ్యవహరించండి. అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? ఎవరికి ఓటు వేస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి. విద్వేషం, విషంతో నిండిన హైదరాబాద్ కావాలా? లేదా విశ్వాసంతో, విజ్ఞతతో ఆలోచించే అభివృద్ధి హైదరాబాద్ కావాలా? మన హైదరాబాద్ అని కొందరు అంటున్నారు. కానీ కొందరి హైదరాబాద్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొందరి హైదరాబాద్‌గా ఉండాలా? అందరి హైదరాబాద్ కావాలా? డివైడెడ్ పాలిటిక్స్ కావాలా? డెసిసివ్ పాలిటిక్స్ కావాలా? విజ్ఞతతో ఆలోచించండి. వోకల్ ఫర్ లోకల్ అని ప్రధాని అంటున్నారు. మేం కూడా అదే అంటున్నాం. మేం గల్లీ పార్టీ.. వారిది ఢిల్లీ పార్టీ. మరి గల్లీ పార్టీ హైదరాబాద్‌ను ఏలాల్నా? ఢిల్లీ పార్టీ హైదరాబాద్‌ను ఏలాల్నా? సిల్లీ రాజకీయ పార్టీ ఉండాలా? ఆలోచించండి. విజ్ఞతతో వ్యవహరించండి.. పనిచేసిన, పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.

చెత్త హైదరాబాద్ నుంచి స్వచ్ఛ హైదరాబాద్ వైపు ప్రధాని స్వచ్ఛ భారత్‌కు పిలుపునివ్వకముందే సీఎం కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అప్పుడు హైదరాబాద్‌లో ప్రతిరోజు 3,500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ అయ్యేది. ఉత్పత్తి ఎక్కువుండేది.. సేకరణ తక్కువయ్యేది. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా 2,500 స్వచ్ఛ ఆటోలు ఏర్పాటుచేశాం. ఇప్పుడు 6,500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తున్నాం. తద్వారా హైదరాబాద్‌ను పారిశుద్ధ్యంలో అగ్రభాగాన నిలుపుతున్నాం. ఈరోజు దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా, ముంబయి నగరాలతో పోల్చితే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లో హైదరాబాద్‌కే అగ్రతాంబూలం దక్కింది. సీటీపీసీ కలెక్షన్ పాయింటింగ్లను పెడుతున్నాం. చెత్త ఆటోలు.. చెత్తను పది కిలోమీటర్ల దూరం తీసుకెళ్లే బదులు.. ఆ కాలనీలోనే వీకేంద్రీకరణ పాయింట్లను పెడుతున్నాం. ప్రస్తుతం 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఉన్నాయి.
వీటికి అదనంగా 90 కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్లను పెడుతున్నాం. దీంతో ఎప్పటికప్పుడు చెత్త సేకరించే వీలుంటుంది. 2,500 స్వచ్ఛ ఆటోలకు మరో 700 కొత్తవి తీసుకొస్తున్నాం. ఇలా మొత్తం 3,200 స్వచ్ఛ ఆటోలను తీసుకొస్తున్నాం. హైదరాబాద్ విశ్వనగరం కావాలని అనుకుంటున్నాం కాబట్టి.. గ్లోబల్ సిటీల్లో ఉన్నట్లుగానే హైదరాబాద్‌లోనూ చెత్త సేకరణ ఉండేలా చేస్తున్నాం. చెత్త సేకరణకు ఉన్న డొక్కు వాహనాలను తీసేసి కొత్తవి తీసుకొచ్చాం. హైదరాబాద్‌కు ఒకే డంపింగ్ యార్డ్ ఉన్నది. మరో రెండు డంపింగ్ యార్డుల ఏర్పాటుకు స్థలాన్ని సేకరించి.. జీహెచ్ఎంసీకి అందించాం. వీటిని కూడా తొందర్లోనే ప్రారంభిస్తాం.
దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌ను జవహర్‌నగర్‌లో ప్రారంభించాం. దీని ద్వారా 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మరో 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నాం. వీటికి ఫౌండేషన్ వేశాం. ఈ విధంగా చెత్త సేకరణను వికేంద్రీకరించి.. సమస్యను తీర్చాం. అదే విధంగా చెత్త నుంచి సంపదను సృష్టించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. దేశంలో ఎక్కడా ఇలాంటి విధానంలేదు. శానిటేషన్ విషయంలోనూ దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలుపుతున్నాం. ఒకప్పుడు ఎక్కడపడితే అక్కడ చెత్త ఉండే హైదరాబాద్‌ను స్వచ్ఛ హైదరాబాద్‌గా మార్చాం. నిర్మాణరంగ వ్యర్థాలకోసం జీడిమెట్లలో ఇటీవలే ప్లాంటును ప్రారంభించాం. కప్పలగూడలో మరొకటి ప్రారంభిస్తాం. హైదరాబాద్‌లో రోజుకు 2 వేల టన్నుల నిర్మాణరంగ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి.
వీటిని ప్రాసెస్‌చేసి.. కంకర, ఇసుక, టైల్స్ తయారు చెయ్యొచ్చు. ఇది కూడా చేస్తున్నాం. దీన్ని కూడా దేశంలో మరే రాష్ట్రం చేయడంలేదు. ఒక్క హైదరాబాద్‌లోనే చేస్తున్నాం. సీవరేజిలో ప్రతిరోజు 2 వేల ఎంఎల్డీ ఉత్పత్తి అవుతుంది. ఇందులో 41% ట్రీట్మెంట్చేస్తున్నాం. దీన్ని 90శాతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. 1,200 ఎల్డీపీల ఎస్టీపీలకు ఏర్పాటు పని టెండర్ల దశలో ఉన్నది. సీవరేజి నీళ్లను మూసీకి అనుసంధానం చేసి.. మూసీ సుందరీకరణ చేయాలని ఆలోచన ఉన్నది.

రూ.9,714 కోట్లు.. లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు -మరే నగరంలోనైనా ఇన్ని ఇండ్లు కడుతున్నారా? -67వేల కోట్లతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం -ఆరేండ్లలో నగర ప్రజలపై పైసా భారం మోపలేదు -అయినా నగర అభివృద్ధిని పరుగులు పెట్టించాం -కరోనా, వరదలొచ్చినా ప్రజలకు అండగా ఉన్నాం
దేశంలో ఏ నగరంలోనూ హైదరాబాద్ మాదిరిగా మురికివాడలను అభివృద్ధిచేసే కార్యక్రమంలేదు. పేదలకోసం ఏకంగా రూ.9,714 కోట్లతో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కడుతున్నాం. వీటి నిర్మాణం చివరిదశలో ఉన్నది. వాస్తవానికి ఈ దసరాకే ఇద్దామనుకొన్నాం. కానీ, కరోనాతో కార్మికులు లేకపోవడంతో నిర్మాణంలో జాప్యం ఏర్పడింది. త్వరలోనే పూర్తిచేసి పేదలకిచ్చిన మాటను నిలబెట్టుకొంటాం. ఇంత భారీ మొత్తం వెచ్చించి దేశంలో మరేదైనా నగరంలో పేదలకోసం ఇండ్లు కడుతున్న ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయా? ముంబైలో ఉన్నదా? అహ్మదాబాద్‌లో ఉన్నదా? చెన్నైలో ఉన్నదా? కోల్‌కతాలో ఉన్నదా? పుణెలో ఉన్నదా? మరెక్కడైనా ఉన్నదో చెప్పాలని సవాల్ చేస్తున్నా.
తెలంగాణ వస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుందని విషం కక్కారు. విద్యుత్‌లేక రాష్ట్రం అంధకారమవుతుందని భయపెట్టారు. కొత్త పెట్టుబడిదారులు రారు.. ఉన్నవారూ పారిపోతారు.. ఉద్యోగాలు ఊడుతాయి.. ఇక కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రచారం చేశారు. అభివృద్ధి ఉండదని అపోహలు కల్పించే యత్నం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి కండ్ల ముందు సాక్షాత్కరించింది. అప్పుడు విమర్శలు చేసినవాళ్లు ఇప్పుడేమంటారు?
విజ్ఞతతో ఆలోచించండి. వివేకంతో వ్యవహరించండి. అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? ఎవరికి ఓటు వేస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి. విద్వేషం, విషంతో నిండిన హైదరాబాద్ కావాలా? లేదా విశ్వాసంతో, విజ్ఞతతో ఆలోచించే అభివృద్ధి హైదరాబాద్ కావాలా? మన హైదరాబాద్ అని కొందరు అంటున్నారు. కానీ కొందరి హైదరాబాద్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొందరి హైదరాబాద్‌గా ఉండాలా? అందరి హైదరాబాద్ కావాలా? పనిచేసిన ప్రభుత్వాన్ని, పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. – మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు
ఈ ఆరేండ్లలో ఒక్క పైసా ప్రాపర్టీ ట్యాక్స్ పెంచినమా? వాటర్ బిల్లు పెంచామా? కరెంటు బిల్లు పెంచామా? స్టాంప్‌డ్యూటీ పెంచామా? రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచామా? ట్రేడ్ లైసెన్స్ ఫీజులు పెంచామా? డెవలప్ మెంట్ ఫీజు పెంచామా? ఏది కూడా పెంచలేదు. ఎఫీషియన్సీని పెంచి.. రాష్ట్ర ఆదాయం పెంచి.. పేదలకు పంచే కార్యక్రమాలు చేశామే తప్ప ఎక్కడా పొరపాటున కూడా పన్నులు పెంచలేదు.. చార్జీల మోత మోగించలేదు. సామాన్యుడి నడ్డివిరిచే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు’ – మంత్రి కేటీఆర్