Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అభివృద్ధికే ఓటు..

కత్తి ఒకరికి ఇచ్చి.. మమ్ములను యుద్ధం చేయమనడం న్యాయమా? కత్తి ఎవరికి ఇచ్చారో వాడినే యుద్ధం చేయమనాలే! అది యుద్ధనీతి. ఓట్లు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు వేసి మమ్మల్ని అభివృద్ధి చేయమంటే ఎట్లా? అని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. పాలేరు ఉపఎన్నిక సందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో బుధవారం భారీ బహిరంగ జరిగింది. ఈ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, సమస్యలపై పోరాడి అభివృద్ధి చేసే టీఆర్ఎస్‌కే ఓట్లేయాలని విజ్ఞప్తిచేశారు. 60ఏండ్లు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు అవకాశాలు ఇచ్చారని, వారందరూ పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా సమస్యల వలయంలోకి నెట్టారని కేటీఆర్ విమర్శించారు. -కత్తి ఒకరికి ఇచ్చి.. యుద్ధం ఒకరిని చేయమనడం న్యాయమా? -అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం.. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి -నేలకొండపల్లి ఎన్నికల సభలో మంత్రి కేటీఆర్

KTR-election-campaign-in-Palair-constituency

కాంగ్రెస్‌కు 11సార్లు, కమ్యూనిస్టులకు మూడుసార్లు అవకాశాలు ఇచ్చారు. వాళ్లే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే పాలేరులో ఎందుకు తాగునీరు లేదు? ఎందుకు రోడ్లు లేవు? ఎందుకు మురికి కాలువలు సక్రమంగా లేవు? అని కేటీఆర్ ప్రశ్నించారు. అభివృద్ధి చేయకుండా ఇబ్బందుల పాల్జేసిన వారికి ఓటు వేద్దామా? లేక తెలంగాణ రాష్ర్టాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లుతున్న సీఎం కేసీఆర్‌కు మద్దతుగా నిలుద్దామా? అనేది ప్రజలంతా ఆలోచించాలని కోరారు. ముదిగొండలో విత్తనాలు, ఎరువులకోసం ఆందోళనలుచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కాల్చి చంపలేదా? అని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు ముష్టియుద్ధాలకు దిగేవారని, క్యూలైన్లలో చెప్పులు పెట్టి భోజనాలకు వెళ్లేవారని మంత్రి గుర్తుచేశారు. ఎరువులు, విత్తనాలను పోలీస్‌స్టేషన్‌లో పెట్టి అమ్మించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే ఏమొస్తదని విషప్రచారం చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే గుర్తింపు తెచ్చాయి అని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ వస్తే కరెంటు లేక చిమ్మచీకట్లో తెలంగాణ మగ్గాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ చివరి కిరణం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారని, ఇప్పుడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఒక్క సెకను కూడా కరెంటు పోకుండా 24గంటలు విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు వృద్ధులకు, వికలాంగులకు రూ.200 పెన్షన్లు ఇచ్చేవని, తెలంగాణ ప్రభుత్వం వారి ఆత్మగౌరవం కాపాడేలా ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు ఇస్తున్నదని అన్నారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకు వలే సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లకోసం ఏటా రూ.800 కోట్లు ఖర్చు పెడితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.4,600 కోట్లు ఖర్చుచేస్తున్నదన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తే ఇదే కాంగ్రెస్‌వాళ్లు, ఎర్రన్నలు తెల్లకార్డులు ఏరివేసి, పేదల పొట్ట కొడుతుందని దుష్ప్రచారం చేశారు. ఎక్కడైనా ఒక్క కార్డు తొలగించామా? అని కేటీఆర్ ప్రశ్నించారు. సన్న బియ్యం పెట్టాలని ఏ రాజకీయ పార్టీ అడుగలేదు. ఏ విద్యార్థులూ కోరలేదు. పిల్లలే తెలంగాణ భవిష్యత్ కాబట్టి , వారు బాగుంటే తెలంగాణ భవిష్యత్ బాగుంటందనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు అని మంత్రి చెప్పారు. పేదవాళ్ల జీవితంలో ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం రెండే సవాళ్లు ఉంటాయి. ఈరోజు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టించడంతోపాటు.. కల్యాణలక్ష్మి పథకంకింద ఇంటి ఆడబిడ్డ పెండ్లికి రూ.51వేలు అందిస్తున్నది.

ఈ ఘనత సీఎం కేసీఆర్‌దే అని అన్నారు. ప్రతి రైతుకు లక్ష వరకు రుణ మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు ఈ ఏడాదితో రుణమాఫీ పూర్తవబోతున్నదని తెలిపారు. రైతుల రుణమాఫీ కోసం రూ.17వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. మాట ఇస్తే మాట నిలబెట్టుకునే సీఎం కేసీఆర్ నేతృత్వంలో పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి పునాదులు వేస్తామని చెప్పారు. నేలకొండపల్లి మండలంలోని రైతాంగంపై ప్రతిపక్షాలు విషప్రచారాలు చేస్తూ బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు.

పాలేరు రిజర్వాయర్‌పై హక్కు ఉన్న నేలకొండపల్లి, కూసుమంచితోపాటు ఇతర గ్రామాలకు సాగునీరు ఇచ్చేందుకు కృష్ణా జలాలే కాకుండా గోదావరి జలాలను తీసుకొచ్చి, పాలేరు రిజర్వాయర్ నింపి, నేలకొండపల్లి మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి మహిళ మంచినీటి కోసం బజారుకు వెళ్లొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఎవరూ అడుగకున్నా.. ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. మూడేండ్లలో ఇంటింటికీ తాగునీరు ఇవ్వకుంటే ఓట్లు అడుగబోమని చెప్పిన దుమ్మన్న నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. 16న ఉప ఎన్నికలో తుమ్మల నాగేశ్వర్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు.

పాలేరులో పోటీ చేయడం నా అదృష్టం: మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పాలేరు నియోజకవర్గంనుంచి పోటీ చేయడం అదృష్టమని మంత్రి, పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. భక్తరామదాసు పుట్టిన పుణ్యక్షేత్రం నేలకొండపల్లి అని, సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు ఎత్తిపోతల పథకంద్వారా పాలేరు నియోజకవర్గానికి నీరందించి భక్తరామదాసు పాదాలు కడుగుతానని అన్నారు. జిల్లాలో ఉన్న భూములు బీడు ఉంచకుండా సాగు చేసుకునేలా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తానన్నారు. జిల్లాలో చేసిన ప్రతి శంకుస్థాపన, నిర్మాణం తనదేనని,ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి కూడా ఖమ్మం పట్టణానికి, నేలకొండపల్లి మండలానికి అనుసంధానం చేసే ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిని కట్టిన ఘనత కూడా తనదేనన్నారు.

ఆడబిడ్డల కష్టాలు తీర్చేందుకే మిషన్ భగీరథ: డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆడబిడ్డల కష్టాలను తీర్చేందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టిందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. 60ఏండ్లలో అన్నిరంగాల్లో వెనుకబడిన తెలంగాణను అభివృద్ధి చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. కాంగ్రెస్‌కు ఓటు అడిగే నైతిక అర్హత లేదని ఆమె విమర్శించారు.

జిల్లా అభివృద్ధి ఘనత తుమ్మలదే: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రాజకీయాలలో ఉద్ధండుడైన తుమ్మల.. అభివృద్ధి కాముకుడని, జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. యువ నాయకుడైన కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారని, దమ్ముంటే ఆ సవాల్‌ను స్వీకరించాలన్నారు. కారు కూతలు కూస్తున్న టీడీపీ నాయకకుడు రేవంత్‌రెడ్డి నేడో, రేపో జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందన్నారు.

టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఓటడిగే హక్కుంది: మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఒక్క టీఆర్‌ఎస్‌కే ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేండ్లే అయిందని, ఇప్పటికే తాగు, సాగునీరు అందించేందుకు శాస్త్రీయ ప్రణాళికను సిద్ధంచేసిందని చెప్పారు. జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా సాగుతున్న మంత్రి తుమ్మలను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి :ఎంపీ పొంగులేటి,ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, బాబూమోహన్ 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని రెండేండ్లలోనే చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పాత కాలువలను ఆధునీకరించి, పాలేరు రిజర్వాయర్‌ద్వారా కృష్ణా, గోదావరి జలాలను అందించే కార్యక్రమం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్నదని, ఇది రైతాంగానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.ఆంధ్రా పార్టీలైన టీడీపీ, వైసీపీల దుకాణం తెలంగాణలో బందైందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఉద్యమ నేత సీఎం అయ్యారని, ఆయనకు అభివృద్ధి చేయడమే తప్ప వేరే ఏమీ లేదని చెప్పారు.

పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం బీరోలు తన సొంత గ్రామమని ఎమ్మెల్యే బాబూమోహన్ చెప్పారు. 60 ఏండ్లుగా ఈ నియోజకవర్గం అభివృద్ధికీ నోచుకోలేదన్నారు. తుమ్మల ఆర్‌అండ్‌బీ మంత్రిగా బాధ్యతలు చేపట్టాకే జిల్లాలో రోడ్లు బాగుపడ్డాయని చెప్పారు. నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికలో 53వేల మెజార్టీ వచ్చిందని, పాలేరు ఉపఎన్నికలో లక్ష మెజార్టీతో తుమ్మలను గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సభకు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎస్‌బీ బేగ్ అధ్యక్షత వహించగా, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, రసమయి బాలకిషన్, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.