Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అభివృద్ధిని చేసి చూపించాం

-60 ఏండ్లలో చేయనివి మూడేండ్లలో చేశాం -జిల్లాలోపార్టీని తిరుగులేని శక్తిగా మార్చాము -కేసీఆర్ తెలంగాణకు లభించిన వరం -అన్ని జిల్లా కేంద్రాలూ జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నాం నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

గత అరవై ఏండ్లలో జరుగని అభివృద్ధిని రోడ్లు భవనాల శాఖ ద్వారా మూడేండ్లలోనే చేసి చూపించామని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. స్వల్పకాలంలో పెద్దసంఖ్యలో రహదారులు, వంతెనలు నిర్మించామని చెప్పారు. మంత్రిగా, సీనియర్ నాయకుడిగా ఖమ్మంజిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా రూపుదిద్దానని చెప్పారు. దీక్షా దక్షత గలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో సభ్యుడిగా బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నామని నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇవీ విశేషాలు..

మూడేండ్లలో శాఖాపరంగా మీరు సాధించినదేమిటి? అరవై ఏండ్లలో సాధించలేని అభివృద్ధిని చేసి చూపించాం. రాష్ట్రం ఏర్పడిననాటినుంచి ఇప్పటిదాకా రూ.7,678 కోట్లతో 9,997కి.మీ. నిడివిగల రోడ్లు నిర్మించాం. రూ.1,538 కోట్లతో 512 వంతెనలు నిర్మించాం. సీఎం కేసీఆర్ ఆలోచనమేరకు ప్రజాప్రతినిధులు ప్రజాక్షేత్రంలోనే ఉండే విధంగా ప్రతి ఎమ్మెల్యేకు నియోజకవర్గం కేంద్రంలో నివాస-కార్యాలయ భవనాలు నిర్మిస్తున్నాం.

ఎన్‌హెచ్‌ల కనెక్టివిటీ ఎలా ఉంది? ముఖ్యమంత్రి చొరవతో ఆ అంశంలో జాతీయస్థాయి కంటే అధిక వృద్ధిరేటు సాధించాం. గడిచిన 60ఏండ్లలో రాష్ట్రంలో 2,527 కి.మీ నిడివిగల 15 జాతీయ రహదారులు వేస్తే, మేం వాటి సంఖ్యను 21కి పెంచి అదనంగా 2,915 కి.మీ నిడివిగల రహదారులను సాధించాం. ప్రతి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవే కనెక్టివిటీ కోసం ప్రయత్నిస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి మండలం, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి డబుల్ లేన్ల రోడ్లు వేస్తున్నాం. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగులేన్ల రోడ్లు నిర్మిస్తున్నాం.

నిధుల విషయంలో కేంద్ర సహకారం ఎలా ఉంది? ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ వల్ల మూడేండ్లలోనే అధిక మొత్తంలో నిధులను రాబట్టాం. ఇందులో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.2,900 కోట్లు, నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.8000 కోట్లు, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.1290 కోట్లు, కేంద్ర రహదారుల నిధి కింద రూ.1020 కోట్లు, రహదారి భద్రత ఇంజినీరింగ్ పనులకు రూ.90కోట్లు ఇలా.. మొత్తం రూ.13,300 కోట్లు కేంద్రం నుంచి రాబట్టాం..

భవన నిర్మాణాలు ఎలా కొనసాగుతున్నాయి..? మాశాఖ తరఫున రూ.1,068.2 కోట్లతో భవన నిర్మాణాలు చేపట్టాం. ఎమ్మెల్యేలకు నివాస- కార్యాలయ భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పరకాల భవనాన్ని ఆరు నెలల్లోనే పూర్తిచేశాం. నూతన కలెక్టరేట్ల నిర్మాణానికి రూ.913 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచాం. రాజ్‌భవన్ స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం, సీఎం క్యాంప్ ఆఫీస్, హైదర్‌గూడలో ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణాలు పూర్తిచేశాం. త్వరలో సీఎం చేతులమీదుగా ప్రారంభించబోతున్నాం. పోలీస్ కమాండ్ కంట్రోల్ భారీ భవనాన్ని కూడా ఆర్‌అండ్‌బీ నిర్మిస్తున్నది.

రాష్ట్రంలో వంతెనల పరిస్థితి ఎలా ఉంది…? రాష్ట్రంలో 512 వంతెనల పనులు రూ.1,538 కోట్ల అంచనా వ్యయంతో కొనసాగుతున్నాయి. గోదావరిపై 4, మానేరుపై 5, గూడెంవద్ద ప్రాణహిత నదిపై ఒకటి, నల్గొండ జిల్లా మఠంపల్లి వద్ద కృష్ణా నదిపై, నాగర్‌కర్నూల్ సోమశిల వద్ద వంతెనలు నిర్మించేందుకు అంచనాలు సిద్ధమయ్యాయి. వాగులు, వంకలపై వంతెనలకు చెక్ డ్యాంలు నిర్మించాలని చెప్పాం. దీనివల్ల స్థానికంగా భూగర్భజలాలు పెరుగడంతోపాటు పశు-పక్ష్యాదులకు తాగునీరు లభిస్తుంది.

సీనియర్ నాయకుడిగా పార్టీలో మీ పాత్ర ఎలా ఉంది? ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతంచేశాం. ఏ ఎన్నిక వచ్చినా అధిక మెజార్టీ సాధించేలా తయారుచేశాం. అన్ని మున్సిపాలిటీలు, కో-ఆపరేటివ్ సొసైటీలు, డీసీఎంఎస్, జడ్పీలో కూడా ఆధిప్యతం సాధించాం. పాత ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ సీట్లకు గానూ ఏడింటిలో అగ్రభాగాన నిలిచాం. ప్రతి ఎన్నికలో జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు ఉండగా, టీఆర్‌ఎస్ పార్టీ ఒకటే మరోవైపు ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించింది. ప్రజలకు టీఆర్‌ఎస్‌ను చేరువ చేశాను. జిల్లాలో 100% గెలుపు ధీమాతో ఉన్నాం.

కేసీఆర్‌తో మీరు సన్నిహితంగా ఉంటారనే ప్రచారం ఉంది..? కేసీఆర్‌తో కలిసి గత ప్రభుత్వాల్లో పని చేసిన సాన్నిహిత్యం ఉంది. ఏదైనా మంచి విషయం ఉంటే సీఎంకు చెప్పేంత స్నేహం ఉంది. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు లభించిన వరం. అన్ని రంగాలలో అనుభవం ఉన్న అలాంటి నేత సీఎంగా లభించడం అదృష్టమనే చెప్పాలి. ఆయన ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా శక్తి వంచన లేకుండా పని చేసి పార్టీ పటిష్ఠతకు పాటుపడుతా.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.