-ప్రతి పనికి అడ్డు తగులుతున్నరు
-24 గంటల కరంటు సరఫరాతో కాంగ్రెస్‌నేతలు దివాళా
-పేకాట, గుడుంబాను అరికట్టడంతో సంతోషంలో మహిళలు
-అత్యాధునిక వసతులతో కూకట్పల్లి రైతుబజార్ నిర్మాణం
-రైతుబజార్ భూమిపూజలో మంత్రి హరీశ్‌రావు
రాష్ర్టాభివృద్ధి కోసం చేపడుతున్న అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూ అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అంధకారమవుతుందని అప్పట్లో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారని.. నేడు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తుండటంతో ఆ పార్టీ నేతల్లో చీకట్లు నెలకొన్నాయన్నారు. 24గంటల కరంటుతో ఇన్వర్టర్లు, జనరేటర్లు తయారుచేసే కంపెనీలతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు దివాలా తీశారని ఎద్దేవాచేశారు. కూకట్‌పల్లిలో రూ.10 కోట్లతో నిర్మించనున్న మోడల్ రైతుబజార్ నిర్మాణ పనులకు శుక్రవారం రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్రం లో పేకాట క్లబ్‌లను మూసేసి గుడుంబాను అరికట్టడంతో మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. 24గంటల కరంటు, మిషన్ భగీరథ, రైతు బంధు, రైతుబీమా పథకాలు, లా అండ్ ఆర్డర్ దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఇతర రాష్ర్టాలు వీటి అమ లుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు వస్తున్న మంచి పేరును చూసి తట్టుకోలేక రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ నేతలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనుల్లో లోపాలుంటే సూచనలు ఇవ్వాలని, అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవుపలికారు.
ఆదర్శంగా కూకట్పల్లి మోడల్ బజార్ 20 ఏండ్ల కిందట నిర్మించిన కూకట్పల్లి రైతుబజార్‌ను రూ.10 కోట్లతో అధునీక రిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రెండంతస్థుల భవనం, విశాలమైన పార్కింగ్, కోల్డ్ స్టోరేజ్ గదులు, రైతు విశ్రాంతి గదులు, క్యాంటీన్, ధరల స్క్రీన్బోర్డులు, ఏటీఎం వంటి వసతులు కల్పిస్తామన్నారు. రైతుబజార్లు, మన కూరగాయల కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు తక్కు వ ధరలో నాణ్యమైన కూరగాయలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతున్నదని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తాగునీరు, కరంటు, ప్రజా రవాణావ్యవస్థ ఆధునీకరణ వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్సీ శంకరయ్య, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, జేడీ రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్లు మల్లేశం, ఇఫ్తాఖత్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ ఉన్నత కార్యదర్శి పద్మ, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నరేందర్‌గౌడ్, ఎస్ఈ ఉమమహేశ్వర్‌రావు, ఈఈ రామారావు, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, ముద్దం నర్సింహయాదవ్, తూము శ్రవణ్‌కుమార్, సబీహాబేగం, జూపల్లి సత్యనారాయణ, ఆర్డీవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.