Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అభివృద్ధికే ఓటేస్తరు.. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

ప్రజాభిమానాన్ని నమ్ముకున్న టీఆర్​ఎస్​ ఒకవైపు, తప్పుడు ప్రచారాలను నమ్ముకున్న కాంగ్రెస్, బీజేపీ మరోవైపు దుబ్బాక ప్రజల ముందు పరీక్షకు నిలబడ్డాయి. ప్రజల కోసం పని చేసేవారెవరో, సీజనల్​గా వచ్చే వైరస్​ల మాదిరిగా ఎన్నికలప్పుడు వచ్చి హడావుడి చేసేదెవరో గ్రహించలేనంత అమాయకులు కారు దుబ్బాక ప్రజలు. దుబ్బాక రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం. పతిపక్షాల అబద్ద ప్రచారాలు, మాటల గారడీలతో ఏ మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు చీదరించుకుంటున్నారు. టీఆర్​ఎస్​ను భారీ మెజారిటీతో గెలిపించడానికి దుబ్బాక ప్రజలు ఎప్పుడో మానసికంగా సంసిద్ధమై పోయారు.

దుబ్బాక ప్రజలే సర్వస్వంగా భావించిన నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి. ఆయన ఆకస్మిక మరణంతో దుబ్బాక ఉపఎన్నిక వచ్చింది. రామలింగారెడ్డి తొలుత వామపక్ష పోరాటాల్లో, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో వీరోచిత పాత్ర పోషించిన నాయకుడు. ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్​రెడ్డి ఎన్నిరకాలుగా ప్రలోభ పెట్టినా లొంగకుండా తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడి నిబద్ధతను చాటుకున్నారు.

ఉద్యమకారునిగా, ఎమ్మెల్యేగా రామలింగారెడ్డి చేసిన సేవలను గుర్తిస్తూ టీఆర్​ఎస్​ అధిష్టానం ఆయన భార్య సోలిపేట సుజాతకు టికెట్ కేటాయించింది. భర్తను కోల్పోయి పుట్టెడు దు:ఖం అనుభవిస్తున్న ఆమె దుబ్బాక ప్రజల మనోభీష్టాన్ని, పార్టీ నిర్ణయాన్ని శిరసా వహించారు. ఒక చేత్తో కన్నీటిని తుడుచుకుంటూ, మరో చేత్తో గులాబీ జెండాను అందుకుని పోటీకి సిద్ధపడ్డారు. భర్త వెంట వివిధ ఉద్యమాల్లో, రాజకీయ కార్యక్రమాల్లో కలిసి నడిచిన అనుభవం ఉన్న సుజాత అచ్చమైన తెలంగాణ గ్రామీణ మహిళ. జనంతో కలుపుగోలుగా నడుచుకునే ఆమె మంచితనం నియోజకవర్గంలో అందరికీ తెలిసిందే.

అభివృద్ధి అంటే ప్రతిపక్షాలకు తెలుసా?
దుబ్బాకలో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదని కాంగ్రెస్, బీజేపీ గోల చేస్తున్నాయి. అభివృద్ధి అంటే ఏమిటో వాళ్లకు అసలు తెలుసా? యాభై సంవత్సరాల్లో జరగని అభివృద్ధి దుబ్బాకలో ఈ ఆరేండ్లలో జరిగింది. దశాబ్దాలుగా ప్రజల్ని వేధిస్తున్న మౌలిక సమస్యలు రామలింగారెడ్డి హయాంలో పరిష్కారమయ్యాయి. అనూహ్యమైన అభివృద్ధి కళ్లముందు కనిపిస్తున్నది. కానీ, రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చిన ప్రతిపక్షాలు కళ్లు లేని కబోదుల్లా నటిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో 50 ఏండ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ ప్రజలకు తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వని మాట నిజం కాదా? వ్యవసాయానికి మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వక పంటల్ని ఎండ బెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించలేదా? కాంగ్రెస్ పాలన అంటేనే జనానికి కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు గుర్తు కొస్తాయి. ఆనాడు రైతుల్ని కరెంటు ఇవ్వక కాంగ్రెస్ చంపింది, ఈరోజు బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టి చంపాలని చూస్తున్నది. వీళ్లా అభివృద్ధి గురించి మాట్లాడేది? నిజమైన అభివృద్ధిని టీఆర్ఎస్ చేసి చూపించింది. కరెంటు కోతలకు చరమగీతం పాడి రైతుల బాధలు తీర్చింది. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తును నిరంతరాయంగా అందిస్తున్నది. మెరుగైన విద్యుత్తు సరఫరా కోసం దుబ్బాకలో రూ.101 కోట్లతో పద్దెనిమిది 33/11 కేవీ సబ్ స్టేషన్లను, ఒక 132 కేవీ సబ్ స్టేషన్ ను నిర్మించాం. వందలాది ట్రాన్స్ ఫార్మర్లను, వేలాది కరెంటు స్తంభాలను రైతుల మీద రూపాయి భారం వేయకుండా ఏర్పాటు చేశాం. ఒక్క దుబ్బాకలోనే మిషన్ భగీరథ పథకం ద్వారా రూ.400 కోట్లు వెచ్చించి, ఇంటింటికీ పైపులైన్ వేసి, ఉచితంగా నల్లాలు బిగించి స్వచ్ఛమైన నీళ్లు అందించింది టీఆర్​ఎస్​ కాదా? ఆడపడుచుల కష్టాలు తీర్చింది కేసీఆర్ విజన్ కాదా? దుబ్బాకలో మిషన్ భగీరథ విజయం వెనుక రామలింగారెడ్డి శ్రమ ఉన్నదనే మాట నిజం కాదా? ఇది అభివృద్ధి ఔనా కాదా? ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే కదా అసలైన అభివృద్ధి.

నిజాలను దాచిపెతున్న కేంద్రం
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికే దిక్సూచిగా నిలుస్తుంటే, దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం తిరోగమన చర్యలతో రైతులు, పేదల నడ్డివిరుస్తున్నది. రైతులకు వ్యతిరేకంగా విద్యుత్, వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చింది. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించి రైతుల సంక్షేమ బాధ్యత నుంచి తప్పుకుంది. రైతులకు అండగా నిలిచే మార్కెట్ కమిటీలను ఖతం చేసి కార్పొరేట్ దోపిడీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నది. రైతులు ఎక్కడైనా తమ ధాన్యాన్ని అమ్ముకోవచ్చని అందంగా చెప్తున్న కేంద్రం కార్పొరేట్ సంస్థలు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, రైతులు ఎక్కడైనా మోసపోవచ్చనే నిజాన్ని దాచి పెడుతున్నది. మక్కజొన్నల దిగుమతి సుంకాన్ని యాభై శాతం నుంచి పదిహేను శాతానికి తగ్గించి దేశంలోని మక్క జొన్న రైతులకు ఉరితాళ్లు బిగిస్తోంది. దుబ్బాక పౌల్ట్రీ కోళ్లు విదేశీ మక్కలు బుక్కితే దుబ్బాక రైతులు పండించిన మక్కలు ఎవరు కొనాలే? బీజేపీ అభివృద్ధి నమూనా ఇది. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఎంపీ, కేంద్రమంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు. కేంద్ర మంత్రే వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసి రైతుల పక్షాన ఉద్యమిస్తున్నది. బీజేపీ అనుబంధ రైతు సంఘం ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నదంటే అవి ఎంతగా రైతు వ్యతిరేకంగా ఉన్నాయో గ్రహించవచ్చు.

ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదు
బీజేపీ తెచ్చిన విద్యుత్ సంస్కరణల బిల్లు విద్యుత్ రంగంలో రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారాన్ని కాలరాస్తుంది. 24 గంటల ఉచిత కరెంటుతో ఉపశమనం పొందుతున్న తెలంగాణ రైతులకైతే ఈ బిల్లు పిడుగుపాటే. కేంద్రం రెండు వేల ఐదువందల కోట్ల ఎర చూపుతూ తెలంగాణలో ఈ బిల్లు అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. ఇలాంటి ఒత్తిడికి తలొగ్గిన పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నాలుగు వేల కోట్లు తీసుకొని ఈ బిల్లును అమలు చేస్తున్నది. మన సీఎం కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గక రైతుల శ్రేయస్సే పరమావధిగా భావించి కేంద్రం ప్రతిపాదనలు తిరస్కరించారు. నిరసన తెలియచేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. మోటార్లకు మీటర్లు పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ రైతులు ఆమోదిస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారా అన్నదానికి దుబ్బాక ఉప ఎన్నిక తీర్పే గీటురాయి కాబోతున్నది. కరెంటు కోతలతో మోటార్లు కాల్చిన కాంగ్రెస్​కు కర్రుకాల్చి వాత పెట్టబోతున్నారు. మోటార్లకు మీటర్లు బిగిస్తామంటున్న బీజేపీకి గుణపాఠం నేర్పబోతున్నారు. ఉచితంగా 24 గంటలు కరెంటు ఇస్తున్న టీఆర్ఎస్​కే అఖండ విజయాన్ని అందించబోతున్నారు.

దుబ్బాక అభివృద్ధికి ఎన్నో నిధులిచ్చాం
గత ప్రభుత్వాలు చెరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా రూ.162 కోట్లతో దుబ్బాకలోని 738 చెరువులను పునరుద్ధరించింది. ఆరేండ్ల కింద పిచ్చిమొక్కలతో ఉన్న దుబ్బాక రామసముద్రం చెరువు, పెద్దచెరువు.. రామలింగారెడ్డి శ్రద్ధ వల్ల పది కోట్ల నిధులతో ఇప్పుడు అందంగా ముస్తాబై ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ నియోజకవర్గానికి ఇవ్వనన్ని డబుల్ బెడ్రూం ఇండ్లను ఒక్క దుబ్బాకకే ప్రభుత్వం మంజూరు చేసింది. 3,901 ఇండ్లు మంజూరు కాగా, దాదాపు మూడు వేల ఇండ్ల నిర్మాణం పూర్తి కావస్తున్నది. రూ.222.45 కోట్లను ఈ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. కేసీఆర్​ను రామలింగారెడ్డి దుబ్బాక కు ఆహ్వానించి పట్టణాభివృద్ధికి రూ.35 కోట్ల స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ ను సాధించారు. కేసీఆర్ తను చదువుకున్న దుబ్బాక స్కూల్, కళాశాల అభివృద్ధికి రూ.పది కోట్లను ప్రత్యేకంగా మంజూరు చేశారు. దుబ్బాకకు ఫైర్ స్టేషన్ సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటూ వంద పడకల ఆస్పత్రిని సాధించిన ఘనత దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డికి దక్కింది. 282 కోట్ల వ్యయంతో దుబ్బాకలో రోడ్లు అభివృద్ధి అయ్యాయి.

మల్లన్న సాగర్​తో గొప్ప మార్పు
కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా దుబ్బాకలో 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ జలాశయం నిర్మాణం అవుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ఏ నియోజకవర్గానికి అందనంతగా దుబ్బాకలోనే లక్షా ముప్ఫై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు మల్లన్న సాగర్ ద్వారా సాగునీరు అందబోతున్నది. ఇప్పటికే కాలువల ద్వారా చెరువులు నింపే ప్రక్రియ రామలింగారెడ్డి చేతుల మీదుగానే ప్రారంభమైంది. దీనికోసం వేలాది కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. దుబ్బాక రైతులు సంవత్సరానికి కనీసం రెండు పంటలు పండించుకొని దర్జాగా జీవించే రోజులు అతి దగ్గర్లో ఉన్నాయి. మల్లన్న సాగర్ తో ఈ ప్రాంత సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో గొప్ప మార్పు వస్తుంది.

సుజాతక్కకు అండగా నిలుద్దాం
దుబ్బాక, సిద్ధిపేట నియోజకవర్గాలు పక్కపక్కనే ఉంటాయి. సిద్ధిపేట నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు డీలిమిటేషన్ తర్వాత దుబ్బాకలో భాగమయ్యాయి. అందువల్ల దుబ్బాక ప్రజలతో, రామలింగారెడ్డితో ముందునుంచీ నాకు మంచి ఆత్మీయ అనుబంధం ఉంది. సోలిపేట సుజాత నాకు సోదరి లాంటిది. రామలింగారెడ్డి ప్రారంభించిన అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో సుజాతక్కకు అండదండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. నాకు వారి కుటుంబంతో ఉన్న వ్యక్తిగత అనుబంధం రీత్యానే కాకుండా జిల్లా మంత్రిగా అది నా బాధ్యత.

గోబెల్స్​ను మించిన ప్రతిపక్షాల ప్రచారం
ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రజలకు తామేం చేశామో, భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నామో చెప్పటం సబబుగా ఉంటుంది. ప్రతిపక్షాలు అధికారపక్షం మీద వాస్తవాల ఆధారంగా నిర్మాణాత్మక విమర్శలు చేయవచ్చు. కానీ, అందుకు పూర్తి భిన్నంగా దుబ్బాకలో ప్రతిపక్షాలు గోబెల్స్ కూడా సిగ్గుతో తలదించుకునే స్థాయిలో తప్పుడు ప్రచారాలకు తెగబడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి సహించలేకపోతున్న బీజేపీ ఆ పథకాలకు ఖర్చవుతున్న నిధుల్లో అధిక శాతం కేంద్రమే ఇస్తున్నదని బుకాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు నెలకు రూ.2,016 పెన్షన్ ఇస్తున్నది. ఇందులో రూ.1,600 కేంద్రమే ఇస్తున్నదని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారానికి తెరతీశారు. అలాగే కేసీఆర్ కిట్ పథకం కింద ఇస్తున్న రూ.13 వేలలో రూ.8 వేలు కేంద్రమే ఇస్తున్నదని, రైతుబంధు, రైతుభీమా పథకాల్లోనూ కేంద్ర వాటా ఉందని బీజేపీ నేతలు నోటికొచ్చిన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. బాధ్యాతాయుతమైన పదవుల్లో ఉన్నామని మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ల అబద్ధాలను బయటపెట్టాలని, నిజానిజాలు నిగ్గుతేల్చాలని బీజేపీ నేతలకు బహిరంగ సవాలు విసిరాను. బీడీ కార్మికుల పెన్షన్ కోసం కేంద్రం రూ.1,600 ఇస్తున్నట్టు నిరూపిస్తే, తగిన ఆధారాలతో దుబ్బాక బస్టాండ్ దగ్గరకు వస్తే, నేను నా ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవికి అక్కడికక్కడే రాజీనామా చేస్తానన్నాను. ఒకవేళ నిరూపించలేకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పార్టీ పదవికి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాను. నా సవాల్​కు సమాధానం చెప్పలేక బీజేపీ నేతలు ముఖం చాటేశారు. అబద్ధాలతో ప్రజల మనసు గెలుచుకోలేమనే వాస్తవాన్ని బీజేపీ ఇప్పటికైనా గ్రహించాలి.
– శ్రీ తన్నీరు హరీశ్​రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.