Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అభివృద్ధిని చూడండి ఆశీర్వదించండి

-ముందస్తు ఎన్నికలకు కారణం కాంగ్రెస్సే
-కాంగ్రెస్‌పార్టీకి అధికారమిస్తే పంటికి అంటకుండా రాష్ర్టాన్ని మింగేస్తారు
-కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాములు ఢిల్లీకి గులాంగిరీ చేద్దామా?..
-అధికారాన్ని మనదగ్గరే ఉంచుకుందామా?శిథిల తెలంగాణను.. తీర్చిదిద్దుతున్నం
-టీఆర్‌ఎస్ పాలనలో అద్భుత అభివృద్ధి
-సంపద పెరిగేకొద్దీ సంక్షేమ పథకాలు విస్తరిస్తాం
-సాధించాం.. కష్టపడ్డాం.. అభివృద్ధి చేశాం
-కులవృత్తులను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడాం
-మళ్లీ గెలిపిస్తే అల్పాదాయ ఉద్యోగుల వేతనాలు పెంచుతాం హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
-24 గంటల కరంటిస్తే గులాబీ కండువా కప్పుకుంటానన్న జానారెడ్డి నిజాయితీ ఉంటే.. ఆ పని చేసి చూపించాలని డిమాండ్

రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి మళ్లీ టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలకు విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్ అరాచక పాలనే తెలంగాణ వెనుకబాటుకు, కరువుకు కారణమన్న సీఎం.. మరోసారి వారికి అధికారం ఇస్తే పంటికి అంటకుండా రాష్ర్టాన్ని మింగేస్తారని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెసే కారణమన్న కేసీఆర్.. పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ, ఏడు నెలల సమయం ఉన్నప్పటికీ కాంగ్రెస్ చేస్తున్న పిచ్చి ప్రేలాపనలు, అవాకులు చెవాకుల వల్లే ప్రజల ముందుకు వచ్చినట్టు స్పష్టంచేశారు. తెలంగాణలో అభివృద్ధిని కొనసాగించాలనే ఉద్దేశంతో, ప్రభుత్వ ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు తెరదింపేందుకే టీఆర్‌ఎస్ త్యాగం చేసిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వదసభలో ఆయన మాట్లాడుతూ తనదైన శైలిలో ప్రతిపక్షాలను ఎండగట్టారు. మొన్నటిదాకా ఎన్నికలకు డిమాండ్‌చేసిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ఎన్నికలను ప్రకటిస్తే గాయిగాయి అవుతున్నారని ఎద్దేవాచేశారు.

ప్రతిపక్షాలకు నిజాయతీ ఉంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ విసిరారు. సమైక్య పాలనలో శిథిలమైన తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో సంపద పెరిగేకొద్దీ సంక్షేమ పథకాలను విస్తరించుకుంటూ పోతామని తెలిపారు. మేము తప్పులు చేసినం అంటున్నరు కదా.. మీ ఆరోపణల్లో బలం, నిజాయితీ ఉంటే ఎన్నికలకు పోదామా? దమ్ముందా? అని రెండు నెలల క్రితం ప్రతిపక్షాలను అడిగాను. దానికి వాళ్లు.. కమాన్ నీకు దమ్ముంటే పెట్టు కేసీఆర్ అన్నారు. అర్ధరాత్రి ఎన్నికలు వచ్చినా రెడీ అన్నరు. కాంగ్రెస్, బీజేపీ అందరూ అదే చెప్పారు. మంచిది పోదాం అని నిజంగా వస్తే ఇప్పుడు గోర్లు గీక్కుంటున్నరు. ఆగమాగమైతున్నరు. గావరగావరైతున్నరు. మీరు మంచో, మేము మంచో ప్రజల్లోనే తేల్చుకుందాం రమ్మంటే భయమెందుకు? అని కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని, 21.69% వృద్ధి రేటుతో ముందుకు వెళ్తున్నదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను దీవించి మరోసారి గెలిపించాలని కోరారు.

అడగకముందే అనేక పథకాలు ప్రారంభించాం
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరూ అనుకోని కార్యక్రమాలు, అడగకముందే చేస్తున్నామని సీఎం చెప్పారు. టీఆర్‌ఎస్ పాలనతో ప్రజలకు భరోసా, కనీసం బతుకగలుగుతం అనే ధీమా వచ్చిందన్నారు. కల్యాణలక్ష్మి పెట్టమని ఎవరైనా ధర్నాలు చేశారా? కులం మతం తేడా లేకుండా లక్షానూటపదహార్లు ఇస్తున్నం. 50 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ వాళ్లకు పేదలు, మహిళలు గుర్తుంటే మహిళల ప్రసవాల గురించి ఆలోచన చేశారా? కేసీఆర్ కిట్ లాంటివి ఇచ్చారా? సర్కారు దవాఖానలు బాగుచేశారా? అని ప్రశ్నించారు. ఈ రోజు కేసీఆర్ వెయ్యి ఇస్తే మేము రెండు వేలు ఇస్తం అంటరు. ఇదేమన్న అర్రాజు పాటనా? మీ జన్మల వెయ్యి ఇచ్చే ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. గులాబీ జెండా దెబ్బకు భయపడి రూ.2000 ఇస్తామని చెప్తున్నరు. మాకు భయపడే అలా అంటున్నరు తప్పితే.. ప్రజలమీద వాళ్లకు ప్రేమ లేదు. ఇన్నాళ్లూ మీరు చేస్తే మేము వద్దన్నమా? భగీరథ తెచ్చి నీళ్లు ఇస్తా అంటే వద్దన్నమా? 50 ఏండ్ల సమయం చాలలేదా మీకు? ఉన్న చెరువులు తాంబాళాలు అయ్యాయి. మహా సముద్రం గండి పడింది. ఎల్లమ్మ చెరువు మల్లమ్మ కూడా చూడలేకుండా నాశనం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలేదు. వలసపాలకుల కుట్రతో ఒక్క టీఎంసీ నీళ్లకు పెట్టారు. మేం అధికారంలోకి వచ్చాక నేను స్వయంగా కట్టమీదికివచ్చి పరిశీలించి, ఎనిమిదిన్నర టీఎంసీలకు పెంచాం అని చెప్పారు. కేసీఆర్ చేసింది తప్పట! గౌరవెల్లి ప్రాజెక్టు ఎనిమిదిన్నర టీఎంసీ ఉండాలా లేక కష్కెడన్ని నీళ్లు ఉండాలా.. ప్రజలే చెప్పాలి అని కోరారు.

నిర్ణయాధికారం ఎక్కడ ఉండాలి?
కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి గులాంగిరీ చేశారని సీఎం మండిపడ్డారు. తెలంగాణ కోసం మాట్లాడేందుకు నోరు లేదు. ఆంధ్ర సీఎంను చూస్తేనే లాగులు తడుస్తయి. కాంగ్రెస్ స్వతంత్రంగా ఉన్నదా? తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరుగుతయా? బాసులు ఢిల్లీలో ఉంటరట. వీళ్లు గడీల కాడ నిలువడుతరు. టికెట్లకు ఢిల్లీ పోతరు తప్ప ఇక్కడ ఇవ్వరు. కాంగ్రెస్ చక్రవర్తులు ఢిల్లీలో ఉంటరు. మనం సామంతులుగా ఉండాలంటరు! చైతన్యవంతమైన హుస్నాబాద్ ప్రజానీకం ఆలోచన చేయాలి అని చెప్పారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాల్లో తప్పు జరిగి ఉంటే నిరూపించాలని మరోసారి కాంగ్రెస్ నేతలకు సవాలు విసిరారు. ఢిల్లీకి గులాంలమవుదాం, పెత్తనం ఢిల్లీ చేతిలో పెడదం అని వాళ్లు మాట్లాడతున్నరు.. లేదు మన రాజకీయ నిర్ణయం మన చేతిలో ఉండాలి, పెత్తనం తెలంగాణ చేతిలోనే ఉండాలని టీఆర్‌ఎస్ భావిస్తున్నది. ఏది జరుగాలో నిర్ణయించాల్సింది మీరే అని ప్రజలనుద్దేశించి అన్నారు. సంక్షేమ పథకాలపైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. పింఛను రూ.2000 చేస్తా అన్నవ్ కదా.. నేను రూ.2100 అంటా.. మరి అప్పుడు ఏం చేస్తవు? ఇది పద్ధతా? ఆరోగ్యకరమైన పోటీనా? అని ప్రశ్నించారు.

చావు నోట్లో తలపెట్టి వచ్చా
చావు నోట్లో తల పెట్టి రాష్ర్టాన్ని సాధించానని సీఎం గుర్తుచేశారు. నేను ఒకటే మాట చెప్పాను. నేను తెలంగాణ మార్గం వీడితే రాళ్లతో కొట్టమని చెప్పా. ఎట్టి పరిస్థితుల్లో జెండా దించ అని చెప్పిన. మడమ తిప్పను అని చెప్పిన.. అదే పద్ధతిలో మీ అందరి దయతో, ఆశీర్వాదంతో చివరివరకు పోరాడి తెలంగాణ సాధించా. కరంట్ బాధలు పోయినయి, సంక్షేమం జరుగుతున్నది, తెలంగాణ ప్రశాంతంగా నిద్రపోతున్నది. మత కల్లోలాలు, కర్ఫ్యూలు లేవు. అందరూ గౌరవంతో బతుకుతున్నరు. నా కల, లక్ష్యం ఒక్కటే. కచ్చితంగా కోటి ఎకరాలను సస్యశామలం చేసి ఆకుపచ్చ తెలంగాణను సాధించాలి. ఆడబిడ్డలు బిందె పట్టుకొని బజారుమీదికి పోకుండా ఇంట్లోనే గౌరవంగా మంచినీరు పొందాలి. ఆత్మగౌరవంతోని అన్ని వర్గాల ప్రజలు బతకాలి అని చెప్పారు. మేం కష్టం చేసినం, మీ కండ్లముందు ఫలితం ఉంది. మరికొన్ని ఫలితాలు రాబోతున్నయి. గ్యారంటీగా మీ సేవలో అవకాశం ఇస్తే కోటి ఎకరాల మాగాణి సాధిస్తాం. రెప్పపాటు సమయం కూడా కరంట్ పోకుండా తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా రూపొందిస్తాం అన్నారు.

కాంగ్రెస్‌కు అప్పగిస్తే రాష్ట్రం నాశనం
కాంగ్రెస్‌కు రాష్ర్టాన్ని అప్పగిస్తే పంటికి అంటకుండా మింగేస్తారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని దుర్మార్గాలు మళ్లీ వస్తాయని హెచ్చరించారు. అల్పాదాయ ఉద్యోగులతో కాంగ్రెస్ వెట్టి చాకిరి చేయించిందని విమర్శించారు. జీతం పెంచాలని అడిగిన అంగన్‌వాడీలను ఒకడు గుర్రాలతో తొక్కించాడు. మరొకడు వెట్టి చాకిరి చేయించాడు. కానీ పది రూపాయల జీతం పెంచలే అని చెప్పారు. గతంలో అంగన్‌వాడీ జీతం ఎంతో ఇప్పుడు ఎంతో చూడాలని కోరారు. విద్యుత్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వెట్టి చేయిస్తే.. తాము వారిని విముక్తిచేశామన్నారు. ఆశా వర్కర్లకు ఎంత జీతం వస్తున్నదో ఆలోచించాలని కోరారు. వృద్ధులు, ఒంటరి మహిళల గౌరవాన్ని నిలబెడుతున్నామని, వారికి వెయ్యి రూపాయల పింఛను ఇస్తున్నామని చెప్పారు. తమను మళ్లీ గెలిపిస్తే అల్పాదాయ ఉద్యోగుల వేతనాలు మరింత పెంచుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో చేనేతలు, గొల్ల కుర్మలు వృత్తి కోల్పోతే, వారి అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషిచేసిందన్నారు. యాదవుల గౌరవం పెంచేందుకు నాలుగువేల కోట్లతో 70 లక్షల గొర్రెలు ఇచ్చామని, ఇప్పుడు రూ.1500 కోట్ల సంపద తెలంగాణ యాదవుల సొంతమైందని తెలిపారు. కులవృత్తులను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడామని, అన్ని వర్గాల ప్రజలను ఆత్మగౌరవంతో బతికేలా చేస్తున్నామని పేర్కొన్నారు.

మీ దర్శనానికి భగవంతుడు పంపాడు
సిద్దిపేటలో 20 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతో చాలా అనుబంధం ఉంది. ఏ విధంగా పనిచేశామో మీ అందరికీ తెలుసు. తట్టలు పట్టి మట్టి పోసి నిర్మాణాలు చేపట్టాం. గతంలోలాగే మొదటి సభ.. పవిత్రమైన శ్రావణ శుక్రవారం భగవంతుడు మళ్లీ మీ దర్శనానికి పంపాడు. కొత్తకొండ వీరన్న కొలువుదీరిన నేల మన హుస్నాబాద్. నాకు పెద్దన్నలాంటివారు కెప్టెన్ లక్ష్మీకాంతారావు. మీరు దీవించిన సతీశ్ ఏవిధంగా పనిచేశారో చూశారు. చరిత్రలో ఏ రోజు కూడా జరుగని అభివృద్ధి పనులు మేము చేస్తున్న ం అని చెప్పారు. కెప్టెన్ సాబ్ కొడుకు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ తనకు తమ్ముడిలాంటివాడని సీఎం అన్నారు. తన దీవెనలు ఆయనకు సంపూర్ణంగా ఉంటాయని చెప్పారు. తాను సిద్దిపేట బిడ్డనని, హుస్నాబాద్ మీద తనకు సెంటిమెంట్ ఉందని తెలిపారు. హుస్నాబాద్‌లో అడుగు పెట్టి ఎక్కడికి వెళ్లినా ఘన విజయమే తప్ప తనకు ఓటమి రాలేదని, అందుకే మీ ఆశీర్వాదం తీసుకొని యుద్ధానికి బయలుదేరుతున్నానని చెప్పారు. హుస్నాబాద్ దీవెనతో తప్పకుండా తామే గెలుస్తామని, అనుకున్నట్లు బంగారు తెలంగాణ సాధిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు.

ముందస్తు కారణం కాంగ్రెసే
సమైక్య పాలనలో శిథిలమైన రాష్ర్టాన్ని టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పునర్నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అన్నీ మీకు తెలుసు. కొత్తగా ఏమీ చెప్పను. డప్పు కొట్టను. చైతన్యవంతమైన హుస్నాబాద్ ప్రజలు ఆలోచించాలి. దేశంలోని ఏ రాష్ట్రం అభివృద్ధిలో తెలంగాణకు దగ్గరల్లో లేదని చెప్పారు. పసిగుడ్డు అయినప్పటికీ నాలుగేండ్ల నుంచి 17.17% వృద్ధిని నమోదు చేస్తున్నదని, 2018-19లో 21.96% వృద్ధిరేటుతో కొనసాగుతున్నదని తెలిపారు. దేశంలోనే అగ్రగామిగా ఉన్నం. గుజరాత్, మహారాష్ట్ర వంటి పెద్దరాష్ట్రాలకు సాధ్యంకానిది మనకెలా సాధ్యమైంది? అవినీతిరహితంగా, క్రమశిక్షణతో పాలనచేస్తే సాధ్యమైంది అని వివరించారు.

పాలుగారితే ఉద్యమం ఎందుకు చేసేవాళ్లం?
కాంగ్రెస్ పాలనలో పాలుగారితే ఉద్యమం ఎందుకు చేసే వాళ్లం? బ్రహ్మాండంగా పాలన ఉంటే, నీరు వస్తే, కరంట్ వస్తే, పేదరికం పోతే.. కాళ్లుచేతులు గులగుల పెట్టి కొట్లాడినమా? అని కేసీఆర్ ప్రశ్నించారు. సమైక్య దుర్మార్గ పాలన మీద వాళ్లు కొట్లాడి ఉంటే ఈ దుర్గతి తెలంగాణకు వచ్చేదా? క్రియాశీలకంగా పనిచేసుంటే ఎందుకు వచ్చేది ఉద్యమం? సమైక్య పాలనతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చిప్పలు చేత పట్టుకొని టికెట్లు, చందాలు అడుక్కోవటం, పైరవీలు చేసుకోవడంతోనే సరిపోయింది. మంత్రి పదవులు, ఇతర పదవులకోసం కుక్కతోక లెక్క సమైక్య పాలకుల దగ్గర ఉన్నరు. తెలంగాణ ఉద్యమంలో వారేం చేశారో ప్రజలకు తెలుసు అని చెప్పారు. నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే.. హరీశ్‌రావు, ఈటల రాజేందర్, వినోద్‌కుమార్‌వంటి వారు పేగులు తెగేదాక కొట్లాడారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట మాట్లాడలేదు. సిగ్గులేకుండా డూప్లికేట్ రాజీనామాలు చేసి ఇండ్లలో ఉన్నారు అని నిప్పులుచెరిగారు.

సతీశ్‌ను బంపర్ మెజార్టీతో గెలిపించాలి
హుస్నాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌ను బంపర్ మెజార్టీతో అందరూ నివ్వెరపోయే విధంగా గెలిపించాలని సీఎం పిలుపునిచ్చారు. ఇది నియోజకవర్గసభలా లేదని, దాదాపు 70, 80వేల మంది హాజరయ్యారని చెప్తూ.. సతీశ్ గెలుపు తథ్యమని తెలిసిపోతున్నదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సతీశ్ మంచి మనిషి. ఎవరికి గులాంగిరీ చేయలేదు, హత్యారాజకీయాలు చేయలేదు. తెలివితో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నాతోని కొట్లాడి.. హుస్నాబాద్ డివిజన్ సాధించారు అని చెప్పారు. హుస్నాబాద్ పచ్చబడాలని, ఇక్కడి ప్రజల బతుకులు పండాలని సీఎం ఆకాంక్షించారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే మళ్లీ వెనక్కి పోతది. కిందిమీదైతది. వాళ్లు తినడానికే సాలది. ఈరోజు మొదటి సభ.. తొలిరోజే వాళ్ల గురించి నోరు పాడుచేసుకోను అన్నారు.

అభివృద్ధి మీ కండ్లముందే ఉన్నది
టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ప్రజల కండ్లముందే ఉన్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. కల్యాణలక్ష్మి ప్రారంభంలో రూ.50 వేలు ఇచ్చాం. అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెల్వదు. సంపద పెరిగాక రూ.1 లక్ష 116 చేసినం. సంపద పెరుగుతుంటే పెంచుకుంటూ పోయినం. గురుకులాల్లో చదివేది మీ పిల్లలే. కేసీఆర్ కిట్ మీ ఇంటికే వస్తున్నది. 24 గంటల కరంట్‌తో మీ పొలం పండుతున్నది. మిషన్ భగీరథ నీళ్లు వస్తే ఇంట్లోకి నీళ్లు వస్తున్నయి ఆడబిడ్డల కాళ్లు కడుగుతున్నం. ఇవన్నీ మీకు తెలుసు మళ్లీ చెప్పను అని సీఎం పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని చెప్పారు. అన్యాయంగా మనుషులను కాల్చే పద్ధతి బంద్‌చేశాం. అరాచకాల్లేవు. కరంట్ కోతల్లేవు. ఎరువుల కోతల్లేవు. పేకాట క్లబ్లులు లేవు. గుడుంబా బట్టీల్లేవు. తాగునీటి సమస్యల్లేవు. భూ కబ్జాల్లేవు. మట్కాల్లేవు.. గుట్కాల్లేవు. కుంభకోణాలు.. ఫ్యాక్షనిజం.. రౌడీయిజం లేదు. కాంగ్రెస్ హయాంలో ఇవన్నీ వర్ధిల్లిన మాట వాస్తవం కాదా? అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఊరుకో పేకాట క్లబ్బు తయారైతదని, గుడుంబా బట్టీలు మొదలైతవని చెప్పారు.ర

కాంగ్రెస్ హయాంలో విధ్వంసం
కాంగ్రెస్ పాలనలో విధ్వంసం చోటుచేసుకున్నదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, కరిగిపోయే కరంట్‌వైర్లు.. భయంకరమైన పరిస్థితులు అనుభవించాం. వేలు, లక్షలు లంచాలు ఇచ్చే పరిస్థితి నాటిది. అన్నింటినీ సరిచేసుకున్నం. దేశంలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంట్ ఇచ్చే స్థాయికి చేరుకున్నం. వ్యవసాయానికి 24 గంటల కరంట్ ఇస్తే గులాబీ కండువా కప్పుకొని టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేస్తా అని జానారెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తూ.. జానారెడ్డికి నిజాయితీ ఉంటే ఆ పనిచేయాలని డిమాండ్‌చేశారు. సాధించాం.. కష్టపడ్డాం.. అభివృద్ధి చేసి చూపించాం. దేశంలోనే రైతులకు నిరంతరాయంగా కరంట్ ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతున్నది వాస్తవం కాదా? కండ్లున్నయ్యా లేవా? లేకుంటే.. వైద్యపరీక్షలు జరుగుతున్నయి. కాంగ్రెస్‌వాళ్లు పరీక్షలు చేయించుకోవాలి. కాంగ్రెస్ నాయకుల చరిత్ర ఎవరికి తెలియదు? వాళ్లేమైనా గంధర్వులా, కిన్నెరులా, కింపురుషులా! ఆకాశం నుంచి వచ్చారా లేకా ఆకుపసరు తాగి వచ్చారా! 50 ఏండ్లనుంచి దేశాన్ని పాలించిందెవరు? అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ముదనష్టపు, దరిద్రపుగొట్టు, పనికిమాలిన అవినీతివల్ల తెలంగాణతోపాటు, యావత్ దేశం పేదరికంలో మగ్గుతున్నదన్నారు.

అంతర్జాతీయంగా చైనాలో 2.23 లక్షల కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌హైవేలు ఉంటే భారత్‌లో 1900 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ హైవేలు మాత్రమే ఉన్నాయని, ట్రక్ స్పీడ్ అంతర్జాతీయ స్థాయిలో గంటకు 80కి.మీ. ఉంటే, భారత్‌లో 24 కి.మీ.గా ఉందని, గూడ్స్ ట్రైన్ అంతర్జాతీయంగా 86 కి.మీ. వేగంతో వెళుతుంటే.. భారత్‌లో 36 కి.మీ. వేగంతో వెళుతున్నదని వివరించారు. భారత్‌లో 70 వేల టీఎంసీల నీళ్లు ప్రకృతి మనకు ఇచ్చింది. అన్ని అవసరాలకు వాడుకున్నప్పటికీ ఇంకో 30, 40 ఏండ్లదాకా నీటికొరత లేదు. అయినా దేశంలో కోట్ల ఎకరాలు కరువుతో మాడుతున్నయి అని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. కేవలం 193 కిలోమీటర్ల సముద్రతీరమున్న సింగపూర్ ఏడాదికి 5.70 కోట్ల కంటైనర్లను డీల్‌చేస్తుంటే, 7,500 కి.మీ. తీర ప్రాంతం ఉన్న భారత్ 47 లక్షల కంటైనర్లే డీల్ చేస్తుండటం సిగ్గుచేటని చెప్పారు. దీనికి కారణం యాభై ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అసమర్థ, అవినీతి విధానాలు కావా? అని ప్రశ్నించారు. దేశంలో 3.25 లక్షల మెగావాట్ల విద్యుత్ లబ్ధి ఉన్నా.. దేశం ఎందుకు వాడుకోలేక పోతున్నదని నిలదీశారు. దేశంలో ఏ రంగంలో చూసినా అభివృద్ధి అనేదేలేదని, దీనికంతటికీ మూల కారణం కాంగ్రెస్ పాలనేనని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.