Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అభివృద్ధిలో గజ్వేల్ రోల్‌మోడల్

-తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞచేయాలి -గజ్వేల్ నుంచి తెలంగాణ హెల్త్‌ప్రొఫైల్.. జనవరిలో గజ్వేల్‌కు కాళేశ్వరం జలాలు -మాతా, శిశు సంరక్షణ కేంద్రానికి 27 కోట్లు.. గజ్వేల్‌లో ఇండ్లు, పని లేనివారు ఉండొద్దు -కొండపాక వద్ద 7500 ఎకరాల్లో అరోమాటిక్ పార్క్.. పర్యటకప్రాంతంగా మల్లన్నసాగర్ -గజ్వేల్ పర్యటనలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -ఉద్యానవర్సిటీ, ఫారెస్ట్ కాలేజీలకు ప్రారంభోత్సవం -పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభాలు, శంకుస్థాపనలు గజ్వేల్‌లో పండుగ వాతావరణం

అభివృద్ధిలో దేశానికి రోల్‌మోడల్‌గా గజ్వేల్ తయారుకావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. అలా తీర్చిదిద్దడానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలంలో అటవీకళాశాల, పరిశోధనకేంద్రం, కొండా లక్ష్మణ్‌బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన కొండా లక్ష్మణ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను సందర్శించారు. ప్రారంభోత్సవాల సందర్భంగా అక్కడ సీఎం మొక్కలు నా టారు. గజ్వేల్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, మహతి ఆడిటోరియంను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మాతా, శిశుసంరక్షణ దవాఖాన, మున్సిపాలిటీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహతి ఆడిటోరియంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులనుఉద్దేశించి సీఎం ప్రసంగించారు..

గజ్వేల్‌ను చూసి ఇతరులు నేర్చుకోవాలి ఇతరులు చూసి నేర్చుకునేలా గజ్వేల్‌ను రూపుదిద్దుదామని సీఎం కేసీఆర్ పిలుపు నిచ్చారు. ఆ తర్వాత రాష్ట్రమంతా అలాగే మార్చుతామని చెప్పారు. గజ్వేల్ నియో జకవర్గంలో ఇండ్లులేనివారు, పనిలేకుండా ఎవరూ ఉండకూడదని స్పష్టంచేశారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన మాటను ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. ఇప్పటికే చాలాపనుల్లో సక్సెస్ అయినం. ఇంకా ఏదో మిగిలే ఉంటది. ప్రతి కుటుంబానికి ఏదో ఒక పని కల్పించాలి. ఏ గ్రామంలో ఏ పనీలేకుండా ఉన్నవాళ్లు ఎవరు? వారి కోసం ఫ్యాక్టరీలు తెద్దామా? ఇంకా ఏం చేద్దాం? అనేది ఆలోచిద్దాం. ఈ కార్యక్రమాన్ని ఓ ప్రతిజ్ఞలా తీసుకు ని అనుకున్నదని సాధించుకుందాం అన్నారు. CMKCR1 ఇండ్లులేని నిరుపేద కుటుంబం గజ్వేల్ నియోజకవర్గంలో ఉండవద్దని చెప్పారు. ప్రతి గ్రామంలో ఎంతమందికి ఇండ్లుకావాలో అందరికీ ఇచ్చుకోవాలి. పైరవీల్లేవు.. పార్టీల్లేవు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరికి ఇష్టమైనవారికి వారు ఓట్లు వేసుకుంటరు. ఇప్పుడు ప్రజలంతా మనవారే. కచ్చితంగా అందరికీ ఇండ్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. అప్పుడే గజ్వేల్ ఆదర్శంగా తయారవుతుంది. స్వయంసమృద్ధంగా, మనకు మనమే గొప్పగా ఉండేలా గజ్వేల్ తయారుకావాలి. నేను ఒకప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలోని రామునిపట్లలో చేశాను. మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దినం. మనకు మనమే అనుకుంటే ఊరిలోనే ఎంప్లాయిమెంట్ ఇవ్వొ చ్చు. అన్నాహజారే రాలేగావ్‌సిద్దిలో చేశారు. మాజీ కేంద్రమంత్రి మోహన్‌దారియా మహారాష్ట్రలో చేశారు. ప్రొఫెసర్ భండార్కర్ లండన్‌లో చదువుకొనే అవకాశం వచ్చినా త్యాగం చేసి.. కుంకన్ ప్రాంతంలో అద్భుతమైన ద్రాక్ష గార్డెన్స్ పెట్టారు. ఆయన కృషివల్ల ఇప్పుడు మహారాష్ట్ర రూ.10వేల కోట్ల ద్రాక్ష పండ్లను ఎగుమతి చేస్తున్నది.

చేసింది ఒక మనిషి.. ఈ రోజు లక్షలమంది బాగుపడుతున్నరు. ఇక్కడకూడా అంతే. ఒక గ్రామంలో ఒకరికి టైలరింగ్ దుకాణం పెడితే అక్కడే కుట్టించుకుంటాం. మన దుకాణంలోనే చెప్పులు కొంటాం. ఇలా అయితే అం దరికీ పని దొరుకుతది అని సీఎం సూచించా రు. ఇది గజ్వేల్ కోసమే కాదు. గజ్వేల్ ఎమ్మెల్యేగా నాకు స్వార్థం ఉంటది. అందులో తప్పులేదు. తనకుమాలిన ధర్మంలేదని శాస్త్రం చెప్తది. మనం యాడనో గప్పాలు కొడితే.. నీదే సక్కగలేదు.. నాకేం చెప్తవంటరు. గజ్వేల్‌కు పోయి సూడుపో ఎట్లా చేసినమో! అంటే అప్పుడు వింటరు. ఇతరులు నేర్చుకునేలా గజ్వేల్‌ను తయారుచేసుకొని, తర్వాత రాష్ట్రమంతా అలా గే మార్చుతాం అని సీఎం చెప్పారు.

గజ్వేల్ నుంచే తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారుచేయాల్సిన అవసరమున్నదని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌ను గజ్వేల్ నుం చే మొదలుపెట్టాలని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్‌కు సూచించారు. ఎక్కడో వెళుతుం టాం. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే.. జేబులో కార్డు ఉంటే డాక్టర్లు అప్పటికప్పుడు వైద్యం అందిస్తారు. మనిషి ప్రాణం నిలుస్తది. హెల్త్ ప్రొఫైల్‌తో చాలా ఉపయోగం ఉంటది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి మనిషికి హెల్త్‌కార్డు ఉంటది. అటువంటిది తెలంగాణలో కూడా చేయాలనే సంకల్పం నాకు ఉన్నది అని తెలిపారు. మిషన్‌మోడ్‌లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ప్రజాప్రతినిధులు గ్రామాలకు వచ్చే వైద్యసిబ్బందికి సహకరించాలని, కంటివెలుగులాగే సక్సెస్ చేయాలని కోరా రు. ప్రతి మనిషి రక్తనమూనా ఇవ్వడంతోపాటు ఇతర పరీక్షలకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. తర్వాత రాష్ట్రమంతా అమలుచేస్తామన్నారు.

CMKCR2

మంత్రులూ.. గజ్వేల్‌ను కాపాడాలే.. గజ్వేల్ నియోజకవర్గాన్ని ఆయా శాఖల మం త్రులు కాపాడాలని సీఎం కేసీఆర్ కోరటంతో సభలో నవ్వులు విరిశాయి. నాది పది ఊర్ల గాయిదితనం. యాడ మునిగితే యాడ తేలుతమో తెల్వదు. అందుకే మంత్రులు నా గజ్వేల్ దిక్కు చూడాలె. ఇప్పుడే వైద్యశాఖ మంత్రి ఈటల రాజందర్ మరో మాతా, శిశుసంరక్షణ కేంద్రానికి రూ.27 కోట్లు మంజూరుచేశారు. సంతోషం. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రాంరెడ్డినే గజ్వేల్ ఎమ్మెల్యే అనుకోవాలి అని సీఎం చెప్పడంతో మళ్లీ నవ్వులు విరిసాయి. కలెక్టర్ నుంచి ఏ ప్రతిపాదన వచ్చినా వెంటనే మంజూరుచేయాలని.. తానుకూడా మీకు సాయం చేసేదగ్గర చేస్తానని చెప్పడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, సభకు హాజరైనవారి నుంచి నవ్వుల వర్షం కురిసింది. త్వరలోనే ఒక రోజంతా సమావేశం

కేసీఆర్ ఈ మధ్య మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు అనుకుంటున్నరు (నవ్వుతూ). తప్పుకాదు. అనుకుంటేనే పని అయితది. కొద్దిరోజుల్లోనే ఓ రోజు మొత్తం మీ మధ్య ఉండేలా సమావేశం పెట్టుకుందాం అని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రజలకు ఇచ్చినమాట ప్రకారం గజ్వేల్‌లో నాకు పనిలేదు అనేవాళ్లు ఉండకుండా చూడాలనేది తన లక్ష్యమని స్పష్టంచేశారు. ఇంటింటికీ పాడిపశువులను ఇచ్చి, ఆ ఇండ్లు పాడి సంపదతో కళకళలాడాలన్నారు.

7,500 ఎకరాల్లో అరోమాటిక్ పార్క్ నియోజకవర్గంలో 30 వేల ఎకరాల అటవీభూమి ఉన్నదని, మల్లన్నసాగర్ కాల్వ వచ్చే కొండపాక మండలంలోని గిరాయిపల్లి, తిమ్మారెడ్డిపల్లి గుట్టల్లో 7,500 ఎకరాలు ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టు వస్తే ఎప్పుడూ ఇక్కడ నీరు ఉంటుందని, హైదరాబాద్‌కు దగ్గరలో ఉండటంతో మల్లన్నసాగర్ అద్భుతమైన పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ఈ 7,500 ఎకరాల భూమిని ఔషధమొక్కలతో అరోమాటిక్ పార్క్‌గా మార్చాలన్న సీఎం.. స్థానిక మంత్రి హరీశ్‌రావు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీశాఖ అధికారి శోభ వెంట నే ఆ ప్రాంతాన్ని సందర్శించి తగు చర్యలు చేపట్టాలని సూచించారు. పోతే మల్లన్నసాగరే పోవాలనేలా ఆ పార్క్ ఉండాలన్నారు. వికారాబాద్‌కా హవా.. లాఖో మరింజోంకా దవా అని ఒకప్పుడు తెలంగాణలో సామెత ఉండేదని సీఎం గుర్తుచేశారు. అనంతగిరిలో తిరుమల కొండల్లో వచ్చిన విధంగా చెట్ల నుంచి సువాసన వస్తుందని, అక్కడినుంచి రాబుద్ధికాదని అన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

జనవరిలో గజ్వేల్‌కు కాళేశ్వర జలాలు కాళేశ్వరస్వామి దయతో వచ్చే జనవరిలో కాళేశ్వరం నీళ్లు గజ్వేల్‌కు వస్తున్నాయని, ఇది చాలా సంతోషమైన విషయమని సీఎం కేసీఆర్ అన్నా రు. కాల్వలు కూడా పూర్తికావాలని చెప్తూ.. అందుకు ఆయా గ్రామాల పరిధిలో అవసరమైన భూములను అప్పగించాలని రైతులను కోరారు. కాల్వలు పూర్తిచేసుకుని ప్రతి కుంట, చెరువు నింపుకొంటేనే గౌరవం. ప్రతి ఎకరానికి పారాలి. అద్భుతమైన పంటలుపండాలి అని ఆకాంక్షించారు. వందల ఏండ్లు ఉండే మంచిపనికోసం కాల్వల నిర్మాణానికి భూములు అప్పగించాలని, ఇది అందరికోసం జరుగుతున్న పని అని చెప్పారు. ఇక్కడినుంచి శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్‌మానేరు) వరకు రైతులు, ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. మొన్న సూర్యాపేట వెళ్తే ప్రజలు నన్ను బంతిలా ఎగురవేశారు. అక్కడ అద్భుతంగా పనులు జరుగుతున్నాయి. మాకు మార్చి వరకు నీళ్లు కావాలి అని అక్కడివాళ్లు సంతోషంగా అడిగారు. గజ్వేల్‌లో కూడా గోదావరి జలాల పండుగ చేసుకోవాలి. నేను కూడా వస్తాను. కాల్వలు సత్వరం తవ్వుకుంటే చెరువులు ఎండనే ఎండవు. ఇంతకుముందు మార్కెట్ ఓపెన్‌చేసి, చేపలు అమ్మేవారిని అడిగితే.. హైదరాబాద్ నుంచి చేపలు తెస్తున్నామని చెప్పారు. మన చెరువుల్లో నీళ్లుంటే ఈ పరిస్థితి ఉండేదా? అని పక్కనే ఉన్న వంటేరు ప్రతాప్‌రెడ్డిని అడిగిన. ఏడాదిలో ఇక్కడి నుంచి చేపలు హైదరాబాద్‌కు పంపిస్తామని స్థానిక ప్రతినిధులు చెప్తున్నారు. చాలా సంతోషం అని సీఎం అన్నారు.

CMKCR4

తెలంగాణ బిడ్డలూ ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్లు కావాలి తెలంగాణ బిడ్డలకు ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్లుగా అవకాశం దొరుకాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించా రు. ములుగులో ఫారెస్ట్ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ.. దీని ని దేశంలోనే నంబర్‌వన్ కళాశాలగా తీర్చిదిద్దుకుంటామన్నారు. ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ ప్రియాం క వర్గీస్ నా ఆఫీసులో పనిచేస్తున్నారు. ఆమె హరితహారం ఇంచార్జిగా ఉన్నారు. సొంత రాష్ట్రం కేరళ. ఎక్కడ చదువుకున్నావమ్మా? అని అడిగితే తమిళనాడులోని కోయంబత్తూరు పక్క న మెట్టుపాళ్యం ఫారెస్ట్ కాలేజీలో అని చెప్పారు. ఆమె భర్త కూడా అక్కడే చదివారు. ఈ ఒక్క కాలేజీనుంచే 120 మంది ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్లు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. మన తెలంగాణ పిల్లలకు కూడా ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్లుగా అవకాశం దొరకాలని ములుగులో కళాశాల ఏర్పాటుచేసుకున్నాం అని సీఎం వివరించారు.

గజ్వేల్ దేశానికి రోల్‌మోడల్: హరీశ్‌రావు క నియోజకవర్గం ఎలా ఉండాలో.. అలాంటి హంగులతో దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒకేరోజు ఎన్నో అద్భుత కార్యక్రమాలను ప్రారంభించుకోవడం గజ్వేల్ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. గజ్వేల్ నుంచి శాసనసభకు ఎన్నికైన వారంరోజులకే సీఎం కేసీఆర్ ఇక్కడ సభ నిర్వహించి ప్రజలనుద్దేశించి మాట్లాడిన సందర్భాన్ని మంత్రి గుర్తుచేశారు. ఏడాదికాలంలో నియోజకవర్గంలో ఇంటింటికీ నీళ్లివ్వకపోతే నేను గెలిచి వృథా అని ఆ సభలో కేసీఆర్ హామీ ఇచ్చారని, ప్రతి ఇంటికి నల్లాద్వారా స్వచ్ఛమైన మంచినీళ్లు అందించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. గజ్వేల్‌లో మొదలుపెట్టిన ఇంటింటికీ తాగునీరందించే పథకమే ఇప్పుడు మిషన్‌భగీరథ పేరుతో దేశానికే రోల్‌మోడల్ అయ్యిందన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీళ్లు అందించిన తొలి సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టించారని చెప్పారు. గజ్వేల్‌లో జరుగుతున్న అభివృద్ధి చూసి ఇక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకుంటున్నారని, వారి ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నదని అన్నారు.

సీఎం కేసీఆర్ పర్యటన సక్సెస్ -గజ్వేల్‌లో పండుగ వాతావరణం -అడుగడుగునా ప్రజల ఘనస్వాగతం -సీఎం కేసీఆర్‌పై స్థానికుల పూలవర్షం

CMKCR3

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన గ్రాండ్‌సక్సెస్ అయ్యింది. సీఎంకు అడుగడుగునా ఘనస్వాగతం పలికిన ప్రజలు.. ఆయనపై పూలవర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ బస్సులోనుంచే ప్రజలకు అభివాదంచేస్తూ ముందుకుసాగారు. గజ్వేల్ పట్టణమంతా పండుగ వాతావరణం కనిపించింది. తొలుత ములుగులోని అటవీ కళాశాల రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపుజీ ఉద్యాన వర్సిటీని ప్రారంభించడంతోపాటు ప్రాంగణంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండా లక్ష్మణ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పైలాన్ వద్ద విద్యార్థులతో కలిసి మొక్క నాటారు. అటవీ కళాశాల విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు. కాలేజ్ క్యాంప్ ఆఫీస్‌ను మంత్రులతో కలిసి పరిశీలించారు. అనంతరం గజ్వేల్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం 1.05 గంటలకు గజ్వేల్‌లో నిర్మించిన వెజ్, నాన్‌వెజ్ సమీకృత మార్కెట్‌ను ప్రారంభించారు.

మార్కెట్‌లో కూరగాయల వ్యాపారుల వద్దకు వెళ్లి మార్కెట్ నిర్మాణంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. మార్కెట్ మొత్తం కలియతిరిగి సంతృప్తి వ్యక్తంచేశారు. ఆ తర్వాత గజ్వేల్- సంగాపూర్ రోడ్డులోని సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయాలను ప్రారంభించారు. కార్యాలయాల్లోకి వెళ్లి పరిశీలించారు. రూ.27.35 కోట్లతో 100 పడకల మాతా శిశుసంక్షేమ దవాఖాన నిర్మాణానికి, మున్సిపాలిటీ పరిధిలో రూ.100 కోట్లతో నిర్మించనున్న అంతర్గత మురుగు కాల్వల నిర్మాణాలకు శంకుస్థాపనచేశారు. అనంతరం తర్వాత ముట్రాజ్‌పల్లి రోడ్డులోని మహతి ఆడిటోరియాన్ని ప్రారంభించారు. అక్కడే నిర్వహించిన సభలో గజ్వేల్ మున్సిపాలిటీ, గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించారు. గజ్వేల్‌లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి మంత్రులు, ముఖ్యఅధికారులు, నాయకులతో కలిసి భోజనం చేసి.. హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఆయా కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్‌తివారీ, పీసీసీఎఫ్ ఆర్ శోభ, ఎఫ్‌సీఆర్‌ఐ డీన్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్లు వేలేటి రోజాశర్మ, హేమలతగౌడ్, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, మండలి చీఫ్‌విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, ఫారుక్‌హుస్సేన్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పన్యాల భూపతిరెడ్డి, బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు మొరంశెట్టి రాములు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.

CMKCR5

మహతి పేరు నేనే పెట్టిన ఈ ఆడిటోరియం పేరు మహతి. ఇదేం పేరో అర్థంకాక కొందరు తికమక పడుతుంటరు. మహతి పేరు నేనే పెట్టిన. ప్రపంచంలో అతి గొప్ప సంగీత విద్వాంసులు నారద మహర్షి, అతని సహచరుడు తుంబురుడు. వాళ్లిద్దరే ముల్లోకాల్లో ఆరితేరినవారు. నారద మహర్షి వాయించే వీణ పేరే మహతి. ఎంత గొప్ప పేరు! మన గజ్వేల్ ప్రాంతం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ సాహితీ సౌరభం, కళాభినివేశం, ఇవన్నీ కలగలిసి ఈ మహతి ఆడిటోరియం నుంచి యావత్తు దేశానికి, ప్రపంచానికి, రాష్ర్టానికి ఆ వెలుగులు ప్రసరించాలన్నది నా కోరిక. అంత గొప్ప పేరు రావాలి. ప్రతి జిల్లా, నియోజకవర్గ కేంద్రంలో ఇలాంటి ఆడిటోరియాలు తేవాలనే సంకల్పం ఉన్నది. అవి నెరవేరే రోజులు ముందున్నాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.