Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అభివృద్ధి ‘సిద్ది’రస్తు

తెలంగాణకు ‘హరీశ్‌రావు నమూనా’ సిద్దిపేట నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి వాగులపై వరుస చెక్‌డ్యామ్‌లు ఊట చెరువులతో ఊళ్లకు జలకళ పల్లె పల్లెకూ మంచినీరు పది లక్షలకుపైగా టేకుచెట్ల పెంపకం కార్యాలయాలు, బడులకు సొంత భవనాలు

(సిద్దిపేట) చినుకు కురిసింది. నీరు కదిలింది. ఏరు పారింది. రెండు మూడు నెలలు నీటి గలలు! ఆ తర్వాత అంతా నిశ్శబ్దం! పల్లమెరిగిన నీరు పారిపోతుంది! ఏరు ఒట్టిపోతుంది! మరి… పారే నీటిని ఒడిసిపడితే! అక్కడక్కడ పట్టి నిలిపితే! అది పచ్చదనానికి బాటలు వేస్తుంది. జలసిరికి దారులు చూపుతుంది. భూగర్భ జలాలకు ఆయువు పట్టుగా మారుతుంది! ఇది.. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఫలించిన ప్రయోగం. రేపటి తెలంగాణకు ఆదర్శం! దీనికి కారణం… టీఆర్ఎస్ అగ్రనేత హరీశ్‌రావు. చెక్‌డ్యామ్‌లతో సిద్దిపేట రూపు మార్చేశారు. అభివృద్ధి పనులకు తన నియోజకవర్గాన్ని చిరునామాగా మార్చారు.

kcr-harish-checkdam2e మెదక్ జిల్లా సిద్దిపేట నియోజవర్గం! ఈ ప్రాంతం ఒకప్పుడు ‘డార్క్ ఏరియా’. అంటే… బోర్లు వేసినా నీళ్లు పడవు. బావులు తవ్వినా జల కనిపించదు. ‘మీ ప్రాంతానికి బోర్లు మంజూరు చేసేది లేదు’ అంటూ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రైతుల దరఖాస్తులను తిప్పిపంపేది. మరి ఇప్పుడో… బోరు వేస్తే నీరు గ్యారెంటీ. బావుల్లో చేయి చాపితే అందే స్థాయిలో నీళ్లు. నియోజకవర్గంలో అత్యధిక భాగంలో జలసిరి. దీనికి కారణం… భూగర్భ జల మట్టం పెరగడమే. అవి పెరగడానికి కారణం… నియోజకవర్గంలో వాగులు, వంకలపై విస్తారంగా చెక్‌డ్యాములను నిర్మించడం. వీటిని నిర్మించడానికి కారణం… స్థానిక ఎమ్మెల్యే హరీశ్ రావు.

వందలు, వేల కోట్ల రూపాయలు అవసరంలేదు. భూసేకరణ ఉండదు. ఖర్చుతో కూడిన ఎత్తిపోతలూ లేవు. ప్రాంతాల మధ్య వివాదాలు, కోర్టు కేసుల ప్రసక్తే లేదు. తక్కువ వ్యయం, తక్కువ సమయంలో నిర్మించే చెక్ డ్యాములే ఈ జల సిరిని ప్రసాదించాయి. నియోజకవర్గంలోని పెద్దవాగు, మందపల్లి వాగు, నక్కవాగు, అల్లీపూర్ వాగు, నారాయణరావుపేట వాగులున్నాయి. వర్షాలు కురిసినప్పుడు వాగులు ప్రవహించడం, భారీ వర్షాలు కురిస్తే మరింత ఉద్ధృతంగా ప్రవహించడం… ఆ తర్వాత కొన్నేళ్లకు మళ్లీ ఒట్టిపోవడం! ఇదీ పరిస్థితి!? ఆ నీటికి అడ్డుకట్ట వేస్తే జలసిరిని పట్టి నిలపవచ్చు. ఇదేమీ కొత్త ఆలోచన కాదు! మందపల్లి వాగుపై నిజాం కాలంలోనే చెక్‌డ్యాములు నిర్మించారు. కానీ, అవి దెబ్బతిన్నాయి. 1985 నుంచి 2004 వరకు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ఆ చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేసి… కొత్తగా ఏడు చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. నక్కవాగుపై ఒక చెక్ డ్యాం కట్టించారు. ఆ తర్వాత అన్నా హజారే ఆదర్శంగా భూగర్భ జలాలను పరిరక్షించే కార్యక్రమాన్ని హరీశ్‌రావు చేపట్టారు.

నీటి వృథాకు చెక్… హరీశ్‌రావు పెద్దవాగుపై రూ.14.28 కోట్ల వ్యయంతో ఆరు చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. గతంలో అర్ధాంతరంగా ఆగిపోయిన చెక్ డ్యామ్‌ల పని పూర్తి చేశారు. 12 కిలోమీటర్లు పారే పెద్దవాగుపై ఏడు చెక్‌డ్యామ్‌లు ఏర్పాటయ్యాయి. దీంతో మొత్తం వాగు పొడవునా నీరు నిలబడింది. ఇక మందపల్లి వాగుపై కేవలం రూ.2 కోట్ల వ్యయంతో పది చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. అల్లీపూర్ వాగుపై రూ.50 లక్షల వ్యయంతో రెండు, నక్కవాగుపై రెండు చిన్న చెక్‌డ్యామ్‌లు కట్టారు. నారాయణరావుపేట శివార్లలో సుమారు రూ.40 లక్షల వ్యయంతో ఒక చెక్‌డ్యామ్ కడుతున్నారు. మందపల్లి వాగుపై మరో రెండు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. ఇవేకాక… నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సుమారు 200 ఊట చెరువులు నిర్మించారు. నంగునూరు మండలంలో రెండు మెగావాటర్ షెడ్లు, చిన్నకోడూరు మండలంలో ఒక మెగా వాటర్‌షెడ్ ద్వారా ఐదేళ్లపాటు భూగర్భ జలవనరుల పెంపొందించే పనులు చేపట్టారు. ఈ పనులకు ఉపాధిహామీ పథకాన్ని కూడా సమర్థంగా ఉపయోగించుకోవడం విశేషం. మెదక్ జిల్లాకే చెందిన రాష్ట్ర చిన్న నీటి వనరుల శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నియోజకవర్గంకంటే ఎక్కువ పనులు సిద్దిపేటలో జరిగాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. కేవలం చెక్‌డ్యామ్‌లు, ఊట చెరువుల నిర్మాణం కోసమే హరీశ్‌రావు రూ.50 కోట్లు మంజూరు చేయించారు. దీంతో ఒకప్పుడు నీరులేని ప్రాంతమైన సిద్దిపేట ముఖచిత్రమే మారిపోయింది.

kcr-harish-checkdam2

క్లీన్ అండ్ గ్రీన్.. సిద్దిపేట నియోజకవర్గంలోని గ్రామాల కోసం కేసీఆర్ హయాంలో దిగువ మానేరు డ్యామ్ నుంచి గ్రామాలన్నింటికీ తాగునీటి పథకం ఏర్పాటైంది. సిద్దిపేటకు మరో నీటి పథకం మొదలైంది. అయితే… పట్టణ నీటి పథకం ఆశించిన స్థాయిలో పనిచేయక పోవడంతో హరీశ్‌రావు రూ.60 కోట్లతో మరో నీటి పథకం పూర్తి చేయించారు. నియోజకవర్గంలోని 110 గ్రామాల కోసం ఇప్పటికే ఉన్న మంచినీటి పథకం పూర్తిస్థాయిలో అవసరాలు తీర్చలేకపోతోంది. దీంతో బాలవికాస స్వచ్చంధ సంస్థ ద్వారా, ప్రజల భాగస్వామ్యంతో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయిస్తున్నారు. రోజుకు 24 గంటలపాటు ఎప్పుడు కోరితే అప్పుడు ‘కార్డు పెట్టు – నీళ్లు పట్టు’ విధానాన్ని అమలు చేయిస్తున్నారు.

kcr-harish-checkdam2d

విద్యారంగంలో.. విద్యారంగ అభివృద్ధికి హరీశ్‌రావు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ సుమారు 90% పాఠశాలలకు పక్కా భవనాలున్నాయి. బాలికల విద్య కోసం రూ.2.25 కోట్ల చొప్పున వ్యయంతో మూడు కస్తూర్బా పాఠశాలలు మంజూరయ్యాయి. సిద్దిపేటలో పీజీ సెంటర్‌కు అదనపు కోర్సులు, మహిళా డిగ్రీ కళాశాల, ఐటీఐ, నంగునూరులో ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కళాశాల, చిన్నకోడూరు మండలంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ వంటివన్నీ హరీశ్ హయాంలోనే వచ్చాయి. మూడు మోడల్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. మిట్టపల్లిలోని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ విస్తరణ కోసం రూ.6.5 కోట్లు మంజూరు చేయించారు. నియోజకవర్గంలోని ప్రతి హాస్టల్‌కు పక్కా భవనాలున్నాయి. అంతేకాదు… జిల్లాలోని ప్రతి హాస్టల్‌లో నిద్ర చేసిన ఘనత హరీశ్‌రావుకే దక్కుతుంది. ఏటా డిసెంబర్ 31న ఆయన హాస్టల్‌లోనే నిద్రిస్తారు.

అత్యధిక నిర్మల్ గ్రామాలు మెదక్ జిల్లాలో ఇంతవరకు సుమారు 60 గ్రామాలు నిర్మల్ పురస్కార్‌కు (బహిరంగ మల విసర్జనకు దూరం) ఎంపికకాగా అందులో 29 సిద్దిపేట నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఈ సంవత్సరం మరో 21 గ్రామ పంచాయతీలు నిర్మల్ పురస్కారం కోసం పరిశీలనలో ఉన్నాయి. త్వరలో నియోజకవర్గంలోని మొత్తం పంచాయతీలకు నిర్మల్ పురస్కారం అందుకోవాలన్నదే తన లక్ష్యమని హరీశ్‌రావు తెలిపారు.

సుందరంగా సిద్దిపేట పట్టణం సిద్దిపేట రూపు రేఖలను మార్చడంలో హరీశ్‌రావు కృషి ఎనలేనిది. ‘హరిత సిద్దిపేట’ లక్ష్యంగా మూడేళ్లుగా సొంత వ్యయంతో మొక్కలు పంపిణీ చేస్తున్నారు. ఇక… స్టేడియం, మునిసిపాలిటీ కార్యాలయం, కోర్టు భవనాలు, న్యాయమూర్తుల క్వార్టర్లు, ఆర్ అండ్ బీ అతిథి గృహం, తహసిల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, ఫైర్ స్టేషన్, ఆర్టీఏ ఆఫీసు… వీటన్నింటికీ హరీశ్ ఆధ్వర్యంలోనే కొత్త భవనాలు సమకూరాయి. సిద్దిపేటలో భూగర్భ డ్రైనేజీ సదుపాయం కూడా ఉంది. రెండున్నర దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మునిసిపల్ పరిధులను విస్తరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున టేకు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించారు.

ఎలా సాధ్యం? హరీశ్‌రావు అధికార పార్టీపై కత్తులు దూసే నాయకుడు! సర్కారుతో ఢీ అంటే ఢీ అనే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇన్ని అభివృద్ధి పనులు ఎలా సాధ్యం?ప్రజల్లో మమేకం కావడం హరీశ్ అలవాటు. ఎప్పటికప్పడు అవసరాలను గుర్తించి, వాటికి సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించి.. స్వయంగా అధికారుల వద్దకు వెళ్లి పనులు మంజూరు చేయిస్తారు. అవసరమైతే.. సచివాలయంలో ఒక్కో అధికారి వద్దకు ఫైళ్లను స్వయంగా తీసుకెళతారు! ఈ చిత్తశుద్ధి వల్లే సిద్దిపేటకు ఇంత అభివృద్ధి సిద్ధించింది.

Courtesy:Andhrajyothy.com

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.