Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అభివృద్ధి పరుగులు

-కొత్త జిల్లాల ఏర్పాటుతో సాటిలేని పురోగతి -21.7శాతం వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే నంబర్1 -పారిశ్రామికంగా, సంక్షేమపరంగా మనకు సాటి లేదు -అన్ని వర్గాలు, అన్ని రంగాల్లో సమపాళ్లలో సాగుతున్న ప్రగతి -సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు సీఎం వరాల జల్లు -రెండు జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు, పోలీస్ కమిషనరేట్లకు శంకుస్థాపన -సిద్దిపేటలో మెడికల్ కాలేజీ, సిరిసిల్లలో అపెరల్ పార్కులకు భూమిపూజ

భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అందుకోలేని వేగంతో తెలంగాణ ఆర్థికవృద్ధి సాధించి అగ్రస్థానానికి చేరుకున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కేవలం మూడేండ్లలోనే 21.7% వృద్ధిరేటుతో అభివృద్ధిలో అందరికంటే ముందున్నామని చెప్పారు. పారిశ్రామికంగా, సంక్షేమపరంగా, శాంతిభద్రతలతోపాటు.. అన్ని రంగాలలోనూ మునుపెన్నడూ లేనిరీతిలో పురోగతి సాధిస్తున్నామని వివరించారు. రాష్ట్రం ఏర్పడిన ఈ కొద్దికాలంలోనే రైతులు, విద్యార్థులు, నేత కార్మికులు, అన్ని కులవృత్తులవాళ్లు, మహిళలు, వృద్ధులు, పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు.. ఇలా అన్నివర్గాలవారు ఏకరీతిన సంతృప్తి చెందేలా కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్రం తెలంగాణ అని సీఎం పేర్కొన్నారు. పరిపాలనను వికేంద్రీకరించేందుకు 10 జిల్లాల తెలంగాణను 31జిల్లాల రాష్ట్రంగా మార్చుకొన్న తరువాత రాష్ట్రం అభివృద్ధిపథంలో పరుగులు పెడుతున్నదని చెప్పారు.

కొత్త జిల్లాలను ఏర్పాటుచేసి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలకు, పోలీస్ కమిషనరేట్ భవనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ముందుగా తాను పుట్టినగడ్డ అయిన సిద్దిపేటలో కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సీఎం.. మెడికల్ కళాశాల నిర్మాణానికి కూడా భూమిపూజ నిర్వహించారు. జిల్లాలో నిర్మిస్తున్న డబుల్‌బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. అటు సిరిసిల్లలో కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ భవనాలతోపాటుగా అపెరల్ పార్క్, గ్రూప్ వర్క్‌షెడ్ పథకాలకు భూమిపూజచేశారు. రెండు జిల్లాల్లోనూ ముఖ్యమంత్రికి ప్రజలు అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతించారు. సిరిసిల్ల సభలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం చేసి జ్ఞాపికను అందజేశారు. సమైక్యరాష్ట్రంలో పడిన కష్టాలను గుర్తుచేస్తూనే, బాలారిష్టాలను అధిగమించి తెలంగాణ రాష్ట్రం గత మూడేండ్లలో సాధించిన ప్రగతితోపాటు, రానున్న రోజుల్లో చేపట్టనున్న అనేక అభివృద్ధి పనుల గురించి ఈ సందర్భంగా ప్రజలకు సీఎం వివరించారు. ప్రస్తుత రాష్ట్ర అభివృద్ధి రేటుతో పాటు, వ్యవసాయం, విద్యుత్తు, సాగు, తాగునీటి సమస్యల పరిష్కారం, కులవృత్తుల అభివృద్ధి, పారిశ్రామీకరణ, ఐటీ, ఫార్మారంగాల్లో సాధిస్తున్న పురోగతి గురించి చెప్పారు. రెండు సభల్లో ముఖ్యమంత్రి ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ఎన్టీఆర్ హయాంలోనే జిల్లా కోసం దరఖాస్తు 1982లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయి.. టీడీపీలో పనిచేస్తున్న. ఆనాటి సీఎం స్వర్గీయ ఎన్టీరామారావు సిద్దిపేట మీదుగా కరీంనగర్ పయనమైపోతున్నడు. అప్పుడు మీ ఎమ్మెల్యే హరీశ్ చిన్న పిల్లవాడు. చింతమడకలో ఉండి పెద్దగుంట పాఠశాలలో చదువుతున్నడు. ఆ సందర్భంలో నేను, ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి బాలమల్లు, ఇంకా కొంతమంది మిత్రులం సిద్దిపేట జిల్లాకు సంబంధించిన దరఖాస్తు రాయించి.. మ్యాప్ గీయించి, అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్‌కు ఇచ్చిన. అలా చాలా దరఖాస్తులు ఇచ్చినం. చాలా దండాలు పెట్టినం. ఎందుకో ఆయన చేయలేకపోయిండు. ఆయనే మంచిర్యాల జిల్లా చేస్తామని ప్రకటించారు. కానీ, చేయలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన అనేకమంది సీఎంలు చేయలేకపోయినారు. ఇక్కడ ఒక్క మాట చెప్పాలి. భారతదేశంలో గత ఆంధ్రప్రదేశ్, మొన్న వెస్ట్‌బెంగాల్ తప్ప.. మిగతా అన్ని రాష్ర్టాలూ పరిపాలన సంస్కరణలు చేసి జిల్లాల సంఖ్యను పెంచుకున్నయ్.

మన ఉనికి, మన ఆత్మగౌరవం, మన వనరులు, మన ఉద్యోగాలు, మన నీళ్లు మనకే దక్కడంకోసం తెలంగాణ ఉద్యమానికి నడుంకట్టినం. మీరే నన్ను దీవించి పంపించిండ్రు. మీ అండదండతో మీరిచ్చిన ఆశీర్వచనంతో రాష్ట్ర సాధన జరిగింది. ఆ తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయనటువంటి సాహసం చేసి.. పది జిల్లాల తెలంగాణను 31 జిల్లాల రాష్ట్రంగా మార్చుకున్నం. సిద్దిపేట నేను పుట్టినగడ్డ కాబట్టి, గత దసరా రోజున జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను సిద్దిపేటకు వచ్చాను. భవనాల రూపకల్పన, డిజైన్లు, దానికి నిధులు సమకూర్చి, ఇప్పుడు మన చీఫ్ సెక్రటరీ మనవి చేసినట్లుగా సుమారు రూ.1300కోట్లు మంజూరు చేసుకుని, సమీకృత కలెక్టరేట్లు, పోలీసు కమిషనర్ కార్యాలయాలను అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో నిర్మించుకుంటున్నం. కూలిపోయేదశలో ఉన్న పాత జిల్లాల్లో కూడా నిర్మాణాలు కొనసాగించుకుంటున్నం. చాలా సంతోషంగా ఉన్నది.

ఈ మట్టిపై మొలకెత్తిన బిడ్డను సిద్దిపేటలో మా గురువు దుబ్బాక పాఠశాల మృత్యుంజయశర్మ, ఇతర గురువుల దయతో, ఈ మట్టిలో మొలిచిన మొలుకను నేను. వారు నేర్పిన భాష, సంస్కారం.. అదంతా వారి దయే. ఇక్కడే డిగ్రీ కళాశాలలో చదువుకున్నా. ఇక్కడే మీ దీవెనతో ఎమ్మెల్యేగా రాజకీయాల్లో మొలుకెత్తడం జరిగింది. అంచెలంచెలుగా ఎదిగి, గత 35 సంవత్సరాలుగా బతికి ఉండగానే కోరుకున్న రాష్ర్టాన్ని సాధించుకోవడం, పుట్టినగడ్డ సిద్దిపేట జిల్లా కావాలని కోరుకుని దాన్ని సాధించుకోవడం, నేనే అధికారికంగా సంతకంపెట్టి దాన్ని మంజూరుచేయడం, ఈ రోజు జిల్లా కార్యాలయానికి శంకుస్థాపనచేసే అవకాశం రావడం నా అదృష్టం. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు రెండు చేతులెత్తి దండంపెడుతున్న. నేను ఇంటర్ చదువుకొనేటప్పుడు ముల్కీ సర్టిఫికెట్ కోసం సిద్దిపేట నుంచి సంగారెడ్డికి వెళితే ఫారిన్‌కు వెళ్లినట్లు అయ్యేది. ఇప్పుడు సిద్దిపేట 50-55 కిలోమీటర్ల పరిధితో జిల్లా అయ్యింది. ఈ జిల్లా అభివృద్ధిలో మంత్రి హరీశ్‌రావుతో ఇతర ప్రజాప్రతినిధులూ భాగస్వాములే. కలిసి అభివృద్ధి చేసుకుంటున్నరు. జిల్లాలో మంచిటీమ్ కుదిరింది. మంత్రితోపాటు కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి బాగా పనిచేస్తున్నరు.

21.75 శాతం గ్రోత్‌తో కేంద్ర ఆర్థికశాఖ, కాగ్ లెక్కల ప్రకారం.. ఆర్థికవృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకున్నం. 21.7% గ్రోత్‌తో అభివృద్ధిలో ముందున్నాం. శాంతిభద్రతలు బ్రహ్మాండంగా ఉన్నయి. పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నయి. రూపాయి లంచం లేకుండా ఐదు వేల పరిశ్రమలకు అనుమతినిచ్చాం. పోలీసులకు, అధికారులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న. ఇదే స్ఫూర్తితో పని చేయాలని సీఎస్ ద్వారా మీ అందరినీ కోరుతున్నా. రైతులకు 17 వేల కోట్ల రుణమాఫీ చేశాం.. ఇంకా చేస్తాం. వ్యవసాయరంగంలో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు ఎరువులను అందిస్తున్నం. గతంలో ఎరువులకోసం లైన్‌లో చెప్పులు పెట్టుకుని ఉండేవారు. హరీశ్ నల్లగొండకు పోతే 24 గంటలు కరెంటు వద్దని అడుగుతున్నరు. తెలంగాణ రైతులను ఒక ఆర్గనైజింగ్ ఫార్మాట్లోకి తీసుకొస్తున్నం. దీంతో పండిన పంటలకు ధర వచ్చేలా చేస్తం. గతంలో పండిన పంటకు ధర రావడం లేదని నేనే ధర్నాలు చేసిన. రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.8 వేలు వచ్చే సంవత్సరం నుంచి ఇస్తాం. హరీశ్ నాయకత్వంలో రంగనాయక్‌సాగర్ త్వరలో పూర్తవుతుంది. సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు కోర్టులకు వెళుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నయి. సిద్దిపేట భూమి బంగారం.. వచ్చే ఏడాది సిద్దిపేటకు చదువుకోవడానికి విద్యార్థులొస్తరు. సిద్దిపేటకు రైలు వస్తది. చెరువుల్లో నీళ్లొచ్చినయ్. మంచినీళ్లు వచ్చినయ్. సాగునీళ్లు రావాలె. వస్తయి.

సంక్షేమంలో నంబర్ 1 రూ.44వేల కోట్లతో సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నది. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నం. వృద్ధులకు వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తున్నం. బీడీకార్మికులను గతంలో ఎవరూ పట్టించుకోలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా వారికి కూడా నెలకు వెయ్యి పింఛను ఇస్తున్నం.

సర్కారు దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి పలు ప్రైవేటు హాస్పిటళ్లు అవసరం లేని ఆపరేషన్లు చేస్తున్నయి. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్‌కిట్ పథకాన్ని తెచ్చినం. దీంతో ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు భారీగా పెరిగినయి. పథకం అమల్లోకి రాక ముందు రాష్ట్రంలో ఏడాదికి 1.20 నుంచి 1.60 లక్షల ప్రసవాలు సర్కారు దవాఖానల్లో జరిగితే.. ప్రస్తుతం ఆ సంఖ్య 4.80 లక్షలకు పెరిగింది.

నేత కార్మికులను ఆదుకుంటాం.. పవర్‌లూం, చేనేత కార్మికులను ఆదుకొనేందుకు ఇప్పటికే రూ.వెయ్యి కోట్లతో పలు పథకాలను అమలు చేస్తున్నం. ఒక్క సిరిసిల్ల పట్టణానికే రూ.800 కోట్లు వచ్చినయి. నూలుపై ఇప్పటికే పదిశాతం సబ్సిడీ ఇస్తున్నం. చేనేత కార్మికులకు వివిధ రకాల వస్తువులపై యాభైశాతం సబ్సిడీ ఇస్తున్నం. రూ.30 కోట్లతో సిరిసిల్లలో అపెరల్ పార్కు ఏర్పాటుచేస్తున్నం.

చెంప ఛెళ్లుమనిపించండి.. ప్రతి నేతకార్మికుడికి నెలకు రూ.15 వేల వేతనం అందేలా పలు పథకాలతో ముందుకు వెళ్తున్నం. నేత కార్మికులకు పని ఉండాలన్న లక్ష్యంతో స్కూల్ పిల్లల యూనిఫారాలకు కావాల్సిన వస్ర్తాన్ని నేసేందుకు రూ.300 కోట్ల ఆర్డర్ ఇచ్చినం. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరెలు ఇవ్వాలన్న లక్ష్యంతో కార్మికులకు రూ.200 కోట్ల ఆర్డర్లు ఇచ్చినం. ఇవన్నీ మంచి ఉద్దేశంతో చేస్తుంటే కొన్ని పార్టీలు వక్రీకరిస్తున్నాయి. అవాస్తవ ప్రచారాలుచేస్తున్నవారికి మీరే బుద్ధి చెప్పాలె. కార్మిక కుటుంబాలన్నీ మౌనం వీడి, అవాకులు, చెవాకులు పేలే నాయకుల చెంప ఛెళ్లుమనిపించాలె.

గోదావరి నీళ్లతో కాళ్లు కడుగుతా ఒకేసారి 21 జిల్లాలను ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే మొదటిది. అలాగే 125 కొత్త మండలాలను ఏర్పాటుచేసినం. ఆరంభంలో ఇది ఎలా సాధ్యమని అందరూ ఆశ్చర్యపోయిండ్రు కానీ.. అద్భుతంగా ముందుకు సాగుతున్నయి. ప్రతి సంక్షేమకార్యక్రమానికి అడ్డుపడేలా పలు పార్టీలు ప్రయత్నిస్తున్నయి. కాళేశ్వరం పథకంలోనూ అదే పంథాను అనుసరిస్తున్నరు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా గోదావరి నీళ్లు తీసుకొచ్చి మీ కాళ్లు కడుగుతా. మిషన్‌భగీరథ పథకం కింద మరో మూడు నాలుగు నెలల్లో ఇంటింటికీ మంచినీరు ఇచ్చి తీరుతం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా నేత, మత్స్యకారులు, యాదవులకు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నం. అన్నదాతలను బలోపేతం చేసేందుకు రైతు సమన్వయసమితులను ఏర్పాటు చేస్తే.. ప్రతిపక్షాలు వాటినీ వక్రీకరిస్తున్నయి.

హామీ ఇచ్చిన రోజే.. శంకుస్థాపన: మంత్రి హరీశ్ సిద్దిపేట కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. జిల్లా ఏర్పడి సంవత్సరం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లా ఏర్పాటు హామీ ఇచ్చిన రోజే శంకుస్థాపన చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. సిద్దిపేట గురించి సీఎంకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదని గుర్తుచేశారు. వారు కలల కన్న నేడు కోమటి చెరువును మనమంతా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. డబుల్ బెడ్‌రూం నిర్మాణంలో అధికారులెంతో శ్రద్ధ చూపిస్తున్నారు. సీఎం స్ఫూర్తితోనే ముందుకుపోతున్నామని.. తాము అడిగినవన్నీ సీఎం మంజూరు చేస్తున్నారని.. హుస్నాబాద్, చేర్యాలలో కార్యాలయాల నిర్మాణాలకు ఆశీస్సులు అందించాలని కోరుతున్నానని తెలిపారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో నంబర్ వన్ స్థానంలో సిద్దిపేట జిల్లా ముందుకు వెళుతున్నదని అన్నారు.

ప్రజల ఆకాంక్షలు గౌరవించే సీఎం: మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో జరిగిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రంగా ఉన్న ఈ గడ్డను జిల్లాగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి రాజన్న-సిరిసిల్ల జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి గౌరవిస్తారని చెప్పడానికి రాజన్న-సిరిసిల్ల జిల్లా ఏర్పాటే నిదర్శనమన్నారు. సీఎంనుద్దేశించి.. సిరిసిల్ల గురించి మీకు చెప్పడమంటే హన్మంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్లు అవుతుందన్నారు. రూ.400 కోట్లతో వేములవాడ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ సామర్థ్యం పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంతోపాటు ప్రభుత్వ చేపడుతున్న అన్ని పాలన సంస్కరణలకు అండగా నిలుస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

సిరిసిల్ల – వేములవాడ ప్రాంతం గతంలో కరువుతో అల్లాడింది. సమైక్య రాష్ట్రంలో జరిగిన ఆకలి చావులు, అత్మహత్యలు నన్ను కలిచివేసినయి. అత్మహత్యలు చేసుకోవద్దు అంటూ గతంలో సిరిసిల్ల గోడలపై రాసిన రాతలు నన్ను కంట తడిపెట్టించినయి. బిడ్డలు పిట్టాల్లారాలి పోతున్నారని, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని నాటి ముఖ్యమంత్రికి మొరపెట్టినా.. పెడచెవిన పెట్టిండ్రు. భూదాన్‌పోచంపల్లిలో ఒకే రోజు ఏడుగురు నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నరు. ప్రభుత్వం స్పందించకపోవడంతో మేమే బిచ్చమెత్తి ఒక్కో కుటుంబానికి రూ.50వేలు ఇచ్చి ఆదుకున్నం. సిరిసిల్లలోనూ ఒకే రోజు తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నరు. పార్టీ ఫండ్ నుంచి రూ.50 లక్షలు ఇచ్చి ఆదుకున్నం. స్వరాష్ట్రంలో ఆ బాధలన్నీ దూరంచేయాలని ఆనాడే నిర్ణయించుకున్నం. అందుకే కొత్త పథకాలకు శ్రీకారం చుట్టాం.

ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యి రాష్ట్రపతి సంతకానికి పోయినప్పుడు నేను వారిని కలువడానికి వెళ్లాను. వారు నా ముందే ఫైలు తెప్పించి సంతకం చేసి.. చంద్రశేఖరరావు.. నీ జీవితం ధన్యమైంది. రాష్ట్రం కావాలని కోరుకున్నవు. బతికుండగనే సాధించుకున్నవ్ అంటూ ఆశీర్వచనం కూడా ఇచ్చిండ్రు.

నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిచ్చినా.. సిద్దిపేట రుణం తీర్చుకోలేను. నాకు జన్మనిచ్చింది సిద్దిపేట.. రాజకీయ జన్మను ఇచ్చిందీ సిద్దిపేటే. ఎక్కడైనా అనర్గళంగా ప్రసంగించే శక్తినిచ్చింది, పోరాడే బలాన్నిచ్చింది, పదవులు, పలుకులు ఇచ్చింది, తెలంగాణను సాధించే ఆత్మశక్తినిచ్చింది సిద్దిపేటే. ఎల్లవేళలా అండదండలిచ్చిన నా సిద్దిపేటకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రాష్ట్రంలో నంబర్ వన్ జిల్లా సిద్దిపేట కావాలె. నేను ఈ భూమి బిడ్డగా మీరు ఏది అడిగినా కాదనను. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచేలా.. నంబర్ వన్ జిల్లా కావాలె. – ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.