-దేశంలో పరివర్తన కోసం జాతీయ పార్టీ
-తెలంగాణ సాధించి అగ్రగామిగా నిలిపాం
-ఇప్పుడు దేశం బాగు కోసం కొట్లాడుదాం
-గుణాత్మక మార్పు, సమాఖ్య స్ఫూర్తి లక్ష్యం
-రత్నగర్భ భారత్.. అమెరికాను దాటే శక్తి
-గెలువాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు
-దేశంలో రైతులు ధర్నా చేసే పరిస్థితి రావొద్దు
-కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి పనిచేస్తాం
-కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేస్తాం
-14న ఢిల్లీలో బీఆర్‌ఎస్ ఆఫీస్ ప్రారంభం
-బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్
-దేశ సమగ్రాభివృద్ధి కోసం సరికొత్త పాలసీలు
-త్వరలో దేశ ప్రజల ముందు పెడతాం
-దేశవ్యాప్తంగా రైతుబంధు, రైతుబీమా
-అధికారంలోకి వచ్చాక రెండేండ్లలోనే
-దేశమంతా 24 గంటల కరెంటు ఇస్తాం
-దళితబంధు పథకం తరహాలో ఏటా
-25 లక్షల మందికి సాయం: సీఎం కేసీఆర్
-దేశానికి కేసీఆర్ నాయకత్వం తక్షణ అవసరం: జేడీఎస్ నేత కుమార స్వామి

టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ ఎన్నికల సంఘం పంపిన ఉత్తర్వులపై సంతకం చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
దేశ నదుల్లో 70- 75 వేల టీఎంసీల నీళ్లు ప్రవహిస్తున్నాయి. అయినా నీటి ఎద్దడి, రాష్ర్టాల మధ్య పంచాయితీలు, దశాబ్దాల గొడవలు. కావేరి నది కోసం కర్ణాటక, తమిళనాడు మధ్య ఎందుకు గొడవలు జరగాలి? తెలంగాణ తన నీటి వాటా కోసం ఎందుకు పోరాడాలి? చెన్నై అద్భుతమైన నగరం. అక్కడ బకెట్ నీళ్ల కోసం ఎందుకు విలవిలలాడుతున్నరు?
ఇంత సుసంపన్నమైన పంటలు పండే భూములు ఉండి, 75వేల టీఎంసీల నీళ్లు ఉండి, పనిచేయగలిగే 130 కోట్ల జనం ఉండి, ఆకలి బాధలు ఎందుకు పడాలె? రైతులు నెలలపాటు ఎందుకు ధర్నాలు చేయాలె? ఈ దుస్థితి ఇంకా ఎంతకాలం?
ప్రపంచంలో ఏ దేశానికైనా అత్యంత విలువైనవి మానవ వనరులు. భారతదేశంలో 52శాతం యువశక్తి ఉన్నది. వాళ్లను నిర్వీర్యం చేస్తున్నరు. మతోన్మాదం పేరుతో రెచ్చగొడుతున్నరు. మనం గుడ్లప్పగించి చూస్తున్నం. ఈ దుస్థితి ఇలాగే కొనసాగితే భయంకరమైన పరిణామాలు వస్తాయి.
తెలంగాణలో మార్పును చూసినట్టే.. దేశంలోనూ పరివర్తన చూడబోతున్నం. ఉత్తమమైన గుణాత్మకమైన మార్పు కోసం, ఉన్నతస్థాయికి చేరుకొనే ఆర్థిక పరిపుష్టి కోసం నడుం బిగిద్దాం. రాష్ట్ర హక్కులు, దేశ హక్కులు అని కాకుండా దేశం మొత్తం ఏకోన్ముఖంగా అద్భుతమైన పరిపుష్టం చెందేలా బాటలు పడాలి.
– ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలో మార్పును చూపెట్టినట్టే.. దేశంలో పరివర్తన తెచ్చేందుకే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఏర్పాటైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఎవరెంత హేళన చేసినా స్థిర సంకల్పంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, ఎనిమిదేండ్లలోనే అద్భుత పురోగతితో దేశానికే మార్గనిర్దేశం చేసే స్థాయికి ఎదిగామని చెప్పారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో దేశంలో ఉత్తమ, గుణాత్మక మార్పు కోసం, ఉన్నత స్థాయికి చేరుకొనే ఆర్థిక పరిపుష్టి కోసం కొట్లాడుదామని పిలుపునిచ్చారు. ఒకప్పుడు ఎడారిగా ఉన్న తెలంగాణ ఎనిమిదేండ్లలోనే ఇంతగా మారితే.. రత్నగర్భగా ఉన్న మనదేశాన్ని ఎంతలా మార్చవచ్చో ఆలోచించాలని కోరారు. ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ బీఆర్‌ఎస్ నినాదమని ప్రకటించారు. కర్ణాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలే బీఆర్‌ఎస్ తొలి టాస్క్‌గా అభివర్ణించారు.
శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కేంద్రంలో అధికారం చెలాయించిన పార్టీల అసంబద్ధ విధానాల వల్లనే ప్రస్తుతం దేశంలో అంధకార పరిస్థితులు నెలకొన్నాయని.. బీఆర్‌ఎస్ ద్వారా ఆ కారుచీకట్లను తొలిగించే చైతన్య దీపం వెలిగిద్దామని పిలుపునిచ్చారు. రాదనుకున్న తెలంగాణను సాధించినట్టే.. భవిష్యత్తులో ఎర్రకోటపై బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. దేశ సమగ్రాభివృద్ధి కోసం కొత్త పాలసీలు రూపొందిస్తున్నామని, త్వరలోనే వాటిని దేశ ప్రజల ముందు పెడతామని చెప్పారు. 14న ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్న అనేక అంశాలు ఆయన మాటల్లోనే..
రాష్ట్రాన్ని సాధించి ఫలితాలు తెచ్చాం
ఈ రోజు తెలంగాణ గడ్డ మీది నుంచి బీఆర్‌ఎస్ పతాకాన్ని ఎగురవేయడం సంతోషంగా ఉన్నది. ఇది ఆవేశంలోనో, ఆషామాషీగానో చేస్తున్న పనికాదు. మన కలలు రెండుమూడు రోజుల్లో నెరవేరేవి కాదు. ఇదొక ప్రారంభమే. 2001లో తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని ఆకాంక్షించి.. పిడికెడు మందితో గులాబీ పతాకాన్ని, టీఆర్‌ఎస్ ఆవిర్భావాన్ని ప్రకటించుకొన్నాం. చిత్తశుద్ధితో, అంకిత భావంతో, అనేక త్యాగాలతో 14-15 ఏండ్ల కృషితో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ప్రజలు పాలనా బాధ్యత అప్పగిస్తే.. ఎనిమిదేండ్లుగా ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. టీఆర్‌ఎస్ ప్రయాణంలో అవహేళనలు, ఛీత్కారాలు, శాపాలు, దీవెనలు, అనేక రకాల కామెంట్స్ ఎదుర్కొన్నాం. కానీ లక్ష్యంవైపు స్థిరంగా, బలంగా అడుగులే స్తూ.. పిడికెడు మంది వేలమందై, లక్షలై ఉప్పెనలా విజృంభించి రాష్ర్టాన్ని సాధించుకొన్నాం.
ఈ రోజు బీఆర్‌ఎస్ కుటుంబ సభ్యుల సంఖ్య 60 లక్షలు. వేల మంది సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు సభ్యులుగా, జడ్పీ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, సహకార సంస్థల నాయకులుగా, కార్పొరేషన్ల చైర్మన్లుగా, మంత్రులుగా పనిచేస్తున్నరు. పిడికెడు మందితో పుట్టిన పార్టీ అనతికాలంలోనే రాష్ర్టాన్ని అద్భుత ప్రగతిబాటలో పెట్టింది. కరోనా మహమ్మారితో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా, అన్ని రాష్ర్టాల వృద్ధి మైనస్‌లోకి పడిపోయింది. రాష్ట్ర వృద్ధిరేటు తగ్గినా, మైనస్‌లోకి పోలేదు. 2 శాతం వృద్ధి సాధించింది. పటిష్ఠఆర్థిక పునాదులు, ఆర్థిక నియంత్రణ, పూర్తిస్థాయి క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడిపిన విధానం ఈ అద్భుత ఫలితాన్ని తెచ్చిపెట్టింది.

దేశానికి మార్గనిర్దేశనం చేసే స్థాయికి చేరాం
ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటేనే బాధలు, బొంబాయి బస్సుల్లో రోదనలు, గంజి కేంద్రాలు, ఎడారులను తలపించే పల్లెలకు చిరునామా. ఉద్యమ సమయంలో అనేకమంది కవులు పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోన అని రాశారు. నేను దళితబంధు కోసం పాటలు రాసే సమయంలో కవులు గోరటి వెంకన్న, సాయిచంద్, రసమయితో చర్చిస్తుంటే, పాలమూరు గుర్తుకొచ్చింది. పాలమూరులో వచ్చిన మార్పు గురించి ‘పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి.. మిషన్ కాకతీయతో చెరువులన్నీ నింపి.. పన్నీటి జలకం ఆడి.. పాలమూరుతల్లి పచ్చని పైట కప్పుకున్నది’ అని రాయండి అని వాళ్లకు చెప్పిన. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి కార్యక్రమానికి వెళ్లేటప్పుడు కావాలనే ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలను, మంత్రులను నాతోపాటు బస్సులో కూర్చొబెట్టుకొని తీసుకుపోయిన. అక్కడి పంట కోతలు, హార్వెస్టర్లు, ధాన్యం రాశులను చూసి చాలా సంతోషపడ్డం. గతంలో ప్రొఫెసర్ జయశంకర్, నేను అనేక సందర్భాల్లో పర్యటించినప్పుడు ‘పాలమూరులో అడివి కూడా బక్కవడ్డదయ్యా’ అని బాధపడ్డరు. కృష్ణా, తుంగభద్ర మధ్య ఉండే నడిగడ్డలో దుస్థితిని చూసి కండ్లనీళ్లు పెట్టుకున్నం.
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పరిస్థితిని చూసి కండ్లల్ల నీళ్లు తిరిగినయి. అలా అనేక రకాల పరిస్థితులను అధిగమించి దేశానికి అద్భుతమైన మార్గనిర్దేశనం చేసే స్థాయికి చేరుకొన్నాం. చాలా మంది ముఖ్యమంత్రులు నాతో మాట్లాడుతూ ‘చాలా అసాధ్యం అనుకున్న పనులన్నీ మీరు అద్భుతంగా చేశారు’ అని చెప్పారు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు మెట్రోరైలు శంకుస్థాపన కోసం పోతుంటే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నాతోపాటు ఉన్నరు. ఫతుల్లాగూడలో సర్వమత శ్మశానవాటికను అద్భుతంగా నిర్మించినమని చెప్పిండు. ఇలా సంస్కారవంతమైన పద్ధతుల్లో తెలంగాణను మనం ముందుకు తీసుకుపోయిన విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఇది ప్రతి ఒక్కరి కష్ట ఫలితం. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ప్రాంతం లో అభివృద్ధి పనుల కోసం ఒక సామాన్య కార్యకర్తలాగా ఒకటికి పదిసార్లు నాకు ఫోన్ చేసి మాట్లాడి, తన చాంబర్‌కు పిలిపించుకొని, నా చాంబర్‌కు వచ్చి చర్చలు జరుపుతారు. అక్కడ రెండుమూడు లిఫ్ట్‌లు ప్రారంభిస్తే, వాటికి మధ్యలో ఉండే ఒక ప్రాంతంలో క్యాంప్ ఆఫీస్‌లాగా ఏర్పాటుచేసుకొని రోజూ మానిటర్ చేస్తున్నరు. ఎంత దీక్షతో, పట్టుదలతో ఎక్కడివాళ్లు అక్కడ పనిచేశారు కాబట్టే ఇప్పుడు మనకు కనిపిస్తున్న తెలంగాణ సాకారమైంది.
తెలంగాణే మారితే.. దేశమెంత మారాలె!
ఎడారిగా మారి, వలసలు పెరిగిపోయి, మంచినీరు దొరకని తెలంగాణే ఎనిమిదేండ్లలో ఇంత బాగా అభివృద్ధి చెందగలిగితే.. భారతదేశం రత్నగర్భ, అద్భుతమైన, అపారమైన మానవ సంపద, ప్రపంచంలో ఏ దేశానికీ లేని అనుకూలతలు ఉన్న దేశం ఇంకెంత అభివృద్ధి జరుగుతుంది? ప్రపంచంలో 50 శాతం సాగుభూమి ఉన్న ఏకైక దేశం భారతదేశం. భూ విస్తీర్ణంలో అమెరికా మనకన్నా పెద్దగా ఉన్నా, అక్కడ 29 శాతమే సాగుకు పనికొస్తుంది. చైనా మనకన్నా రెండింతలున్నా 16 శాతమే అనుకూలం. మనదేశ భూ విస్తీర్ణం 83 కోట్ల ఎకరాలైతే సుమారు 41 కోట్ల ఎకరాలు సాగు అనుకూల భూములు ఉన్నాయి. సమశీతోష్ణ మండలం, అనుకూల వాతావరణం, పర్యావరణం, మనదేశ నదుల్లో 70-75 వేల టీఎంసీల నీళ్లు ప్రవహిస్తున్నాయి. అయినా నీటి ఎద్దడి, రాష్ర్టాల మధ్య పంచాయతీలు, దశాబ్దాల గొడవలు. కావేరీ నది కోసం కర్ణాటక, తమిళనాడు మధ్య ఎందుకు గొడవలు జరగాలి? తెలంగాణ తన నీటి వాటా కోసం ఎందుకు పోరాడాలి? చెన్నై అద్భుతమైన నగరం. అక్కడ బకెట్ నీళ్ల కోసం విలవిలలాడుతున్నారు.
ఒక చారిత్రక నగరం బకెట్ నీళ్ల కోసం ఆరాటపడటం మనం సిగ్గుపడాల్సిన విషయం అని ఎంపీ నామా నాగేశ్వర్‌రావు పార్లమెంట్‌లో ప్రసంగిస్తే.. పార్లమెంట్ మొత్తం ఆయనవైపు చూసింది. దేశంలో ఉన్న 40 కోట్ల ఎకరాలకు కడుపునిండా నీళ్లు ఇవ్వడానికి 30 వేల టీఎంసీలు సరిపోతాయి. మంచినీళ్ల కోసం, పరిశ్రమల కోసం మరో 10 వేల టీఎంసీలు వాడినా.. మనదేశంలో ఇంకో 30-35 వేల టీఎంసీలు మిగులు జలాలు ఉంటాయి. ఇది కేంద్రం లెక్క. ఇంత సుసంపన్నమైన పంటలు పండే భూములు ఉండి, 75 వేల టీఎంసీల నీళ్లు ఉండి, పనిచేయగలిగే 130 కోట్ల జనం ఉండి, ఎందుకు ఆకలి బా ధలు పడాలె? రైతు లు నెలలపాటు ఎందుకు ధర్నాలు చేయాలె? ఈ దుస్థితి ఇంకా ఎంత కాలం? ఈ స్టోరీలు ఇంకా ఎన్ని వినాలె? తెలంగాణలో జరిగిన ప్రయత్నమే దేశమంతటా జరిగితే, సిన్సియారిటీ, కమిట్మెంట్ ఉంటే.. అమెరికాను తలదన్నే ఆర్థిక వ్యవస్థలా దేశం ఎదుగుతుంది. ప్రపంచంలో ఏ దేశానికైనా ఉన్న అత్యంత విలువైనది మానవ వనరులు. దేశంలో 52 శాతం యువశక్తి ఉన్నది. వాళ్లను నిర్వీర్యం చేస్తున్నరు. మతోన్మాదం పేరుతో రెచ్చగొడుతున్నరు. మనం గుడ్లప్పగించి చూస్తున్నాం. ఈ దుస్థితి ఇలాగే కొనసాగితే భయంకరమైన పరిణామాలు వస్తాయి.
కేంద్రంలో వచ్చేది రైతు ప్రభుత్వమే
దేశ జనాభాలో 40 శాతం రైతులే ఉన్నారు. కానీ కేంద్రం అడ్డగోలు విధానాల వల్ల రైతులు కుదేలైతున్నారు.అందుకే ‘అబ్‌కీ బార్.. కిసాన్ సర్కార్’ (ఈసారి రైతు ప్రభుత్వం) అనే నినాదంతో పోరాడబోతున్నాం. కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను దేశమంతటా అమలు చేయడానికి వీలు కలుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అతితక్కువ కాలంలోనే 24 గంటల కరెంటును సాధ్యం చేశాం. ఇదే తరహాలో దేశంలో అధికారంలోకి వస్తే రెండేండ్లలో దేశంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా 24 గంటల కరెంటు అందిస్తాం. ఏటా 25 లక్షల మంది దళిత బిడ్డలకు దళితబంధు అమలు చేయగలుగుతాం.
ప్రజలు గెలువాలి.. అందుకే బీఆర్‌ఎస్ ఏర్పాటు
నాటి నుంచి నేటి వరకు రాజకీయాలు అంటే ఒక పార్టీ గెలవడం, ఒకటి ఓడిపోవడం. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకున్నది సాకారం కావాలంటే ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు. ప్రజా ప్రతినిధులు గెలవాలె. వారు ప్రజల కోసం పనిచేయాలె. అంటే.. ఎన్నికల ద్వారా ప్రజలు గెలవాటె. ప్రజల అభిప్రాయం పెరగాలె. ప్రజాస్వామ్యం పరిపుష్టం చెందాలె. ఆ పరివర్తన కోసం ఈ రోజు ఉద్భవించిందే బీఆర్‌ఎస్. ఈ దేశాన్ని మంచి మార్గం పట్టించడానికి, నూతన ఆలోచనతో నూతన ఒరవడి సృష్టించడానికే బీఆర్‌ఎస్ పుట్టింది.
కుమారస్వామిని సీఎం చేస్తాం
బీఆర్‌ఎస్ మొదటి టాస్క్ కర్ణాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలే. మా దగ్గర స్పష్టంగా కన్నడ మాట్లాడగలిగే నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ వంటివాళ్లు ఎంతోమంది ఉన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కర్ణాటకలో వివరిస్తాం. కుమారస్వామిని మరోసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా చేస్తాం. 2018లో నేను కర్ణాటకకు వెళ్లి దేవేగౌడతో, కుమారస్వామితో చర్చలు జరిపాను. బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో కుమారస్వామిని సీఎంగా చూడాలని ఉన్నదని చెప్పాను. చెప్పినట్టే ఆయన సీఎం అయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయన సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను. ఇందుకు కర్ణాటకలో బీఆర్‌ఎస్ సపోర్ట్ చేస్తుంది.
ఢిల్లీ కోట మీద బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయం
తెలంగాణ కోసం నేను బయలుదేరిననాడు ‘కొత్త దుకాణం పెట్టినవేంది’ అని అవహేళన చేశారు. ‘వీళ్లతో ఏం కాదు’ అని అన్నారు. ‘ఈ బక్కోన్ని బొండిగె పిసికి పడేస్తరు’ అన్నోళ్లు ఉన్నరు. ఇప్పుడు అంతకన్నా రెట్టించి హేళన చేస్తరు. ఎప్పుడైనా ఒక కొత్త శక్తి ఆవిర్భావం అయితే పాత శక్తులన్నీ కలిసి దాడి చేస్తాయి. దానికి సిద్ధంగా ఉండాలి. అవన్నీ మనకు పాత అనుభవాలే. అవన్నీ అధిగమించే రాష్ర్టాన్ని సాధించినం. వాస్తవాలు ప్రజల్లోకి పోతుంటే.. వారికి అర్థం అవుతుంటే ఆటోమెటిక్‌గా ప్రజలు పిడికిలి బిగించి బీఆర్‌ఎస్ వెంట నడిచే కాలం వస్తుంది. వందకు వంద శాతం నాకు ఆ నమ్మకం ఉన్నది. భవిష్యత్తులో ఢిల్లీ ఎర్రకోట మీద బీఆర్‌ఎస్ జెండా ఎగురుతది. కొంత మంది బాధలు పెట్టవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు అంత మాత్రాన పిరికిగా పారిపోవాల్సిన అవసరం లేదు. ముందుకే పురోగమిద్దాం. బీఆర్‌ఎస్ అనే ఈ వెలుగుదివ్వెను దేశం నలుమూలల ప్రసరింపజేసి, అద్భుత బాటలు వేసి, తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరత మాత పాదాల దగ్గర పెట్టి, భరతమాత సంతృప్తిని కండ్లారా చూద్దామని కోరుతున్నా.
చైతన్య దీపం వెలిగిద్దాం..
దేశంలోని పరిస్థితులను మార్చేందుకు ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కావాలె, నాందీ ప్రస్తావన జరగాలె. ఎవరో ఒకరు నడుం బిగించకపోతే.. ఎవరో ఒకరు చైతన్యం దీపం వెలిగించకపోతే ఈ కారు చీట్లు ఇలాగే కొనసాగుతాయి. అది తెలంగాణ నుంచి ప్రారంభం కావడం సంతోషం. తెలంగాణలో మార్పును చూసినట్టే.. దేశంలోనూ పరివర్తన చూడబోతున్నాం. ఉత్తమ, గుణాత్మక మార్పు కోసం, ఉన్నత స్థాయికి చేరుకొనే ఆర్థిక పరిపుష్టి కోసం నడుంబిగిద్దాం. రాష్ట్ర హక్కులు, దేశ హక్కులు అని కాకుండా దేశంమొత్తం ఏకోన్ముఖంగా అద్భుతమైన పరిపుష్టం చెందేలా బాటలు పడాలి. తప్పకుండా ఫెడరల్ స్ఫూర్తి కొనసాగాలె, నియంతృత్వం పోవాలె. ఎవరి బాధ్యతలు వారు ధర్మంగా స్వీకరించి, అమలు చేసే విధానం ఉండాలె. అప్పుడే ఈ దేశం బాగుపడుతది.
బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. వేదికపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, హర్యానా నేత గుర్నామ్‌సింగ్ చౌదాని, ఒడిశా నేత అక్షయ్‌కుమార్, సినీనటుడు ప్రకాశ్‌రాజ్, ఎంపీ కే కేశవరావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులు
14న ఢిల్లీ కార్యాలయం ప్రారంభం
బీఆర్‌ఎస్‌గా మార్చేందుకు ఎన్నికల సంఘం ఆమోదించినట్టు గురువారం 3:30 గంటలకు మెసేజ్ వచ్చింది. బీఆర్‌ఎస్ ఆవిర్భావానికి శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉన్నదని వేదపండితులు చెప్పారు. ఇన్నాళ్లూ తెలంగాణ కోసం కొట్లాడినం కాబట్టి ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ అనేది సమంజసం. ఇప్పుడు దేశం కోసం వెళ్తున్నారు, కాబట్టి పార్టీ పేరులో తెలంగాణ అని ఉంటే విమర్శలు వస్తాయి. ఆ ఇబ్బందిని అధిగమించండి.. అప్పుడు మీ వెంట నడుస్తాం అని పలురాష్ర్టాల నేతలు సూచించారు. అందుకే బీఆర్‌ఎస్‌గా మార్చాం. ఇప్పుడు మనం దేశం గురించి బ్రహ్మాండంగా మాట్లాడొచ్చు. 14న ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించుకొందాం. 13 సాయంత్రానికి లేదా 14 ఉదయానికి అందరం ఢిల్లీకి పోదాం. పండగలాగా కార్యాలయాన్ని ప్రారంభించి, కార్యకలాపాలు మొదలు పెడతాం. రెండుమూడు నెలల్లో సొంతభవనం పూర్తవుతుంది. 14న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో మీడియా ముందు అనేక అంశాలను వివరిస్తా.
దేశం కోసం కొత్త పాలసీలు
అందరికీ విద్య, వైద్యం, ప్రాథమిక మౌలిక అవసరాలు, అన్ని రంగాలు పురోగమించేలా కొత్త విధానాలు తీసుకురాబోతున్నాం. వీటి కోసం నలుగురైదుగురు సుప్రీం మాజీ న్యాయమూర్తులు, వందల మంది మాజీ ఐఏఎస్‌లు, ఆర్థికవేత్తలు నాతో మాట్లాడుతున్నారు. డ్రాఫ్ట్ వర్క్ నడుస్తున్నది. కొన్ని వారాల్లో పాలసీలను దేశం ముందు పెడతాం.
ట్రిబ్యునళ్లు వేసి దశాబ్దాల కాలం నడిపి, రాష్ర్టాల మధ్య పంచాయతీలు పెట్టించి తమాషాలు చూసే కేంద్రప్రభుత్వాల దుర్మార్గం, దౌర్భాగ్యం, దాష్టీకం పోవాలంటే ఇప్పుడున్న ‘వాటర్ పాలసీలు’ రద్దయ్యి ఇండియా కోసం బ్రహ్మాండమైన కొత్త వాటర్ పాలసీ తయారు కావాలె. దాని కోసమే బీఆర్‌ఎస్.
ఆర్థికంగా అనేక రంగాల్లో పురోగమించి, ఉన్నతస్థాయికి చేరుకొనే అవకాశం ఉన్నది. అయినా కేంద్రం తప్పుడు విధానాలతో ఆర్థిక రంగం విలవిలలాడుతున్నది. విదేశీ నిల్వలు ఆవిరవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూ.82కు పడిపోవడం కన్నా హీనం ఇంకొకటి లేదు. ఇండియాకు ఒక ‘కొత్త ఎకనమిక్ పాలసీ’ అవసరం. బీఆర్‌ఎస్ కొత్త ఎకనమిక్ పాలసీని రూపొందిస్తుంది.
మనదేశానికి 4 లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నది. అపారమైన నీళ్ల సంపద, బొగ్గు, అపార సౌరశక్తితో సహజంగా వచ్చే కరెంటును వాడుకొనే అవకాశం.. అద్భుతమైన నదులతో జల విద్యుత్తును ఇంకో లక్ష మెగావాట్లకు పెంచుకొనే అవకాశం ఉన్నది. మనం వాడుకోగా పక్క దేశాలకు ఇచ్చేంతగా తయారు చేయొచ్చు. అయినా కరెంటు కొరత వేధిస్తున్నది. అందుకే.. దేశానికి కొత్త పవర్ పాలసీని ఇస్తాం.
దేశంలో అద్భుతమైన రైతులు ఉన్నరు. వాస్తవానికి మనకున్న వనరులకు, భూములకు, పంటలకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ చైన్ మన దగ్గర ఉండాలె. కానీ విదేశీ కంపెనీలపై ఆధారపడుతున్నాం. మన రైతులు నెలలపాటు ధర్నాలు చేసే దుస్థితి. రైతాంగం అభివృద్ధి చెందాలంటే దేశానికి ‘కొత్త అగ్రికల్చర్ పాలసీ’ అవసరం. బీఆర్‌ఎస్ కొత్త అగ్రికల్చర్ పాలసీని రూపొందిస్తున్నది.
తెలంగాణకు హరితహారం పేరిట రాష్ట్రంలో గొప్ప హరిత విప్లవం తెచ్చాం. ఆ మాత్రం చేసినా దేశం గొప్ప పద్ధతిలో ఉంటుంది. కాబట్టి కొత్త ఎన్విరాన్‌మెంటల్ పాలసీ తెస్తాం.
దళితులు, గిరిజనులు, బీసీలు, ఓసీల్లో నిరుపేదలు దశాబ్దాలుగా నలిగిపోతున్నరు. 20-29 శాతం ఉన్న దళితబిడ్డలను మీరు అస్పృస్యులుగా ఉండాలె.. మీ ఆర్థిక స్థితిని మేము పట్టించుకోము.. ఓట్లుగానే చూస్తం అనే దౌర్భాగ్య పరిస్థితి ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడుతదని ఎవడైనా అంటే వాడు బేవకూఫ్‌గాడే. డెఫినెట్‌గా వారికి గ్రోత్ ఇంజిన్స్ కావాలె. మన ఇంట్లో ఉండే బక్కపిల్లగానికి విటమిన్లు ఇచ్చినట్టే దళితులకు, బలహీన వర్గాలకు, గిరిజినులకు గ్రోత్ ఇంజిన్లు కావాలి. ఎకానమీ పెరిగినప్పుడు ఆదుకొనే వెసులుబాటు కలుగుతుంది. వాళ్లకోసం దళితబంధు తరహాలో.. ‘వీకర్స్ సెక్షన్ అప్‌లిఫ్ట్‌మెంట్ పాలసీ’ తీసుకొస్తాం.
అన్ని రంగాల్లో మహిళలకు సమ ప్రాధా న్యం ఇస్తున్న దేశాలు పురోగమిస్తున్నాయి. గతంలో తెలంగాణలో మార్కెట్ కమిటీ చైర్మన్లలో మహిళలు లేరు. మనం రిజర్వేషన్ పెట్టి వాళ్లకు బాధ్యతలు అప్పగించాం. బ్రహ్మాండంగా పనిచేస్తున్నరు. ఇదే తరహాలో మహిళల కోసం ‘న్యూ ఉమెన్ ఎంపవర్‌మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నాం. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలను మీరు ఇలాగే ఉండాలె.. ఈ పని మాత్రమే చేయాలె.. అని చెప్పినంత కాలం ఈ దేశం బాగుపడదు. బాగుపడుతుందని చెప్తే వాడు మూర్ఖుడే.