-సీఎం కేసీఆర్ పనితీరుతో తెలంగాణకు -జాతీయస్థాయిలో గుర్తింపు -నందిపేటలో మన ఊరు-మన ఎంపీ -కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత -డప్పుల దరువు, మంగళహారతులతో స్వాగతం

తెలంగాణలో మానవీయ పాలన కొనసాగుతున్నదని, అందరి బాధలను అర్థం చేసుకునే సీఎం కేసీఆర్ పాలనలో ఆడబిడ్డలకు అధిక ప్రాధాన్యం లభిస్తున్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన స్త్రీ శక్తి భవనాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఎంపీ కవిత మాట్లాడారు. ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ బిడ్డగా, ఓ పెద్దన్నగా అండగా ఉంటున్నారన్నారు. గతంలో ఇచ్చే రూ.200 పింఛన్ ఏమూలకు సరిపోవడంలేదని గుర్తించి, దాన్ని వెయ్యి రూపాయలకు పెంచి ఆసరాగా నిలిచారన్నారు. ఆడబిడ్డకు అండగా ఉండేందుకు అనేక పథకాలను ఆయన రూపొందించారని తెలిపారు. సర్కారు దవాఖానల్లో ప్రసవిస్తే రూ.12వేలు వారి ఖాతాల్లో వేసి ఆర్థికంగా ఆదుకుంటున్నారన్నారు.రూ.3వేల విలువ చేసే కేసీఆర్ కిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులకు అదనంగా మరో రూ.400 కోట్లను ఖర్చు చేస్తున్నదన్నారు. సర్కారు దవాఖానల రూపురేఖలు మార్చి కనీస అవసరాలు, వసతులు ఏర్పాటు చేసేందుకు రూ.27వేల కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. ఆడపిల్లలను బాగా చదివించాలని ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఎక్కువగా మహిళలే ఉండాలని ఆకాంక్షించారు. అందుకు తగ్గట్ట్టుగా ప్రభుత్వం బాలికల చదువుకోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నదని చెప్పారు. సీఎంకు రాష్ట్ర ప్రజలపై ఎనలేని ప్రేమ ఉన్నదని, బిడ్డ క్షేమం కోసం తల్లి ఎలా ఆరాటపడుతుందో, సీఎం కేసీఆర్ అదే తీరులో రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి నిత్యం 18 గంటలు శ్రమిస్తున్నారన్నారు. కేసీఆర్ పట్టుదలతోనే దేశంలో రాష్ర్టానికి గుర్తింపు సాధ్యమైందన్నారు. సాగునీటి సమస్యను తీర్చడానికి కాళేశ్వరం నుంచి పోచంపాడ్లోకి రివర్స్ పంపింగ్ కోసం ప్రభుత్వం రూ.1,200 కోట్లతో పనులు చేపడుతున్నదన్నారు. నూత్పల్లి, సిర్పూర్, లక్కంపల్లి, జిజి నడ్కుడ గ్రామాలతోపాటు నందిపేటలో 3 మహిళా సంఘాల భవన నిర్మాణాలకు తన నిధుల నుంచి రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తున్నట్టు ఎంపీ ప్రకటించారు.
ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తాం: ఎంపీ కవిత
సబ్బండ వర్ణాలతో కలిసి ఉద్యమించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన స్ఫూర్తితోనే బంగారు తెలంగాణ కోసం అకుంఠిత దీక్షతో పనిచేస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం డొంకేశ్వర్‌లో మంగళవారం మన ఊరు-మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తమను హైదరాబాద్‌లో ఉండవద్దని, ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలని ఎప్పుడూ హితబోధ చేస్తుంటారన్నారు. ఆయన ఆదేశాలు, మార్గదర్శనం ప్రకారం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్టు చెప్పారు. బీడీ అక్కలకు ఎవరైనా జీవనభృతి ఇద్దామని ఆలోచించారా? అది కేసీఆర్ చేసి చూపారని అన్నారు. గ్రామంలో రాత్రి నిర్వహించిన ఎంపీ సభకు గ్రామస్థులు భారీగా తరలివచ్చారు.
ఎంపీకి అపూర్వ స్వాగతం.. డొంకేశ్వర్‌లో మన ఊరు-మన ఎంపీ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ కవితకు మహిళలు గ్రామ శివారులో బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. డప్పుల దరువు, పటాకుల మోత మోగించారు. మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా డొంకేశ్వర్‌లో పండుగ వాతావరణం కనిపించింది. పుట్టా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన కవిత ఆ తరువాత గ్రామంలో పర్యటించారు. భారీగా తరలివచ్చిన మహిళలతో కలిసి ఆమె ముందుకు కదిలారు. గ్రామ ప్రజలు ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఎంపీ అందరిని ఆత్మీయంగా పలుకరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు.