Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆడంబరాలొద్దు !

-ప్రజాప్రతినిధులు కావడం గొప్ప అవకాశం.. చారిత్రక సందర్భంలో ఎన్నికైనం -సమస్యలు పరిష్కరిస్తూ ప్రతిక్షణం ఆస్వాదిద్దాం -ప్రజాప్రతినిధుల గౌరవం పెంచుదాం.. వచ్చేసారి మనమే గెలుస్తాం -టీఆర్‌ఎస్ శిక్షణ తరగతుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ -రాజకీయాల్లోకి రావాలనుకోలేదు.. నాది కల్చరల్ లైన్ -70-80 వేల పుస్తకాలు చదివా: కేసీఆర్

KCR in orientation programme

ఆడంబరాలకు స్వస్తి చెప్పి ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఒక గొప్ప చారిత్రక సందర్భంలో ప్రజాప్రతినిధులుగా ఉండడాన్ని అదృష్టంగా భావించాలని, ఈ అవకాశాన్ని ప్రజాసేవకు గొప్పగా వాడుకుని చరిత్రలో నిలిచిపోవాలని ఆయన మార్గదర్శనం చేశారు.

నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల శిక్షణ తరగతుల్లో చివరి రోజైన సోమవారం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం కోసం లక్షల మంది పోరాటం చేసిండ్రు. దెబ్బలు తిన్నరు. జైళ్ల పడ్డరు. కష్టాలు ఎదుర్కొన్నరు. అపుడు మీరు ముందు వరుసలో ఉన్నరు. ఇపుడు ఒక చారిత్రక సందర్భంలో ఉన్నం. కోట్లాదిమందిలో గొప్ప అవకాశం మీకు వచ్చింది. దీన్ని ప్రజలకోసం గొప్పగా వాడుకోవాలి. రేపు తెలంగాణ చరిత్రలో రాష్ట్రం వచ్చినంక మొట్టమొదట పనిచేసింది ఎవరు అంటే మీరు అని ఉంటది. మొదటి మంత్రిగా, మొదటి జడ్పీచైర్మన్‌గా, డీసీసీబీ చైర్మన్‌గా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా మీ పేర్లు ఉండిపోతయి. మన కంటే ముందు ఎందరో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసిండ్రు. వారి కంటే బాగా పని చేశామనిపించుకోవాలి. పదవులు వచ్చాయని ఆడంబరాలకు పోవద్దు.. గొప్పగా కనిపించడం కాదు, గొప్పగా బతకడం ముఖ్యం. అందులో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పని చేయాలి అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజా జీవితంలో అవకాశం ఒక వరం.. ప్రజాజీవితంలో అవకాశాలు లభించడం అంత తేలికకాదని కేసీఆర్ అన్నారు. తన అనుభవంలో ఎందరినో చూశానని, కొందరు సర్పంచ్ కావాలని జీవిత కాలమంతా ఆరాటపడ్డా కాలేకపోయిన వారున్నారని చెప్పారు. అలాంటి అవకాశం మనకు లభించడం పూర్వజన్మ సుకృతం లేదా పెద్దల దీవెనగా భావించాలన్నారు. డబ్బులు సంపాదించడం గొప్పకాదని, దావూద్ ఇబ్రహీం కూడా చాలా సంపాదించాడని అన్నారు. వాళ్లను గురించి ప్రజలేమని అనుకుంటున్నారో గమనించాలని అన్నారు. పెండ వ్యాపారం చేసినా పైసలొస్తాయని, అయితే జీవితంలో విలువలు ప్రధానమని అన్నారు. మన సంప్రదాయం విలువలకే ప్రాధాన్యం ఇచ్చిందని, తల్లి జోల పాటలో జో అచ్చుతానంద, జో జో ముకుందా అని అంటుంది తప్ప జో కుంభకర్ణా, జో జో రావణా అనదని చెప్పారు. తన బిడ్డలను అచ్యుతుడు , ముకుందుడు వంటి ఉత్తముడే కావాలని ప్రతి తల్లి కోరుకుంటుందన్నారు.

Orientation programme in Nagarjunasagar

తల్లి చనుబాలతోనే విలువలను బోధించే ఉత్తమ సంస్కృతి మనకు ఉందని, దీన్ని అర్థం చేసుకుని జీవించాలని అన్నారు. భూమ్మీద ఎవరూ వెయ్యేళ్లు బతకడానికి రాలె.. మనిషిగా పుట్టడమే అదృష్టం. ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఉండడం అదృష్టం. ఈ సమయంలో ఎట్లా పని చేశామనేది ముఖ్యం అన్నారు. ఈ దిశగా మనం ప్రజాసమస్యల పరిష్కారం కోసం కష్టపడుతున్నామని, అందువల్ల వచ్చే టర్మ్ కూడా మనమే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నాది పొలిటికల్ లైనే కాదు..: తనకు రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదని కేసీఆర్ చెప్పారు. నేనెప్పుడూ రాజకీయాల్లోకి రావాలనే అనుకోలే. ఆ ఆలోచన నాకు లేకుండె. నాది అసలు పబ్లిక్ లైన్ కాదు. కల్చరల్ లైన్. మొదటినుంచి అదే నాకు ఇష్టం. చదువన్నా పుస్తకాలన్నా ఇష్టం. ఇప్పటి వరకు 70, 80 వేల పుస్తకాల దాకా చదివిన. నేనెప్పుడైనా ఊరికి పోతుంటే లగేజిలో బట్టల కంటే పుస్తకాల లగేజీ పెద్దగా ఉంటుండె. చదువుకునే రోజుల్లో కూడా ఈ విషయంలో నా మీద జోకులేసుకొనేటోళ్లు అని గుర్తు చేసుకున్నారు. అనుకోకుండా పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చానని వచ్చిన తర్వాత మాత్రం గొప్పగా ఉండాలనే అనుకున్నానని తెలిపారు.

పదవులు దోపిడీ కోసం కాదు..: ప్రజాజీవితంలోకి రావడం అంటే పైసలు సంపాదించడమే అనే భావన బాగా బలంగా ఉందని కేసీఆర్ అన్నారు. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారని అన్నారు. 1985లో ఎన్నికల్లో పోటీ చేసినపుడు మా బావ రాజేశ్వర్‌రావు వచ్చి పోయినసారి ఓడిపోయినవు..ఈసారన్నా గెలువు అని రూ. పదివేలు ఇచ్చారు. గెలిచిన. ఏడాదిన్నర అయింది. ఆయనకు పైసలు ఇయ్యలేదు. ఓసారి ఆయనే హైదరాబాద్‌ల నా దగ్గరికి వచ్చిండు. పత్తి విత్తనాల కోసం వచ్చిన. గా పైసలిస్తావా అని అడిగిండు. ఎప్పుడు ఊరు పోతున్నరు అని అడిగితే ఇపుడు పైసలిస్తే ఇప్పుడే కొనుక్కపోత. లేకపోతె రేపు పోతా అన్నడు. సరే ఉండు.. ఇప్పుడైతె పైసలు లేవు.. తెప్పిచ్చి ఇస్త.. రేపు పో అని చెప్పితే.. ఎమ్మెల్యే అయి సంవత్సరంన్నరాయె. పదివేలన్నా లేవురా నీ దగ్గర?.. నువ్వేం ఎమ్మెల్యేవురా! అన్నడు. అంటే పదవి రాగానే డబ్బు సంపాదనే అనే అభిప్రాయం ఉన్నది అని తన అనుభవాన్ని వివరించారు. ప్రజాప్రతినిధుల మీద సమాజంలో గౌరవం తగ్గిపోతున్నదని అన్నారు.

మన మీద సెటైర్లు పడుతున్నయి..: ఇవాళ ఓ పేపర్ల కార్టూన్ వచ్చింది. దాంట్ల ఒకాయన అనగ అనగ రాగమతిశయిల్లుచునుండు అని కలవరిస్తుంటె, ఇంటామె.. నాగార్జున సాగర్‌నుంచి వచ్చినప్పటినుంచి ఇట్లనే పాడుతున్నడు.. అంటున్నది. అంటే ఇక్కడినుంచి వెళ్లినోల్లు గట్ల అయితుండ్రని మన మీద సెటైర్ వేసిండ్రు. ఇగ క్లాసెస్ తర్వాత మీరు కూడా పోతున్నరు. మీరేం చేస్తరో.. వాళ్లేం వేస్తరో… మీ దయ అంటూ చమత్కరించారు.

ఇక ఆర్నెళ్లకోసారి క్లాసులు..: పార్టీ తరపున క్లాసులు అన్నప్పుడు కొంతమందికి నచ్చలేదు. గిన్నేండ్లు ఎమ్మెల్యేలుగ ఉన్నం,మంత్రులు చేసినం, మాకు క్లాసులేంది ? అనుకున్నారు. క్లాస్‌లు మొదలయ్యే రోజు కూడా మీ ముఖాలు కొంచెం వేరే రకంగా ఉండె. స్కూల్ పోరగాండ్ల లెక్కన గీ బ్యాగులేంది? ఈ పాఠాలేంది? ఇది రాసుకునేదేంది? అనుకున్నరు. కానీ ఇవాళ మీ ముఖాలు వేరే రకంగా ఉన్నయి. ఉత్సాహంగ ఉన్నయి. వాస్తవానికి ఇవి శిక్షణ తరగతులు కావు. ఇంటరాక్షన్ ప్రోగ్రామే. మన అనుభవాలను పంచుకున్నం. తెలియని విషయాలు తెలుసుకున్నం. చర్చించుకున్నం. ఎంతో అవగాహన వచ్చింది. ఇది ఉండాలె. మీరంత అంగీకరిస్తే ఆర్నెళ్లకో రోజు శిక్షణా తరగతులను నిర్వహించుకుందాం అని కేసీఆర్ చెప్పారు.

తన ఆత్మను చూసుకుంటుంది: తెలంగాణ ఇప్పుడు తన ఆత్మను తాను చూసుకుంటుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 30 ఏండ్ల నుంచి ఆగమాగమైన రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడుతుందన్నారు. ఇంతకు ముందు మన పంటలకు ఎప్పుడూ కరెంటు కోతలే ఉండేవన్నారు. దిక్కుమొక్కు లేకుండే.. ఇపుడు ఒక్క క్షణం కరెంటు పోకుండా చూస్తున్నం. ఒక్క గుంట పొలం కూడా ఎండిపోకుండా చూసుకోగలుతున్నాం అని చెప్పారు. ఇంతకు ముందు సాగర్ అంటే ఆంధ్రుల పెరటి చెరువు లెక్క ఉండేదని, ఇపుడు మన హక్కు మనం వాడుకుంటున్నామని చెప్పారు. దశాబ్దాల తర్వాత మొదటిసారి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో లక్షల ఎకరాల్లో రెండోపంట వేసుకుంటున్నామని అన్నారు. నాగార్జున్‌సాగర్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

చారిత్రక సన్నివేశమిది..: తెలంగాణ రాష్ట్రమేర్పడిన తర్వాత మొదటి తరం ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, డీసీసీబీ చైర్మన్లుగా చరిత్రలో నిలిచిపోతారని ప్రజాప్రతినిధులనుద్దేశించి సీఎం అన్నారు. చిల్లర మల్లర రాజకీయాలు,ఆవేశాలు ఉన్నా వాటిని పరిష్కరించుకొని ముందుకు నడువాలన్నారు. ఏ ముఖ్యమంత్రి వెళ్లని దేవాలయాలకు వెళ్లిన.. చరిత్రలో ఏ ముఖ్యమంత్రన్నా కొమురవెల్లి పోయిండా? కాళోజి, దాశరథిలకు కళాక్షేత్రాలు, అవార్డుల గురించి ఆలోచించిండా? మన రాష్ట్రంలో మనకు కావలిసింది చేసుకుంటున్నం. ఒక గొప్ప అవకాశం మనకొచ్చింది దాన్ని గొప్పగా వాడుకుందాం. ప్రజలకు చేసి చూపిద్దాం అన్నారు. మానవ సంబంధాల మీద దేశపతి శ్రీనివాస్ బాగా మాట్లాడారని ప్రశంసించారు.

శిక్షణ విజయవంతం సాగర్‌లో మూడురోజులపాటు నిర్వహించిన శిక్షణా శిబిరం పార్టీ ప్రజాప్రతినిధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. కొత్త రాష్ట్రంలో, కొత్త ప్రభుత్వంలో, కొత్త ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా కానున్నారు. నిష్ణాతులతో మూడు రోజులు అనేకాంశాలపై శిక్షణ నిర్వహించారన్నారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులంతా పాల్గొని ఆయా అంశాలపై వారికున్న సందేహాలు నివృతి చేసుకున్నారు. శిక్షణ ప్రతీ ప్రజాప్రతినిధికి ఉపయోగపడుతుంది. తరగతులు విజయవంతంగా ముగిశాయి. -కడియం శ్రీహరి, డిప్యూటీ సీఎం

20 ఏండ్ల వరకు ఢోకాలేదు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు 20 ఏండ్లవరకు ఢోకా లేదు. ప్రజలు మెచ్చిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఆమోదిస్తారు. శిక్షణ శిబిరంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. ఇది కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఇకపై ఈ శిక్షణ తరగతులు ప్రతి ఆరు నెలలకోసారి ఉంటాయి. -కవిత, ఎంపీ

అదో అద్భుత అనుభూతి కృష్ణా నది ఒడ్డున మూడురోజులపాటు జరిగిన రాజకీయ శిక్షణా తరగతులు ఒక అద్భుత అనుభూతి. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలియని విషయాలెన్నో తెలుసుకున్నా. గతంలో నేను పాల్గొన్న శిక్షణా తరగతులకు టీఆర్‌ఎస్ శిక్షణా తరగతులకు చాలా తేడా ఉంది. ప్రజాస్వామ్యంలో పార్టీ పాత్ర, ప్రజాప్రతినిధుల బాధ్యత, ప్రభుత్వ పరిపాలన తీరు తదితర అంశాలపై చాలా విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోగలిగాం. వివిధ రంగాలలో నిష్ణాతులు చాలా విషయాలపై అవగాహన కలిగించారు. నాకు మళ్లీ కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. ఎక్కడా బోర్ లేకుండా శిక్షణ ఇంత తొందరగా ముగిసిందా అనిపించింది. ప్రజాస్వామ్యంలో కొంతమందికే ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా అవకాశం లభిస్తుంది. దానిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? ప్రజల సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేయాలనే విషయంలో సీఎం కేసీఆర్ మాకు మార్గనిర్దేశం చేశారు. -తలసాని శ్రీనివాస్‌యాదవ్, వాణిజ్యపన్నులశాఖ మంత్రి

బంగారు తెలంగాణ సాధనకు ఉపయోగపడుతుంది శిక్షణా తరగతులు బంగారు తెలంగాణ ఏర్పాటుకు ఉపయోగపడతాయి. ప్రతీ విషయంలో ఉపయోగకరంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు రాబోయే రోజుల్లో ఎలా పని చేయాలో అవగాహన వచ్చింది. ఈ తరగతుల్లో నేర్చుకున్న విషయాలు ప్రజలకు ఉపయోగకరంగా వినియోగించుకుని మరింత ప్రగతికి బాటలు వేయడానికి కృషి చేస్తాం. -పద్మారావు, ఎక్సైజ్‌శాఖ మంత్రి

కొత్త విషయాలు తెలుసుకున్నాం శిక్షణ తరగతుల ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. చట్టసభలు, బడ్జెట్‌కు సంబంధించిన అనేక అంశాల గురించి లోతుగా వివరించారు. ఈ తరగతులతో ఎంతో ప్రయోజనం కలిగింది. -బాల్క సుమన్, ఎంపీ

12 అంశాలపై బోధించారు శిక్షణ శిబిరంలో మంత్రులు, ఎంపీలు, ఎమెల్యేలు, ఎమెల్సీలు అనేక కొత్త విషయాలు తెలుసుకున్నారు. మూడురోజుల శిక్షణలో 12 అంశాలపై నిపుణులు క్షుణ్ణంగా బోధించారు. శిక్షణకు హాజరైనవారంతా చాలా శ్రద్ధగా విన్నారు. ఈ శిక్షణ ద్వారా ప్రజలకు మరింత చేరువవుతారు. శిక్షణ తరగతులు విజయవంతం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. వసతుల ఏర్పాటుకు సహకరించిన పర్యాటకశాఖ, జెన్‌కో, ఇతర వసతి గృహాల యాజమాన్యాలకు ధన్యవాదాలు. 40 వలంటీర్లు, టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయ కార్యదర్శి రమేశ్‌రెడ్డి, రాజేశ్, సాయి, ప్రేమ్‌కుమార్, తదితరులందరికీ పార్టీ తరపున కృతజ్ఞతలు చెప్తున్నా. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ

అన్ని విషయాలపై అవగాహన పెంచారు శిక్షణా తరగతులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. మూడురోజుల శిక్షణలో అనేక విషయాలపై అవగాహన కలిగింది. పారిశ్రామికంగా, వ్యవసాయరంగంలో సైతం అనేక విషయాలను తెలుసుకున్నాం. శాసనసభలో వ్యవహరించాల్సిన తీరు, క్రమశిక్షణ, నైతికతపై పూర్తి అవగాహనను పొందగలిగాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.