Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అద్భుతమైన స్థితికి సిరిసిల్ల

-అమెరికాలో అమ్మేవి సిరిసిల్లలో తయారవ్వాలి -గొప్ప నేతకార్మికులు సిరిసిల్లలో ఉన్నరనే పేరు రావాలి -ఆ దిశగా కేటీఆర్ కృషిచేస్తున్నరు -కేసీఆర్ లేకపోతే సిరిసిల్ల జిల్లా అయ్యేది కాదు -కాళేశ్వరం నీటితో ఈ ప్రాంతం కళకళలాడాలి -నెల అయితే మిషన్ భగీరథ పూర్తయితది -కూలిపోయిన కులవృత్తులను నిలబెడుతున్నం -సిరిసిల్ల ఎన్నికల ప్రచారసభలో సీఎం కేసీఆర్

సిరిసిల్లలో నేతపరిశ్రమ అద్భుతంగా అభివృద్ధికావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. దేశంలో గొప్ప చేనేతకార్మికులు ఎక్కడున్నారంటే సిరిసిల్లలోనే అని పేరురావాలన్నారు. ఈ దిశగా మంత్రి కే తారకరామారావు పనిచేస్తున్నారని, ఈ కృషిలో ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరారు. గతంలో సిరిసిల్లలో అప్పటి జిల్లా కలెక్టర్ ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు అని గోడలపై రాయించిన సందర్భాన్ని గుర్తుచేసిన సీఎం.. యాభై ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండదని ఆ రోజు బాధపడ్డామన్నారు. మంత్రిగా కేటీఆర్ చేసిన పనులు, ప్రభుత్వ నిర్ణయాలతో సిరిసిల్లలో కొంతవరకు చేనేత పరిశ్రమకు ఉపశమనం కలిగిందన్న సీఎం.. ఇంకా బాగుపడాలని చెప్పారు. కేటీఆర్ ప్రారంభించిన అపారెల్ పార్క్‌లో కాటన్ టు క్లాత్ వరకు, రెడీమేడ్ దుస్తుల వరకు తయారుకావాలని ఆకాంక్షించారు.

ఒకనాడు ఆత్మహత్యలు చేసుకున్న సిరిసిల్ల.. అద్భుతమైన పరిస్థితికి రావాలని నా గుండెల్లో కోరిక ఉంది. అది నెరవేరుతదని ఆశపడుతున్న అని చెప్పారు. సిరిసిల్ల చేనేత ఆత్మహత్యలు ఆగాయి. కానీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ప్రతి చేనేత కార్మికుడికి రూ. 25-30వేల వేతనాలు రావాలి. ప్రతి కార్మికుడు అపారెల్ పార్కులో ఓనరుకావాలి. అమెరికా మార్కెట్‌లో అమ్మేవి సిరిసిల్లలో తయారు కావాలనేది నా కల అన్నారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారసభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

కూలిపోయిన కులవృత్తులను నిలబెట్టుకుంటున్నం ఉమ్మడి రాష్ట్రంలో కూలిపోయిన కులవృత్తులను నిలబెట్టుకుంటున్నం. రూ.4వేల కోట్లతోటి 65 లక్షల గొర్రెలు పంపిణీచేశాం. వాటికి 45 లక్షల పిల్లలు పుట్టినయి. రూ.1500 కోట్ల సంపదను మన గొల్లకురుమలు సాధించారు. ఈ విషయం కాంగ్రెస్ గొర్రెలకు అర్థం కాలేదు. కులవృత్తులు కూలిపోయినాయి కాబట్టే సిరిసిల్లలో చేనేత ఆత్మహత్యలు జరిగాయి. ఆ దుస్థితి పోవాలనే కులవృత్తులను నిలబెట్టుకుంటున్నం.

ఎన్నో కష్టాలు అధిగమించాం ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ర్టానికి కొత్తలో ఎన్నో కష్టాలు.. ఎన్నో శాపాలు! కేంద్రం కొంత ప్రతికూలంగా వ్యవహరించింది. మీకు కరంటు ఉండదు.. పరిశ్రమలు తరలిపోతయి అన్నరు. ఎన్నో ఇబ్బందులు, బాలారిష్టాలు అధిగమించాం. ఏమైతదో అనుకున్నవాళ్లకు తెలంగాణ దీటైన సమాధానం చెప్పింది. భగీరథ కార్యక్రమాన్ని 11 రాష్ర్టాల వాళ్లు వచ్చిచూసి నేర్చుకుని పోతున్నరు. రైతుబంధు పథకాన్ని ప్రపంచంలోనే అద్భుతమైనదిగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది.

ఎలక్షన్ తెమ్మన్నరు.. ఇప్పుడేమో గోడలు గీకుతున్నరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని కాంగ్రెస్‌వాళ్లు కేసులతో అడ్డుకున్నరు. ఈ రభస, పిచ్చి ఆలోచనలకంటే ప్రజల్లోకి వెళదామా? అని అడిగిన. కేసీఆర్.. నీకు దమ్ముంటే అర్ధరాత్రి వరకు ఎలక్షన్లు తీసుకురా.. మేం సిద్ధం అన్నరు. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఇంకా గోడలు గీకే పరిస్థితిలో ఉన్నరు. వచ్చిన తెలంగాణలో ఏది జరుగాలని ఆశపడ్డానో అది బ్రహ్మాండంగా జరుగుతాఉంది. 24 గంటల కరంటు ఉంది. చేనేత ఆత్మహత్యలు ఆగిపోయినాయి. బతుకుమీద భరోసా వచ్చింది. భవిష్యత్తు మీద ఆశకలిగింది.

కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెపుతున్నరు.. పెరిగిన సంపదను దిగమింగలే. కుంభకోణాలు చేయలే. పేదలకు పంచాం. ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లో చనిపోతే అనాథల్లాగా పీనుగులను పడేసేది. ఈ రోజు పరమపద వాహనాల్లో వాళ్ల ఇంటికాడ దించుతున్నం. కేసీఆర్ మా పెద్ద కొడుకు అని పింఛన్ అందుకుంటున్న ముసలివాళ్లు చెప్తున్నరు. బీడీ కార్మికుల పరిస్థితి దిగజారుతున్నదని వేయి రూపాయలు ఇచ్చినం. వచ్చే సంవత్సరం అన్ని రకాల పింఛన్లు పెంచుతున్నం. ఈ రోజు ప్రపంచమే అశ్యర్యపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నం. వచ్చే జూన్‌నాటికి అప్పర్‌మానేరు, లోయర్ మానేరు 365 రోజులు నిండే ఉంటయి.

నాలుగేండ్లలో ఇసుక ఆదాయం 2057 కోట్లు తెలంగాణ రాకముందు పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇసుకమీద పదేండ్లలో రూ.9.56 కోట్లు ఆదాయం వచ్చింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ నాలుగేండ్లలో రూ.2057 కోట్లు వచ్చింది. నేను ఏమైనా మాయామశ్చీంద్ర చేసానా? ఏం చేయ్యలే. దొంగతనం అరికట్టినం. 50 శాతమే అయింది.. ఇంకా 50% ఉంది. విచ్చలవిడి స్మగ్లింగ్ అరికట్టినం. ఈ పనిచేసింది గనులశాఖ మంత్రిగా ఉన్న కేటీఆరే. మీ మంత్రి, మీ ఎమ్మెల్యే. ఆదాయం ఇంకా పెరిగితే.. ఇంకో రెసిడెన్షియల్ స్కూల్ పెడుతం. పేదలకు పంచుతం.

నేను పొత్తుల సద్దిని కేసీఆర్ ఒక కులానికి, మతానికి చెందిన వ్యక్తికాదు. నేను తెలంగాణ ప్రజల పొత్తుల సద్దిని. అందరు తినవచ్చు. అందరు అనుభవించవచ్చు. నాకు ఎవ్వరూ శత్రువులు లేరు. నన్ను అద్భుతంగా ఈ స్థాయికి పెంచిన వారు మీరు. భవిష్యత్‌లో ఎట్టి పరిస్థితుల్లో చేనేత ఆత్మహత్యలు పునరావృతంకావద్దు. ఇంకా అద్భుతంగా ముందుకుపోదాం. వేములవాడ దివ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం.

కేసీఆర్ లేకపోతే జిల్లా అయ్యేదా? కేసీఆర్ లేకపోతే, కేసీఆర్ సీఎం కాకపోతే ఈ జన్మల సిరిసిల్ల జిల్లా అయ్యేది కాదు. రాజరాజేశ్వర స్వామి దయ! ఆయన పేరుతోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటుచేసుకున్నం. స్వామివారి దయతో ఈ ప్రాంతమంతా అభివృద్ధి చేసుకుందాం.

కేటీఆర్, రమేశ్ బాబులకు 80 శాతం ఓట్లు.. నేను చెప్పేది నిజమైతే కేటీఆర్‌ను, రమేశ్‌ను చెరొక లక్ష మెజార్టీతో గెలిపించాలి. అబద్ధం అయితే వాళ్లకు డిపాజిట్ రాకుండా ఓడగొట్టాలి. నాకు నివేదిక వచ్చింది.. కేటీఆర్, రమేశ్‌బాబులకు దాదాపు 80% ఓట్లు పడుతయి. కారు గుర్తుకు ఓటేసి తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను గుండెల నిండా ఎగురవేయాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.