పంట నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, మహేందర్ రెడ్డి శంకర్‌పల్లి మండలం చందిప్పలో నష్టపోయిన పంటల పరిశీలన

అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధ్దంగా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం శంకర్‌పల్లి మండలంలోని చందిప్ప గ్రామాంలో పంటనష్టంను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని 10 జిల్లాల్లో జరిగిన పంట నష్టం వివరాలను తెలుసుకొని రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులు అధైర్య పడొద్దని అన్నారు.
అకాల వర్షాలు వచ్చి రైతులు తీవ్రంగా నష్ట పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం తాను, రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి జిల్లాలో తిరిగి పంట నష్టం వివరాలను తెలుసుకుంటున్నామని, అందులో భాగంగా శంకర్‌పల్లికి రావడం జరిగిందన్నారు. సమైకాంధ్ర పాలనలో కాంగ్రెస్ ప్రభత్వం తెలంగాణలో పంట నష్టం జరిగితే రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని, ఆంధ్ర ప్రాంత రైతులకు నష్ట పరిహారాన్ని అందజేశారని అన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో కలెక్టర్లతో సమావేశమై జిల్లాలో పంట నష్టం వివరాలను తెలుసుకొని ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తామని తెలిపారు. రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు అందిన సమచారం మేరకు 500 ఎకారలలో పంట నష్టం జరిగిందని వివరించారు.
శంకర్‌పల్లి మండలంలో సుమారు 150 ఎకారాల్లో పంట నష్టం జరిగిందన్నారు. చందిప్ప గ్రామంలోని డి.రాఘవేందర్, కవిత అనంత్‌రెడ్డి పొలాల్లో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో చేవెళ్ళ ఎమ్యెల్యే యాదయ్య, జాయింట్ కలెక్టర్ అమ్రాపాళి, వ్యవసాయ శాఖ జేడీ విజయ్ కుమార్, ఇన్‌చార్జ్జి ఆర్‌డీవో సురేష్, తహసీల్దార్ అనంత్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.