-అలాకానిపక్షంలో థర్డ్ ఫ్రంట్.. ఎన్డీఏకు మద్దతిచ్చే ముచ్చటే లేదు -సోనియాకు జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాం: కేసీఆర్ -ఇక్కడ మేమే.. అక్కడ జగన్ -తెలంగాణలో అధికారం మాదే -60కి పైగా సీట్లు గెలుస్తున్నాం -ఉత్తరం, దక్షిణం అంతా మాదే గెలుపు -సీమాంధ్రలో జగన్‌దే అధికారం -చంద్రబాబు గాన్ కేస్.. నా ఘర్కా.. నా ఘాట్కా -కాంగ్రెస్ స్కోరు 30 కూడా దాటదు -పొన్నాలా.. బ్రోకర్‌వా? ఇంత వ్యభిచారమా ?.. చీరి చింతకు కడ్తరు జాగ్రత్త! -టీఆర్ఎస్ నిప్పులాంటి పార్టీ.. పట్టుకుంటే కాలిపోతరు -ఎవరినీ మద్దతు అడుగలేదు.. క్యాంపుల ఖర్మ మాకు లేదు -ఒకే భవనంలో రెండు రాష్ర్టాల ఆఫీసులు వద్దు -పంట నష్టం ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించాలి -విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ అధినేత
హైదరాబాద్ మే 9: ఎన్నికల అనంతరం కేంద్రంలో యూపీఏకే మద్దతు ఇస్తామని టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ప్రకటించారు. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వానికి అండగా నిలుస్తామన్నారు. అలాకాని పక్షంలో థర్డ్‌ఫ్రంట్‌కు మద్దతు పలుకుతామని వివరించారు. ఎట్టి పరిస్థితిలోనూ ఎన్డీఏకు మద్దతునిచ్చేదిలేదని కేసీఆర్ విస్పష్టంగా చెప్పారు. తెలంగాణ కల సాకారం చేసిన సోనియాగాంధీకి తాము జీవితాంతం కృతజ్ఞులమై ఉంటామని ఆయన చెప్పారు. శుక్రవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను ప్రస్తావిస్తూ తెలంగాణలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి పూర్తి మెజారిటీతో అధికారం చేపడుతుందని చెప్పారు. సీమాంధ్రలో జగన్ వందకు పైగా సీట్లు గెలుస్తున్నాడని చెప్పారు. చంద్రబాబు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడేనని ఎద్దేవా చేశారు. మద్దతు కోసం తామెవరినీ సంప్రదించలేదని, క్యాంపులు కూడా నిర్వహించడం లేదని స్పష్టం చేశారు.

దక్షిణ తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ మెజారిటీ సీట్లు సాధిస్తున్నదని, ఖమ్మం జిల్లాలో బోణి కొట్టబోతున్నామని వివరించారు. తమ సర్వేల ప్రకారం టీఆర్ఎస్ 60కి పైగా సీట్లు గెలుచుకోవడం ఖాయమని.. ఈ సంఖ్య 90దాటినా అశ్చర్యం లేదని ఆయన అన్నారు. అనంతరం పొన్నాల చేసిన ప్రకటనపై కేసీఆర్ మండిపడ్డారు. పొన్నాలా.. నువ్వు బ్రోకర్‌వా? ఇంత వ్యభిచారమా? అని నిలదీశారు. ప్రజల తీర్పును అపహాస్యం చేస్తే చీరి చింతకు కడతరని హెచ్చరించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు సహనశీలత ఉండాలన్నారు. కాంగ్రెస్‌కు 23నుంచి 30 సీట్లు మాత్రమే వస్తున్నాయని చెప్పారు. 17వ తేదీనుంచి అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సెక్రెటరీ జనరల్ కే.కేశవరావు, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, మధుసూదనాచారి, రామచంద్రుడు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
కేసీఆర్ మాటలు యథాతథంగా… టీఆర్ఎస్ పార్టీ 60స్థానాల పైనే గెలుస్తుంది. ఊపు చూస్తుంటే ఆ సంఖ్య 90 సీట్లు కూడా దాటొచ్చు. జంట నగరాల్లో కూడా గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుస్తాం. ప్రజలంతా టీఆర్ఎస్కే ఓట్లేశామని చెబుతున్నారు. సౌత్ తెలంగాణలో ఒక్క సీటు కూడా టీఆర్ఎస్కు రాదని కొన్ని మీడియాలు రాస్తున్నాయి. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మెజారిటీ సీట్లు గెలుస్తున్నాం. ఖమ్మంలో బోణీ కొడుతున్నాం. మూడు స్థానాల్లో గెలుపు అవకాశముంది. ఇతర పార్టీలతో సంబంధం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మద్దతుకోసం మేం ఎవర్నీ సంప్రదించలేదు. ఆ అవసరం కూడా మాకు లేదు. మేం ఎలాంటి క్యాంపులు పెట్టడం లేదు. మాది అధికార పార్టీ. 17వ తేదీ నుండి మాదే అధికారం. కుచ్చిత రాజకీయాలు వద్దు. ఈ సమయంలో మీడియా తన గౌరవాన్ని కాపాడుకోవాలి. నేను సీఎం అనే ప్రశ్నే ఇప్పుడు వద్దు. ఆ నిర్ణయాన్ని శాసనసభాపక్షం తీసుకుంటుంది.
అక్కడ జగన్… ఇక్కడ మేము.. సీమాంధ్రలో జగన్ అధికారంలోకి వస్తాడు. 100కు పైగా సీట్లు వస్తాయి. 101 శాతం సీఎం అవుతాడు. జగన్ ఆంధ్రకు సీఎం అయితే మేం ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. సీమాంధ్రలో చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అది గాన్ కేస్. చంద్రబాబు పరిస్థితి ధోభీకా కుత్తా… నా ఘర్కా… న ఘాట్కా. అప్పుడే సింగపూర్ పోయిండట.
జగన్‌తో కలిసి పనిచేస్తున్నారని అంటున్నారు..తప్పేం లేదు. పక్కపక్క రాష్ర్టాల వాళ్లం. కొన్ని అంశాల మీద కలిసి పోవాల్సి వస్తుంది. చాలా అంశాలు ఉమ్మడిగా ఉంటాయి. సమన్వయం చేసుకోవాలి. పంపకాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఇందులో శషబిషలేం లేవు. జగనేమన్నా అంటరాని పదార్థమా? కొందరికి కావొచ్చు. మాకైతే కాదు. మాది బాధ్యత కలిగిన పార్టీ. గంభీరంగా ఉంటాం. అక్కడి సీఎంను మేం గుర్తించాల్సి ఉంటుంది. కర్నాటక, చత్తీస్ఘడ్ సీఎంలతో కూడా మాట్లాడుతాం. ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం మేం రమణ్‌సింగ్‌తో మాట్లాడొద్దా? ఆంధ్రలో పోర్టులున్నాయి. మాకు అవసరాలుంటాయి. ఆంధ్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సి ఉంటుంది.
వాళ్లిద్దరూ ఇక్కడినుంచి పోతామన్నారు.. భవనాలు పంపకాల్లో ఏదో జరుగుతున్నదంటున్నరు. అసలు జగన్, చంద్రబాబు ఇద్దరు కూడా మేం హైదరాబాద్‌లో ఉండం. సీమాంధ్రలో చెట్లకిందనైనా ఉంటం అని ప్రకటించుకున్నరు. వాళ్లు ఇక్కడ ఉండనే ఉండం అన్నప్పుడు ఇంకా భవనాల సమస్య ఏముంది? అయితే ఒకే భవనంలో రెండు రాష్ట్రాల వారు ఉండేలా వద్దని అంటున్నం. ఉద్యోగుల పంపిణీలో తగాదాలుంటాయి కనుక కలిపి ఉంచొద్దు. రెండు రాష్ట్రాలకు విడివిడిగానే భవనాలు ఇవ్వాలని గవర్నర్‌ను అడుగుతున్నం. ఆయన పట్టించుకున్నా, పట్టించుకోకున్నా ఆయన ఇష్టం.
కాంగ్రెస్‌కు 30లోపే ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు 23-35 స్థానాలు వస్తాయని చెప్పిన. ఈ రోజు మళ్లీ చెబుతున్నా. నేను చేయించిన సర్వేలు, క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత చెబుతున్న. కాంగ్రెస్ పార్టీ 30 స్థానాలలోపే ఉంటుంది. పొన్నాల పని అయిపోయింది. మేం ప్రజల తీర్పు కోరాం. ఫలితాలు రానున్నాయి. అలా మేం చిల్లర రాజకీయం చెయ్యం. పిచ్చిపిచ్చి ప్రయత్నాలు మానుకోండి. ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ సహనశీలతతో ఉండాలి. గత్తరబిత్తర అవసరం లేదు. పదవుల కోసం టీఆర్ఎస్ లేదు. టీఆర్ఎస్ నిప్పులాంటి పార్టీ. పట్టుకుంటే కాలిపోతరు. ముట్టుకుంటే ఒళ్లంతా దహించుకుపోతారు.
16వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఎవరు ఎంటో తెలుస్తుంది. ఎవరి మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అసలు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడింది ఏంది..అది నీతా? మాతోటి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నడు… ఆయన బ్రోకరా? పార్టీ ఫిరాయింపు ప్రొత్సహిస్తవా? చీరి చింతకు కడుతరు. తమాషానా? ఇంత వ్యభిచారమా? అయినా మీరెట్ల(విలేకరులనుద్దేశించి) భరిస్తరు. విలువలు ఉన్నాయా. మీరే చెంప చెళ్లుమనిపించాలి. అదే కదా జర్నలిజం. అడుగకపోతే ఇలాంటి మీడియా ఉన్నందుకు అది ప్రజల కర్మ. పార్లమెంట్ స్థానాలు కూడా మెజార్టీగా గెలుస్తాం. మెజార్టీ అంటే 9 కంటే ఎక్కువ గెలుస్తాం.
క్యాంపుల ఖర్మ మాకు లేదు… కొందరికి గొంతెమ్మ కొర్కెలున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుంటే బాగుండునని ఉంది. నాపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కొంచెం ప్రేమ ఎక్కువ. ప్రపంచంలోని కవిత్వం అంతా రాస్తున్నాడు. మేం అధికారంలోకి రావొద్దని కొందరికి గులగులగా ఉంది. ఇంకా కూడా పిచ్చిపిచ్చి రాతలు రాస్తున్నారు. పగటి కలలు కంటున్నారు. కొన్ని పత్రికలు క్యాంపులు పెడతయి అని కూడా రాస్తున్నాయి. క్యాంపుల కర్మ మాకు లేదు. పూర్తి మెజార్టీతో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. బాజాప్తా బహిరంగంగానే ఉంటం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎవరూ ఆపలేరు.
అపాయింటెడ్ డేపై ఎందుకు అడిగామంటే… అపాయింటెడ్ డేను ముందుకు జరపాలని ఊరకే అడగలే. జరపకపోతే కలిగే బాధ నాకు తెలుసు. సన్నాసులకేం తెలుసు. ఇదివరకే నరేంద్ర మోడీ హైదరాబాద్‌ను రెండో రాజధాని చేస్తనని అన్నాడు. కేంద్రంలో ముందుగా ఎవరి ప్రభుత్వమో అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో మన ప్రభుత్వం లేకుంటే ఎన్ని సమస్యలు వస్తయి? కనుకే మేం అపాయింటడ్ డేను ముందుకు జరపాలని హోంశాఖను అడిగినం. హోంశాఖ ప్రాసెస్ కూడా చేసింది. ప్రస్తుతం లా డిపార్ట్మెంట్కు హైకోర్టు ఆర్డర్‌ను పంపింది. హైకోర్టు చెప్పినదాన్ని పక్కన పడేయ్యలేరుకదా. సరిగ్గా ఉంటే అపాయింటెడ్ డేను ముందుకు జరుపుతరు.
అసలు పంపిణీ ప్రభుత్వాలు వచ్చాకే… ఉద్యోగుల విషయానికి వస్తే మా పార్టీ ఆప్షన్లకు వ్యతిరేకం. కానీ కొన్ని పత్రికలు పంపకాలు చేస్తున్నట్లుగా అయోమయం చేస్తున్నాయి. ఏది జరిగినా రెండు రాష్ర్టాల్లో ప్రభుత్వం ఏర్పడిన తరువాతే జరుగుతయి. ఇపుడు జరిగేదంతా ప్రొవిజనలే. ప్రతిపాదనలే. రాష్ట్ర ఆవిర్భావం నాటికి సర్కారు రెగ్యులర్ పనులు చేయ్యాలె కద. అందుకని ఇది తాత్కాలిక ఏర్పాటు. ఇదే ఎస్ఆర్సీ యాక్ట్‌లో కూడా ఉంది. అసలు పంపిణీ రెండు ప్రభుత్వాలు వచ్చినంకనే. ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకుని చేసుకుంటరు. ఏకాభిప్రాయం రానప్పుడు కేంద్రం ఫైనల్ డెసిషన్ చేస్తది. చాలా అంశాలపై ఏకాభిప్రాయమే ఉంటుంది. ఏకాభిప్రాయం లేని చోటే కేంద్రం సలహా ఇస్తుంది. ఇదికూడా ఎస్ఆర్సీ యాక్టులోనే ఉంది. ఈవిషయం నేను సీఎస్‌తో మాట్లాడే చెబుతున్నా. కానీ కొన్ని పత్రికలు అర్భకత్వాన్ని రుద్దుతున్నాయి. అది మన ప్రజల కర్మ.
మెజార్టీ స్థానిక సంస్థలు గెలుస్తాం.. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఇప్పుడు పెట్టాల్సింది కాదు. 16వ తేదీ తరువాత పెట్టాల్సింది. ఏదేమైనా తేదీలు ప్రకటించారు కనుక మున్సిపల్, స్థానిక ఎన్నికల కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదనంతర చర్యలపై మాట్లాడుకున్నాం. మాకే ఎక్కువ జడ్పీలు, మున్సిపాలిటీలు వస్తాయి. జేడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా ఎక్కువ మేమే గెలుస్తాం. మున్సిపల్ ఛైర్మన్, జిల్లా పరిషత్ ఛైర్మన్, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికల తేదీలు ఇంకా రాలేదు. జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకునేందుకు ప్రతి జిల్లాకు కొందరికి బాధ్యతలు అప్పగించాం. కరీంనగర్ – ఈటెల రాజేందర్, మెదక్ – హరీష్‌రావు, మహబూబ్‌నగర్ పెద్ద జిల్లా కనుక నలుగురైదుగురిని ఎంపిక చేసుకున్నం. ఫలితాలు వచ్చిన తరువాత జాగ్రత్తగా ఉండాలని చెప్పినం. రాష్ట్ర కార్యాలయంలో కూడా ఒక మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ మానిటరింగ్ సెల్ 16వ తేదీ ఫలితాలకు కూడా పనిచేస్తుంది.
పంటనష్టం ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించాలి రాష్ట్రంలో అల్పపీడనం వల్ల భారీగా వడగళ్ల వర్షాలు, అకాల వర్షాలు కురిశాయి. పంటనష్టం తీవ్రంగా కనిపిస్తోంది. ప్రభుత్వం నుండి స్పందన లేదనే అక్రందనలున్నాయి. రాష్ట్ర గవర్నర్‌ను డిమాండ్ చేస్తున్నాం. వెంటనే జిల్లా కలెక్టర్లను, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించాలి. తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి. గవర్నర్ కూడా రెండుమూడు జిల్లాల్లో హెలికాప్టర్ వేసుకుని పర్యటించి రావాలి. ప్రభుత్వం లేదు, అసెంబ్లీ లేదు కనుక గవర్నరే చూసుకోవాలి.
సోనియా అంటే వ్యతిరేకత లేదు.. సోనియాగాంధీకి మేం జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాం. ఆమె వల్లనే తెలంగాణ వచ్చిందని నిజాయితీగా నమ్ముతున్నాం. ఆమె పట్ల ఆ సద్భావం ఎప్పుడూ ఉంటుంది. మేం సోనియాగాంధీ, రాహుల్జీ కి వ్యతిరేకం కాదు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని ఆన్ రికార్డుగా ఆనాడు చెప్పిన.. ఇప్పుడు కూడా అంటున్నా. ఎన్నికల తర్వాత యూపీఏ ప్రభుత్వం సాధ్యం కాకుంటే థర్డ్‌ఫ్రంట్‌కు సపోర్టు చేస్తాం. ఎన్డీయేకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వలేం.
మంత్రులు ఇంటికే… తాజా ఎన్నికల్లో మెజార్టీ మంత్రులు ఓడిపోతున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. విలేకరుల సమావేశం ముగిసిన అనంతరం వేదిక కిందికి వచ్చాక విలేకరులతో కొద్దిసేపు ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, సునితాలక్ష్మారెడ్డి సుదర్శన్‌రెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ్మ కూడా ఓడిపోతున్నారని అన్నారు. టీఆర్ఎస్కు అదిలాబాద్‌లో 10, వరంగల్‌లో 10, కరీంనగర్లో 11, నిజామాబాద్‌లో 9, మెదక్‌లో 10 స్థానాలు వస్తున్నాయని, దక్షిణ తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ భారీ సంఖ్యలో సీట్లు వస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు కల్పించుకుని మిగిలిన ఏ పార్టీకి కూడా స్టార్ క్యాంపెయినర్ లేడని, టీఆర్ఎస్కు అదే పెద్దబలమని అన్నారు.