Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అద్భుతం ఆవిష్కృతమైంది

-గుండెనిండుగా సజీవ గోదావరి..
-నిలువెల్లా పులకించిన సీఎం
-150 కి.మీ. సజీవ నది సాక్షాత్కరిస్తున్నది
-అనుకున్నదానికంటే గొప్పగా కనిపిస్తున్నది..
-సజీవ గోదావరిని చూసి మనసు పులకించింది
-కాశేళ్వరం ప్రాజెక్టు సందర్శన అనంతరం సీఎం కేసీఆర్
-400 టీఎంసీలు తరలించేలా కాళేశ్వరం ప్రాజెక్టు
-45 లక్షల ఎకరాలకు సాగునీరందించి తీరుతాం
-కరంటు బిల్లు రూ.15వేల కోట్లయినా భరిస్తాం
-కాళేశ్వరం జలాలు రైతులకు ఉచితంగా ఇస్తం
-అప్పులుపోయి నాలుగైదు లక్షలు రైతులకు మిగులాలి
-అప్పటిదాకా తెలంగాణ రైతులకు సాయం చేస్తం
-నిండు గోదావరిని చూసి కొందరికి పిచ్చిలేస్తున్నది
-జయప్రకాశ్ నారాయణ్‌ది హాఫ్ నాలెడ్జ్
-నేను బతికుండగా తెలంగాణకు అన్యాయం జరుగనివ్వ
-మేడిగడ్డ వద్ద రోజూ 50-60 టీఎంసీలు పోతున్నాయి
-అందుకే కాశేళ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు రీడిజైన్ చేశా
-రివర్సబుల్ పంపింగ్ కాదు.. ఎత్తిపోత మాత్రమే
-ఈ నెల 9 లేదా 12వ తేదీన లింక్- 2 ప్రారంభం
-వంద కోట్లతో గొప్పక్షేత్రంగా ధర్మపురిని తీర్చిదిద్దుతం
-ఐదారునెలల్లో జర్నలిస్టులు, ఎమ్మెల్యేల కోరిక నెరవేరుతది
-ధర్మపురిలో మీడియాతో ముఖ్యమంత్రి కేసీఆర్

CM KCR Press Meet In Dharmapuri

ఒకప్పుడు ఎండిపోయినట్టు కనిపించే గోదావరి.. నేడు మేడిగడ్డ నుంచి ధర్మపురి నరసింహస్వామి పాదాల చెంత వరకు.. సుమారు 150 కిలోమీటర్ల మేర అద్భుతమైన జీవనదిని సాక్షాత్కరిస్తున్నదని, తన కష్టానికి ప్రతిఫలం దక్కిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అనుకున్నదానికి మించి గొప్పగా గోదావరి సాక్షాత్కరించిందంటూ ఆనందం వెలిబుచ్చారు. తెలంగాణకు శాశ్వత నీటివసతి కాళేశ్వరంతోనే సాధ్యమని రుజువైందని చెప్పారు. సజీవ గోదావరిని చూసి తన మనసు పులకించిపోయిందన్నారు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానంలో అయితే 20, 25 ఏండ్లకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదికాదని అన్నారు. కానీ.. సమిష్టిగా ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసుకున్నామని చెప్పారు. ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు.

MedigaddaBarrage

ఇంతపెద్ద సజీవ గోదావరిని తెలంగాణకు ప్రసాదించినందుకు ఇరిగేషన్ డిపార్టుమెంటును అభినందించారు. నిండుగా నీటితో కళకళలాడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఏరియల్ వ్యూద్వారా పరిశీలించారు. మేడిగడ్డ బరాజ్‌పై కాలినడకన తిరిగి, గోదావరి తల్లికి వాయినాలు సమర్పించారు. అనంతరం గోలివాడ పంప్‌హౌస్‌ను సందర్శించారు. తదుపరి ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మపురిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను, ఆవశ్యకతను వివరించారు. ఈ ప్రాజెక్టుపై పలువురు కుహనా మేధావులు చేస్తున్న విమర్శలను గణాంకాలతో తిప్పికొట్టారు. ఎస్సారెస్పీలోకి ఐదారు టీఎంసీల నీళ్లు కూడా రాలేదని, కానీ.. మేడిగడ్డ దగ్గర రోజుకు 50-60 టీఎంసీల నీళ్లు దిగువకు వెళ్లిపోతున్నాయని చెప్పారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేశానని తెలిపారు. వివిధ అంశాలపై సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ధర్మపురి వరకు సజీవ గోదావరి
తెలంగాణ సాధించుకోవడంతోపాటు రాష్ట్ర భవిష్యత్తుకోసం శాశ్వత అవసరాలైన సాగునీటి వనరులకోసం తరుగులేని, తిరుగులేని గొప్ప ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తిచేసుకున్నం. ఒకప్పుడు గోదావరి ఎండిపోయి కనిపించేది. ఈరోజు మేడిగడ్డనుంచి ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి పాదాల వరకు సజీవంగా సుమారు 150 కిలోమీటర్లు అద్భుతమైన జీవనది సాక్షాత్కరిస్తున్నది. చాలా సంతోషం. సజీవ గోదావరిని చూసి నా మనసు పులకరించిపోయింది. ఇదే ధర్మపురికి 2003లో పుష్కరాల సందర్భంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని, పుష్కరస్నానం చేశాను. ఇక్కడనే నా ఆకాంక్ష వెలిబుచ్చాను. మళ్లీ పుష్కరాల వరకు కచ్చితంగా తెలంగాణ వస్తది.. తెలంగాణలోనే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకుందామని చెప్పిన. స్వామి దయ, ఉద్యమ ఫలితాలవల్ల తెలంగాణ వచ్చింది. కొత్త రాష్ట్రమైనప్పటికీ పుష్కరాలను గొప్పగా నిర్వహించుకున్నం. ఆ కీర్తి కూడా మనకు దక్కింది.

CMKCR4

కరంటు, నీటి సమస్యలకు పరిష్కారం
అనేక సమస్యల్ని పరిష్కరించుకున్నాం. అతి జటిలంగా ఉన్న కరంటు సమస్య ఇప్పుడు లేదు. దేశంలోనే 24 గంటలపాటు అన్నిరంగాలకు మీటర్లు, మోటర్లు కాలని, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు అవసరంలేని అద్భుతమైన, నాణ్యమైన కరంటు సరఫరాచేస్తున్న ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ. అందుకు మనం కచ్చితంగా గర్వపడాలి. దాని తదనంతరం మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కూడా కనుగొన్నాం. మిషన్ భగీరథ అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. యావత్ దేశంతోపాటు కేంద్రప్రభుత్వం కూడా మెచ్చుకుంటున్నది. మనదగ్గరికి ప్రతి 15 రోజులకు ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగానీ, కేంద్రప్రభుత్వ కార్యదర్శులుగానీ వస్తున్నారు. మే నెలలో భయంకరమైన ఎండలవల్ల మూడువేల పైచిలుకు ట్యాంకుల నిర్మాణాన్ని నిలిపివేయాలని నేనే చెప్పిన. అవి పూర్తయ్యేదశలో, మీద ట్యాంకు కట్టేదశలో ఉన్నయి. అంతవేడిలో కడితే పగుళ్లువచ్చి ఇబ్బంది వస్తుందని ఆపేయమన్నం. వర్షాకాలం తర్వాత మళ్లీ ప్రారంభించినరు. మరోనెలలో మిషన్ భగీరథ పరిపూర్ణం అవుతుంది. సుమారు 56 లక్షల గృహాలకు మంచినీటిని సరఫరాచేస్తం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో ధనికులు జలమండలి ద్వారా ఎలాంటి శుద్ధమైన నీళ్లు తాగుతరో.. ఆదిలాబాద్‌లో ఆదివాసీలు, నల్లగొండ జిల్లా తండాల్లోని గిరిజనులు, ఏ చిన్న గ్రామంలోని దళితవాడల్లోనైనా అవే నీళ్లు తాగుతరు.

సంక్షేమంలో మనకు మనమే సాటి
సంక్షేమంలో తెలంగాణ నంబర్‌వన్. మనను మించినవాడు దేశంలో లేడు. ఇలాంటి రికార్డులు ఎన్నో ఉన్నయి. తెలంగాణ మాత్రమే చేపడుతున్న కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మిలాంటి కార్యక్రమాలు అనేకం ఉన్నయి. వాటి సత్ఫలితాలు పేదవారికి అందుతున్నయి. అద్భుతంగా అమలవుతున్న రైతుబంధు, రైతుబీమాలను చూసి దేశమే ఆశ్చర్యపోయింది. రెండు గుంటల భూమి ఉన్న రైతు చనిపోయినా.. ఆయన కుటుంబానికి రూ.ఐదు లక్షలు బీమాకింద ఎలాంటి దరఖాస్తు, దస్త్రం లేకుండా పదిరోజుల్లో అకౌంట్లో జమవుతున్నయి. దేశంలో ఇలాంటి పథకాలు ఎక్కడా లేవు. ఎవరూ ప్రయత్నం కూడా చేయలేదు. ఈ మధ్యనే ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్ చేశారు. నేను వెళ్లినపుడు నా ముందే విలేకరులకు చెప్పారు.. నేను నా సహచర సీఎం అమలుచేస్తున్న పథకాలను చూసి గర్వపడుతున్నాను. ఆయన పెట్టిన రైతుబంధు పథకాన్ని కాపీకొట్టి ఇక్కడ కాలియా పేరుతో అమలుచేస్తాం అని స్వచ్ఛమైన హృదయంతో చెప్పారు. ఇట్ల మంచి కార్యక్రమాలు చాలా చేసుకున్నం. రైతుల్లో నిరాశ తొలిగి, ఆశావహ పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త రాష్ట్రమైనా చక్కటి పంథాతో ముందుకు పోతున్నామనేది నిర్వివాదాంశం.

CMKCR3

గత ప్రభుత్వాలైతే నిర్మాణానికి 20-25 ఏండ్లు
కొన్ని రాజకీయపార్టీలు, కొందరు నాయకులు బీద అరుపులు అరుస్తున్నారు. తెలిసీతెలియక, సగం అవగాహనతో మరికొందరు స్వయంప్రకటిత మేధావులు తప్పుడు ప్రచారంచేస్తున్నారు. ఈరోజు తెలంగాణకు సజీవంగా ఉన్న గోదావరిని చూసి నాకు చాలా ఆనందంగా ఉన్నది. మామూలు ఆనందం కాదు.. ఎందుకంటే ఇది సాధ్యమయ్యే పనికాదు. ఒక బరాజ్ ఒక ప్రాజెక్టుగా, ఒక పంపుహౌసే ఒక ప్రాజెక్టుగా ఉన్నాయి. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానమే అయితే 20-25 ఏండ్లలోపు కూడా కట్టరు. అహోరాత్రులు శ్రమించి ఆ ప్రాజెక్టును నేను రీడిజైన్ చేయడమే కాదు.. మా ఇంజినీరింగ్ సిబ్బంది రాత్రి, పగలు లేకుండా భార్యాపిల్లలు, కుటుంబాల్ని వదిలిపెట్టి, ఇక్కడనే ఉండి పూర్తిచేసినరు. వాళ్లందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఇంతపెద్ద సజీవ గోదావరిని తెలంగాణకు ప్రసాదించినందుకు ఇరిగేషన్ డిపార్టుమెంటును హృదయపూర్వకంగా అభినందిస్తున్న.

ఎల్లంపల్లికి భారం పెరిగింది
ఎల్లంపల్లిపై భారం పెరిగింది. ఒక్క ఎన్టీపీసీకే 20 టీఎంసీల నీళ్లు అవసరం. హైదరాబాద్ జలమండలికి 30 టీఎంసీలు కావాలి. నికరంగా లెక్కలు తీస్తే.. ఎల్లంపల్లి నుంచి 75 టీఎంసీల వినియోగం ఉన్నది. ఎల్లంపల్లికి వచ్చిన తర్వాతనే 400 టీఎంసీలు పోతయి కాబట్టి ఎల్లంపల్లికి రోజుకు మూడు టీఎంసీలు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నం. వచ్చే ఏడాది జూన్‌నుంచి మేడిగడ్డ బరాజ్ నుంచి ఎల్లంపల్లి బరాజ్‌కు రోజు మూడు టీఎంసీలు తరలిస్తాం. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌కు వచ్చే జూన్, జూలై వరకు రోజుకు రెండు టీఎంసీల తరలింపు మొదలవుతుంది. మల్లన్నసాగర్‌నుంచి చివరన ఉన్న కొండపోచమ్మసాగర్‌కు 7000 క్యూసెక్కుల తరలింపు ఉంటుంది.

CMKCR5

జయప్రకాశ్ నారాయణ్‌ది హాఫ్ నాలెడ్జ్
తెలంగాణ రాష్ట్రం వద్దన్న వ్యక్తి జయప్రకాశ్‌నారాయణ్. అసలు ఆయనెవరు? తెలంగాణకు ఏం సంబంధం? రాష్ట్రం వస్తే కొంపలు అంటుకుంటాయన్న వ్యక్తి. అతిగా మాట్లాడుతున్నడని ఇద్దరు ముగ్గురు నాకూ చెప్పారు. ఆఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నడు. ఆయన ఏ ప్రాతిపదికన, ఏ సిద్ధాంతం ప్రకారం మాట్లాడుతున్నడు? తెలంగాణ అవసరాలు ఆయనకు తెలుసా? అసలు మేడిగడ్డ ఎక్కడ ఉన్నదో తెలుసా? ఎప్పుడన్న కాళేశ్వరం వచ్చి దండం పెట్టిండా? లేనిపోనివి ఆయనకెందుకు? ఆయన పని ఆయన చేసుకోక అనవసరంగా మాట్లాడటం ఎందుకు? ఆయన మాటల్లో ఈర్ష్య కనిపిస్తున్నది. తెలంగాణ గిట్ల చేసుకుంటదా అనే ఒక అసూయ కనిపిస్తున్నది. ప్రోగ్రెసివ్ థింకింగ్ లేదు. రాష్ట్రాలు, దేశాలు వారి ప్రాధాన్యాల క్రమం పెంచుకుంటరు. దానికి కొన్ని ప్రత్యేక కారణాలుంటయి.

ఐదారునెలల్లో జర్నలిస్టులు, ఎమ్మెల్యేల కోరిక నెరవేరుతది
జర్నలిస్టులకు ఇండ్లస్థలాల కేసు సుప్రీంకోర్టుకు పోయింది. నేను జడ్జీతో కూడా మాట్లాడాను. మంచోచెడో చెప్పమన్నాను. లేకుంటే ప్రత్యేకంగా చట్టం చేసుకొని కోరిక నెరవేర్చుకుంటం అన్న. ఇవ్వడానికి స్థలాలు చాలా ఉన్నయి. మీతోపాటు మా పార్టీలో ఎమ్మెల్యేలు కొత్తగ గెలిచినవాళ్లు చాలామంది గరీబోళ్లు ఉన్నరు. ముందుగా వాళ్లది, మీది జాగ పంచాయతీ తేల్చుకుందాం. నాకు తెలిసి.. జర్నలిస్టులు, ఎమ్మెల్యేల కోరిక ఐదారునెలల్లో నెరవేరుతది.

CMKCR2

స్వామివారి సన్నిధిలో సీఎం కేసీఆర్
ధర్మపురి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద సీఎం కేసీఆర్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, విద్యాసాగర్‌రావు, జగిత్యాల కలెక్టర్ శరత్ ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి చేరుకున్న సీఎంకు వేదపండితులు, అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో అర్చకులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించి ఘనంగా ఆశీర్వదించారు. శేషప్ప కళావేదికపై ముఖ్యమంత్రిని ఆసీనులను చేసి స్వామివారి ప్రసాదం, స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం అందజేసి ఘనంగా సన్మానించారు. దీంతో సీఎం కేసీఆర్.. స్వామివారి మొక్కు తీర్చుకున్నట్లయింది. 2015 జూలై 14న గోదావరి పుష్కరాలు ప్రారంభమైన సందర్భంగా సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా వచ్చి గోదావరి స్నానంచేసి పుష్కరాలను ప్రారంభించారు. అదేరోజు సీఎం సమీపబంధువొకరు దివంగతులైనందున ఆరోజు స్వామివారిని దర్శించుకునే అవకాశం లేకుండాపోయింది. గతేదాడి ఆగస్టులో కూడా స్వామివారి దర్శనానికి రావాలనుకున్నా.. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావడంతో పర్యటన రద్దయింది.

కాళేశ్వరం కరంటుకు 15వేల కోట్లయినా సిద్ధమే
మరోసారి చెప్తున్న.. కరంట్ బిల్లులు ఏటా రూ.5వేల కోట్లు. ఇంకా రూ.15వేల కోట్లు అయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధం. రైతుల క్షేమం, సాగునీటి, పరిశ్రమల అవసరాలకోసం.. వెరసి తెలంగాణ యావత్ ప్రజల సంక్షేమంకోసం కాబట్టి.. ఎన్ని వేల కోట్లయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఎవరికీ శషభిషలు అవసరంలేదు. కరంట్ బిల్లులపై చర్చ చేసి, కంఠశోష తెచ్చుకోవద్దు. ఎంత అరిచినా.. మొత్తుకున్నా ప్రజాసంక్షేమంకోసం మేం చేస్తనే ఉంటం. ఇవన్నీ ప్రజల ముందు ఉంచాలి. ఎందుకంటే ఈ సన్నాసుల బాధలు తప్పుతయి. అరిచి, కరిచి.. ఒకడు 20 కోట్లు అని, ఇంకొక్కడు 10 కోట్ల బిల్లు అని.. పిచ్చిపిచ్చిగా చేస్తున్నరు. పిచ్చి ముదిరింది. గోదావరిని చూస్తుంటే వాళ్లకు గంగ మాదిరిగా ఉన్నది. పిచ్చిలేసిపోతున్నరు. భగీరథ, విద్యుత్ అయిపోయాయి. మిషన్ కాకతీయ అయిపోయింది.. ఇంకా అవుతుంది. నాలుగువేల కోట్లతో చెక్‌డ్యాంలు కడుతున్నం. అదో అద్భుతమైన వనరు అవుతుంది.

CMKCR1

రైతుల అప్పులు పోయేదాకా సాయం
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరాకు ఐదువేల చొప్పున ఇస్తున్నది. నాణ్యమైన ఉచిత కరంట్ 24 గంటలు ఇస్తున్నాం. కాళేశ్వరం జలాలు కూడా ఉచితంగా ఇస్తమని చెప్తున్నం. ఇవన్నీ ఎందుకు ఇయ్యాలంటే.. సమైక్య రాష్ట్రంలో 40, 45వేల బోర్లు వేసి భార్య పుస్తెలు అమ్మి, రైతాంగం అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొని కుంగిపోయి, కునారిల్లిపోయి, కృశించిపోయింది. నాకు తెలిసి ఇంచుమించు 45 వేల కోట్లు కుమ్మరించారు. నేను కూడా తెలంగాణ రైతునే. నా పొలం కాడ నేనే 30 దాక బోర్లు వేసిన. మూడు బోర్లల్ల నీళ్లు వచ్చినయి. తెలంగాణలో అప్పులేని రైతు లేడు. రెండువేలో నాలుగువేలో ఎంతో ఉంది. వాళ్ల అప్పులన్నీ తీరిపోయి నాలుగో, ఐదో లక్షల రూపాయలు వారికి మిగులాలి. సొంత పెట్టుబడి పెట్టుకునే శక్తి రావాలి. అప్పటివరకు రైతులకు ఈ సాయం చేస్తనే ఉంటం. అది తెలంగాణ, టీఆర్‌ఎస్ పార్టీ నమ్ముతున్న సిద్ధాంతం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.