-ఆర్థిక క్రమశిక్షణలో మేటి -లౌకికవాదానికి ప్రతీక -సంక్షేమంలో ఆదర్శం -అంధకారం నుంచి వెలుగుల్లోకి రాష్ట్రం -గ్రామాల పునరుజ్జీవం.. పట్టణాల్లో ప్రగతి పరుగు -వ్యవసాయం, నీటిపారుదలరంగాల్లో సమగ్రాభివృద్ధి -ఉద్యమనేత రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం అదృష్టం -ఉభయ సభల సంయుక్తసమావేశంలో గవర్నర్ తమిళిసై -గవర్నర్‌కు స్వాగతం పలికిన చైర్మన్, స్పీకర్, సీఎం తదితరులు

ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం స్వల్పకాలంలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించిందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. ఉద్యమనాయకుడే ప్రభుత్వ సారథి కావడం కలిసొచ్చిందని.. సమైక్యరాష్ట్రంలో కుదేలైనఅన్నిరంగాలకు పునరుత్తేజం కల్పించేందుకు కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆరేండ్లుగా చిత్తశుద్ధితో, ప్రణాళికాబద్ధంగా చేసిన కృషి సత్ఫలితాలిస్తున్నదని కొనియాడారు. గంగా-జమున తెహజీబ్లా తెలంగాణ లౌకికవాదానికి ప్రతీకగా నిలుస్తున్నదని చెప్పారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. ఉదయం 10.50 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి సీఎం కే చంద్రశేఖర్‌రావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు స్వాగతం పలికారు. వారంతా వెంటరాగా 10.56 గంటలకు గవర్నర్ అసెంబ్లీ హాల్లోకి చేరుకొన్నారు. జాతీయగీతం అనంతరం ఉభయసభలను ఉద్దేశించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పాలనా సంస్కరణలను ఉటంకిస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది.
కేసీఆర్ నేతృత్వంలో పునర్నిర్మాణయజ్ఞం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి తెలంగాణలో అన్నిరంగాల్లో దుర్భర పరిస్థితులుండేవని.. వ్యవసాయం, కులవృత్తులు దెబ్బతినడంతోపాటు, విద్యుత్‌కోతలతో గాఢాంధకారంలో ఉండేదని గవర్నర్ అన్నారు. నిత్యం ఆత్మహత్యలు, ఆకలిచావులు, వలసలు, సాగునీటి వ్యవస్థ అగమ్యగోచర స్థితితో తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. 2014లో అధికారం చేపట్టిన కేసీఆర్.. రాష్ర్టానికి ఉన్నవనరులు, వసతులు, అవసరాలు, అనుకూలతలు, ప్రతికూలతలను బేరీజు వేసుకుని ప్రణాళికాబద్ధంగా పునర్నిర్మా ణ యజ్ఞాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు.
విద్యుత్‌రంగంలో రాష్ట్రం అనితరసాధ్యమైన విజయాలు సాధించిందని, దేశంలోనే అత్యధిక తలసరి విద్యుత్ వినియోగరాష్ట్రంగా నిలిచిందని చెప్పారు. సమైక్యరాష్ట్రంలో 13,162 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఏర్పడితే, నేడు తెలంగాణలో 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌కు చేరినప్పటికీ కోత, లోటులేకుండా సరఫరా చేయడం ఘనవిజయమని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల ఉచితవిద్యుత్‌ను ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలువడం గర్వకారణమని తెలిపారు. మిగులు విద్యుత్రాష్ట్రంగా మార్చేందుకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం వేగవంతమైందని చెప్పారు.

సంక్షేమంలో ఆదర్శం ‘రైతుబంధు’ ప్రపంచంలోనే గొప్ప పథకాల్లో ఒకటిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం గర్వకారణమని గవర్నర్ అన్నారు. రూ.5 లక్షలు అందించే రైతుబీమా అద్భుతమని కొనియాడారు. మిషన్‌కాకతీయతో చెరువులను పునరుద్ధరించడంతో భూగర్భజలమట్టం భారీగా పెరిగిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈఏడాది వర్షాకాలం నుంచి రోజుకు 3 టీఎంసీలను ఎత్తిపోసేందుకు సిద్ధమవుతున్నదని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి, సమ్మక్క బరాజ్, సీతారామ ప్రాజెక్టుల పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. నీటిపారుదలరంగం అద్భుత పురోగతిని సాధించిందనడానికి.. యాసంగిలో 123.5 శాతం వరిసాగువిస్తీర్ణమే పెరుగడమే నిదర్శనమని చెప్పారు. మిషన్‌భగీరథతో అన్ని ఆవాసాలకు సురక్షిత నీరు అందుతున్నదని..అన్ని రాష్ర్టాలతోపాటు, కేంద్రం ఇలాంటి పథకాన్ని అమలుచేయడానికి ముందుకొచ్చిందని పేర్కొన్నారు.
75 శాతం సబ్సిడీపై గొర్రె పిల్లలను పంపిణీచేసి గొల్ల, కురుమలను, జలాశయాల్లో ఉచితంగా చేపపిల్లలు వేసి మత్స్యకారులను, చేనేతవస్ర్తాలను ప్రభుత్వమే కొనుగోలుచేయడంతోపాటు, మార్కెటింగ్ కల్పిస్తూ నేతన్నలను, మోడ్రన్ సెలూన్లు పెట్టుకొనేందుకు, బట్టలు ఉతికే యం త్రాలకు ఆర్థిక సాయం అందజేస్తూ నాయీబ్రాహ్మణులు, రజకులను ప్రోత్సహిస్తున్నట్టు గవర్నర్ చెప్పారు. సంచారకులాలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు తదితరవర్గాల వారికోసం ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలను సముచిత గౌరవం కల్పించినట్టు చెప్పారు. అన్నిమతాల పండుగలను ప్రభుత్వం తరుఫున నిర్వహిస్తునట్టు చెప్పారు.
పాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణ తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణను చేపట్టిందని తమిళిసై పేర్కొన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించుకున్నామని తెలిపారు. 43 రెవెన్యూ డివిజన్లను 73కు, 459 మండలాలను 590 మండలాలకు పెంచినట్టు తెలిపారు. మున్సిపాలిటీలను 52 నుంచి 128కి, కార్పొరేషన్లను 6 నుంచి 13కు పెంచుకున్నామని, 8,690 గ్రామ పంచాయతీలను ప్రత్యేక తండాపంచాయతీలతో కలిపి 12,751 చేసుకున్నామన్నారు. శాంతి భద్రతలను పకడ్బందీగా పర్యవేక్షించేందుకు రెండు పోలీస్ కమిషనరేట్లను తొమ్మిది పోలీస్ కమిషనరేట్లకు పెంచినట్టు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచేందుకు.. స్థానిక సంస్థలను క్రియాశీలం చేసేందుకు కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్చట్టాలను తీసుకొచ్చామన్నారు. గ్రామాల్లో పల్లెప్రగతి, పట్టణాల్లో పట్టణ ప్రగతితో అభివృద్ధి బాటలు వేసినట్టు చెప్పారు. అవినీతి, జాప్యానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని కూడా రూపొందిస్తున్నట్టు తెలిపారు.
మెరుగైన ప్రజారోగ్యం ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్న మొదటి మూడురాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి కావడం గర్వకారణమని తమిళిసై పేర్కొన్నారు. 40 ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలు, 20 ఇంటెన్సివ్‌కేర్ యూనిట్లు, 305 స్టాండర్డైజ్డ్ లేబర్ రూములు. గర్భిణులను దవాఖానకు తీసుకురావడానికి 200 అమ్మఒడి వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. వ్యాధి నిరోధక టీకాల్లో 96 శాతం ఇమ్యునైజేషన్ సాధించి దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ హెల్త్‌ప్రొఫైల్ రూపొందించనున్నట్టు చెప్పారు.
ఆర్థికక్రమశిక్షణతో తెలంగాణ దేశంలో తీవ్ర ఆర్థికమాంద్యం నెలకొన్నప్పటికీ కట్టుదిట్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆ ప్రభావం పడకుండా నిలదొక్కుకోగలిగామని గవర్నర్ పేర్కొన్నారు. దేశంలో ఆదాయ వృద్ధిరేటు తిరోగమనంలో ఉండగా.. తెలంగాణలో ఆ పరిస్థితి లేకపోవడం మెరుగైన అంశమని చెప్పారు. నూటికినూరు శాతం ప్రభుత్వఖర్చుతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిరిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం నెలనెలా ఇస్తున్న రూ. 2,016 ఆసరా పింఛన్లతో పేదలు సంతోషంగా జీవిస్తున్నారని.. వికలాంగుల పింఛన్‌ను రూ.500 నుంచి రూ.3016కు పెంచి అందిస్తున్నట్టు తెలిపారు.
బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులకు కూడా పింఛన్ అందిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే 57 ఏండ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్లు అందుతాయనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను అని గవర్నర్ పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి- షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆడపిల్ల పెండ్లి ఖర్చుల కోసం రూ.1,00,116 చెక్కులు ఇస్తున్నట్టు తెలిపారు. పేదవిద్యార్థుల కోసం 959 రెసిడెన్షియల్ విద్యాలయాలను అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సభ్యులందరికీ నమస్కారం.. వణక్కం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై.. ఆకలి దప్పులు లేని, అనారోగ్యం లేని, శతృత్వం లేని రాజ్యమే గొప్పరాజ్యహంటూ ప్రసంగాన్ని ముగించారు.
ఐటీ, పారిశ్రామికాభివృద్ధిలో మేటి రాష్ర్టాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చామని.. 15రోజుల్లోనే అన్నిరకాల అనుమతులిచ్చే టీఎస్ఐపాస్ పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తున్నదని గవర్నర్ తమిళిసై చెప్పారు. ఈ విధానం ద్వారా ఇప్పటివరకు 12,427 పరిశ్రమలు అనుమతులు పొందాయని, రెండులక్షల నాలుగువేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. ఐటీ రంగంలోనూ బలమైనశక్తిగా ఎదిగామని తెలిపారు. 2013-14లో ఐటీ ఎగుమతులు విలువ రూ.57వేల కోట్లు ఉంటే.. 2018-19 నాటికి రూ. లక్షా 9 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. గతేడాది ఐటీ ఎగుమతుల వృద్ధిరేటులో దేశ సగటు 8.9 శాతం కాగా, తెలంగాణ వృద్ధిరేటు 16.89 శాతం కావడం గమనార్హమన్నారు.
కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని రూపొందించింది. మిషన్ కాకతీయతో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఏడాది వర్షాకాలం నుంచి రోజుకు 3 టీఎంసీలను ఎత్తిపోయనుంది. నీటి పారుదలరంగం అద్భుతపురోగతికి యాసంగిలో 123.5% పెరిగిన వరి సాగువిస్తీర్ణమే నిదర్శనం – గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్